అసంజకలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యూబ్లో నిల్వ ఉంచిన నైట్రో సెల్యులోస్ అసంజనక

అసంజకలు (adhesives ) రెండు ఉపరితలాలను ఒకదానితో ఒకటి చక్కగా అతికే పదార్థాలను అసంజకలు అంటారు. అసంజకలు, గ్లూలు అనే రెండు మాటలు ఒకే అర్థంలో పర్యాయపదాలుగా చాలా కాలం నుండి వాడుకలో ఉన్నాయి. అయితే సర్వసాధారణంగా గ్లూ అనేది జిగురుగా ఉంటుంది. కానీ అసంజకలు జిగురుగా ఉండవు.

రకాలు

[మార్చు]

అసంజకలలో ముఖ్యంగా రెండు రకాలు ఉన్నాయి.

 1. కర్బన (సమ్మేళనాత్మక) అసంజకలు
 2. మూలక రసాయన అసంజకలు

రసాయన ప్రవృత్తిని ఆధారంగా చేసుకొని, అసంజకలు ఏడు రకాలు

[మార్చు]
 1. థెర్మోప్లాస్టిక్ సంశ్లేషణ రెజిన్లు
 2. థెర్మో సెట్టింగ్ సంశ్లేషణ రెజిన్లు
 3. సహజ రబ్బర్లు, సంశ్లిష్ట రబ్బర్లు
 4. సహజ రెజిన్లు, బూటామెన్లు
 5. పిండి పదార్థాలు, సెల్యూలోజ్, బంక మొదలైన వాని నుండి ఉత్పన్నం చేసినవి.
 6. మాంసకృత్తులు లేదా మాంసకృత్తుల నుండి తయారు చేసిన ఉత్పత్తులు.
 7. మూలక రసాయన అసంజకలు

వీటిలో 4, 5, 6 రకాలు కర్బన అసంజకల తయారీకి ఉపయోగపడేవే మూలపదార్ధాలు. లభించిన అసంజకల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వర్గీకరించడం జరిగింది. మొదటి రకానివి గట్టి అసంజకలు. అవి దృఢమైన ఉపరితలాలు గల కర్ర, గాజు, పింగాణి, దృఢమైన ప్లాస్టిక్లు, లోహాలు వంటి వాటిని అతకడానికి వాడతారు. రెండో రకానివి మెత్తని అసంజకలు. ఇవి మెత్తని ఉపరితలాలు గల కాగితం, బట్టలు, తోళ్ళు కావలసిన ఆకృతులుగా మలిచే ప్లాస్టిక్లను, పలచని లోహపురేకులు వంటి వాటిని అతికించేందుకు వాడే అసంజకలు. ఈ తరగతికి చెందిన అసంజకాలకు అతికించవలసిన ఉపరితలాలతో సమానమైన మృదుత్వం ఉండడం అవసరం.

థెర్మోప్లాస్టిక్ సింథెటిక్ రెజిన్ అసంజకలలో పొలిమెరిజేషన్ ఉత్పన్నాలైన పొలివినైల్ అసెటితే, పాలివినైల్ బ్యూతిరాల్, పాలివినైల్ ఆల్కహాల్, పొలి వినైల్ రెజిన్లు, ఆక్రిలిక్ మీథాక్రిలిక్ ఆమ్లాలు, ఎస్తర్ రెజిన్లు, సైనో అక్రిలెట్లు, సంశ్లేషణ రెజిన్లైన పొలి ఇసొబ్యుటిలిన్, పొలి ఎమైడ్లు, కుమరొన్-యొడిన్ ఉత్పన్నాలు, సిలికాన్లు ఉన్నాయి. సాధారణంగా ఇట్టి థెర్మొప్లాస్టిక్ రెజిన్లకు, శాశ్వత ద్రావణీయత, ద్రవీభవించే గుణమూ సిద్ధిస్తాయి. అందుచేత వీటిని టేపుల తయారీలోను, భద్రత - గాజులోను, జోళ్ళకు వాడే సిమెంట్ తయారీ పరిశ్రమలోను వాడుతున్నారు. అంతేగాక పలచని లోహపు రేకులను అతకడంలో, కర్ర సంబంధమైన వాటిని, రబ్బరు, కాగితం మొదలైన వాటిని అతకడానికి దీన్ని విస్తృతంగా వాడుతున్నారు. వివిధ రకాలైన రబ్బరు అసంజకలు కూడా వాడుకలో ఉన్నాయి.

వీటిలో ముఖ్యమైనవి

[మార్చు]
 1. రబ్బరు పాలు (లాటెక్స్) ఉన్న ద్రావణాలు.
 2. రబ్బరు లేదా కృత్రిమ పరివర్తత రబ్బర్ ద్రావణాలు
 3. వివిధ సంఘటనలలో ఉన్న కెసిన్ గాని ఏదైనా సంశ్లేషణ రెజిన్ గాని ఉన్న ద్రావణం
 4. పై వాటి మిశ్రమాలు.

ఇట్టి సంఘటన గల అసంజకలు చాలా సులువుగా పరచడానికి వీలైన మెత్తని పదార్ధాలను, కాగితాలను, నేత వస్త్రాలను, చర్మ పదార్థాలను అతికించడానికి విస్తృతంగా వాడుతున్నారు.

సహజ రెజిన్లు బిటుమెన్ వర్గానికి చెందిన వాటిలో ఆస్ఫాల్ట్, షెల్లాక్, రజిన్ వాని ఎస్టారు ఉత్పన్నాలు వాటికి సంబంధితాలైన ఇతర పదార్ధాలు ఉంటాయి. వీటిని ఖనిజాలను లీనోలియమ్ వంటి వాటిని అతికించేటందుకు ఉపయోగిస్తారు.

సెల్యూలోజ్ అసంజకలు సెల్ల్యూలోజ్ ఉత్పన్నాలు

[మార్చు]

మెథైల్ సెల్ల్యూలోజ్, ఈథైల్ సెల్ల్యూలోజ్, సెల్ల్యూలోజ్ అసెటైట్, సెల్ల్యూలోజ్ నైట్రేట్, కార్బాక్సీ మెథైల్ సెల్యూలోజ్ . వీటిని అసంజకలలో అనుఘటకాలుగా వాడుతున్నారు. ఇవి ముఖ్యంగా తోళ్లను, నేత వస్త్రాలను, కాగితాలను అతికించడానికి వాడుతున్నారు. వీటికి విషస్వభావం లేనందువల్ల, వీటిని కళ్ళలో కాంటాక్ట్ లెన్సెస్ అతికించడానికి వాడుతున్నారు.

మాంసకృత్తుల ఉత్పన్నాల వల్ల ఏర్పడిన వాటి నుండి రెసిన్, జైన్, సోయబీన్ ప్రోటీన్లు సంగ్రహింపబడతాయి.

గ్లూలు, జంతు చర్మాల నుండి, ఎముకల నుండి రక్తపు అల్బుమిన్ నుండి లభిస్తున్నాయి. ఫిష్- గ్లూలు చేప నుండి సంగ్రహింపబడినవి. వృక్ష సంబంధ అసంజకలు పిండి నుండి చెట్ల నుండి ఏర్పడిన బంకల నుండి తయారవుతున్నాయి. ఈ రకానికి చెందినవే సాధారణ పిండి పదార్ధాలు , శుద్ధి చేయబడిన పిండి పదార్ధాలు, డెక్స్ ట్రిన్ , నీటిలో కరిగే జిగురులు.

ఇవి నీటిలో కరిగే లేదా విక్షేపణ చెందేవి. పిండి పదార్ధాలు డెక్స్ ట్రిన్ ఉత్పన్నాలను, కాగిత, కలప, నేత బట్టలు అతకడంలో ఉపయోగిస్తారు. బంకను కాగితాలను, తపాలా స్టాంపులను ఇతర స్టాంపులను అతకడానికి వాడుతున్నారు.

మూలక రసాయన అసంజకలు చాలా ముఖ్యమైన వర్గానికి చెందినవి. వీటిలో సోడియం సిలికేట్ ఉంటుంది. ఇది ముఖ్యంగా ముడతలు పడిన కాగితాలను, తత్సంబంధమైన కాగితపు ఉత్పన్నాలకు, లోహపు రేకులకు, ప్లైవుడ్ ను అతికించడానికి, నిర్మాణాలకు సంబంధించిన బిళ్లలు, రక్షణ కవచం గల అట్టల నిర్మాణాలలోనూ వాడుతారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను, మెగ్నీషియం ఆక్సీ క్లోరైడ్ ను పింగాణీ సామానులకు, లిథార్జీ గ్లిజరిన్ ను నీటి గొట్టాలను అతకడానికి, పోర్ట్ లాండ్ సిమెంటును గృహనిర్మాణాలలోను, బంధక - పదార్ధాలుగాను వాడుతున్నారు.[1]

మూలాలు

[మార్చు]
 1. రసాయన శాస్త్రం, సంపుటం -10. విజ్ఞాన సర్వస్వం. హైదరాబాదు: కొమర్రాజు లక్ష్మణ రావు విజ్ఞాన సర్వస్వ కేంద్రం. pp. 55, 56.{{cite book}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=అసంజకలు&oldid=3388834" నుండి వెలికితీశారు