ఆర్. నటరాజ మొదలియార్
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ఆర్. నటరాజ మొదలియార్ దక్షిణ భారత దేశంలో తొలి సారిగా మూకీ చిత్రం "కీచక వధ" నిర్మించిన ఘనుడు. ఇతడు 1885, జనవరి 26న రాయవెల్లూరులో నీతినిజాయితీలకు పేరుపడ్డ ఒక వ్యాపారస్తుల కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి రంగస్వామి మొదలియార్. నటరాజ మొదలియార్ మెట్రిక్యులేషన్ వరకు రాయవెల్లూరులోనే చదివాడు. తండ్రిలాగా తను కూడా వ్యాపారం చేయాలని సంకల్పించి తన పెత్తల్లి కొడుకు ధర్మలింగ మొదలియార్‌తో కలిసి మద్రాసులో "వాట్సన్ అండ్ కో" అనే సంస్థను స్థాపించి అయిదారు సంవత్సరాలు సైకిళ్ళను దిగుమతి చేసుకుని అమ్ముతుండేవాడు. ఆ తర్వాత "రొమార్ డాన్ అండ్ కో" అనే కంపెనీని కొనుగోలు చేసి మోటారు కార్లను దిగుమతి చేసుకుని అమ్మేవాడు. ఆ కాలంలో దక్షిణ భారత దేశంలో ఈ వ్యాపారం చేసే రెండు సంస్థలలో ఇది ఒకటి. మంచి వ్యాపారిగా పేరు వచ్చినా ఇతడికి ఈ జీవితం అంతగా తృప్తిని కలిగించలేదు. ఏదైనా సృజనాత్మకత కలిగిన వ్యాపారం కాని, వృత్తి కాని చెయ్యాలని అతనికి కోరిక కలిగింది.
ఆ సమయంలోనే భారతదేశంలో మొట్టమొదటి మూకీ చిత్రం "రాజా హరిశ్చంద్ర" విడుదలయ్యింది. ఈ చిత్రాన్ని చూసిన నటరాజ మొదలియార్‌కు అలాంటి చిత్రాలను తీయాలని కోరిక కలిగింది. దానితో పూనా వెళ్లి అక్కడ స్టూవర్డ్ అనే బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ వద్ద ఫోటోగ్రఫీ, ప్రింటింగ్, ప్రాసెసింగ్ మొదలైన విద్యలన్నీ అభ్యసించాడు. అక్కడ శిక్షణ ముగిసిన తర్వాత 1915లో మద్రాసు వచ్చాడు. 1917లో ఇండియన్ ఫిలిం కంపెనీ అనే సంస్థలు స్థాపించాడు. తిరువయ్యూరులో ముపనార్ అనే అతని వద్ద ఒక కెమెరా, ప్రింటర్‌ను 1,800 రూపాయలు పెట్టి కొన్నాడు. తనకు సహాయకుడిగా ఉండడానికి తన మిత్రుడు జగన్నాథ ఆచారి అనే అతడిని పూనాలోని స్టూవర్డు వద్దకుపంపి ఫోటోగ్రఫీ, డెవలపింగు, ప్రాసెసింగులలో శిక్షణ ఇప్పించాడు. అతడు తిరిగి రాగానే చిత్రనిర్మాణం ప్రారంభించాడు. మిల్లర్ రోడ్డులో ఒక బంగళా తీసుకుని ఆ కాంపౌండులోనే ఒక పెద్ద షెడ్డు వేసి పై కప్పుగా ఒక తెల్ల గుడ్డను కప్పించాడు. దాని వల్ల షూటింగుకు అవసరమయ్యే సూర్యకాంతి షెడ్డులో పడుతుంది. సూర్యకాంతి కూడా తీక్షణంగా ఉండదు. ఆ రోజులలో షూటింగుకు సూర్యకాంతి తప్ప లైట్లు ఉపయోగించేవారు కాదు. ఆ విధంగా మద్రాసులో - దక్షిణ భారత దేశంలో మొట్టమొదటి సినిమా స్టూడియో వెలిసింది.
నాటకరంగంపై పేరుప్రతిష్టలు సంపాదించిన రంగవడివేలు అనే న్యాయవాది ఇతనికి సహకరించాడు. తిరు వెంకటస్వామి అనే మరో న్యాయవాది ఇతనికి స్క్రిప్టు రచనలో సహాయపడ్డాడు. "కీచక వధ"ను కథావస్తువుగా స్వీకరించారు. రాజు మొదలియార్ అనే రంగస్థల నటుడిని కీచకునిగా, జీవరత్నం అనే నటిని సైరంధ్రి పాత్రకు తీసుకున్నారు. చితీకరణ ఎక్కువ భాగం అవుట్ డోర్‌లోనే జరిగింది. నటరాజ మొదలియారే ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఫోటోగ్రఫీ, ప్రింటింగు, ప్రాసెసింగు మొత్తం ఇతనే చూసుకున్నాడు. ఈ సినిమాకు కళాదర్శకుడంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. ఇతడే సెట్స్‌కూ, పాత్రలకు రూపకల్పన చేశాడు. షణ్ముగం అనే ఆర్టిస్టూ, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో పనిచేసే మీనన్ అనే ఆయనా ఇతడికి సహకరించారు. ఈ సినిమా నిడివి 6000 అడుగులు. కొన్ని ముఖ్య దృశ్యాలను వివరిస్తూ 'సబ్ టైటిల్స్ ' హిందీలోను, తమిళంలోను వేశారు. తమిళ టైటిల్స్ వ్రాయడానికి ఇతనికి ఇతని మేనమామ గురుస్వామి మొదలియార్, తిరువెంకటస్వామి మొదలియార్ సహకరించారు. హిందీ టైటిల్స్ దేవదాస్ గాంధీ (మహాత్మాగాంధీ కుమారుడు) వ్రాశాడు.
ఆ విధంగా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి మూకీ చిత్రం "కీచక వధ" నిర్మించబడింది. ఈ సినిమా నిర్మాణానికి ఐదు నెలలు పట్టింది. 35 వేల రూపాయలు ఖర్చయ్యింది. ఈ సినిమా 1918లో మద్రాసులోని ఎలిఫిన్ స్టన్ టాకీసులో విడుదలయ్యింది. రోజూ రెండు ప్రదర్శనలు శని, ఆదివారాల్లో మ్యాటినీలు ఉండేవి. సబ్ టైటిల్స్ వచ్చినప్పుడు హాలులో కొందరు వ్యాఖ్యాతలు ఆ దృశ్యాలను ప్రాంతీయ భాషలలో విశదీకరించేవారు. ఈ సినిమా భారతదేశంలో పలుచోట్ల, రంగూన్, కరాచీ నగరాలలో ప్రదర్శించబడింది. ఈ చిత్రం 50 వేల రూపాయలు వసూలు చేసింది.
మొదటి చిత్రంతో వచ్చిన లాభంతో ఇతడికి ఉత్సాహం పెరిగి రెండవ మూకీ ప్రారంభించాడు. ఈసారి "ద్రౌపదీ వస్త్రాపరహణం" కథను ఎన్నుకున్నాడు. కాని ద్రౌపది పాత్రను నటించడానికి భారతీయ వనితలు ఎవరూ ముందుకు రాకపోవడంతో "వైలెట్ బేరీ" అనే బ్రిటిష్ వనితను ఒప్పించాడు. ఆమెకు తమిళం రాదు. నటించవలసిన దుశ్శాసన పాత్రధారికి ఆంగ్లం రాదు. చివరకు ఇంగ్లీషు తెలిసిన దొరస్వామి పిళ్లైను ఆ పాత్రకు ఎన్నుకున్నాడు. తొలి చిత్రం కన్నా తక్కువ ఖర్చుతో నిర్మించబడిన ఈ మూకీ సినిమా 1919లో విడుదలై 75,000 రూపాయలు వసూలు చేసింది.
ఆ తరువాత ఇతడు "లవకుశ", "రుక్మిణి - సత్యభామ", "మార్కండేయ", "మైరావణ" చిత్రాలను నిర్మించాడు. ఇతడు తీసిన ఆరు మూకీ సినిమాలూ పౌరాణికాలు కావడం విశేషం. ఇతడి స్టూడియో అగ్ని ప్రమాదంలో కాలిపోవడంతో విరక్తి చెంది సినిమా నిర్మాణానికి దూరమయ్యాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "The stamp of honour". The Hindu. 10 July 2000. Archived from the original on 11 November 2012. Retrieved 5 June 2013.