ఆంధ్రసాహిత్యములో బిరుదనామములు
ఆంధ్రసాహిత్యములో బిరుదనామములు | |
పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | |
---|---|
సంపాదకులు: | కోడిహళ్లి మురళీ మోహన్ |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | పరిశోధన |
ప్రచురణ: | CIIL,మైసూర్ & కోడిహళ్లి మురళీ మోహన్, హైదరాబాద్ |
విడుదల: | 2017 |
ఆంధ్రసాహిత్యములో బిరుదనామములు ఒక పరిశోధనాత్మక గ్రంథం. ఇది కోడిహళ్లి మురళీ మోహన్ సంపాదకత్వంలో వెలువడినది. 2017 జనవరిలో మొదటి ముద్రణ పొందినది.[1] తెలుగు సాహిత్యంలో ఏ కవికి ఏ ఏ బిరుదులు ఉన్నాయి. ఏ బిరుదు ఏ ఏ కవికి ఇవ్వబడినది అను విషయాలను తెలియజేస్తు రాయబడిన పుస్తకం ఇది.
పుస్తక విషయం
[మార్చు]ఈ పుస్తకానికి పీఠికను సంపాదకుడే రాశాడు. పీఠికలో బిరుద నామం అంటే ఏమిటి? బిరుదులు ఎవరిస్తారు? ఎందుకిస్తారు? ఎవరికిస్తారు? ఇచ్చేవారికి, పుచ్చుకునే వారికి ఉండవలసిన అర్హతలేమిటి? బిరుదుల్లో రకాలు, బిరుదు ప్రదానం వెనుకున్న నేపథ్యాల గురించి సంపాదకుడు సవివరంగా తెలియజేశాడు. తెలుగు సాహిత్యంలో కవి పండితులు పొందిన బిరుదలన్నిటిని ఒకచోట పొందు పరిచే ప్రయత్నమే ఈ పుస్తకమని సంపాదకుడు చెప్పుకున్నాడు. ఈ పుస్తకంలో రెండు పట్టికలలో బిరుదులను పొందుపరచడం జరిగింది. మొదటి పట్టికలో బిరుదునామములు అకారాది క్రమంలో ఉంటే, రెండవ పట్టికలో బిరుద గ్రహీతల పేర్లు అక్షరక్రమంలో ఇవ్వడం జరిగింది. 606 బిరుదులను, 599 మంది కవి పండితులను ఈ రెండు పట్టికలలో చేర్చడం జరిగింది. ఈ విధానం ద్వారా ఒకే బిరుదు ఎంత మందికి ఇవ్వబడినది, ఒక కవికి ఎన్ని బిరుదులు ఉన్నాయో పాఠకులు సులభంగా తెలుసుకొనే సౌలభ్యం కొరకు ఇలా కూర్పు చేయడమైనది రచయిత తెలియజేశాడు.సుమారు 1035 ఆరోపాలను ఈ పుస్తకంలో పొందుపరచడమైనది. కొన్ని కొన్ని చోట్ల బిరుదులను ఎవ్వరిచ్చారో (సంస్థ/వ్యక్తి) కూడా తెలియజేయడమైనది. జిల్లా సర్వస్వాలు, కవుల చరిత్రలు, పత్రికలు, అనేక గ్రంథాలు, అంతర్జాలం ఈ సమాచార సేకరణకు మూలాధారమని సంపాదకుడు తెలియజేశాడు.
సంపాదకులు
[మార్చు]- కోడిహళ్లి మురళీ మోహన్ తెలుగు రచయిత. అబ్జక్రియేషన్స్ సాహిత్యసాంస్కృతిక సంస్థ (రి), హైదరాబాద్‌కు వ్యవస్థాపక కార్యదర్శి. ఇతను "స్వరలాసిక" కలం పేరుతో రచనలు, గ్రంథసమీక్షలు చేశాడు. ఆంధ్రభూమి దిన పత్రిక, నేటి నిజం దినపత్రిక, ఈవారం, జాగృతి లాంటి పత్రికలలో వివిధ గ్రంథాలపై చేసిన సమీక్షల్ని "గ్రంథావలోకనమ్" పేరుతో వెలువరించాడు.[2]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రసాహిత్యములో బిరుదనామములు, సం.కోడిహళ్లి మురళీ మోహన్,CIIL,మైసూర్ & కోడిహళ్లి మురళీ మోహన్, హైదరాబాద్,2017
- ↑ "వినదగు నెవ్వరు జెప్పిన... 'గ్రంథావలోకనమ్' పై స్పందన!!!". Archived from the original on 2016-03-06. Retrieved 2020-04-13.