Jump to content

ఎడ్ల రామదాసు

వికీపీడియా నుండి

ఎడ్ల రామదాసు (1860 - 1910) రామభక్తులు, గేయ రచయిత, తత్త్వకర్త.

జీవిత విశేషాలు

[మార్చు]

అతను విజయనగరం జిల్లా కలవచర్ల అగ్రహారంలో అచ్చయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. తన 12 యేండ్ల ప్రాయంలో కాకినాడకు చేరాడు. అక్కడ మంతెన వెంకటాచార్యులు వద్ద శిష్యరికం చేసి అచల తత్త్వాన్ని నేర్చుకున్నాడు. అతని వద్ద ఉపదేశం పొంది సాంఖ్య, తారక, అమనస్క, రాజయోగాది భావములను గ్రహించాడు.

అతను తన అనుభవాలను, బోధనలను పద్యాలుగాను, కీర్తనలుగాను రచించాడు.

అతను కాకినాడలో ఉండేవాడు. బ్రహంగారి తత్త్వాల తర్వాత ఎడ్ల రామదాసు తత్త్వాలకు బహుళ ప్రచారం ఉన్నది. 119 కీర్తనలతో "సాంఖ్యతారకామనస్కయోగంబనెడు సుజ్ఞానచంద్రిక" అను గ్రంంథమును ప్రచురించాడు. ఈ సుజ్ఞాన చంద్రికతో పాటు అతని శిష్యులు కొందరు తాము రచిందిన తత్త్వాలను కూడా చేర్చి ఎడ్ల రమదాసు చరిత్ర అను పేరుతో ప్రకటించారు. ఈ గ్రంథంలో తత్త్వాలు రచించిన ఇతర భక్తులు - బూచి అప్పలదాసు, చిట్టూరి నారాయణదాసు, విత్తనాల కొండయ్యదాసు, బోని అప్పలదాసు, బోని గవరయ్య, మామిడి అప్పలదాసు, కంచుమర్తి యల్లయదాసు నాగన్నలు.

ఈ గ్రంథంలో తన జీవిత చరిత్రంగానే రచించాడు. అందులోని రచనలన్నీ తత్త్వాలు మాత్రమే కావు. చాలా పాటలు సంకీర్తన పద్ధతిలో ఉన్నవి. భజన పాటలు, మేలు కొలుపులు, జోలపాటలు, మంగళ హారతులు, ఆంజనేయ దండకం, గోపీకృష్ణ సంవాదము, గురుశిష్య సంవాద గేయములు కూడా కలవు. రంగనాథుడు, వేంకటేశ్వరుడు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, త్రిపురసుందరి, ఈశ్వరుడు, నారాయణుడు అనే పేర్లతో వెలసిన పరబ్రహ్మమును గురిచిన కీర్తనలున్నవి.[1]

కొన్ని కీర్తనలు

[మార్చు]

కృష్ణ లీలా సంకీర్తనం - శ్రీరాగం - ఆట తాళం:

ఎన్ని మాయలు నేర్చినా డమ్మ - యశోద నీ కొడు
కన్నిటికి నెరజాణుడో యమ్మ
ఎన్ని మాయలు నేర్చినాడే చిన్నతనయుడు నిన్నరేయి, మా
కన్నెపడుచును జూచి రమ్మని కనుసైగలు చేసినా డట

వట్టి మాటలు కావు వినవమ్మ ఈ వాడ లోపల
యిట్టి వానిని జూడలేదమ్మ -
ఉట్టిమీదా చట్టిలోనా వట్టి పాలిడి అట్టె బోవగ
చట్టి యోడల కొట్టి కృష్ణుడు పొట్టనిండా బట్టినా డట.
ఈ తేలిక మాటలతో జీవాత్మ పరమాత్మల సంభంధాన్ని తెలియజేసాడు.

మూలాలు

[మార్చు]
  1. బ్రహ్మశ్రీ చెళ్ళపిళ్ల వెంకట శాస్త్రి గారు ఆంధ్రపత్రిక వారపత్రికలో (29.12.1948) వచ్చిన ఒక వ్యాసం

బాహ్య లంకెలు

[మార్చు]
  • Ramana, Venkata (2018-03-08). "శోభనాచల: నిట్టల ప్రకాశదాసు, ఎడ్ల రామదాసు – చెళ్ళపిళ్ల వారి వ్యాసం". శోభనాచల. Archived from the original on 2020-06-21. Retrieved 2020-06-21.