ఇంద్రపాల నగరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విష్ణుకుండినులు (5,6 శతాబ్దముల కాలము) నాటి ఆంధ్రుల ఔన్నత్యమునకు పతాకమై నిలచిన ప్రాచీనాంధ్ర మహానగరంలలో ఇంద్రపురి లేదా ఇంద్రపాల నగరం ఒకటి.[ఆధారం చూపాలి] ఈనగరం తర తరములనుండి శిథిలమై నేటికి నామమాత్రావశిష్టమై యున్నది. ఇది నల్గొండ లోని రామన్నపేట తాలూకాకు అయిదు మైళ్ళ దూరంలో ఉన్న భువనగిరి రోడ్డుకు ఆనుకొని తుమ్మలగూడమనె గ్రామమున్నది. ఆ గ్రామమునంటి ఒక చెరువున్నది. ఆసఫ్నహర్ కాలువ ద్వారా ఆచెరువులోనికి నీరు ప్రవేశించును. చెరువుకట్ట సుమారు పొడవు రెండున్నర మైళ్ళు ఉండును. ఆచెరువు కట్టకు, మూసీనదిని ఆనుకొని ఉన్న ఇంద్రపాలగుట్టకు మధ్యగల సువిశాల ప్రదేశములో ఈ ప్రాచీనాంధ్ర మహానగరం శిథిలములున్నవి. ఇంద్రపాల నగరం విష్ణుకుండిన ప్రభువుల కావాసమై ఆంధ్ర దేశమునం దానాటి మహానగరంలలో నొకటిగా కీర్తింపబడి యుండవచ్చును.

మూసీనదికి అరమైలు దూరములో నాగవరమను గ్రామమున్నది. నాగవరమునకు తుమ్మలగూడెమునకు మధ్యగల దోరము రెండు మైళ్ళు. ఇంద్రపాలగుట్ట, శిథిల నగరం, నాగవరము ఇంచుమించు కలసియే ఉన్నాయి. సుమారు మూడుమైళ్ళ వరకు వ్యాపించిన ఈ నగరపు శిథిల చిహ్నములు నాగవరములోను తుమ్మలగూడెము చెరువులోను, చెరువు కట్టకును ఇంద్రపాల గుట్టకును మధ్యగల విశాల ప్రదేశములోను కనిపించును.

చరిత్ర[మార్చు]

ఆంధ్రదేశ చరిత్రలో మహోజ్జ్వలముగ రాణించిన రాజ వంశములలో విష్ణుకుండినులు వంశ మొకటి. శాలంకాయనులు అనంతరము ఈ వంశీయులు రాజ్యము నెలకొల్పి క్రీ. శ. 5, 6వ శతాబ్దములో ఆంధ్రదేశమును పాలించిరి. ఆకాలమున దక్షిణాపధ పశ్చిమోత్తములందు వాకాటక వంశీయులు రాజ్యమును విస్తరింపజేసి శక్తి సమంవితులై ఉండిరి. విష్ణుకుండిన మాధవవర్మ వాకాటక రాజకుమార్తెను వివాహమాడి వారితో సంబంధములను మెరిగుపరిచెను.

అట్టి విష్ణుకుండినుల చరిత్ర నిర్మాణమునకు సాధనములనదగిన ఆరు తామ్ర శాస్రనములు, ఒక శిలా శాసనము ప్రకటింపబడినవి. ఈ శాసనముల వలన విష్ణుకుండినులు దక్షిణాపధపతి, త్రికూట మలయాధిన, శ్రీ పర్వతస్వామి పాదానధ్యాత లను బిరుదులను కలవారని తెలియుచున్నది. అట్టి వారు పాలించిన మహానగరంలలో ఒకటి ఈ ఇంద్రపాల నగరం.

ఇంద్రపాల గుట్ట[మార్చు]

నాగవరం గ్రామానికి ఈశాన్యాన, తుమ్మెలగూడెం గ్రామానికి ఉత్తరాన మూసీనదిని ఆనుకొని ఒక ఎత్తైన గుట్ట సుమారు మైలు పొడవునను, అరమైలు వెడల్పునను వ్యాపించి ఉంది. తూర్పు వైపు విశాలముగను, పడమర కొంత భాగము విశాలముగను ఉండి మధ్యభాగము ఎత్తుగను, గోపురాకారముగను ఉంది. గుట్టపైన కోట కట్టబడిఉన్నది. ఇట్టి దానిని గిరిదుర్గ అంటారు. ఇది విష్ణుకుండినుల నాటిది. కోటకు 12 బురుజులున్నవి. కోటకు దగ్గరలో ఒక కోనేరు ఉన్నది దీనినే ఈనుగుల బావి అంటారు. ఇచట పెద్ద పెద్ద ఇటుకులు, రాళ్ళు, ఇండ్ల పునాదులు, రెండు గజంజుల ఎత్తు, పెద్ద గోడలు, శిథిలమైన గదులు ఉన్నాయి. గోపురాకారముగా ఉన్న శిఖరమును ఎక్కుటకు మెట్లుకలవు. గుట్టపైన ఎల్లమ్మ గుడి ఉంది. అచటనే పరశురాముడు పాదాలు ఉన్నాయి. గుట్ట పైకి వెళ్ళు మార్గములో 12 స్తంభముల మంటపము, దానికి ఇరువైపులా అరుగులు ఉన్నాయి. మంటప ద్వారము సింహమువలె ఉంది.

గుట్టపైన ఒక శివాలయము ఉంది. అది కొండపైగల రెండు పెద్దరాతిగుండ్లచే, దాని యంతట అదే ప్రకృతిసిద్ధముగా వెలసినట్లున్నది. శివలింగము నల్లరాతితో మలచబడింది. లింగము ఎత్తు రెండు అడుగులు. ఒక రాతిగుండుపై మరియొకరాతిగుండు నిలిచి దేవాలయముగా రూపుదిద్దుకొని అతి సహజముగా ఉంది. శివాలయములో నున్న పెద్ద రాతిగుండు వెనుక భాగమునందొక తెలుగు శాసనము చెక్కబడింది. శివాలయమునకు ఎదురుగా ఒక పురాతన మంటపము ఉంది. దీనిని ఆనుకొని పలు కోనేరులు ఉన్నాయి. శివాలయమునకు ఎదురుగా ఒక శిలాశాసనము ఉంది. ఇది శిథిలమైనది. శివాలయమునకు ఆనుకొని మరికొన్ని శిధలమైన దేవాలయములు ఉన్నాయి. ఇక్కడ మూసీ నదికలోనికి దిగుటకు దారి ఉంది. ఇంద్రపాల గుట్టకు, కొంచెం దూరములో మూసీనదిలో గుట్టకు ఎగువ భాగమున ఒక పరుపు బండపై 101 శివలింగములు చెక్కబడినవి.

పంచలింగేశ్వరాలయం[మార్చు]

ఈ ఆలయము ఈ నగరంలో ఉంది. ఇది రాతితో నిర్మించబడింది. ఆలయగోపురము మాత్రము ఇటుక సున్నము కలిపి నిర్మించబడింది. ఇంద 5 ఆలయములు కలిపియే ఉన్నాయి. 40 స్తంభములు గల గర్భగుడి, విశాలమై సాధారణ శిల్పముతో నొప్పారుచున్నది. ఇందు నంది మహమ్మదీయుల దురంతరములకు గురియైనది. తల నరికివేయబడెను. ఆలయమంతయు జీర్ణించి పోయింది. అయినను ఆలయత్వమును కోల్పోలేదు. ముఖ్యమైన ఆలయములోని లింగము తప్ప మిగిలినవి భిన్నించినవి. ఆలయమునకెదురుగా రెండంతస్తుల మండపమున్నది. గాలి గోపురముపై నున్న మండపమునకు నాలుగు స్తంభములు, క్రింది మండపమునకు ఆరు స్తంభములు ఉన్నాయి. ఆలయమునకు చేరువున ఉత్తరభాగమున నాలుగు స్తంభములతో నిర్మించబడిన విశాలమైన మంటపము ఉంది. అది వివాహ మంటపము. ఆలయమునకు ముందు ఎడమవైపున కోనేరు ఉంది. దాని ప్రక్కన శిలాశాసనము ఉంది. ఆ శాసనము తెల్ల రాతిపై చెక్కబడి ఉంది. అక్షరములన్నియు చెదిరి పోయినవి.

దేవాలయమునకు ఈశాన్యమున మరియొక శిలాశాసనము ఉంది. దాని ఎత్తు ఎనిమిది అడుగులు. శాసనమందలి అక్షరములు చెదిరిపోయినవి. ఇక్కడే ఒక మసీదు ఉంది. అది నూతనముగా కట్టబడింది.

వేంకటేశ్వరాలయం[మార్చు]

పంచలింగేశ్వరాయలయమునకు పశ్చిమమున కొంచెం దూరములో ఉత్తర దిశాభిముఖముగా ఈ ఆలయము ఉంది. ఇది జీర్ణావస్థలో ఉంది. ఇది రాతితో కట్టబడింది. ఆలయముయొక్క ముందర భాగము 16 స్తంభములతో నిర్మింపబడింది. ఆలయ సింహద్వారము 6 స్తంభములచే నిర్మించబడింది. ఇక్కడ ఉన్నా శాసనములు తెలుగులో చెక్కబడినవి. అక్షరములు చెదిరి పోయినవి.

మూలాలు[మార్చు]

  • 1965 భారతి మాస పత్రిక.