ఎం.ఎల్.ఆదయ్య
మాదరి ఎల్.ఆదయ్య (డిసెంబరు 6, 1867 - డిసెంబరు 19, 1938) సంఘ సంస్కర్త, దళిత నాయకుడు. హైదరాబాదు ప్రాంతంలో సామాజిక, సేవా రంగాల్లో విశేషమైన కృషిని చేశాడు. హైదరాబాదు రాజ్యంలో షెడ్యూల్డ్ కులాల నుండి ఇంజనీరైన తొలివ్యక్తి.[1]
ఆదయ్య సికింద్రాబాదులోని ఘాస్‌మండీ ప్రాంతంలో 1867, డిసెంబరు 6న దళిత మాల[2] కుటుంబంలో జన్మించాడు.[3] ఈయన తండ్రి మాదరి లక్ష్మయ్య. పాఠశాల విద్యాభ్యాసం తర్వాత సికింద్రాబాదులో క్వీన్స్ ఓన్ సాప్పర్ అండ్ మైనర్స్ ఇంజనీరింగు స్కూల్లో చేరి, ఇంజనీరింగు పట్టభద్రుడయ్యాడు. నిజాం రాజ్యపు ప్రజాపనుల శాఖలో పర్యవేక్షకుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి, సహాయ ఇంజనీరుగా ఎదిగాదు. ఈయన పర్యవేక్షణలోనే హైదరాబాదు హైకోర్టు, విక్టోరియా జనానా ఆసుపత్రి, సిటీ కళాశాల, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వంటి అద్భుతమైన భవనాలు కట్టబడ్డాయి.[2] ఈయన కృష్ణమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. యువకుడుగా ఆదయ్య మంచి క్రీడాకారుడు కూడా. ఆయన రోజుల్లో హైదరాబాదులో చెప్పుకోదగిన క్రికెట్ క్రీడాకారుడు. ఒకసారి ఢిల్లీ జట్టుపై డబుల్ సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. యూరోపియన్ జింఘానాలో బొంబాయి జట్టుకు వ్యతిరేకంగా ఆడాడు.[4]
ఆదయ్య, హైదరాబాదులో దళిత నాయకులైన భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి సమకాలీకుడు. ఎటువంటి ఆర్భాటం లేకుండా తన పరిధిలో సమాజసేవ చేసుకుంటూ సాగాడు. భాగ్యరెడ్డి వర్మలాగా వాక్చాతుర్యం, కూడగట్టే శక్తిలేకపోయినా, అరిగే రామస్వామిలాగా చురుకైన వ్యక్తులు లేకపోయినా, సముదాయం పట్ల ఉన్న ప్రేమ, నిబద్ధతతో అట్టడుగు వర్గాల స్థితిగతులు మార్చాలనే ఉద్దేశంతో తనకు కొత్త భోయిగూడాలో అందిన ఇద్దరు ముగ్గురు వ్యక్తుల సహాయంతో నిమ్మలంగా పని చేసుకుంటూ పోయేవాడు.[4]
19వ శతాబ్దపు ప్రారంభంలో దళిత విద్యార్ధుల విద్యాభ్యాసానికై పాయల్ పాఠశాలను వివిధ నగర ప్రాంతాల్లో దళితులే నడిపేవారు. వీరికి మిషన్ పాఠశాలల్లో తప్పించి మిగిలిన సాధారణ పాఠశాలల్లో ప్రవేశం దొరకడం కష్టంగా ఉండేది. కొన్ని పాఠశాలలు దళిత బాలికలకు ప్రవేశం నిరాకరించాయి. ఆదయ్య ఈ పరిస్థితిని గమనించి దళిత విద్యార్ధుల శిక్షణకై జీవితాంతం తన సొంత డబ్బు వెచ్చించి శాయశక్తులా కృషిచేశాడు. 1906లో "లీగ్ టు హెల్ప్ ది హెల్ప్‌లెస్" అనే తాను స్థాపించిన సంస్థ ఆధ్వర్యంలో ఒక ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాడు. 15 విద్యార్ధులతో, నెలకు 8 రూపాయల జీతంతో ఒక మహిళా ఉపాధ్యాయురాలిని నియమించి, ఒక బల్ల, బెంచి, కుర్చీలతో ఈ బడిని ప్రారంభించాడు. ఇవన్నీ ఆదయ్య తన సొంత డబ్బుతోనే ప్రారంభించాడు. ఆరంభ దశలో రెవరెండ్ బి.పాల్ మరికొందరు శ్రేయోభిలాషులు సహాయం చేశారు. ఆ తర్వాత కాలంలో హరిజనుల సంక్షేమాభిలాషి అయిన పద్మారావు ముదలియార్, ఆదయ్య సహాయానికి వచ్చి పాఠశాలకు గౌరవ కార్యదర్శిగా పనిచేశాడు. [2] పద్మారావు ముదలియార్, ఆదయ్యకు సహాయం చేసి, లీజుపై పాఠశాల భవనం నిర్మించడానికి భూమిని ఇప్పించాడు. స్థానిక ప్రభుత్వం నుండి భవన నిర్మాణానికి, యాజమాన్యానికి కావలసిన నిధులు సమకూర్చాడు.[4] స్థలాన్ని దానం చేసిన బ్రిటీషు రెసిడెంట్ సర్ విలియం బార్టన్ పేరుమీద పాఠశాలకు సర్ విలియం బార్టన్ పాఠశాల అని పేరు పెట్టారు.[2] పద్మారావు, బార్టన్ సహాయంతో ఈ పాఠశాలను ప్రాధమికోన్నత స్థాయికి తీసుకువెళ్లాడు.[4] ఈ పాఠశాలే తర్వాత కాలంలో ప్రభుత్వ అదయ్య స్మారక ఉన్నత పాఠశాలగా రూపొందింది.[1]
1907లో భాగ్యరెడ్డి వర్మతో కలిసి మన్య సంఘం ఏర్పరచాడు. దీన్నే 1921లో ఆది-హిందూ సామాజిక సేవా సంఘంగా పేరుమార్చారు.[5] ఆది-హిందూ సామాజిక సేవా సంఘం సభ్యుడైన ఆదయ్య, భాగ్యరెడ్డి వర్మనుండి స్ఫూర్తి పొంది సికింద్రాబాదులో ఆది హిందూ పాఠశాలను ప్రారంభించాడు.[6] ఈయన దళితుల కోసం చెన్నకేశవస్వామి ఆలయం నిర్మించి, ప్రతివారం భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు.[2] ఈయన పెళ్లి భోజనం, చావు భోజనం వంటి సామూహిక కార్యక్రమాల్లో మాంసాహారం తినడం, మద్యపానం సేవించడం వంటి ఆచారాలను నిర్మూలించడానికి పాటుపడ్డాడు. చాలా వరకు ఈ విషయంలో విజయవంతమయ్యాడు కూడా.[2]
ఆ తర్వాత కాలంలో, యేలేటి రాఘవయ్య, అన్నవరం పాండురంగం, సేబోలు వెంకటస్వామితో కలిసి సంఘాభివృద్ధి సమాజం అనే మరో సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ యొక్క ముఖ్య విధి, ప్రతి వారం క్రమంతప్పకుండా భోయిగూడా వెంకటేశ్వరస్వామి ఆలయంలో, బూరుగుచెట్టి జజార్లోని చెన్నకేశవస్వామి ఆలయంలో భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా మనుషుల్ని జాగృతం చేయడం.[4] అంటరాని కులాలన్నింటినీ ఐక్యం చేయడానికి ప్రయత్నించింది. ప్రజలను అణగార్చి, దోచుకుంటున్న చౌదరీలను వ్యతిరేకించింది. మద్యపానాన్ని గర్హించింది.[2]
సికింద్రాబాదు నగరపాలిక ఆదయ్య సేవలను గుర్తిస్తూ, ఘాస్‌మండీ ప్రాంతానికి ఆదయ్య నగర్ అని పేరుపెట్టింది.[3] ఈయన స్థాపించిన విలియం బార్టన్ పాఠశాలకు, 1961లో ఆదయ్య స్మారక ఉన్నత పాఠశాలగా పేరుమార్చారు.[7][1][2]
ఆదయ్య 1938, డిసెంబరు 19న సికింద్రాబాదులో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 C.R., Gowri Shanker (30 January 2024). "School for SC, BC in Ranigunj faces existential crisis; student strength declines, pressure to shift it out". Siasat. Retrieved 8 September 2024.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 Kshīrasāgara, Rāmacandra (1994). Dalit Movement in India and Its Leaders, 1857-1956. M.D. Publications. p. 168. Retrieved 8 September 2024.
- ↑ 3.0 3.1 Naidu, M.V. (1955). City Of Secunderabad (deccan). p. 99-100. Retrieved 8 September 2024.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 P.R., Venkatswamy (2 February 2020). Our Struggle for Emancipation: The Dalit Movement in Hyderabad State, 1906-1953. Hyderabad Book Trust. p. 44. Retrieved 8 September 2024.
- ↑ Haldar, Debakanya (May 2019). Mapping the Body Politic: A Critical Study of Dalit Women’s Poetry in Post-1947 India (PDF). Kolkata: Jadavpur University. p. 75. Retrieved 14 September 2024.
- ↑ Gundimeda, Sambaiah (2013). Mapping Dalit politics in contemporary India: a study ofUP and AP from an Ambedkarite perspective (PDF). SOAS, University of London. p. 235. Retrieved 14 September 2024.
- ↑ సంగిశెట్టి, శ్రీనివాస్ (January 2021). "నిజమైన అంబేద్కరైట్ కె.ఆర్.వీరస్వామి". దక్కన్ ల్యాండ్. Retrieved 14 September 2024.