ఎమోటికాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక నవ్వు-ముఖం ఎమోటికాన్.
గ్రాఫిక్ స్మైలీ, నవ్వుతూ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా చూపించే ఒక గ్రాఫిక్ ఎమోటికాన్

ఎమోషన్, ఐకాన్ అనే రెండు ఆంగ్ల పదాల కలయికతో ఏర్పడిన పదమే ఎమోటికాన్. ఎమోషన్ అంటే భావోద్వేగం, ఐకాన్ అనగా ప్రతేక చిహ్నాం అనగా భావోద్వేగాన్ని ప్రత్యేక చిహ్నాం రూపంలో చూపించేవే ఎమోటికాన్లు. ఎమోటికాన్లు స్మైలీలల పేరుతో బాగా ప్రసిద్ధిగాంచాయి. ఈ భావోద్వేగ చిహ్నాలను ఎక్కువగా సెల్ ఫోన్ తో సందేశాలను పంపుకునేటప్పుడు, వాట్స్ యాప్‌లో చాటింగ్ చేసేటప్పుడు,, ఇంటర్నెట్ ద్వారా గూగుల్, యాహూ, ఫేస్‌బుక్ వంటి వాటిలో చాటింగ్ చేసేటప్పుడు ఉపయోగిస్తుంటారు. నవ్వు, కోపం, ఆనందం, బాధ, ఆశ్చర్యం, ప్రేమ, దుఃఖం వంటి భావోద్వేగాలను అవతలి వారికి స్పష్టంగా అర్ధమయ్యేలా వ్యక్తం చేయడానికి ఈ భావోద్వేగ చిహ్నాలను ఉపయోగిస్తారు. సాధారణంగా ఎక్కువగా కీబోర్డులో ఉండే విరామ చిహ్నాల ద్వారా వీటిని రూపొందిస్తారు, అయితే కొన్నిసార్లు వీటిని రూపొందించడానికి సంఖ్యలు, అక్షరాలను కూడా ఉపయోగిస్తారు. అలాగే ఇవి ప్రత్యేకంగా ముందుగా రూపొందించిన ప్రత్యేక చిహ్నాలుగా కూడా అందుబాటులో ఉండటం వలన వీటిని కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. హార్వేబాల్ అనే చిత్రకారుడు 1963లో స్మైలీ ఫేస్‌ను రూపొందించాడు. హార్వేబాల్ కనిపెట్టిన ఈ భావోద్వేగ చిహ్నాలకు 1982లో స్కాట్ ఇలియట్ ఫాల్మన్ అనే కంప్యూటర్ శాస్త్రవేత్త ప్రాచుర్యాన్ని కల్పించాడు. అలా ఈ భావోద్వేగ చిహ్నాలు అందరికీ పరిచయమయ్యాయి. అలా పరిచయమైన వీటిని ఆ తర్వాత జపనీయులు, చైనీయులు, కొరియన్లు, ఇతర పాశ్చాత్య దేశాల వాళ్లూ తమ దేశ భాషల్లో అనేక రకాల హావభావాలతోనూ, ముఖకవళికలతోనూ రూపొందించారు. ఆ తర్వాత యానిమేషన్ రూపంలో కూడా ఈ ఎమోటికాన్లను రూపొందించారు. ప్రస్తుతం ఈ ఎమోటికాన్లను తన భావోద్వేగాన్ని వ్యక్తపరచడానికే కాక అవతలి వారిని వెక్కిరించడానికి, ఎత్తిపొడవడానికి ఉపయోగిస్తున్నారు. అలాగే కొంత సమయం విరామం తీసుకునేటప్పుడు ఎందుకు ఎంత సేపు అని అవతలవానికి అర్థమయ్యేలా కొన్ని చిహ్నాలను ఈ భావోద్వేగ చిహ్నాలకు జోడిగా ఉపయోగిస్తున్నారు.

మూలాలు[మార్చు]

సాక్షి దినపత్రిక - 31-01-2015 (ఎమోటికాన్లను ఎవరు కనిపెట్టారు?)