ఏడిద కామేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఏడిద కామేశ్వరరావు బాల సాహిత్య రచయితగా ప్రసిద్ధుడు.ఇతడు తూర్పు గోదావరి జిల్లా, మండపేట మండలం, ఏడిద గ్రామంలో 1913, సెప్టెంబరు 12వ తేదీన వెంకట రాజ్యలక్ష్మి, పెదకొండలరాయుడు దంపతులకు పెద్ద కుమారుడిగా జన్మించాడు. చిన్నతనంలో ఒకసారి బొమ్మలకొలువులో ఎప్పుడూ పాడే పాటలేనా అని కొందరు పెదవి విరవడంతో అప్పటికప్పుడు 'తాంబూలం' పాట వ్రాసి పాడాడు. తొమ్మిదవ తరగతి చదివేటప్పుడే 'మానిటర్‌ను ఎన్నుకోవడం' అనే పిల్లల నాటికను వ్రాసి ప్రదర్శించాడు.

జీవిత విశేషాలు[మార్చు]

చదువు ముగించిన తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు నడిపిన స్వరాజ్య పత్రికలో సంపాదకశాఖలో చేరాడు. 1937లో ఆంధ్రపత్రిక సంపాదకశాఖకు మారాడు. పిమ్మట గృహలక్ష్మి, ప్రజామిత్ర పత్రికలలో కూడా కొంతకాలం పనిచేశాడు. తరువాత విజయవాడలో 'బాలభారతి' పేరుతో ఒక బాలల సంఘాన్ని స్థాపించి పిల్లలకు ఆటలు, పాటలు నేర్పుతూ బాలసాహిత్యాన్ని సృష్టించాడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో బొమ్మరిల్లు, పాలవెల్లి వంటి పిల్లల కార్యక్రమాలను నిర్వహించడమే కాక బాలల నాటికలు, గేయాలు, గేయకథలు, గేయనాటికలు, హరికథలు, బుర్రకథలు వందల సంఖ్యలో రాసి, ప్రసారం చేసి రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందాడు. ఇరవై యేళ్లపాటు విజయవాడ ఆకాశవాణిలో పనిచేసి 1974లో పదవీ విరమణ చేశాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ ప్రచురించిన బాలచంద్రిక పత్రికకు గౌరవ సంపాదకుడిగా వ్యవహరించాడు. బాలసాహిత్యానికి ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 'బాలబంధు' పురస్కారంతో సత్కరించింది. ఇతడు 1995, డిసెంబరు 27వ తేదీన మరణించాడు.[1]

రచనలు[మార్చు]

  1. ఇండోనీషియా[2]
  2. చిరుగజ్జెలు (గేయనాటికల సంకలనం)[3]
  3. అరుణ ఆసఫాలి[4]
  4. పిలిచితే పలుకుతావట
  5. ఆచార్య కృపలాని జీవిత చరిత్ర
  6. ఆనంద మందిరం
  7. రంగ బాల
  8. బాలభారతి
  9. పాలవెల్లి
  10. బాలమందారాలు
  11. పాలధార
  12. పంచదార
  13. బొమ్మల కొలువు
  14. ఒప్పులకుప్ప
  15. వినురవేమ
  16. చిన్నారి పాపలకు చిట్టిపొట్టి కథలు

మూలాలు[మార్చు]

  1. "బాలబంధుకు నివాళి - దాసరి వెంకటరమణ". Archived from the original on 2014-10-18. Retrieved 2016-01-26.
  2. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో ఇండోనీషియా పుస్తకప్రతి
  3. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో చిరుగజ్జెలు పుస్తకప్రతి
  4. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో అరుణ ఆసఫాలి పుస్తక ప్రతి