Jump to content

ఒంగోలు జాతి పశువులు

వికీపీడియా నుండి
ఒంగోలు జాతి ఎద్దు.
ఒంగోలు గిత్తలు

ప్రపంచంలోనే పేరెన్నిక గన్న పశువుల జాతి ఒంగోలు జాతి. ఒంగోలుకు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి తెచ్చిపెట్టిన జాతి ఇది. ఇవి బలిష్టమైన కాయంతో, చూడముచ్చటైన రూపంతో ఉంటాయి. కష్టతరమైన దుక్కి దున్నడం వంటి పనులకు ఒంగోలు జాతి గిత్త బాగా అనువైనది. ఒంగోలు జాతి పాడి ఆవులు ఈతకు ఈతకు మధ్య 3000 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. ఒంగోలు జాతి పశువులు 1863లో మొదటిసారిగా బ్రెజిల్ దేశానికి ఎగుమతి అయ్యాయి.[1] బ్రెజిల్, అర్జెంటైనా, పరాగ్వే, మెక్సికో, అమెరికా, శ్రీలంక, ఫిజీ, జమైకా, ఇండోనేషియా, మలేషియా వంటి అనేక దేశాలు ఒంగోలు జాతి పశువులను దిగుమతి చేసుకుంటున్నాయి.

బాస్ ఇండికస్ (Bos indicus) అనే పశువుల కుటుంబానికి భారత ఉపఖండం నిధి వంటిది. వ్యవసాయ పనులకు గాని, పాలు, మాంసానికి గాని ఈ జాతి పశువులు ప్రశస్తమైనవి. నేల, వాతావరణం, దొరికే గ్రాసం వంటి వాటిని బట్టి ఈ కుటుంబంలో 30 వరకు వివిధ జాతుల పశువులు అభివృద్ధి చెందాయి. వీటి పేర్లు ఆయా ప్రదేశాల పేర్లను బట్టి వచ్చాయి. ఈ జాతుల్లో సింధీ, సహివాల్, కంక్రేజ్, గిర్, ఒంగోలు, మైసూరు, కంగాయం, హిస్సార్, కృష్ణా నదీలోయ వంటి జాతులు ప్రపంచంలోని అనేక సమశీతోష్ణ దేశాలకు వ్యాపించాయి. ఈ తొమ్మిది జాతుల్లోనూ, ఒంగోలు జాతి అనేక దేశాల్లోను, వివిధ ఖండాల్లోను అత్యధికంగా వ్యాపించింది.

విశిష్టత

[మార్చు]
ఒంగోలు ఎద్దు

ఒంగోలు జాతి పశువులు ఆకారంలో చాలా పెద్దవిగాను, బలిష్టంగాను ఉంటాయి. చక్కగా మచ్చిక అయ్యే గుణం కలిగి, బండి లాగుడుకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఒంగోలు ఎద్దులు ఆకారంలోను, కొమ్ములలోను విలక్షణంగా ఉండి చూడగానే గుర్తించేలా ఉంటాయి. కొమ్ములు కురచగా - 3 , 6 అంగుళాలు - ఉండి బయటి వైపుకు పొడుచుకు వచ్చి ఉంటాయి.

ఒంగోలు ఆవు

విశాలమైన కాళ్ళు, చిన్న మొహం, వెడల్పాటి నుదురు, పెద్ద చెవులు, పెద్దగంగడోలు కలిగి ఉంటాయి. ఒంగోలు ఎద్దులో మరో ప్రముఖమైన అంశం దాని అందమైన మూపురం. మూపురం పెద్దదిగా ఉండి, నడిచేటపుడు అటూఇటూ ఒరిగి పోతూ ఉంటుంది.


చక్కటి మచ్చిక గుణం కలిగి ఉండడం చేత ఒంగోలు ఎద్దులకు ముకుతాడు వెయ్యడం అరుదు. వాటి లాగుడు శక్తి అమోఘం, ఇతర జాతి పశువుల కంటే చాలా ఎక్కువ; 1500 నుండి 2000 పౌండ్ల వరకు అవలీలగా లాగగలవు.

ఒంగోలు జాతి ఆవులు పాల దిగుబడికి ప్రసిద్ధం. ఒక్క రోజులో దాదాపు 20 లీటర్ల పాలు ఇస్తాయి. ఒక్కో ఈతకు ఒక దూడను కంటాయి.

ఒంగోలు జాతి గిత్త(Bull)

మూలాలు, వనరులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆ మూపురం సిరుల గోపురం". ఈనాడు. జూలై 10, 2016. p. 4.