ఎం. టి. వి. ఆచార్య
ఎం టి వి ఆచార్య మంచి చిత్రకారుడు. ఆయన చందమామ తెలుగు మాసపత్రికలో మొట్టమొదటి చిత్రకారులలో ఒకరు. స్వతహాగా కన్నడిగ ఐనప్పటికీ, తమిళనాట ఎక్కువ రోజులు ఉన్నారు. 1962 ప్రాంతాలలో వ్యక్తిగత కారణాల వల్ల చందమామ పత్రికను వదిలి, బెంగుళూరు వెళ్ళిపోయారు.
( మడిపడగ బలరామాచార్య అనే చిత్రకారుడు వేరు.)
కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ ‘ఈ మాట’లో రాసిన ‘చందమామ జ్ఞాపకాలు’ వ్యాసంలో ఎం.టి.వి. ఆచార్య గురించి ఇలా రాశారు.
‘‘మహా భారతం అట్టచివరి బొమ్మకూ, అట్టమీది బొమ్మకూ ఆయన అద్భుతమైన బొమ్మలు గీశారు. ఆయనకు మనుషుల ఎనాటమీ క్షుణ్ణంగా తెలుసు. సుమారు 20 ఏళ్ళ పాటు కొనసాగిన మహాభారతం సీరియల్‌కు ఆయన వివిధ పాత్రల ముఖాలు ఏ మాత్రమూ మార్పు లేకుండా చిత్రీకరించారు. అందరూ బుర్రమీసాల మహావీరులే అయినా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, దుర్యోధనుడు, ఇలా ప్రతి ఒక్కరినీ బొమ్మ చూడగానే పోల్చడం వీలయేది. భీష్ముడికి తెల్ల గడ్డమూ, బట్టతలా ఆయనే మొదటగా గీసినట్టు గుర్తు. భీష్మ సినిమాలో ఎన్.టి.రామారావు మేకప్ అంతా “చందమామ”కు కాపీ అని నా ఉద్దేశం.’’
భారతంలోని విరాటపర్వంలో వచ్చే ‘కీచక వధ’ ఘట్టాన్ని ఆచార్య బాగా చిత్రించారు. ఇది చందమామ ముఖచిత్రంగా ప్రచురితమైంది. మసక చీకటిలో సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపది చూస్తుండగా కండలు తిరిగిన భీముడు, కీచకుల పోరాటం ఆకట్టుకునేలా గీశారు.