ఇంటర్నేషనల్ మొబైల్ స్టేషన్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ
ఇంటర్నేషనల్ మొబైల్ స్టేషన్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ లేదా ఐఎంఈఐ అనేది సాధారణంగా థర్డ్ జనరేషన్ పార్టనర్షిప్ ప్రాజెక్ట్ (3GPP) (అనగా జిఎస్ఎమ్, యుఎంటిఎస్, ఎల్‌టిఈ), ఐడెన్ మొబైల్ ఫోన్లు, అలాగే కొన్ని శాటిలైట్ ఫోన్లను గుర్తించే అద్వితీయమైన సంఖ్య. ఈ సంఖ్య సాధారణంగా ఫోన్ యొక్క బ్యాటరీ కంపార్ట్మెంట్ లోపల అతికించబడిన కాగితంపై కనిపిస్తుంది, అలాగే ఈ సంఖ్య చాలా ఫోన్లలో డయల్ ప్యాడ్ పై *#06# ను ఎంటర్ చెయ్యడం ద్వారా ఫోన్ స్క్రీన్ పై ప్రదర్శితమవుతుంది, లేదా స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ వ్యవస్థలలో సెట్టింగ్ల మెనులోని ఇతర వ్యవస్థ సమాచారంతో పాటు ఉంటుంది. ఈ ఐఎంఈఐ సంఖ్యను చెల్లుబాటు అయ్యే పరికరాలను గుర్తించడానికి GSM నెట్వర్క్ ద్వారా ఉపయోగిస్తారు, ఈ ఐఎంఈఐ నెంబర్ ద్వారా దొంగిలించబడిన ఫోన్ లో ఏ నెంబరు సిమ్ను ఉపయోగిస్తున్నారో నెట్వర్క్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా తెలుసుకొని వారిని పట్టుకోవచ్చు, లేదా ఆ ఫోనును పనిచేయకుండా ఆపివేయవచ్చు. ఉదాహరణకు ఒక మొబైల్ ఫోన్ దొంగతనం చేయబడినట్లయితే ఆ ఫోన్ యజమాని నెట్వర్క్ ప్రొవైడర్ కు కాల్ చేసి ఆ ఫోన్ యొక్క ఐఎంఈఐ నెంబరును తెలిపి ఆ ఫోనును "బ్లాక్‌లిస్ట్"లో పెట్టమని చెప్పాలి.