ఉప్పలపాటి సుందరనాయుడు
ఉప్పలపాటి సుందరనాయుడు (1936 జులై 1 - 2022 ఏప్రిల్ 28) ప్రముఖ పారిశ్రామికవేత్త, బాలాజీ హ్యాచరీస్ వ్యవస్థాపకుడు.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]1936 జులై 1న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కంపలపల్లెలో గోవిందునాయుడు, మంగమ్మ దంపతులకు ఉప్పలపాటి సుందరనాయుడు జన్మించారు. వీరు మొత్తం ఐదుగురు తోబుట్టువులు. వీరిది ఉమ్మడి కుటుంబం. పైగా మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. అయినా టి.పుత్తూరు పాఠశాలలో ప్రాథమిక విద్య, అరగొండ జడ్పీ హైస్కూల్‌లో ఉన్నత పాఠశాల విద్య, తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత బొంబాయి వెటర్నరీ యూనివర్సిటీలో బీవీఎస్సీ ఆయన పూర్తి చేశారు. 1964 డిసెంబర్ 9న సుందరనాయుడికి పెమ్మసాని సుజీవనతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. శైలజ, నీరజ. శైలజాకిరణ్ రామోజీగ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు పెద్ద కోడలు. మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్‌కి మేనేజింగ్ డైరెక్టర్.
వృత్తి, వ్యాపారం
[మార్చు]వెటర్నరీ డాక్టర్ గా వృత్తి ప్రారంభించినా కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి అమితమైన కృషి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలితరం పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. ఏపీ పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడిగా సుందరనాయుడు సేవలందించారు. చిత్తూరులో బాలాజీ హ్యాచరీస్ స్థాపించి అనేకమంది యువతకు ఉపాధి కల్పించారు. అలాగే యువతను చైతన్య పరచడానికి నేతాజీ బాలానంద సంఘాన్ని స్థాపించారు. గ్రామస్థుల సహకారంతో ఈ సంఘానికి శాశ్వత భవనాన్ని నిర్మించారు. యువతకు గ్రంథాలయం, క్రీడా పరికరాలను సమకూర్చారు. కొంతకాలం చిత్తూరు జిల్లా పీలేరులో పశు వైద్యుడిగా ప్రభుత్వ ఉద్యోగం చేశారు. అనంతరం చిత్తూరు, అనంతపురం, తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాల్లో పశు వైద్యుడిగా సేవలందించారు. రైతులకు అదనపు ఆదాయాన్ని కల్పించాలన్న ఆలోచనతో కోళ్ల పెంపకం ప్రోత్సహించారు. ఫౌల్ట్రీ రంగానికి సుందరనాయుడు చేసిన కృషికిగానూ అనేక అరుదైన గౌరవాలు అందుకున్నారు. న్యూజెర్సీ ప్రభుత్వం 'డూయర్ ఆఫ్ ద ఫౌల్ట్రీ ఇన్ సౌత్ ఇండియా' అవార్డుతో ఆయనని సత్కరించింది.
మరణం
[మార్చు]85 ఏళ్ళ ఉప్పలపాటి సుందరనాయుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2022 ఏప్రిల్ 28న తుదిశ్వాస విడిచారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Sundar Naidu Uppalapati: ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరనాయుడు కన్నుమూత". web.archive.org. 2022-04-29. Archived from the original on 2022-04-29. Retrieved 2022-04-29.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Sundar Naidu Uppalapati: ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరనాయుడు కన్నుమూత". web.archive.org. 2022-04-29. Archived from the original on 2022-04-29. Retrieved 2022-04-29.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)