ఆకాశవాణి కేంద్రం, కడప
ఆకాశవాణి రేడియో ప్రసారాల కోసం కడపలో నెలకొల్పిన కేంద్రం ఇది. ఈ కేంద్రం కార్యక్రమాలు (Frequency Modulation) 103.6 MHz మరియు Amplitude Modulation (AM) 900 KHz మీద ప్రసారమౌతాయి.
చరిత్ర, పురోగతి
[మార్చు]ఆకాశవాణి కడప కేంద్రం రాయలసీమ ప్రాంత ప్రజల కోసం 1963 జూన్ 17న రిలే కేంద్రంగా ప్రారంభమైంది. అప్పట్లో కేంద్ర సమాచార ప్రసార శాఖామాత్యులు డా. బెజవాడ గోపాలరెడ్డి ఈ రిలే కేంద్రం ప్రారంభించారు. కొప్పర్తిలో రిలే స్టేషన్ నిర్మించి సాయంప్రసారాలు హైదరాబాదునుండి 20 కిలోవాట్ల ప్రసార శక్తితో ప్రారంభమయ్యాయి.[1] 1975 జూన్ లో స్వతంత్ర కేంద్రంగా ప్రసారాలు ప్రారంభమయిన సభకు రాష్ట్రమంత్రి యం. లక్ష్మీదేవి ముఖ్య అరిథి. బెంగుళూరుకు చెందిన టి. ఆర్. రెడ్డి తొలి అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరు. తర్వాత డైరక్టరుగా మంగుళూరు బదలీ అయ్యారు. వీరు బెంగుళూరు కేంద్రం డైరక్టరుగా 1986 జూన్ లో రిటైరయ్యారు. బెంగుళురులో స్థిరపడ్డారు.
1974 నవంబరు 2 నుండి మూడు ప్రసారాలు కడప కేంద్రం నుండి ప్రారంభమై నిలయకళాకారులు, కార్యక్రమ నిర్వాహకులు చేరారు. కార్యక్రమ రూపశిల్పులలో శ్రీ బి. ఆర్. పంతులు, ఆర్. విశ్వనాథం, కె. రాజభూషణరావు, శ్రీ గోపాల్, డా. ఆర్. అనంతపద్మనాభరావు, గొల్లపూడి మారుతీరావు, ఆరవీటి శ్రీనివాసులు, దేవళ్ళ బాలకృష్ణ, డి. కె. మురార్, శ్రీ పి. ఆర్. రెడ్డి, వై. గంగిరెడ్డి, డా. టి. మాచిరెడ్డి, సుమన్, కౌతా ప్రియంవద వంటి వారు ప్రముఖులు. ఈ కేంద్రం రాయలసీమ వాసుల చిరకాల వాంఛలకు ప్రతీకగా ఎందరో కళాకారులను తీర్చిదిద్దింది.
ప్రముఖులు-కార్యక్రమాలు
[మార్చు]- బి. రామన్న పంతులు తొలినాళ్ళలో కార్యక్రమ ప్రణాళికను తీర్చిదిద్దడంలో కృషి చేశారు. 1960లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్‌లో ఎం.ఏ. చేసిన అనంతరం 1963లో సెలక్షన్ ద్వారా ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. విజయవాడ, ధర్వాడ, హైదరాబాదు కేంద్రంలో 1975 వరకు పనిచేశారు. 1975లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా కడప, పోర్ట్‌బ్లయర్, పాండిచేరి, మదరాసుల్లో పనిచేశారు. 1988లో అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరుగా మదరాసులో చేరారు. 1988లో డైరక్టరుగా ఢిల్లీలోని డైరక్టర్ జనరల్ కార్యాలయం వెళ్లారు. 1993-96 మధ్యకాలంలో సంగీత విభాగం డైరక్టరుగా పనిచేశారు. వీరి సోదరులు గిరిజా శంకరరావు హైదరాబాదు కేంద్రం అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా పనిచేశారు.
- రాళ్ళపల్లి విశ్వనాథం ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా 1963 నుండి మదరాసు, బెంగుళూరు, విశాఖపట్టణం కేంద్రాలలో పనిచేసి ఒరిస్సాలోని సంబల్‌పూర్ బదలీ అయ్యారు. వీరు 1963లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. పట్టా పొందారు. కొంతకాలం మదరాసు ఆంధ్రపత్రిక దినపత్రిక కార్యాలయంలో పనిచేశారు. 1975 జూలైలో కడపకేంద్రానికీ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా బదలీ అయ్యారు. అక్కడ నుండి విజయవాడ, అదిలాబాద్, హైదరాబాదు, వరంగల్ కేంద్రాలలో పనిచేశారు. 1986లో ASD అయి 90 నుండి స్టేషన్ డైరక్టర్‌గా C.B.S. హైదరాబాదులో పనిచేశారు. కార్యక్రమ రూపకల్పన పట్ల చక్కని అవగాహన గల విశ్వనాథం స్నేహశీలి.
- కె. రాజభూషణరావు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా కడప, విశాఖపట్టణ కేంద్రాలలో రెండు దశాబ్దాలు పనిచేసి 1994లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా పదవీ విరమణ చేసి భీమిలిలో స్థిరపడ్డారు.
- డా. తక్కోలు మాచిరెడ్డి హిందీలో పి.హెచ్ డి. చేసి ట్రాన్సుమిషన్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. ఆ తర్వాత UPSC ద్వారా 1975లో P B X గా చేరారు. జగదల్‌పూర్, కడప, రాంపూరు, స్టేషన్లలో పనిచేశరు. 1994లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా మడికెర (మైసూర్) బదలీ అయి తర్వాత అనంతపురం కేంద్రానికి వచ్చారు. సాహిత్యంలో చక్కటి అవగాహనగల మాచిరెడ్డి అభ్యుదయ భావాలు గల వ్యక్తి.
- చక్కటి గాయకుడైన అరవీటి శ్రీనివాసులు జానపద సంగీతవిభాగ ప్రయోక్తగా చక్కటి కార్యక్రమాలు నిర్వహించాడు, ఎం. ఏ. పట్టభద్రుడైన శ్రీనివాసులు కడప కేంద్రంలో 1975 లో అనౌన్సర్‌గా చేరి 1980లో ప్రొడ్యూసర్ అయ్యాడు. కడప, మదరాసు కేంద్రాలలో పనిచేసి 1994లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా అనంతపురం బదలీ అయ్యాడు. తర్వాత కడపకేంద్రం వచ్చాడు. మిమిక్రీ కళాకారుడుగా జానపద ప్రయోక్తగా శ్రీనివాసులు భావుకుడు. కొంతకాలం ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమి సభ్యులు.
- స్నేహసౌహార్దాలకు ప్రతీక వై. గంగిరెడ్డి హైదరాబాదు కేంద్రంలో ఫారంరేడియో రిపోర్టర్‌గా చేరి 1978లో విశాఖపట్టాణానికి F R O గా వెళ్ళారు. అక్కడ దశాబ్దికిపైగా పనిచేసి తిరుపతి బదలీ అయ్యారు. 1993లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా కడప బదలీ అయ్యారు. బి. యస్‌సి (అగ్రికల్చర్) పూర్తిచేసిన గంగిరెడ్డి చిత్తూరు జిల్లాలో జన్మించారు. స్వయంగా రైతుకుటుంబంలో నుండి వచ్చారు గాన రైతుకార్యక్రమాలపట్ల చక్కని అవగాహన.
- పి. వెంకటేశ్వరరావు అనబడే సుమన్ హిందీలో ఎం.ఏ., బి.యిడి. పూర్తిచేసి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్ (స్క్రిప్ట్)గా చేరారు. 1979లో విద్యా ప్రసారాల విభాగం ప్రొడ్యూసర్ గా రిక్రూట్ అయ్యారు. విజయవాడ, అదిలాబాద్ కేంద్రాలలో పనిచేశారు. సుమన్ 1994లో కడపకేంద్రం అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా బదలీ అయ్యారు. చక్కటి కథా రచయిత సుమన్ కార్యక్రమ రూపకల్పనలో అందవేసిన చేయి. సుమన్ 1996 జూన్ నుండి విజయవాడలో పనిచేస్తున్నారు.
- కడప కేంద్రంలో మూడు దశాబ్దాలకు పైగా అనౌన్సర్లుగా శ్రీయుతులు గాడిచర్ల శ్రీనివాసమూర్తి, గుర్రం కోటేశ్వరరావు పనిచేశారు.
మూలాలు
[మార్చు]- ↑ ప్రసార ప్రముఖులు. విజయవాడ కేంద్రం. డా. ఆర్. అనంతపద్మనాభరావు. pp. 76–78.