Jump to content

ఓవర్ (క్రికెట్)

వికీపీడియా నుండి
ఇద్దరు బౌలర్లు వేసిన ఓవర్లు, మెయిడెన్ ఓవర్ల సంఖ్యను చూపే స్కోర్‌బోర్డు.

క్రికెట్‌లో బ్యాటరుకు బౌలరు వరుసగా వేసే ఆరు చెల్లుబాటయ్యే బంతులను కలిపి ఒక ఓవర్‌ అంటారు. సాధారణంగా ఒక ఓవరును ఒకే బౌలరు వేస్తాడు. ఆ ఆరు బంతుల్లో ఏదైనా చెల్లని డెలివరీ ఉంటే దాని స్థానంలో మరో డెలివరీని వేస్తారు. ఆట ముగిసిన సందర్భంలో ఓవరు, ఆరు బంతులు వెయ్యకుండానే మధ్యలోనే ముగిసిపోవచ్చు.

బ్యాటరు బ్యాటుతో కొట్టగా వచ్చే పరుగులు, చెల్లని డెలివరీల ద్వారా వచ్చే పరుగులూ బౌలరు లెక్కలోకి వస్తాయి. లెగ్ బైలు, బైలు బౌలరు లెక్కలోకి రావు. బౌలరు లెక్కలోకి వచ్చే పరుగులు సున్నా ఉండే ఓవరును మెయిడెన్ ఓవర్ అంటారు. ఓవరులో పరుగులు అసలేమీ ఇవ్వకుండా వికెట్ తీస్తే, దాన్ని వికెట్ మెయిడెన్ అంటారు. అదే విధంగా, ఒక మెయిడిన్ ఓవర్‌లో రెండు, మూడు వికెట్లు తీస్తే ఆ ఓవరును డబుల్, ట్రిపుల్ వికెట్ మెయిడిన్‌ అంటారు. [1]

ఎన్ని బంతులు వేసారో అంపైరు లెక్కిస్తూంటారు. ఆరు డెలివరీల తర్వాత అంపైర్ 'ఓవర్' అని పిలుస్తాడు. దాంతో ఫీల్డింగ్ జట్టు, తాము ఉన్న ఎండ్ నుండి రెండో ఎండ్‌కు మారతారు. తరువాతి ఓవరును వేయడాణికి మరో బౌలరు వచ్చి, రెండో ఎండ్ నుండి బౌలింగు చేస్తాడు. ఏ బౌలర్ ఏ ఓవర్ బౌల్ చేయాలో ఫీల్డింగ్ జట్టు కెప్టెన్ నిర్ణయిస్తాడు. ఏ బౌలరు కూడా వరుసగా రెండు ఓవర్లు వేయకూడదు.

అవలోకనం

[మార్చు]

ప్రస్తుతం ఓవరుకు 6 చెల్లే బంతులు ఉంటాయి. [2] గతంలో నాలుగు నుండి ఎనిమిది బంతుల దాకా ఒక్కో ఓవరుకు వేసేవారు. బౌలరు వైడ్-బాల్ గానీ నో-బాల్ బౌలింగ్ వేసినట్లయితే, అవి చెల్లవు కాబట్టి, ఆరు-బంతులలో ఒకటిగా దాన్ని పరిగణించరు. దాని స్థానంలో మరొక చెల్లే డెలివరీ వేయాలి. [3]

ఒక ఓవర్ మధ్యలో, బౌలరు గాయపడినా, క్రమశిక్షణా కారణాల వల్ల అంపైర్ బయటకు పంపినా, వేరే బౌలరు మిగిలిన డెలివరీలను వేసి ఓవరును పూర్తి చేస్తాడు.

బౌలరు వరుసగా ఓవర్లు వేయకూడదు కాబట్టి, కెప్టెన్ ఇద్దరేసి బౌలర్లను ఒకరి తరువాత ఒకరు వేసేలా నియమించడం సాధారణ వ్యూహం. బౌలరు అలసిపోయినప్పుడు లేదా సరిగా బౌలింగు వేయనప్పుడు, కెప్టెన్ ఆ బౌలర్‌ను తీసేసి మరొకరితో వేయిస్తాడు. ఒకటి విడిచి ఒక ఓవరును ఆపకుండా వేసే ఓవర్లన్నిటినీ కలిపి ఒక స్పెల్ అంటారు.

పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లో, బౌలర్లు బౌలింగ్ చేసే మొత్తం ఓవర్ల సంఖ్య కూడా పరిమితం గానే ఉంటుంది. సాధారణ నియమం ఏమిటంటే, ఏ బౌలర్ కూడా ఇన్నింగ్స్‌లో ఉండే మొత్తం ఓవర్లలో 20% కంటే ఎక్కువ బౌలింగు చేయకూడదు; అందువలన, 50 ఓవర్ల మ్యాచ్‌లో ప్రతి బౌలరు గరిష్టంగా 10 ఓవర్లు వేయగలడు.

టెస్టులు, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో, జట్టు ఇన్నింగ్స్‌లో ఓవర్ల సంఖ్యకు పరిమితి లేదు, అలాగే ఒకే బౌలరు ఎన్ని ఓవర్లు వేయాలనే దానిపై పరిమితి ఉండదు. ఈ మ్యాచ్‌లలో, ఒక రోజు ఆటలో కనీసం 90 ఓవర్లు బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది.[4]

వివిధ క్రికెట్ ఫార్మాట్‌లలో ఓవర్‌ల సంఖ్య

[మార్చు]

ఈ ఫార్మాట్లలో ఒక్కో జట్టుకు ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఉంటుంది:

  • అంతర్జాతీయ వన్డే : ఒక్కో ఇన్నింగ్స్‌కు 50 ఓవర్లు
  • T20 క్రికెట్ : ఒక ఇన్నింగ్స్‌కు 20 ఓవర్లు
  • 100-బంతుల క్రికెట్ : ఒక్కో ఇన్నింగ్స్‌లో 5-బంతుల ఓవర్లు 20 ఉంటాయి. ("ఫైవ్" అంటారు. బౌలరు వరుసగా 2 "ఫైవ్‌లు" బౌలింగ్ చేయవచ్చు. 10 బంతుల తర్వాత, చివరలు మారతాయి)
  • T10 క్రికెట్ : ఒక ఇన్నింగ్స్‌కు 10 ఓవర్లు

వ్యూహాత్మక పరిశీలనలు

[మార్చు]

బౌలింగ్ ఓవర్లలో వ్యూహాత్మక పరిశీలనలు

[మార్చు]

ఫీల్డింగ్ జట్టు వ్యూహాత్మక ప్రణాళికలో ఓవర్ అనేది ప్రాథమికంగా పరిగణించబడుతుంది. ఒక బౌలర్ మరొక బౌలర్‌కు బంతిని అందజేయడానికి ముందు బౌలింగ్ చేయడానికి కేవలం ఆరు చట్టబద్ధమైన బంతులు మాత్రమే ఉన్నందున, బౌలరు సాధారణంగా ఆ ఆరు బంతులను ఉపయోగించి బ్యాటింగ్ ఆటగాడిని అవుట్ చేయడానికి తగినట్లుగా ఆట నమూనాను రూపొందించడానికి ప్లాన్ చేస్తాడు. ఉదాహరణకు, మొదటి కొన్ని బంతులను ఒకే లైన్, లెంగ్త్ లేదా స్పిన్‌తో బౌల్ చేయవచ్చు. బౌలర్ కొట్టడానికి తేలికగా ఉండే బంతులను అందించడం ద్వారా బ్యాటరు షాట్‌లు కొట్టేందుకు ప్రలోభపెట్టాలని చూస్తాడు. బ్యాటింగ్ చేసే ఆటగాడు ఆ ఎరను తీసుకుంటే, బౌలరు వికెట్‌ను కొట్టడానికి లేదా దూకుడుగా పరుగులు తీసే ఊపులో ఉన్న బ్యాటరు చేత పొరపాటు చేయించడానికీ, తద్వారా క్యాచ్ ఇవ్వడానికీ ఉద్దేశించిన బంతిని వేయవచ్చు.

ఫీల్డింగు జట్టు ఎక్కువ సమయం తీసుకుంటూ స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేస్తే ఆ జట్టుకు జరిమానాలు విధిస్తారు.[5] ఈ జరిమానాల్లో, పోటీ పాయింట్లు కోల్పోవడం, మ్యాచ్ నిషేధం వంటివి ఉంటాయి. ఓవర్లు నిదానంగా ముందుకు సాగుతున్నట్లయితే, ఓవర్లు త్వరగా వెయ్యడానికి స్లో/స్పిన్ బౌలర్లను ఉపయోగిస్తారు ఆ బౌలర్ల రనప్ తక్కువ ఉంటుంది కాబట్టి వారు తమ ఓవర్లను మరింత త్వరగా పూర్తి చేస్తారు. నిషేధించబడటం లేదా పాయింట్లు కోల్పోవడం వంటి పెనాల్టీలను నివారించడానికి తక్కువ నైపుణ్యం కలిగిన బౌలర్‌ను ఉపయోగించడం ద్వారా నాసిరకం వ్యూహాన్ని ఎంచుకోవడం, ఇది.

బ్యాటింగ్ చేసే ఆటగాళ్ళు తమ స్కోరింగ్ అవకాశాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి క్రికెట్ లోని వన్‌డే, టి20 రూపాల్లో మెయిడెన్ ఓవర్లు వేయడం కష్టం. పైగా బ్యాటర్‌లు మరింత సులభంగా స్కోర్ చేయడానికి వీలయ్యేలా ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌లపై పరిమితి కూడా ఉంటుంది. ఒక్క మెయిడెన్ ఓవర్ పడినా అది ఆట వ్యూహాత్మక స్థితిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఒక ఇన్నింగ్స్‌లోని చివరి ఓవర్‌లను తరచుగా "డెత్ ఓవర్‌లు" అనీ "డెత్ ఓవర్‌లో బౌలింగ్" అనీ అంటారు. ఈ ఓవర్లలో స్కోరింగ్‌ను పరిమితంగా ఉండేలా చేయడంలో నైపుణ్యం కలిగిన బౌలర్లను డెత్ బౌలర్లు అంటారు. ఆస్ట్రేలియన్ ఇయాన్ హార్వే, దక్షిణాఫ్రికా ఆటగాడు ఆండ్రూ హాల్, న్యూజిలాండ్‌కు చెందిన డేనియల్ వెట్టోరి ఈ పాత్రలో రాణించగలరని అంటారు. [6] [7]

బ్యాటింగ్‌లో వ్యూహాత్మక పరిశీలనలు

[మార్చు]

బ్యాటింగు చేస్తున్న ఆటగాళ్లు ఇద్దరూ ఒకే సామర్థ్యం కలిగినవారు కాకపోతే, వ్యూహాత్మక పరిశీలనలు వారి ఆటను ప్రభావితం చేయవచ్చు. ఎక్కువ నైపుణ్యం గల బ్యాటరు బౌలింగ్‌ను మరింత ఎక్కువగా ఎదుర్కొనేలా ఆడతారు. ఓవర్‌లోని తొలి బంతుల్లో సరి సంఖ్యలో పరుగులు తీస్తూ, చివరి బంతికి బేసి సంఖ్యలో పరుగులు సాధించి, తరువాతి ఓవరులో కూడా తానే మళ్ళీ బంతిని ఎదుర్కొనేలా ప్రయత్నిస్తారు. బలహీనమైన బ్యాటరు దానికి విరుద్ధంగా ఆడతాడు. బౌలరు ఈ పద్ధతిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు.

ఒక బ్యాటరు కుడిచేతి వాటం, మరొకరు ఎడమచేతి వాటం కలిగి ఉన్నట్లయితే, వారు బౌలరు లయను అడ్డుకోడానికి బేసి సంఖ్యలో పరుగులు సాధించి స్ట్రైకును నిరంతరం మారుస్తూ ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఫీల్డర్‌లు కూడా తరచూ స్థానాలు మార్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళూ అలసిపోతారు. [8]

టెస్ట్ క్రికెట్‌లో ఒక ఓవర్‌కు చారిత్రక సంఖ్య

[మార్చు]

క్రికెట్ చట్టాలు (1980 కోడ్), చట్టం 17.1 కి ముందు ఒక ఓవరులో ఎన్ని బంతులు ఉండాలో సంఖ్యను స్పష్టంగా పేర్కొనలేదు. కానీ బంతుల సంఖ్య ఎన్ని ఉండాలో టాస్‌కు ముందు ఇద్దరు కెప్టెన్లు అంగీకరించాలి అని మాత్రమే పేర్కొంది. సాధారణంగా ఆడే మ్యాచ్‌కు సంబంధించిన నిబంధనలలో బంతుల సంఖ్య నిర్దేశించబడుతుంది. సాధారణంగా బంతులు సంఖ్య 6 అయినప్పటికీ, ఎల్లప్పుడూ ఇలాగే ఉండేది కాదు. 1980 కోడ్‌లో చట్టం 17.1 లో దీన్ని -"బాల్ ఒక్కో ఎండ్‌ నుండి ఒకదాని తరువాత మరొకటి, 6 బంతుల ఓవరు బౌల్ చేయాలి" అని సవరించారు.

ఓవర్‌కు బంతులు

ఇంగ్లాండ్ లో

  • 1880 నుండి 1888: 4
  • 1889 నుండి 1899: 5
  • 1900 నుండి 1938: 6
  • 1939 నుండి 1945: 8
  • 1946 నుండి ఇప్పటివరకు: 6

ఆస్ట్రేలియా లో

  • 1876/77 నుండి 1887/88: 4
  • 1891/92 నుండి 1920/21: 6
  • 1924/25: 8
  • 1928/29 నుండి 1932/33: 6
  • 1936/37 నుండి 1978/79: 8 [9]
  • 1979/80 నుండి ఇప్పటి వరకు: 6

దక్షిణాఫ్రికాలో

  • 1888/89: 4
  • 1891/92 నుండి 1898/99: 5
  • 1902/03 నుండి 1935/36: 6
  • 1938/39 నుండి 1957/58: 8
  • 1961/62 నుండి ఇప్పటి వరకు: 6

న్యూజిలాండ్‌లో

  • 1929/30 నుండి 1967/68: 6
  • 1968/69 నుండి 1978/79: 8
  • 1979/80 నుండి ఇప్పటి వరకు: 6

పాకిస్థాన్ లో

  • 1954/55 నుండి 1972/73: 6
  • 1974/75 నుండి 1977/78: 8
  • 1978/79 నుండి ఇప్పటి వరకు: 6

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Gray, James (2017-08-18). "Sam Curran bowls TRIPLE wicket maiden in Surrey's T20 Blast clash with Gloucestershire". Express.co.uk (in ఇంగ్లీష్). Retrieved 2020-09-09.
  2. "That's the over".
  3. "Law 17 – The over". MCC. Retrieved 29 September 2017.
  4. "The difference between Test and limited-overs cricket" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2005-09-06. Retrieved 2020-09-09.
  5. "Law 41.9 – Time wasting by the fielding side". MCC. Retrieved 29 September 2017.
  6. Kundu, Sagnik (2016-09-10). "5 bowlers with the highest number of maiden overs across all formats". www.sportskeeda.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-09.
  7. "The best ODI bowler at the death".
  8. "Cricket's greatest myth debunked #ICCWorldCup". NewsComAu (in ఇంగ్లీష్). 2015-02-10. Retrieved 2020-09-09.
  9. "The unexpected and quirky stats from a brilliant Ashes". BBC Sport (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2023-08-06. The previous record for fewest maidens bowled in a series of five or more Tests was 66 (India, against Australia, in 1947-48, when the overs were eight balls long and maidens commensurately rarer), [...]