ఇంద్రద్యుమ్నము
ఇంద్రద్యుమ్నము అనునది ఒకానొక సరస్సు. ఇది ఇంద్రద్యుమ్నుడు అను రాజు దానము చేసిన గోవులగొరిసెల త్రొక్కుడుచేత ఏర్పడినది. ఇంద్రద్యుమ్నుడు ఇంద్రసదనమున ఉండఁగా బహుకాలమునకు అతని కీర్తి లోకమున మాసెను. అంత అతనిని అమరులు భూమికి త్రోయఁగా అతడు మార్కండేయుని పాలికి చని నన్నెఱుంగవే అని అడుగఁగా అతడు తాను ఎఱుఁగననియు, తనకంటె పెద్దయయి హిమశృంగశైలవాసి యయియుండు ప్రవాళకుండు అను ఘూకము ఎఱుంగవచ్చుననియు చెప్ప, అతనివద్దకు పోయిరి. అంత అతడును తాను ఎఱుంగను అనఁగా అతని ప్రేరణచే ఈ ఇంద్రద్యుమ్న సరస్సు నందు ఉండిన నాళీజంఘుడు అను ఒక బకము చెంతకుపోయి అతని మూలముగ ఆ కొలని యందుండు యుగంధరుడు అను తాబేలును అడుగ అదికొంతసేపు తలఁచుకొని కన్నుగవ యందు అశ్రుతతులు తొరగ,
ఉ|| అక్కట నేనెఱుంగనె మహాగుణభూషణు నమ్మహాత్ము న,
న్నిక్కడఁ బెక్కు మాఱులననేక భయంబులఁ బొందుచుండఁగా,
నక్కటికంబుతోడ దగనాతఁడు గైకొని కాచెగాదె పెం,
పెక్కిన యన్నరేశ్వరుని నెన్నటికిన్మఱువంగ వచ్చునే.
తే. అమ్మహాత్ముండు బహువిధ యజ్ఞదక్షి,
ణార్థముగ విప్రవరులకు నర్థినిచ్చు,
గోగణంబుల గొరిజల గ్రొస్సి యయ్యెఁ,
గాదె యీసరోవరము జగన్నుతముగ
అని పలికెను. ఇది జగన్నాథమునందు ఉండును.
మూలాలు
[మార్చు]- పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879