ఎల్లంపల్లె
ఎల్లంపల్లె, కడప జిల్లా ఎస్.మైదుకూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఎల్లంపల్లె | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 14°44′01″N 78°46′35″E / 14.733549°N 78.776422°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
మండలం | ఎస్. మైదుకూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 516 173 |
ఎస్.టి.డి కోడ్ | 08564 |
చరిత్ర
[మార్చు]ఎల్లంపల్లె గ్రామ సమీపంలోని గగ్గితిప్ప వద్ద పొలాలలో పురాతన శాసనాలు, శిల్పాలు బయటపడినవి. ఎల్లంపల్లె సమీపంలోని "పేరనిపాడు" రాజధానిగా, సా.శ. 1428లో సంబెట పిన్నయదేవ మహారాజు శాసనాలు వేయించారని చరిత్రకారులు, తెలుగు భాషోద్యమ సమాఖ్యకు చెందిన తవ్వా ఓబుల్ రెడ్డి వీటి వెలికితీత సమయంలో అభిప్రాయపడ్డారు.[1] విజయనగర సామ్రాజ్యాన్ని రెండవ దేవరాయలు పరిపాలిస్తున్న కాలంలో సంబెట పిన్నయదేవ మహారాజు విజయనగర సామంతునిగా ఈ ప్రాంతంలో కోట నిర్మించారు. కోట, పేట కట్టి రాజ్యం చేశాడు. పేట నిర్మాణంలో సైన్యాధ్యక్షుడు హెగ్గడన్న ప్రధాన భూమిక వహించాడు. పిన్నయదేవ మహారాజు అనంతరం రాజ్యాన్ని ఆయన కుమారుడు సంబెట శివరాజు పరిపాలించాడు. ఆయన పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలో అనేక దేవాలయాలు నిర్మించాడు. అస్తవ్యస్త పరిస్థితులు దన్నుగా సామ్రాజ్యంపై శివరాజు తిరుగుబాటు చేశాడు. అప్పటి విజయనగర చక్రవర్తి సాళువ వీరనరసింహరాయలు ఫిరంగులతో కోటను కూల్చి, తిరుగుబాటును అణచివేసి పేరనిపాడు సామంత రాజ్యాన్ని సామ్రాజ్యంలోకి కలిపేసుకున్నాడు. అప్పటినుంచీ సామ్రాజ్య పతనం వరకూ విజయనగర చక్రవర్తులు నేరుగా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు.[2] గ్రామంలో వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న సోమేశ్వరస్వామి ఆలయంలో జీర్ణావస్థలో ఉంది.
దేవాలయాలు
[మార్చు]- తిరుమలనాథ ఆలయం
ఎల్లంపల్లి సమీపంలో సంబెట పిన్నయదేవ మహారాజు వారసుడైన సంబెట శివరాజు నిర్మించిన తిరుమలనాథ ఆలయం ఉంది. సా.శ.1503లో సంబెట శివరాజు యల్లంపల్లికి ఈశాన్యదిశలోని గుట్టపై శ్రీదేవి, భూదేవి సమేత తిరుమలనాథ స్వామి ఆలయాన్ని తూర్పు అభిముఖంగా నిర్మించి, గుట్టకు పడమర నుంచి తన కోటలోంచి దేవాలయానికి వెళ్ళేందుకు వీలుగా మెట్లు ఏర్పాటుచేశాడు. తిరుగుబాటు విఫలమై శివరాజు రాజ్యభ్రష్టుడు అయ్యాకా విజయనగర సామ్రాజ్య పాలనలో శ్రీకృష్ణదేవరాయలు తిరుమలనాథ ఆలయం కైంకర్యం కోసం మాన్యంగా సమీపంలోని గడ్డంవారిపల్లె గ్రామాన్ని దానమిచ్చాడు. శతాబ్దాల అనంతరం చారిత్రక ప్రసిద్ధి కలిగివుండీ, నిర్లక్ష్యానికి గురైన ఈ ఆలయాన్ని ఇటీవల సోమా తిరుమల కొండయ్య జీర్ణోద్ధరణ చేశాడు. సంక్రాంతికి వైభవంగా వేడుక చేసి, స్వామిని ఆలయం చుట్టుపక్కల గ్రామాల్లో గ్రామోత్సవంగా ఊరేగింపు చేస్తారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, విలేకరి (7 ఆగస్టు 2014). "ఎల్లంపల్లెలో బయటపడ్డ శాసనాలు". ఈనాడు. కడప టాబ్లాయిడ్. న్యూస్ టుడే. p. 16. Retrieved 9 January 2018.
- ↑ 2.0 2.1 వెబ్సైట్, నిర్వాహకులు. "చింతకుంట లక్ష్మీచెన్నకేశవ స్వామి దేవళం". kadapa.info. Retrieved 9 January 2018.