Jump to content

ఉలగళంద పెరుమాళ్ కోవెల, కాంచీపురం

వికీపీడియా నుండి
తిరుఊరగం
200px
వామన మూర్తి ఆలయ ధృవబేర నమూనా, ఆలయం ప్రాంగణంలోని ఒక తోరణంపైగల విగ్రహం
పేరు
ఇతర పేర్లు:తిరుఊరగం
ప్రధాన పేరు :ఉలగళంద పెరుమాళ్ కోవెల
దేవనాగరి :उलगलंद पेरुमाल
మరాఠీ:उलगळंद पेरुमाल
ప్రదేశం
దేశం:భారత దేశము
రాష్ట్రం:తమిళనాడు
ప్రదేశం:కాంచీపురం కు దగ్గరగా
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:వామనమూర్తి
ప్రధాన దేవత:అమృతవల్లి అమ్మవారు
ఉత్సవ దైవం:శ్రీలోకనాథుడు
నిర్మాణ శైలి, సంస్కృతి
దేవాలయాలు మొత్తం సంఖ్య:5

తిరుఊరగం అనే పేరుతో కూడా పిలువబడే ఉలగళంద పెరుమాళ్ కోవెల విష్ణుమూర్తి అవతారమయిన వామనమూర్తి ఆలయం. ఇది కాంచీపురంలో రైల్వే స్టేషను నుండి కామాక్షి అమ్మవారి కోవెలకు వెళ్ళే దారిలో ఉంది. ఈ దేవాలయంలో 108 వైష్ణవ దివ్యతిరుపతులలో ఐదు ఉన్నాయి. 7-10వ శతాబ్దాలకు సంబంధించిన ఆఴ్వా ర్లు అనే వైష్ణవ భక్తులు ఈ గుడికి సంబంధించిన విషయాలు తెలుపుతూ కీర్తించారు. వామన మూర్తి ఇతర దేవాలయాల్లో చిన్ని-పొట్టి వటువుగా పూజిస్తే, ఈ దేవాలయంలో త్రివిక్రముడిగా 30 అడుగుల విగ్రహాన్ని పూజిస్తారు.

స్థల పురాణం

[మార్చు]
వామనమూర్తి ఆలయం, కంచి

పురాణాల ప్రకారం రాక్షసుల రాజు, ప్రహ్లాదుని మనవడు అయిన మహాబలిచక్రవర్తి తన మంచితనము, దాతృత్వం వలన ప్రసిద్ధుడై కీర్తిలో దేవరాజు ఇంద్రుణ్ణి మించిపోయాడు. అలా వచ్చిన గర్వాన్ని హరించేందుకు విష్ణువు వామనుడై అవతరించాడు. మరుగుజ్జు అయిన వటువు రూపంలో మహాబలిని చేరుకొని మూడడుగుల నేలను దానమివ్వమని కోరాడు. రాక్షసగురువు శుక్రుడు వారించినప్పటికీ ఈ దానానికి బలి చక్రవర్తి ఒప్పుకుంటాడు. కానీ దానం పుచ్చుకునేప్పటికి వామనుడు తన ఆకారాన్ని పెంచుకుంటూ ఆకాశమంత ఎత్తు ఎదుగుతాడు. ఒక్క అడుగులో భూమిని, మరొక అడుగులో ఆకాశాన్ని (ముల్లోకాలనూ) కొలిచి, మూడవ అడుగు కోసం తిరిగి బలిచక్రవర్తిని అడుగుతాడు. బలిచక్రవర్తి నిస్సహాయుడై తన తలను వంచి అక్కడ మూడవ అడుగును కొలవమంటాడు. వామన మూర్తి బలిచక్రవర్తిని పాతాళానికి అణిచివేస్తాడు. మాటను నిలబెట్టుకుని దానమిచ్చినందుకు వామనుడు పాతాళాన్ని ఏలుకోమని ఇంకా మరెన్నో వరాలు బలిచక్రవర్తికి ప్రసాదిస్తాడు. కానీ బలి చక్రవర్తి విష్ణుని పునర్దర్శనం కోసం తపస్సు చేస్తాడు. విష్ణువు ఆదిశేషునిగా దర్శనమిస్తాడు, ఆ సన్నిధి ఈ కోవెలలోనే గర్భగృహానికి ఎడమ వైపుకి ఉంది. దీనినే తిరుఊరగం అంటారు.

విశేషాలు

[మార్చు]

ఈ గుడి 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవ్యంగా ఉంటుంది. మూడంతస్తుల రాజగోపురం మనోహరంగా ఉంటుంది. ఈ ఒక్క క్షేత్రంలోనే ఐదు దివ్య తిరుపతులు ఉన్నాయి. అవి తిరుక్కర్వాణం, తిరుకారగం, తిరుఊరగం, తిరునీరగం. తిరుమంగై ఆఴ్వా రు, తిరుమఴిశై ఆఴ్వా రు రచించిన పాశురాలలో ఈ గుడి కీర్తించబడింది. ఈ స్వామి దేవేరి అమృతవల్లి అమ్మవారు (స్థానికులు అముదవల్లి అని పిలుస్తారు). ఉత్సవమూర్తి పేరు శ్రీలోకనాథుడు. ధ్రువబేరము పేరు త్రివిక్రముడు లేదా ఉలగళంద పెరుమాళ్ళు.

ధృవబేరం విశేషాలు

[మార్చు]
  • విగ్రహం 30 అడుగుల ఎత్తు ఉండి పశ్చిమాభిముఖంగా ఉంటుంది.
  • ధ్రువబేరము ఎడమ కాలు విగ్రహశరీరానికి సమకోణంలో ఉంటుంది. కుది పాదం వామనుడి శిరస్సుపై ఉంటుంది. ఎడమ చేతిలో రెండు వేళ్ళు తెరిచిపెట్టి ముల్లోకాలను రెండడుగుల్లో కొలిచిన సంజ్ఞగానూ, కుడి చేత ఒకవేలు తెరిచి మూడవ అడుగు ఎక్కడ ఉంచాలి అని అడుగుతున్న సంజ్ఞగానూ కనిపిస్తాయి.
  • ఇంత పెద్ద విగ్రహం మరెక్కడా ఏ దివ్య తిరుపతిలోనూ ముఖ్యారాధన పొందదు, అదే ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత.
  • ధ్రువబేరమును చూడాలంటే పూజారి ఒక కఱ్ఱకు దీపపు కుందే కట్టి అది ఎత్తి చూపించాల్సి ఉంటుంది.

మూలాలు

[మార్చు]