ఆంధ్రుల జాతీయత

వికీపీడియా నుండి
(ఆంధ్రజాతి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
విశ్వామిత్రుని విగ్రహం

ఆంధ్రుల జాతీయత గూర్చి వివిధ వాఙ్మయాలలో వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా ప్రస్తావనలు ఉన్నాయి.

వేద వాఙ్మయంలో

[మార్చు]
వశిష్ఠ మహర్షి

ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రజాతిని గురించి ప్రస్తావించిన వాక్యానికి వ్యాఖ్యానం సంశయాస్పదంగా ఉంది. ఆ బ్రాహ్మణంలోని కథ ఇది; యజ్ఞపశువుగా కొంపోవడుచున్న బ్రాహ్మణయువకుడు శునశ్శేపుని రక్షించి విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి తీసుకొనివెళ్ళి, తన కుమారులను శునశ్శేపుని సోదరునిగా స్వీకరించమనగా వారిలో కొందరు నిరాకరించారు. విశ్వామిత్రుడు కోపించి అవిధేయులైన వారిని ఆర్యభూముల నుండి బహిష్కరించగా వారే ఆంధ్ర, పుళింద, శబర, మూతిబాది జాతులయినారు. ఈ కథను బట్టి ఆంధ్రులు విశ్వామిత్రుని సంతతివారు.విశ్వామిత్రుడు ఆర్యర్షి, అవిధేయత వల్ల పతితులైన ఆర్యులు ఆంధ్రులని ఒక వ్యాఖ్యానం. ఈ బ్రాహ్మణంలో
'ఏతేండ్రాః పుండ్రాః శబరాః పుశిందామూతిబాఇత్యుదంత్యా బహవోభవంతి'
అనే వాక్యానికి విశ్వామిత్రుని కుమారులు పై జాతులలో కలసిపోయినారు అనే వ్యాఖ్యానం కొందరు చేస్తున్నారు.ఇది యిట్లుంచి విశ్వామిత్రుని జాతీయతే అనుమానాస్పదంగా ఉంది. విశ్వామిత్రుడు ఆర్యేతరుడని ఆర్యదండ యాత్రికులలో మొట్టమొదట చేరిన స్థానికుడని ఒకరి పరిశీలన. స్వర్గంపై ఇంద్రుని గుత్తాధిపత్యం మీద, బ్రాహ్మణాధిపత్యం మీద, రక్తసిక్తమైన వైదిక క్రతుకాండ మీద విశ్వామిత్రుడు విప్లవధ్వజం ఎత్తినాడు. వశిష్ఠునితో సుదీర్ఘ సంఘర్షణ అనంతరం బ్రహ్మత్వం సాధించాడు. ఆర్య దేవతాగణంలో తాను జేరడానికి ప్రతిఘటించిన దక్షుని నిర్జించిన శివునివలె విశ్వామిత్రుని జీవితంలోని ఈ సంఘటనలు పై అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. శునశ్శేపుని కథ కూడా పై అభిప్రాయాన్నే సూచించవచ్చు. ఆర్యులతో చేరిన విశ్వామిత్రుడు తనవారిని సయితం ఆర్యాధిపత్యం అంగీకరించవలసిందని కోరగా అందుకు అంగీకరించనివారు ఆర్యాధికారాన్ని ప్రతిఘటించే శక్తి చాలక ఆర్యాక్రమిత భూములనుండి నిర్గమించారనేదే ఆ సూచన.

భాగవతంలో

[మార్చు]

భాగవతాది పురాణాల్లో అంధకులే ఆంధ్రులని యదువృష్ణి భోజకుమారాది ఆర్యజాతులలోని వారైన ఆంధ్రులు ఆర్యులని ఒక వాదన. ప్రాకృత వాఙ్మయం ఆంధ్రులను అంధకులని వ్యవహరిస్తున్నది. ప్రాకృతాంధకులు పౌరాణికాంధకులు ఒకరేననేది కూడా వీరి వాదంలో ఒక భాగం. పౌరాణిక అంధకులు ఆంధ్రులనడానికి వీలులేదు. ఆంధ్రశబ్దం ప్రాకృతంలో అంధ అవుతుంది. 'క' అనేది నివాస స్థలన్ని సూచించే ప్రత్యాయం. పురాణాలు అంధకులను వృష్ణి భోజాది ఔత్తరాహజాతులతో కలిపి చెప్పినాయి గాని దక్షిణాత్యులైన శరబ పుళిందాదులతో చెప్పలేదు. మరోక విశేషం; వృష్ణి భోజాంధక అని చెప్పిన భాగవత పురాణానికి ఆంధ్ర పదంతో పరిచయం ఉంది. అందుచేత భాగవతకారునకు అంధక, ఆంధ్ర అనే రెండు భిన్న జాతులున్నట్లు తెలుసుకొనడం స్పష్టం, కాబట్టి అంధకులే ఆంధ్రులనడం సరియైనవాదం కాదు.

పురాణాలలో

[మార్చు]

వాయు బ్రహ్మాండాది పురాణాల్లో హిమాలయాలకావలి ఉత్తర భూముల్లో వక్షు నదీతీరంలో ఆంధ్రులొకప్పుడు నివసించిన సూచనలున్నాయి. మధ్య ఆసియాలోని ఆక్సస్ నదియే పూరాణాల్లో వక్షు (చక్షు) నది. ములకలు, దరదులు, పారదులు, పహ్లవులు మొదలైన తెగలు ఆంధ్రుల ఇరుగుపొరుగున ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి.
"అథచీనమ రూంశ్చైవ నణ్గణాన్ సర్వమూలికాన్
సాన్థ్రాం స్తుషారాంస్తంపాకాన్ పహ్లవాన్ దరదాన్ శకాన్
ఏతాని జనపదాన్ చక్షుః ప్లాపయ న్తీ గతోదధిమ్."
అని వాయుపురాణం, నేటికి మధ్య ఆసియాలోని బలక్ పశ్చిమాన నూరుమైళ్ళ దూరంలో "అన్థకుయి" అనే ప్రాంతం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధప్రియులైన ఒక జాతిపేరు అన్ధ్రి లేక అంధేరి. వక్షు (చక్షు) నదితీర వాసులుగా పురాణాలు పేర్కొంటున్న దరద, పహ్లవ, ములక, పారదాది తెగలు చారిత్రక కాలంలో తిరిగి ఆంధ్రులకు పొరుగువారుగా దక్షిణాపథంలో కనిపిస్తున్నారు. ములకులాక్రమించిన ప్రాంతమే ములక (నాడు) రాష్ట్రమయింది. పహ్లవులు స్థిరపడిన ప్రదేశం పల్లవ భోగ్య (బొగ్గు) మై నేటి పలనాడయింది. ఆంధ్రుల నివాసస్థలమే ఆంధ్రాపథంగా జాతక కథలలో ప్రవేశించింది. అశోకుని శాసనాలు పారదులను దాక్షిణాత్యులుగా పేర్కొన్నాయి.దరదులను పిశాచులని, వారిది పైశాచీభాష అనీ ఆర్యులు నిందించారు. పైశాచీ భాషకు సంస్కృతానికి పోలికలున్నవని పండితుల అభిప్రాయం. కథాసరిత్సాగరములోని గుణాఢ్యుని కథ శాతవాహనుల కాలంలో పైశాచీభాష మాతృభాషగా ఉన్నవారు ఆంధ్రుల్లో ఉన్నట్లు సూచిస్తుంది. కథాసరిత్సాగరాన్ని గుణాఢ్యుడు పైశాచీభాషలో వ్రాసినాడట! కారణాంతరాలవల్ల బహుశా ఆర్యదండయాత్రల తాకిడివల్ల చక్షునదీ వాసులైన ఈ జాతులన్నీ వలసవచ్చి దక్షిణా పథంలో స్థిరపడినారని భావించవచ్చు. ఈ జాతులన్నింటిని సృతివాఙ్మయం మ్లేచ్ఛులని పేర్కొంటున్నది.

ఆంధ్రజాతిలో లీనమైనతెగలు

[మార్చు]

ఈ మాహా ప్రస్థానంలోనూ దక్షిణా పథంలోను ఆంధ్రులకు మరికొన్ని తెగలతో సంబంధం ఏర్పడింది. వారిలో నాగులు, యక్షులు, అశ్మకులు, మహిషకులు, తెలుగులు ముఖ్యులు. పేర్లను బట్టి వీరిలో చాలాభాగం చిహ్నారాధకులైన తెగలని చెప్పవచ్చు

నాగులు

[మార్చు]

బౌద్ధ వాఙ్మయంలోను సింహళ, సయాం దేశాల ప్రాచీన సాహిత్యంలోను కృష్ణా ముఖద్వారాన్ని నాగభూమిగా వర్ణించారు. ఋగ్వేదకాలంలో (క్రీ.పూ.2000 ) నాగులు పంజాబు ప్రాంతంలో నివసిస్తూ ఆర్యదండ యాత్రలను తీవ్రంగా ప్రతిఘటించారు. వీరిని శిశ్నదేవులని ఆర్యకర్మలకు విరోధులని ఋగ్వేదం వర్ణిస్తున్నది. వీరు మదనోత్సవాలలో ప్రధానాంశమైన లింగారాధకులయినట్లు గ్రహించవచ్చు. నాగులు, ఆర్యులకు జరిగిన తీవ్ర సంఘర్షణలో " ఖాండవ దహనం", జనమేజయ "సర్పయాగం" రెండు ముఖ్యఘట్టాలు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకొన్న నాగులు దక్షిణంగా వలసవచ్చి కృష్ణా ముఖద్వారంలో స్థిరపడి ఉంటారు. అమరావతీ శిల్పలలోని రాజులకు రాణులకున్న సర్పకిరీటాలు వారి జాతీయతకు చిహ్నలే!

యక్షులు

[మార్చు]

ఆంధ్రులకు సంబంధించిన అనేక గాథల్లో యక్షులు ప్రసంగం కనిపిస్తుంది. వీరుకూడా ఆర్యేతరులే. శాతవాహన వంశ మూలపురుషుడు సాతుడనే యక్షుని కొడుకైనట్లు తెలుస్తుంది. యక్షులే నేటి జక్కులయి వుంటారు. 'యక్షగాన' మనే పేరు యక్షుల సంగీతాభినివేశానికి నిదర్శనం. నేటికి జక్కులవాండ్రు నాటకాలాడడంలో ఆరితేరినవారు. నాగులు, యక్షులు అదిమ శైవాన్ని అనుసరించినారని చెప్పవచ్చు. శివుడు నాగభూషణుడు; యక్షగణాధ్యక్షుడు. క్రమంగా వీరు బౌద్ధాన్ని ఆదరించారు. బౌద్ధవాఙ్మయంలో నాగులు, యక్షులు పెద్ద కట్టడాలు నిర్మించడంలో సిద్ధహస్తులనే వర్ణనలున్నాయి. ఆంధ్రదేశంలోని ప్రాచీన స్తూపాలు వీరి నిర్మాణాలే అయివుంటాయి

అశ్మక మహిషకులు

[మార్చు]

ఇక అశ్మక మహిషకులు. అశ్మక పదం అశ్మకరూపంలో కూడా కన్పిస్తుంది. నాగులవలె వీరు అశ్వమహిష చిహ్నారధకులైన తెగలని భావించవచ్చు. శాతవాహన పదానికి ప్రిజులస్కీ పండితుడు ముండారీ భాషలో అశ్వసంతతి (సత=అశ్వము, పహన్=కొడుకు) అనే అర్థం వుందని చెప్పినాడు. ఈ నిర్వచనం శాతవాహనులు అశ్వక తెగకు చెందినవారనినప్పుడు సరిపోతుంది. ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో (మెదక్, నల్గొండ, ధార్వాడ్ జిల్లాలలో) మహిషకులుండినట్లు పురావస్తు ఆధారలవల్ల తెలుస్తున్నది.

ఆంధ్రజాతిలో లీనమైన మరొక తెగ తెలుగులు

ఆంధ్రులు అనార్యులే

[మార్చు]

ఆంధ్రుల అనార్యత్వానికి ఆర్య వాఙ్మయంలో సందేహానికి తావులేదు. ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్రులను శబరజాతితో కలిపి చెప్పింది కదా! నేటికి శబరులు ఆంధ్ర ఉత్కళ రాష్ట్రాల్లో ఉన్నారు. వారి శరీర నిర్మాణాన్నిగాని సంస్కృతినిగాని పరిశీలించినవారు వారిని మంగోలు జాతివారిగా నిర్ణయిస్తున్నారు. అయినచో శబరుల సోదరులైన ఆంధ్రులు ఆర్యజాతివారని చెప్పడం సమంజసం కాదు. ఇక మహాభారతం ఆంధ్రులను దక్షిణాపథవాసులైన చేర, చోళ, పాండ్యాదులతో కలిపిచెప్పింది. మత్స్య, భాగవతాది పురాణాలుకూడా వారిని మ్లేచ్ఛులుగా వర్ణిస్తున్నాయి. ఆంధ్రులు గ్రామబహిప్రదేశాల్లో మాత్రమే నివసించడానికి యోగ్యులు అని మనుధర్మశాస్త్రం శాసించింది.అయితే ఈ స్మృతి వాఙ్మయం తయారైన రోజుల్లో ఆంధ్రులు బౌద్ధమతాభిమానులైనందున ఆ వాఙ్మయం వారిని మ్లేచ్ఛులుగా చిత్రించిందని ఒక ఊహ (డా. డిసి సర్కార్). కాని బౌద్ధమత చరిత్రలో రెండో అశోకుడుగా ప్రసిద్ధుడైన కనిష్కుని ఆస్థాన వైద్యుడు, బౌద్ధుడునైన చరకుడు తన సంహితలో-
"గృథ్రోలూ కశ్వకాకాద్వైఃస్పప్నేయ పరివార్యతే రక్షఃప్రేత పిశాచ స్త్రీ చండాల ద్రవిడాంధ్రకైః"
అంటూ ఆంధ్రుడు కలలోకి వస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించాడు. అందుచేత ఆంధ్రుల మ్లేచ్ఛత్వానికి వారి బౌద్ధమతం కారణం కాదని తెలుస్తున్నది.

మానవశాస్త్రం (Anthropology)

[మార్చు]

జాతీయతను నిర్ణయించడానికి అవయవ నిర్మాణ పరిశీలన ఒక ముఖ్యసాధనం. అయితే శతాబ్దాల తరబడి ఒకే ప్రాంతంలో కలసివున్నందున, యుగయుగాలుగా భిన్న ఆర్థిక రాజకీయ కారణాల ఫలితంగా, జరిగే సామాజిక పరివర్తనా ఫలితంగాను జాతి సాంకర్యానికి అవకాశం ఉండి ఒకే వ్యక్తిలో భిన్న జాతుల లక్షణాలు కన్పించడం సంభవం కాని స్థూలంగా ఆంధ్ర ప్రజలను పరిశీలిస్తే వారిలో మథ్యధరా, ఆస్ట్రలాయిడ్, మంగోలాయిడ్ జాతుల లక్షణాలు కనిపిస్తాయి. వీరందరూ అర్యేతర జాతులే. మధ్యధరా జాతికి మధ్యస్థమైన దేహ ప్రమాణం, వెడల్పుగా పొట్టిగా ఉండే ముఖాలు, వంకరలు ఎక్కువగా లేని జుట్టు, గోధుమవర్ణం ముఖ్య లక్షణాలు. ముఖ్యంగా తీర మైదానంలోని అగ్ర వర్ణాల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అదీగాక ఆంధ్రదేశంలో "రాక్షసగుళ్ళు" అనే ప్రాచీన సమాధులున్నాయి. వీటిలో లభించిన అస్థి పంజరాలలో మధ్యధరా జాతుల లక్షణాలు స్పష్టం. ఒకప్పుడీ జాతులు ఆసియామైనర్ నుండి గంగా మైదానం వరకు విస్తరించివూడే వారని పారశీక గ్రంథమైన అవేస్థాలోని 'దాహదహ్యులు' ఋగ్వేదంలో దాసదస్యులు వీరేనని చరిత్రకారుల నిర్ణయం. కాబట్టి ఆర్య ద్రావిడ సంఘర్షణ భారతదేశానికి వెలుపలే ప్రారంభమయింది. ఉత్తరాపథంలో ద్రావిడులు ఒకప్పుడుండేవారనడానికి బలూచిస్తాన్ లోని బ్రహుయీ భాషను నిదర్శనంగా ఉదహరిస్తారు. ఇక దక్షిణ పీఠభూమిలోని ఆదివాసులు ఆస్ట్రలాయిడ్, మంగోలాయిడ్ జాతులకు చెందినవారు. నల్లమలారణ్యాల్లోని చెంచులు, కోయలు ఆస్ట్రలాయిడ్ జాతివారు. వీరివి పొట్టిదేహాలు, పొడవైన తలలు, చప్పిడి ముక్కులు. మన్యప్రాంతారణ్యాలలోని సవరలు, గదబులు మంగోలాయిడ్లు. వీరిది నల్లని దేహకాంతి, బొద్దు పెదవులు, చప్పిడి ముక్కులు. క్రమంగా ఈ జాతులవారు సమీప నాగరికతా సంస్కృతులలవచుకొని సమాజంలో కలిసిపోతున్నారనవచ్చు.

ఆహార సంపాదనలోని కష్టనిష్టూరాలు, ఇతర జాతులవల్ల కలిగే భయాందోళనలు వంటి కారణాల ఫలితంగా పరస్పర సహకార అవశ్యకత గుర్తించి ఈ జాతులన్నీ క్రమంగా ఐక్యమయినాయి. జాతి సాంకర్యం సాంస్కృతిక సమ్మేళనం దక్షిణాపథంలో శిలాయుగంలోనే కన్పిస్తుంది. ఈ జాతులలో సాహసోపేతులు యుద్ధప్రియులైన ఆంధ్రులు రాజకీయాధిక్యం సాధించడంతో వారి ఆధిపత్యం కిందికి తెచ్చిన తెగలన్నీ స్వీయ వ్యక్తిత్వం కోల్పోయి ఆంధ్రులయినారు. భిన్నజాతుల సమ్మేళనం ద్వారా ఆంధ్రజాతి ఏర్పడిందని సూచించడానికే బహుశా "ఆంధ్రాశ్చ బహవః" అంటూ మహాభారతం నిర్వచించింది. వాసిష్టీ పుత్రపులోమావికి 'నవనరస్వామి' అనే బిరుదు ఉంది.

యివి కూడా చూడండి

[మార్చు]

వనరులు

[మార్చు]
  • ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్

యితర లింకులు

[మార్చు]