Jump to content

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం, పరిశోధనాలయం

వికీపీడియా నుండి
2017లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ ఇనిస్టిట్యూట్‌ను సందర్శించిన భారత ప్రధానినరేంద్ర మోడీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం, పరిశోధనాలయం (Andhra Pradesh Government Oriental Manuscripts Library and Research Institute) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంస్థ. ఈ సంస్థ 1967 లో హైదరాబాద్ కేంద్రంగా స్థాపించబడినది. దీనికి వ్యవస్థాపక అధ్యక్షులుగా వడ్లమూడి గోపాలకృష్ణయ్య వ్యవహరించారు.

ఈ సంస్థ రాష్ట్రంలో లభించిన అరుదైన వ్రాతప్రతులను భద్రపరచి వాటిని పరిశోధకులకు అందించాలనేది ముఖ్యమైన ఉద్దేశం.[1] ఇక్కడ 14 భాషలకు సంబంధించిన 21 వేల వ్రాతప్రతులు సేకరించబడి మైక్రోఫిలిం చేయబడి అందుబాటులోవున్నాయి. వీటిలో ఒక వేయికి పైగా తెలుగు, సుమారు 3 వేల సంస్కృత తాళపత్రగ్రంథాలు కాగా, సుమారు 17 వేలకు పైగా అరబిక్, పర్షియన్, ఉర్దూ కాగిత ప్రతులు ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

ఈ సంస్థ 1967 లో రాష్ట్ర ఆర్కీవు సంస్థలో భాగంగా పనిచేసేది. పిదప 25 జూలై 1969లో అప్పటి రాష్ట్ర విద్యాశాఖామాత్యులుగా పి.వి.నరసింహారావు ఆధ్వర్యంలో ఇదొక ప్రత్యేక విభాగంగా సంస్కరించబడినది. 1971 లో ఐదవ పంచవర్ష ప్రణాళికలో భాగంగా దీనిని పరిశోధనాలయంగా మార్చి ఈశాఖను ఒక జాయింట్ డైరెక్టర్ అధీనంలో ఉంచబడింది.

1 జనవరి 1975 నుండి ఈ సంస్థను ఒక స్వతంత్ర ప్రతిపత్తిగల ప్రభుత్వ సంస్థగా రాష్ట్ర విద్యాశాఖ ఆధీనంలో ప్రత్యేక డైరెక్టరు నియమించినది. అప్పటినుండి వడ్లమూడి గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో 1978 వరకు అభివృద్ధిచెందినది.

ప్రారంభకాలంలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవనంలోనే పనిచేసేది; 1980లో దీన్ని తార్నాక లోని రాష్త్ర పురావస్తు శాఖ భవనానికి మార్చబడినది. 1984లో అబిడ్స్ లోని స్వంతభవనం అయిన రతన్ మహల్ లోనికి చేరింది.

ప్రచురణ

[మార్చు]

ఈ సంస్థ వ్రాతప్రతులను సంగ్రహణతో బాటుగా కొన్ని అరుదైన పుస్తకాలను ప్రచురించింది. ఇందులో 16 తెలుగు పుస్తకాలున్నాయి. ఇవి కాక మరో 16 సంస్కృత, తమిళ, ఇతర భాషలకు చెందినవి. విజ్ఞాన సరస్వతి (Vijnana Saraswati) అనే త్రైమాసిక పత్రికను కూడా ఈ సంస్థ విడుదలచేసింది.[2]

  • 1971 : షాజీ భోంస్లే రచించిన సీతాకళ్యాణం అను యక్షగానం (తెలుగు)
  • 1972 : ప్రాచీనకవి రచించిన శృంగారపదములు (తెలుగు)
  • 1972 : తెనాలి రామభద్రకవి రచించిన ఇందుమతీ పరిణయం (తెలుగు)
  • 1972 : జయదేవుడు రచించిన శ్రీ గీతగోవిందం, పంచరత్న ఆదినారాయణ రచించిన శ్రీ గీతశంకరం (తెలుగు లిపిలో సంస్కృతం)
  • 1972 : షాజీ మహరాజు రచించిన రాధా వంశీధర విలాస నాటకం (హిందీ)
  • 1973 : విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన శ్రీ విరూపాక్ష శ్రీరామ తామ్రపత్ర శాసనాలు[3] (నగరి, తెలుగు లిపిలో సంస్కృతం)
  • 1975 : మంచెళ్ల వాసుదేవ కవి రచించిన వైకృత చంద్రిక (తెలుగు లిపిలో సంస్కృతం)
  • 1976 : అల్లుడు నరసింహకవి రచించిన నారదీయ పురాణము (తెలుగు)
  • 1978 : ఏనుగుల వీరాస్వామి రచించిన కాశీయాత్ర చరిత్ర ఆంగ్ల అనువాదం.[4]
  • 1982 : వెల్లంకి తాతంభట్టు రచించిన కవి చింతామణి (తెలుగు)
  • 1983 : నారన సూరన రచించిన ఉదయనోదయము, వనమాలీ విలాసము (తెలుగు)[5]
  • 1983 : వాసిరెడ్డి దుర్గా సదాశివేశ్వర రచించిన అర్ష కుటుంబము (తెలుగు)
  • 1985 : చింతలపూడి ఎల్లనార్య రచించిన తారకబ్రహ్మ రాజీయము (తెలుగు)[6]
  • 1985 : రాజశేఖర శుధి రచించిన అలంకార మకరంద (సంస్కృతం)
  • 1985 : గిరిధర్ దాస్ రచించిన నహుష్ (హిందీ)
  • 1986 : అసకనూరి రంగధామకవి రచించిన వజ్రగిరి నరసింహ శతకము (తెలుగు)
  • 1986 : కొటికెలపూడి కోదండరామకవి రచించిన రామరాజవతంశ శతకము (తెలుగు)
  • 1986 : మద్దిపట్ల అప్పన్న శాస్త్రి రచించిన యోగశక్త పరిణయము (తెలుగు)
  • 1986 : బహిరి పమనాయక రచించిన భార్గవ పురాణము (తెలుగు)
  • క్రొత్తపల్లి సుందరరామయ్య సంకలనం చేసిన అకారాది అమర నిఘంటువు

పరిశోధన

[మార్చు]

ఈ సంస్థలో పరిశోధనకు అత్యంత ప్రాముఖ్యత ఇయ్యబడినది. ఇక్కడి పి.హెచ్.డి. కార్యక్రమాన్ని ఆంధ్ర, వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు గుర్తించాయి. నలుగురు ఇక్కడనుండి పి.హెచ్.డి.పట్టాపొందారు. వెలగా వెంకటప్పయ్య వారిలో ప్రముఖులు. వీరి పరిశోధనకు త్రిపురనేని గోపీచంద్ స్మారక బంగారు పతకం, ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు లభించాయి.

మూలాలు

[మార్చు]
  1. Hand book of Andhra Pradesh Govern. Oriental Manuscripts Library. Hyderabad: A.P. Govt. Oriental Manuscripts Library And Research Institute. 1988. Retrieved 7 February 2021.
  2. విజ్ఞాన సరస్వతి సంపుటి 5, సంచిక 3. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం, పరిశోధనాలయం. 1988. Retrieved 7 February 2021.
  3. శ్రీ విరూపాక్ష - శ్రీరామ తామ్రశాసనములు. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం, పరిశోధనాలయం. 1973. Retrieved 7 February 2021.
  4. Komaleswarapuram Srinivasa Pillai (1973). Enugu Veeraswamy's Journal (PDF). Hyderabad: A.P. Govt. Oriental Manuscripts Library And Research Institute. Retrieved 9 February 2021.
  5. నారన సూరన (1983). ఉదయనోదయము. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం, పరిశోధనాలయం. Retrieved 7 February 2021.
  6. చింతలపూడి ఎల్లనార్య (1986). తారకబ్రహ్మ రాజీయము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయము, పరిశోధనాయం. Retrieved 7 February 2021.