ఆర్గ్ ఇ బామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
ఆర్గ్-ఇ బాం
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
Fortaleza de Bam, Irán, 2016-09-23, DD 09.jpg
ప్రదేశంబామ్, ఇరాన్
రకంనిర్మాణం
ఎంపిక ప్రమాణంసాంస్కృతికం: ii, iii, iv, v
మూలం1208
యునెస్కో ప్రాంతంఇరాన్
శిలాశాసన చరిత్ర
శాసనాలు2004 (28th సమావేశం)
అంతరించిపోతున్న సంస్కృతి2004–2013
ఆర్గ్ ఇ బామ్ is located in Iran
ఆర్గ్ ఇ బామ్
Location of ఆర్గ్ ఇ బామ్ in Iran.
2003 భూకంపానికి ముందు, తర్వాత, పునర్నిర్మాణం తర్వాత బామ్ సిటాడెల్
భూకంపానికి ముందు
భూకంపం తర్వాత
పునర్నిర్మాణం (2016 సెప్టెంబరు నాటిది)

ఆర్గ్-ఇ బామ్ ( ఫార్సీ: ارگ بم‎ ) కాల్చని ఇటుకలతో నిర్మించే అడోబీ తరహాలో ప్రపంచంలోనే అతిపెద్ద భవనం. ఇది ఆగ్నేయ ఇరాన్‌లోని కర్మన్ ప్రావిన్స్‌లోని బామ్ అనే నగరంలో ఉంది. "బామ్, దాని సాంస్కృతిక లాండ్‌స్కేప్" యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో నిలిచింది. సిల్క్ రోడ్‌లో ఉన్న ఈ భారీ దుర్గం (సిటాడెల్) అచెమెనిడ్ సామ్రాజ్య (క్రీ.పూ. ఆరవ నుండి నాల్గవ శతాబ్దాలు) కాలంలోనూ, అంతకన్నా పూర్వ కాలం నుంచీ ఉనికిలో ఉంది. ఈ దుర్గం ఏడు నుండి పదకొండవ శతాబ్దాల వరకు ప్రధాన వాణిజ్య మార్గాల కూడలిలోను, పట్టు, పత్తి వస్త్రాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ప్రదేశంలోను ఉన్న కాలంలో ఉచ్ఛస్థితిలో ఉండేది.[1]

మొత్తం భవనాన్ని పరిశీలిస్తే అది సిటాడెల్ (దుర్గం) కలిగి ఉన్న ఒక పెద్ద కోట. అయితే, ఎత్తైన ప్రదేశంగా ఏర్పడి, ఆకట్టుకునే రూపంతో ఉన్న సిటాడెల్ విశిష్టంగా కనిపించడంతో, మొత్తం కోటకు బామ్ సిటాడెల్ అని పేరు పెట్టారు. 2003 డిసెంబరు 26న భూకంపం వచ్చి బామ్ నగరం, దాని పరిసర ప్రాంతాలతో పాటుగా సిటాడెల్ పూర్తిగా నాశనమైంది. భూకంపం తర్వాత కొద్ది రోజులకు ఇరాన్ అధ్యక్షుడు మొహమ్మద్ ఖతామి సిటాడెల్ పునర్నిర్మాణం చేయనున్నట్టు ప్రకటించారు.

సంక్షిప్త చరిత్ర

[మార్చు]

బామ్ సిటాడెల్ భవనాలు ఎప్పటివి అన్నది కచ్చితంగా తేల్చగల పురావస్తు డేటింగ్ లేదు. కానీ, చారిత్రక మూలాలు, పురాతన గ్రంథాలు ఆధారం చేసుకుని చూస్తే ఈ ప్రాంతంలో ఆకేమేనియన్లు క్రీ.పూ. 579-323 కాలంలో నిర్మించిన కోటతోనే మొదటి మానవ నివాసాల జాడ మొదలైనట్టు తెలుస్తోంది. సహజమైన కొండను, మానవులు నిర్మించిన టెర్రెస్‌ను కలిపి వేదికను కట్టడం వంటి ఈ సిటాడెల్ లక్షణాలు కొన్ని పరిశీలించి పురాతత్త్వ శాస్త్రజ్ఞులు అకేమేనియన్ రాజధాని పర్సెపోలీస్‌లోని నిర్మాణశైలితో పోలస్తున్నారు. పార్థియన్ పాలనలో కోట విస్తరించడంతో బామ్ సిటాడెల్‌గా, ఆర్గ్-ఎ-బామ్‌గా పేరొందింది. "బామ్ అండ్ ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ అర్బన్ సెటిల్మెంట్ అండ్ ప్లానింగ్ ఆఫ్ ఇరాన్" అనే తులనాత్మక అధ్యయనం పార్థియన్ కాలంలో బామ్ నగరంలో ముఖ్యమైన భాగంతో పాటు గవర్నర్ విభాగం కూడా నిర్మితమైందని తేల్చింది. సస్సానిడ్స్ కాలంలో, కోటను అర్దేశీర్ బాబాకన్ ముట్టడించాడు. సా.శ. 224 నుంచి 637 మధ్యకాలంలో కొత్త ప్రాకారాలు, గోడలు నిర్మించారు.[2]

తిరిగి కొన్నేళ్ళకు సా.శ.645 లో అరబ్బులు కర్మన్ ప్రాంతాన్ని జయించారు, బహుశా అర్గ్-ఇ-బామ్ యుద్ధంలో దెబ్బతింది. అరబ్ కమాండర్లలో ఒకరైన అల్ రసౌల్ మసీదును నిర్మించారు, ఇది ఇస్లామిక్ యుగం ప్రారంభంలో ఇరాన్‌లో నిర్మించిన మొట్టమొదటి మసీదుల్లో ఒకటి. సా.శ. 656లో ఇమామ్ అలీ చేతిలో ఓడిపోయిన ముస్లిముల బృందం ఖవారిజ్, కర్మన్, బామ్ నగరాలకు పారిపోయి అక్కడ ఆర్గ్-ఎ-బామ్‌లో స్థిరపడ్డారు. సా.శ.869లో, అబ్బాసిడ్‌లతో పోరాడుతున్న యాకుబ్ ఇబ్న్ అల్-లేత్ అల్-సఫర్ ఖవారీజ్‌ను ఓడించి, ఆర్గ్-ఎ-బామ్‌ను స్వాధీనం చేసుకున్నాడు. అది అతని శాశ్వత బేస్ క్యాంప్‌గా మారింది. 10వ శతాబ్దంలో ఇస్లామిక్ రచయితలు బామ్ పేరును మొదటిసారిగా ప్రస్తావించారు. ఈ రచయితల ప్రకారం, బామ్ అప్పుడు చుట్టూ విస్తృతంగా వ్యవసాయ ప్రదేశాలతో చక్కగా స్థిరపడిన మార్కెట్ ప్రాంతం. ఈ నగరం సొగసైన పత్తి బట్టలకు, అజేయమైన కోటకు, బిజీ బజార్లకు, తాటి చెట్లకు పేరొందింది.[2]

ఇరాన్‌పై మంగోల్ దండయాత్ర తరువాత, బామ్, కర్మన్ ప్రాంతాలు సా.శ. 1240 నుండి 1363 వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన ఖరాఖటయన్ రాజవంశం చేతిలోకి వెళ్ళాయి. ఈ ప్రాంతాన్ని సిల్క్ రోడ్‌కు అనుసంధానించే మసాలా మార్గంలో వ్యూహాత్మక ప్రదేశంలో ఉండడంతో బామ్‌కు లాభించింది. పట్టు పురుగుల పెంపకం, పట్టు పరిశ్రమ ఈ నగరంలో విలసిల్లుతూండేవి.[2]

చారిత్రకంగా ఇతర పాలనా కాలాలతో పోలిస్తే 1502 నుండి 1722 వరకు సాగిన సఫావిడ్ పాలనలో ఇరాన్‌లో ప్రశాంతత, స్థిరత్వం నెలకొంది. దేశంలోని ఇతర ప్రాంతాలు, కట్టడాలతో పాటుగా ఆర్గ్-ఎ-బామ్ గణనీయంగా అభివృద్ధి చెందింది. ఫోర్ సీజన్స్ ప్యాలెస్ ఈ కాలంలో నిర్మించబడింది. సఫావిడ్ కాలం ముగుస్తున్న కాలానికి, ఆర్గ్-ఇ-బామ్‌ను కజార్ రాజవంశ వ్యవస్థాపకుడు ఆఘా మొహమ్మద్ ఖాన్ జయించి స్వాధీనం చేసుకున్నాడు. అతను ఆఫ్ఘన్, బలూచి ఆక్రమణలు, దాడులను నివారించడానికి సిటాడెల్‌ను వ్యూహాత్మక స్థానంగా వాడుకుని, దానిని సైనిక కాంప్లెక్స్‌గా రూపొందించాడు. 1839లో నిజారీ ఇస్మాయిలీ శాఖకు చెందిన ఇమామ్ అయిన మొదటి ఆగా ఖాన్ మొహమ్మద్ షా కజార్‌ను వ్యతిరేకిస్తూ ఎదిగి ఆర్గ్-ఇ-బామ్‌లో ఆశ్రయం పొందాడు. తరువాత తరువాత ఫార్మాన్ ఫార్మా (పాలకుల పాలకుడు) గా పేరొందిన ప్రిన్స్ ఫిరూజ్ మీర్జా అతన్ని బంధించాడు. ఆర్గ్-ఎ-బామ్ లోపల సైనికుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ పోవడంతో ప్రాకారాల బయట ప్రజలు స్థిరపడసాగారు. 1880లో ఫిరోజ్ మీర్జా సిటాడెల్ ప్రాంతంలో సైనిక సిబ్బంది మాత్రమే నివసిస్తున్నారని రాశారు. సిటాడెల్ పాదాలలోని జనంలేని పాత నగరాన్ని కూల్చి తోటగా మార్చాలని సూచించాడు. 1900లో బామ్ కొత్త నగర నిర్మాణం ప్రారంభమైంది. ప్రజలు క్రమంగా పాత బామ్‌ను విడిచిపెట్టారు.[2]

ఆర్గ్-ఇ-బామ్‌లోని దుర్గం (సిటాడెల్) లో సైన్యం 1932 వరకు విడిసి ఉండేది, కాని దుర్గం పాదాల వద్ద ఉన్న పాత నగరంలో ఎవరూ నివసించలేదని తెలుస్తోంది. పాత నగరంతో పాటు ఆర్గ్-ఇ-బామ్‌ను కూడా 1932 నుండి పూర్తిగా వదిలేశారు. 1953లో ఈ ప్రదేశాన్ని జాతీయంగా ప్రముఖమైన చారిత్రక ప్రదేశంగా గుర్తించారు, క్రమంగా దీని పరిరక్షణ, పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే 1973 నుంచి ఈ పనులు ఊపందుకోసాగాయి[2]

ఇస్లామిక్ విప్లవం తరువాత ఆర్గ్-ఎ-బామ్‌ బాధ్యత ఇరానియన్ కల్చరల్ హెరిటేజ్ ఆర్గనైజేషన్ (ICHO) కిందికి వెళ్ళింది. 1993లో సిటాడెల్ జాతీయ సాంస్కృతిక వారసత్వ సంస్థ వారి అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది.[1][2]

సిటాడెల్ వివరణ

[మార్చు]

సిటాడెల్‌లో నాలుగు ప్రధాన విభాగాలు ఉన్నాయి: నివాస ప్రాంతం, అశ్వశాల, సైనిక శిబిరాలు, గవర్నర్ నివాసం .

అర్గ్-ఇ-బామ్‌లో 38 కావలి బురుజులు (వాచ్‌టవర్లు), నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. బయటి రక్షణ గోడ చుట్టూ కందకం ఉంది. ప్రభుత్వ క్వార్టర్స్ రాతి కొండపై ఉన్నాయి, దీన్ని జోడు కోట గోడలు రక్షిస్తున్నాయి. అత్యంత ముఖ్యమైన నిర్మాణాలు బజార్, సామాజిక మసీదు, మీర్జా నయీమ్ అసెంబుల్, మీర్ హౌస్‌లు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Bam and its Cultural Landscape – UNESCO World Heritage Centre". Whc.unesco.org. Retrieved 2012-08-26.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "Bam and Arg-e-Bam, Iran". Auroville Earth Institute, UNESCO.  This article incorporates text from this source, which is in the public domain.