ఓ చిగురాకులలో చిలకమ్మా (సినిమా పాట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిగురాకులలో చిలకమ్మా ... తెలుగు పాట చిత్రం : దొంగ రాముడు (1955 సినిమా)

పల్లవి

ఓ..ఓ చిగురాకులలో చిలకమ్మా ... చిన్నమాట వినరావమ్మా
ఓ..ఓ మరుమల్లెలలో మావయ్య... మంచి మాట సెలవీవయ్యా
పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు
నీ చిరునవ్వుకు సరికావమ్మా ఓ..ఓ
ఓ … ఓ చిగురాకులలో చిలకమ్మా …

చరణం 1

ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట
తెలిసీ పలికిన విలువేల ఆ … ఆ ఓ .. ఓఓ
ఓ…..ఓ మరుమల్లెలలో మావయ్యా.....

చరణం 2

వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తీయ్యదనాలకు
కలవా విలువలు సెలవీయ ఆ … ఆ ఓ .. ఓఓ
ఓఓ ఓఓ చిగురాకులలో చిలకమ్మా

చరణం 3

పై మెరుగులకే భ్రమ పడకయ్య మనసే మాయని సొగసయ్యా
గుణమే తరగని ధనమయ్యా ఆ … ఆ … ఆ … ఆ
ఓఓ మరుమల్లెలలో మావయ్యా మంచి మాట సెలవీవయ్యా
ఓఓ చిగురాకులలో చిలకమ్మా చిన్న మాట వినరావమ్మా

విశేషాలు

[మార్చు]
  • చలన చిత్రం : దొంగ రాముడు
  • సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
  • సాహిత్యం: సీనియర్ సముద్రాల
  • నేపద్యసంగీతం: ఘంటసాల & జిక్కి

వివరణ

[మార్చు]

కొన్ని పాటలు కొంతకాలమే బ్రతుకుతాయి. మరికొన్ని పాటలు ఏదోలా బ్రతికేస్తుంటాయి. కొద్దిపాటలు మాత్రం కలకాలం గుర్తుంటాయి. అలా గుర్తున్న పాటల్లోనూ సాహిత్యపరంగా, సంగీతపరంగా వీనులవిందుగా మనస్సులలో జీవిస్తూ నిలిచేవి అజరమమైనవి కొన్నే మరి. చిగురాకులలో చిలకమ్మా ... అంటూ సాగిపోయే తెలుగు పాట [చలన చిత్రం : దొంగ రాముడు - 1955] అటువంటి కలకాలం గుర్తుండే సజీవమైన కమ్మని పాట అని చెప్పవచ్చు. ఎప్పుడు విన్నా ఎక్కడ విన్నా ఎన్నిసార్లు విన్నా మల్ల్లీ మళ్ళీ వినాలనిపించే తీయతీయని తేనెల మాటల తెలుగు పాట ఇది. సంగీతం, సాహిత్యం జానపదంతో చమక్కులు మెరిపిస్తూ మల్లెలు పూయిస్తూ తెలుగు మాధుర్యం తొణికిసలాడిస్తూ గలగలా సాగిపోయే అపురూపమైన మరపురాని తెలుగుపాట ఇది. చిగురాకులలో చిలకమ్మ(మహానటి సావిత్రి) అలవోలకగా పదాలను పూరిస్తుంటే ఆ పల్లె పడుచు గడుసుధనపు మనసు మనకు అవగతమవుతుంటే ఆ పద లాలిత్యం మనసున గిలికింతలు పెడుతుంటే ఆ పాట రివ్వున సాగిపోతుంటే మనసు మల్లెలు పూయదా మరి. ఆ గడుసరి నెలకాడు (మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు) గలగలమాటలతో తన నెచ్చలి మనసున సిగ్గులు పూయిస్తుంటే, ఆ తలపుల వలపుల మాటలతో తన మనసున పూచిన ముసిముసి నవ్వులతో చల్లని చిరునవ్వులదొంతరలతో మాటల జల్లులు కురిపిస్తూ మైమరపిస్తూ మన మనసులలో మరుమల్లెలు పూయించే పెదవులపై చిరునగవులు విరియించే చిగురాకుల చిలకమ్మ పాడే మధురమైన కమ్మని పాట ఇది మన తెలుగు పాట.

'పున్నమి వెన్నెల గిలికింతలకు పూచిన మల్లెల మురిపాలు నీ నవ్వుకు సరికావమ్మా ... 'అంటూ తన నెలకాడు వలచి తూచే మాటలజల్లులకు ఆ చూడ చక్కని ఆ పల్లె పడుచు మురిపాలు, చిందించే చిరునవ్వుల సోయగాలు, నగుమోము అందాలు మనలను అలరించి మనసు ఊయలలో తేలిపోయేటట్లు చేస్తాయి. మనసున గిలికింతలు పెడుతూ మల్లె తీగలా అల్లుకొంటూ సాగిపోయే ఈ పాటలోని పదబందాలు ఆపై ఎత్తుకోవడాలు చక చక సాగే తీరు వినసొంపుగా వుంటుంది. సాహిత్యం జానపదంతో పెనవేసుకుపోతూ వీనులవిందుగా సాగిపోయే ఇటువంటి వలపు పాటలు మన తెలుగు చిత్రాలలో అక్కడక్కడ మెరుస్తూ ప్రేక్షకులను రంజింప చేస్తుంటాయి.

'వలచే కోమలి వయ్యారాలకు, కలసే మనసుల తీయదనాలకు ..... 'వంటి పొందికైన పదహారాలు ఈ పాటలో అలవోకగా దొర్లుతూవుంటాయి. తేట తెలుగు పద లాలిత్యంతో తొణికిసలాడే ఈ పద విరుపుల రాసినదేవరో పాడినదెవరో బాణీ కూర్చినదెవరో ఆ త్రయానికి సలాం చెప్పితీరాలి. తన చిరునవ్వుల ముఖకవళికలతో ముసిముసి నవ్వులతో మురిపించి అలరించిన ఆ అభినేత్రి నగుమోము ఈ పాట వింటున్నంతసేపూ మన మనోఫలకంలో మెరుస్తూనే వుంటుంది. మన నోటిలో కూనిరాగం కూయిస్తూనే వుంటుంది.

'ఓ..ఓ మరుమల్లెలలో మావయ్య... మంచి మాట సెలవీవయ్యా 'అంటూ ప్రారంబిస్తూ చివరకు ‘పై మెరుగులకే భ్రమ పడకయ్య మనసే మాయని సొగసయ్యా’అంటూ మరుమల్లెలలో మావయ్యకి సుద్దులు చెపుతూ, ‘గుణమే తరగని ధనమయ్యా’ అంటూ చివరకి ముక్తాయింపు పలికే పడుచు పాత్రలో సావిత్రిని చూపిన తీరు చూడ ముచ్చటగా వుంటుంది. పెండ్యాల వారి సంగీతం మైమరపిస్తూ ఓలాడిస్తుంది.

ఇటువంటి అపాతమదురాలు ఇప్పుడేవి? ఎడారిలో ఒయాసిస్సులా అలసిన మనసుకు సేద తీర్చే ఇటువంటి కమ్మని మధుర గీతాలు మన తెలుగు పాటలతోటలలో లో అక్కడక్కడ అరుదుగా పూస్తాయి. సీనియర్ సముద్రాల, పెండ్యాల నాగేశ్వరరావుల దిగ్గజాల కలబాణీ మెరుపుల నుండి మెరిసిన ఈ అజరామం తెలుగు పాత పాటల అభిమానులకు ఇప్పటికీ అలరిస్తూనే వుంటుంది. ముఖ్యంగా ఈ పాటలో కనిపించే ఆ సోయగాల పల్లె పడుచు నగుమోము, నటన చూడముచ్చటగా వుండటం మనం గమనించవచ్చు. మాటల చిరునవ్వులతో హరివిల్లులు కురిపిస్తూ, తన చెలికాని మాటకు దీటుగా పదం ఎత్తుకోవడంలో అభినేత్రి వలపు మనోగతం ఈ పాటలో మనకు స్పురిస్తుంది. చక చక సాగే ఆ తీయ తీయని తేనెల మాటల పద జల్లులలో, వడి వడి పద విరిజల్లులలో ఈ పాట వీక్షకులు తడిసిముద్ధై మురిసిపోవడం సహజం. అందుకే ఈ పాట తెలుగు వారి మదిలో కలకాలం గుర్తుండిపోయింది. ఈ భావ పద సాహిత్య రాగ మాలికలకు సహజ అభినయం చిరునవ్వుల హరివిల్లి మన మహానటి సావిత్రి కే చెల్లు. ఈ అజరామ గీతం మన తెలుగు చిత్ర సాహిత్యానికే అపురూపం తతరాలుకు తరగని గనిభాండారం అంటే అతిశయోక్తి కాదు.

పున్నమి వెన్నెల గిలికింతలకు పూచిన మల్లెల మురిపాలు....... నీ చిరునవ్వుకు సరికావమ్మా ఓ...మహా నటి సావిత్రి.

మైమరపించే ఓలాడించే నీ గళ మాధుర్యానికి ఈ ఇలలో నీకెవరు, ఆ సురలో వేరెవరు సరి రారమ్మ ఇది నిజమమ్మ ఓ సుమధుర గాయని జిక్కి.

మూలాలు

[మార్చు]