Jump to content

ఇందుకూరి చినసత్యనారాయణరాజు

వికీపీడియా నుండి

ఇందుకూరి చినసత్యనారాయణరాజు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది. స్వాతంత్ర్యానంతరం కూడా గాంధీజీ సిద్ధాంతాలను పాటించి, ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. నరసాపురంతాలూకా పండితవిల్లూరు గ్రామానికి చెందిన సత్యనారాయణరాజు గాంధీజీ ఖద్దరు నిధి కోసం జిల్లా వచ్చినప్పుడు ఆయన మార్గాలు నచ్చి, జాతీయోద్యమంలోకి అడుగుపెట్టారు. ధనవంతుల ఇంటిలో జన్మించిన ఆయన 18 ఎకరాల భూమిని స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఖర్చుపెట్టేశారు. ఆచంట ఫిర్కాలో ఎక్కువకాలం డిటెన్యూగా జైలు జీవితం అనుభవించన ఏకైక వ్యక్తి సత్యనారాయణ రాజే. స్వాతంత్ర్యానంతరం వివిధ హోదాల్లో ప్రజాసేవ చేసి, మంచి రాజకీయనాయకునిగా పేరుపొందారు. సత్యం, అహింసను నమ్మి, ఆచరణలో పెట్టి, ఎవరినీ నొప్పించని మనస్తతత్త్వం వంటి లక్షణాల వల్ల సహచరులు ఆయనను 'బుద్ధదేవుడు ' అని సంబోధించేవారు.[1]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

నరసాపురం తాలూకా పండితవిల్లూరులో సంపన్న కుటుంబంలో సూర్యనారాయణరాజు, వెంకాయమ్మ దంపతులకు 1906 జూన్ 15న జన్మించారు సత్యనారాయణరాజు. పండితవిల్లూరులోని వీధిబడిలో విద్యాభ్యాసం ప్రారంభించారు ఆయన. 1926లో మార్టేరు హైస్కూలులో ఎస్.ఎస్.ఎల్.సి చదివిన సత్యనారాయణరాజు 13వ ఏట తండ్రి, 23వ ఏట అన్నగారు చనిపోవడంతో ఉన్నత విద్య చదివేందుకు వీలు లేక అక్కడితో చదువు ఆపేశారు. తమ వంశపారంపర్య భూమిలో వ్యవసాయం చేసేవారు సత్యనారాయణరాజు.

జాతీయోద్యమం

[మార్చు]

1929లో ఖద్దరు నిధి యాత్ర కోసం జిల్లాకు వచ్చిన గాంధీజీ కారును పండితవిల్లూరులో గ్రామ పెద్దలు ఆపి, వారి నిధికి ఆయనకు ఇచ్చినప్పుడు గాంధీని మొదటిసారి చూశారు సత్యనారాయణరాజు. గాంధీ ఆలోచనలకు, విధానాలకు ప్రభావితులైన రాజు గాంధీ మార్గాన్ని అవలంబించారు. 1930 ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాలకొల్లు, నరసాపురంలలో కల్లు దుకాణాల వద్ద తాగద్దంటూ ఆందోళన చేస్తుండగా పోలీసుల లాఠీఛార్జిలో గాయాలపాలయ్యారు ఆయన.

1933లో కలకత్తాలో శ్రీమతి నెల్లీసెన్ గుప్తా అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ మహాసభకు ప్రతినిధిగా ఉద్ధరాజు రామంతో కలసి సత్యనారాయణరాజు కూడా హాజరయ్యారు. ఆ సమయంలో పోలీసులు అరెస్టు చేయగా 7 రోజులు అలీపూర్ జైలులో ఉన్నారు ఆయన.

1941లో రెండో ప్రపంచ యుద్ధ వ్యతిరేక ప్రచారంలో భాగంగా వ్యక్తి సత్యాగ్రహం చేసేందుకు రాజుకు గాంధీజీ నుంచి అనుమతి లభించింది. దాంతో స్నేహితుడు వెలిచేటి నారాయణతో కలసి 1941 జనవరి 13న పండితవిల్లూరులోని కచేరి సావిడి దగ్గర సత్యాగ్రహం చేశారు ఆయన. ప్రారంభించిన కొన్ని గంటలకే పెనుగొండ పోలీసులు వీరిని అరెస్టు చేశారు. నరసాపురం సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ వీరికి 1941 జనవరి 15 నుండి 3 నెలలు కఠిన కారాగార శిక్ష, 50 రూపాయల జరిమానా విధించగా, ఆయన రాజమండ్రి జైలులో తన శిక్షను అనుభవించారు.

మూలాలు

[మార్చు]
  1. గాదం, గోపాలస్వామి (ఆగస్టు 2016). భారత జాతీయోద్యమంలో పశ్చిమగోదావరి జిల్లా యోధులు. అత్తిలి: శ్రీసత్య పబ్లికేషన్స్.