ఎంటర్ ది డ్రాగన్
ఎంటర్ ది డ్రాగన్ | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
దస్త్రం:Enter the dragon.jpg | |||||||||||
Chinese name | |||||||||||
సంప్రదాయ చైనీస్ | 龍爭虎鬥 | ||||||||||
సరళీకరించిన చైనీస్ | 龙争虎斗 | ||||||||||
| |||||||||||
దర్శకత్వం | రాబర్ట్ క్లౌస్ | ||||||||||
రచన | మైఖేల్ అలిన్ | ||||||||||
నిర్మాత |
| ||||||||||
తారాగణం |
| ||||||||||
ఛాయాగ్రహణం | గిల్బర్ట్ హబ్స్ | ||||||||||
కూర్పు |
| ||||||||||
సంగీతం | లాలో షిఫ్రిన్ | ||||||||||
నిర్మాణ సంస్థలు |
| ||||||||||
పంపిణీదార్లు |
| ||||||||||
విడుదల తేదీ | 19 ఆగస్టు 1973(అమెరికా) | ||||||||||
సినిమా నిడివి | 102 ని[1] | ||||||||||
దేశాలు |
| ||||||||||
భాషలు |
| ||||||||||
బడ్జెట్ | $850,000 | ||||||||||
బాక్సాఫీసు | 400 మిలియన్ డాలర్లు |
ఎంటర్ ది డ్రాగన్ 1973 లో రాబర్ట్ క్లౌస్ దర్శకత్వంలో విడుదలైన మార్షల్ ఆర్ట్స్ చిత్రం. ఇందులో బ్రూస్ లీ, జాన్ శాక్సన్, జిమ్ కెల్లీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది బ్రూస్ లీ 1973 జులై 20 లో మరణించక ముందు పూర్తయిన ఆఖరి చిత్రం. అమెరికన్, హాంగ్ కాంగ్ దేశస్థులు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బ్రూస్ లీ మరణించిన ఒక నెల తర్వాత 1973 ఆగస్టు 19 న లాస్ ఏంజిలెస్ లో ప్రీమియర్ ప్రదర్శించారు. ఇది అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా 400 మిలియన్ డాలర్లు (ద్రవ్యోల్బణాన్ని బట్టి ప్రస్తుతం 2 బిలియన్ డాలర్లు) వసూలు చేసింది. దీని బడ్జెట్ 850,000 డాలర్లు. బడ్జెట్ కంటే 400 రెట్లు ఎక్కువ డబ్బులు వసూలు చేసిన ఈ చిత్రం అత్యంత లాభాలు పొందిన చిత్రాల్లో ఒకటి. అలాగే అత్యంత విజయవంతమైన మార్షల్ ఆర్ట్స్ చిత్రం కూడా.
ఎంటర్ ది డ్రాగన్ అతి గొప్ప మార్షల్ ఆర్ట్స్ చిత్రంగా చాలామంది కొనియాడారు.
కథ
[మార్చు]లీ, హాంగ్‌కాంగ్ లోని ఒక షావోలిన్ దేవాలయంలో బోధకుడు, మార్షల్ ఆర్టిస్టు. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ బ్రెత్‌వైట్, లార్డ్ హాన్ అనే ఒక నేరసామ్రాజ్యాధిపతిని పట్టుకోవడానికి జరిపే అండర్ కవర్ ఆపరేషన్ లో లీ సహాయం కోరతాడు. లార్డ్ హాన్ కూడా ఒకప్పుడు షావోలిన్ దేవాలయంలో ఉన్నవాడే. ఇందులో భాగంగా హాన్ తన ప్రైవేటు ద్వీపంలో నిర్వహిస్తున్న ఉన్నత స్థాయి యుద్ధ క్రీడా పోటీల్లో లీ ని పాల్గొనే సాకుతో, హాన్ మీద ఉన్న మత్తు పదార్థాల రవాణా, వేశ్యావ్యాపారంలో ఆరోపణలకు ఆధారాలు సంపాదించమని కోరతాడు.
హాన్ ఉండే ద్వీపంలో కొంతభాగం మాత్రమే తమ నియంత్రణలో ఉండటం వల్ల అక్కడ తాము అధికారికంగా విచారణ జరపలేకపోతున్నామని చెబుతాడు. హాన్ తన దీవిలో అడుగుపెట్టేవారినెవ్వరినీ మందుగుండు సామాగ్రిని తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. దీని వల్ల అతని మీద హత్యాయత్నం చేసేవారు, లేదా తన మీద విచారణకు వచ్చే అంతర్జాతీయ అధికారులకు అడ్డుకట్ట వేయచ్చని అతని ఆలోచన. హాన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్షల్ ఆర్ట్స్ పాఠశాల నడుపుతూ తన నేర సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ అక్కడ జరిపే పోటీల ద్వారా మరింత మంది మార్షల్ ఆర్టిస్టులను నియమించుకుని దాన్ని విస్తరిస్తూ ఉంటాడు. బ్రెత్‌వైట్ తనకు అప్పజెప్పిన పనిని చేయడానికి లీ అంగీకరిస్తాడు. ఈ పని చేయడం ద్వారా హాన్ చేసిన పనికి తమ షావోలిన్ దేవాలయానికి ఏర్పడ్డ కళంకాన్ని తొలగించవచ్చని అతను భావిస్తాడు. అక్కడికి బయలు దేరే ముందే తన చెల్లెలు సు లిన్ మరణానికి, హాన్ అంగరక్షుడు ఓహరా కారణం అని లీ తెలుసుకుంటాడు.
లీ, హాన్ ద్వీపానికి చేరుకోగానే అతనికి మంచి ఆతిథ్యం ఇస్తారు. అతనితో పాటు అక్కడికి అమెరికన్ ప్లేబోయ్, జూదగాడు, అప్పులవాళ్ళ నుంచి తప్పించుకుని వచ్చిన రోపర్, లాస్ ఏంజిలెస్ లో ఇద్దరు జాతివివక్షపూరితమైన అధికారులనుంచి తనను కాపాడుకోవడానికి ఆఫ్రికన్ అమెరికన్ కార్యకర్త అయిన విలియమ్స్ వస్తారు. రోపర్, విలియమ్స్ ఇద్దరూ మాజీ కరాటే యోధులు. వియత్నాం యుద్ధంలో కలిసి పనిచేసినవారు. వీరిద్దరూ కలిసి ఒక సరదా బెట్టింగ్ స్కాం కూడా చేస్తుంటారు. వీరిద్దరూ తమ మొదటి పోటీల్లో సులభంగా గెలుస్తారు.
హాన్ నిర్వహించే పోటీలలో నిబంధనలు సరళమైనవి. పోటీదారులు ఒకరితో ఒకరు పోరాడతారు. మట్టికరిచిన వాడు బయటకు వెళ్ళిపోతాడు. పోటీలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయుధాలు వాడకూడదు. మొదటిరోజు ఆట ముగిసిన తర్వాత హాన్ సహాయకురాలైన తానియా పోటీదారులకు వారు కోరిన అమ్మాయిలను పంపుతుంది. విలియమ్స్ కొంతమంది అమ్మాయిలను ఎంచుకుంటాడు. రోపర్ తెలివిగా తానియానే ముగ్గులోకి దింపి ఆమెనే ఎంచుకుంటాడు. లీ మాత్రం హాన్ తో పాటూ ఎక్కువగా కనిపించే మీ లింగ్ అనే అమ్మాయిని ఎంచుకుంటాడు. ఈమెను బ్రిటిష్ ఏజెంట్ బ్రెత్‌వైట్ అక్కడ గూఢచారిగా నియమించి ఉంటాడు. కానీ ఆమె మాత్రం హాన్ కఠిన నిబంధనలను దాటి సమాచారం సేకరించలేకపోతుంది.
లీ ఆ రోజు రాత్రి కాపలా వాళ్ళ కన్నుగప్పి హాన్ రహస్య స్థావరాలను పరిశోధించడానికి వెళతాడు. అక్కడ ఒక రహస్య సొరంగం గుండా వెళితే భూమి లోపల అక్రమ కార్యకలాపాలు జరుగుతుండటం గమనిస్తాడు. అక్కడ మత్తు పదార్థాలను ఉత్పత్తి చేసి, అమాయకులైన ఖైదీల మీద ప్రయోగిస్తూ ఉండటం గమనిస్తాడు. అక్కడ ఉన్న హాన్ రక్షక భటులు లీని గమనిస్తారు కానీ వారు అతనెవరో తెలుసుకునే లోపే లీ వారిని మట్టుపెడతాడు. విలియమ్స్ ఆ ప్రదేశంలో రాత్రి సమయంలో బయటకు రాకూడదనే నిబంధన ఉన్నా, దానిని ఉల్లంఘించి బయట తిరుగుతూ లీ ని గమనిస్తాడు. మరుసటి రోజు ఉదయం హాన్ పోటీదారులు రాత్రుళ్ళు బయట తిరగకూడదని హెచ్చరిస్తాడు. ఆ పొరపాటు జరిగినందుకు కారణమైన రక్షకభటులను తన దగ్గర పనిచేసే బలిష్టమైన ముఖ్య అంగరక్షకుడు బోలో చేతిలో మరణశిక్ష విధింప జేస్తాడు. అది పూర్తి కాగానే లీ రంగంలోకి దిగుతాడు. అతని పోటీదారు ఓహరా.
పోటీ ప్రారంభంలోనే ఓహరా లీ కి ఏ మాత్రం పోటీ ఇవ్వకుండా చిత్తుగా ఓడిపోతుండటం గమనించి అతన్ని పందెం నుంచి పక్కకు తప్పుకోమని హెచ్చరిస్తాడు హాన్. కానీ అతను ఓడిన కోపంలో రెచ్చిపోయి, పగిలిన గాజు సీసాలతో లీని చంపబోగా అతన్ని చంపి, తన చెల్లెలి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాడు. అవమానంతో హాన్ ఆ రోజు పోటీలను చాలించి ఓహరా పోటీలకే కళంకం తెచ్చాడని చెబుతాడు. తర్వాత హాన్ విలియమ్స్ ని పిలిపించి గత రాత్రి తన భటుల మీద దౌర్జన్యం చేశావని ఆరోపణ చేస్తాడు. విలియమ్స్ అందుకు ఒప్పుకోకుండా ఆ దీవిని విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ హాన్ తన బలమైన ఇనుపచేతితో మోది అతన్ని అంతమొందిస్తాడు.
హాన్, రోపర్ ని తన భూగృహానికి తీసుకువెళ్ళి అమెరికాలో తన కార్యకలాపాలకు ప్రతినిథిగా ఉండమని కోరతాడు. అలా చేయకపోతే తన సైనికులచేత అతన్ని బంధిస్తానని హెచ్చరిస్తాడు. చివరికి హాన్ గుర్తు పట్టలేకుండా తయారైన విలియమ్స్ మృతదేహాన్ని ఆమ్లంలో పడవేయడం గమనించి, తాను అంగీకరించకపోతే తనకు కూడా అదే గతి పడుతుందని అందుకు సమ్మతిస్తాడు. అదే రోజు రాత్రి లీ మళ్ళీ అండర్ గ్రౌండ్ లోకి ప్రవేశించి హాన్ ని అరెస్టు చేయడానికి కావలసిన మరిన్ని ఆధారాలను సేకరించడానికి ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో అక్కడ ఉన్న సైనికులతో చాలా సేపు పోరాటం చేసి, చివరికి ఒక బోనులో చిక్కుబడిపోతాడు.
మరుసటి రోజు హాన్, రోపర్ ని లీ తో పోరాడమంటాడు. రోపర్ అందుకు అంగీకరించకపోవడంతో అతన్ని బోలోతో పోరాడమని చెబుతాడు. చాలా సేపు భీకరమైన పోరాటం తర్వాత రోపర్ బోలోని ఓడిస్తాడు. హాన్ తన సైనికులతో లీ, రోపర్ ని ఇద్దరినీ చంపమని ఆదేశిస్తాడు. అప్పటికే మీ లింగ్ అక్కడ బంధించి ఉన్న ఖైదీలను విడుదల చేయడంతో వారి సహాయంతో లీ, రోపర్ లు కలిసి హాన్ సైన్యాన్ని ఓడిస్తారు. ఈ గందరగోళంలో హాన్ అక్కడి నుంచి తప్పించుకుపోవడానికి ప్రయత్నిస్తాడు. లీ అతని వెంటపడతాడు. చివరికి వారు హాన్ వ్యక్తిగత మ్యూజియం దగ్గరికి చేరుకుంటారు. తన చేతికి ఒక భయంకర ఆయుధాన్ని తగిలించుకుని లీ ని ఒక అన్నివైపులా అద్దాలు కలిగిన మేజ్ లోకి తీసుకువెళతాడు హాన్. లీ ఆ అద్దాలను బద్దలు గొట్టి అతని ఎత్తుల్ని చిత్తు చేస్తాడు. చివరికి అతన్ని హతం చేస్తాడు.
చివరికి లీ రోపర్ ని కలుసుకుని విజయాన్ని పంచుకుంటాడు. అదే సమయానికి మిలిటరీ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ "Enter the Dragon". British Board of Film Classification. Archived from the original on 18 July 2020. Retrieved 17 July 2020.