ఐవానే గజల్
ఐవానే గజల్ రచయిత్రి జిలానీ బానో హైదరాబాద్ చరిత్రని ప్రధాన అంశంగా తీసుకొని రాసిన నవల. [1] [2]ఈ నవల హైదరాబాద్ నగరంలో గత వైభవం తలచుకుంటూ నిర్వ్యాపారంగా కాలం గడిపే వ్యక్తి జీవితం చుట్టూ అల్లుకుంది. ఆ వ్యక్తి ముస్లిం మతస్తుడు, కవి సంప్రదాయానికి చెందిన కుటుంబంలో జన్మించినవాడు. వారి పూర్వులు అంతులేని సంపద సృష్టించగా తర్వాతి తరాలు ఏ పనీ లేకుండా కేవలం సాహిత్యం, లైంగికతతో జీవించడంతో క్రమంగా కుటుంబ సంస్కృతి నిస్తబ్దంగా మారిపోయి శిశిరంలోని చెట్టులా తయారవుతారు. ఈ నవలను పతనమవుతున్న ఫ్యూడల్ సంస్కృతికి అద్దంగా కొందరు సాహిత్యవేత్తలు భావించారు. అంతర భారతీయ గ్రంథమాల ద్వారా తెలుగులోకి అనువదించి నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ప్రకటించింది.
కథాంశం
[మార్చు]ఇది నిజానికి హైదరాబాద్ లోని వొక ముస్లిం జమీందారు వాహిద్ హుసేన్ కథ. ఈ కథ అతనితో మొదలై, అతని నలుగురు మనవరాళ్ళ జీవితంతో కొనసాగి, ఒక రాజకీయ నవలగా ముగుస్తుంది. వాహిద్ హుసేన్ కి కవిత్వం, గజల్ అంటే ప్రాణం. అతని గజల్ సాంప్రదాయకమైన గజల్. అతను కొత్తగా వచ్చిన గడియారాలను కూడా అంగీకరించడు కానీ నీడ గడియారాన్ని నమ్ముతాడు. ఇస్లాం కట్టుబాట్లని తూచాతప్పక పాటిస్తాడు. నిజాం మాత్రమే భూమంతటికీ అధిపతి అని నమ్ముతాడు. స్త్రీ అంటే సాంప్రదాయిక గజల్ లా ఒద్దికగా వుండాలనీ కోరుకుంటాడు. అతని భవనంలోని స్త్రీలకు బయటి ప్రపంచం తెలియది. ఖైదులో ఉన్నట్లు జీవించేవారు. అతను ఆ కలల ప్రపంచంలో విహరిస్తూ వుండగానే 1940 లలో హైదరాబాద్ ముస్లిం జీవితంలో అనేక మార్పులు వస్తాయి. అందులో ముఖ్యమైంది 1948 పోలీసు చర్య. దాని తర్వాత హైదరాబాదు రాష్ట్ర స్వభావమే మారిపోతుంది. దానితో పాటు అందరి జీవితాలూ మారిపోయాయి. స్త్రీల జీవితాల్లో బాగా మార్పు వచ్చింది. అలాంటి రోజుల్లో వాహిద్ హుసేన్ మనవరాలు చాంద్ సుల్తానా అబ్బాయిలతో కలిసి మెడికల్ కాలేజీ చదువులకి వెళ్తుంది. సంగీతం, నాట్యం, నాటక రంగాల మీద ప్రేమ పెంచుకొని, సంజీవ అనే వుద్యమకారుడి ప్రేమలోనూ పడుతుంది. అప్పటికీ చాంద్ లో ఇంకా సంప్రదాయ అవశేషాలు వుండడం వల్ల సంజీవ కమ్యూనిష్టు భావాలను ఆమె పూర్తిగా ఒప్పుకోదు. అది సరైన మార్గం కాదని ఆమె అనుకుంటూ వుంటుంది. చివరికి ఒంటరి స్త్రీగానే మిగిలిపోతుంది. చాంద్ కథ అలా వుంటే, వాహిద్ హుసేన్ యింకో మనవరాలు నాటకరంగంలో స్థిరపడుతుంది. కాని, ఆ రంగంలో స్థిరపడి వున్న పురుషాహంకారాన్ని దిక్కరిస్తుంది. యింకో ఇద్దరు మనవరాళ్ళు – కైజర్, క్రాంతి- దాకా వచ్చేసరికి మొత్తం కథే మారిపోతుంది. కైజర్ తెలంగాణా సాయుధ పోరాటంలోకి వెళ్లి, అజ్ఞాత వాసంలో వుండిపోతుంది. కైజర్ కూతురు నక్సల్ ఉద్యమం వైపు మొగ్గు చూపడంతో నవల ముగుస్తుంది.
మూలాలు
[మార్చు]- ↑ "హైదరాబాద్ చరిత్ర పుటల మధ్య సంచారం! | వాకిలి" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-02.
- ↑ "ఆర్కైవ్ నకలు". m.andhrajyothy.com. Archived from the original on 2021-05-02. Retrieved 2021-05-02.