కంద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Elephant foot yam
ചേന.jpg
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: Plantae
(unranked): Angiosperms
(unranked): Monocots
క్రమం: Alismatales
కుటుంబం: Araceae
ఉప కుటుంబం: Aroideae
జాతి: Thomsonieae
జాతి: Amorphophallus
ప్రజాతి: A. paeoniifolius
ద్వినామీకరణం
Amorphophallus paeoniifolius
(Dennst.) Nicolson
పర్యాయపదాలు

A. campanulata

కంద: కొత్తపేట రైతు బజారులో తీసినచిత్రం

తెలుగులో కంద అన్నా "కంద గడ్డ" అన్నా అర్థం ఒక్కటే. ఇది భూమిలో పెరిగే ఒక దుంప. తెలుగు వారు వాడే కూరగాయలలో కందకి ఒక స్థానం ఉంది. అడవులలో తిరిగే మునులు "కందమూలాలు" తిని బతికేవారని చదువుతూ ఉంటాం. అంటే, వారు ఆహారంగా పనికొచ్చే దుంపలు (tubers), వేళ్లూ (roots) తినేవారని అభిప్రాయం.

పేర్లు[మార్చు]

సంస్కృతంలో కందని "సూరణ" అనిన్నీ "కన్‌ద" అనిన్నీ, "అర్శోఘ్న" అనిన్నీ అంటారు. అర్శ వ్యాధి (మొలలు వ్యాధి లేదా piles) ని పోగొడుతుందని దీనికి "అర్శోఘ్న" అన్న పేరు వచ్చింది. కంద గడ్డ చూడడానికి ఏనుగు పాదంలా ఉంటుందని దీనిని ఇంగ్లీషులో Elephant foot yam అంటారు. దీని శాస్త్రీయనామం "ఎమార్పోఫాలస్ కాంపాన్యులేటస్" (Amorphophallus companulatus). గ్రీకు భాషలో "ఎమోర్ఫస్" అంటే నిరాకారమైన అని అర్థం. కంద దుంపకి ఒక నిర్దిష్టమైన ఆకారం లేకపోవడం వల్ల ఈ మొదటి పేరు వచ్చింది. దీని పువ్వులు గంట ఆకారంలో ఉంటాయి కనుక రెండవ పేరు వచ్చింది.

భారత దేశంలో 14 కంద ఉపజాతులు కనబడుతున్నాయి. వీటన్నిటికి మూలం అనదగ్గది అడవి కంద. దీనిని తెలుగులో "వజ్ర కంద" అనిన్నీ "వన కంద" అనిన్నీ పిలుస్తారు. సంస్కృతంలో "వజ్రమూల" అనిన్నీ, "వనసూరణ" అనిన్నీ అంటారు. దీని శాస్త్రీయనామం "ఎమార్పోఫాలస్ సిల్వాటికస్" (Amorphophallus sylvaticus). కంద జన్మస్థానం భారత దేశమే అని శాస్త్రవేత్తలు నిర్ణయించేరు.

కంద సాగు[మార్చు]

కంద భారత దేశంలోని దరిదాపు అన్ని ప్రాంతాలలోను సాగవుతుంది. కొబ్బరి తోటలలో అంతర పంటగా వేస్తూ ఉంటారు. ఇది నేలలోని సారాన్ని బాగా పీల్చుకుంటుంది కనుక ఒక సారి వేసిన పొలంలో ఐదారు సంవత్సరాలు పోతే కాని మళ్లా వెయ్యరు.

లక్షణాలు[మార్చు]

 • కంద పేరు వినగానే గుర్తుకి వచ్చేది దాని ముఖ్యమైన లక్షణం: దురద. పచ్చి కందని తినడానికి ప్రయత్నిస్తే నోరంతా ఒకటే దురద వేస్తుంది. దుంపకూరలు అన్నీ పచ్చివి కొరికితే కొద్దో గొప్పో దురద వేస్తాయి; కాని కందలో ఈ దురద లక్షణం విపరీతం. అందుకనే కందకు లేని దురద కత్తిపీటకెందుకో అనే సామెత వాడుకలోకి వచ్చింది.
 • కందలో రెండు రకాలు ఉన్నాయి: (1) తీట (దురద) కంద, (2) తియ్య కంద.
 • తీట కందని ముక్కలుగా కోసి, నీళ్లల్లో వండి, ఆ నీళ్లని పారబోస్తే, ఆ దురద పోతుంది.
 • కంద ముక్క్లని బాగా నీళ్లల్లో కడిగి, తరువాత వాటిని మజ్జిగలోనో, చింతపండు రసంలోనో ఉడకబెడితే దురద తగ్గిపోతుంది.
 • కొత్తగా తవ్వి తీసిన కంద ఎక్కువ దురద వేస్తుంది. కొత్తగా తవ్వి తీసిన కందని "నీటి కంద" అనిన్నీ, నిల్వ ఉంచిన కందని "పాటి కంద" అంటారు.
 • కంద దుంపలో ఉండే Calcium oxalate అనే రసాయనం కారణంగా కందకి ఆ దురద వచ్చింది.
 • వైద్యంలో ఉపయోగపడే కందని "వన సూరణ కంద" అంటారు. దీని దురద అత్యధికం.

ఆహారంగా కంద[మార్చు]

 • భారతీయుల ఆహారంలో కందకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కంద, బచ్చలి కలిపి చేసిన కూర లేకుండా కొన్ని సంతర్పణలు జరగవు.
 • కంద ముక్కలని పలచగా తరిగి "చిప్సు" చేస్తున్నారు.
 • హైదరాబాదులోని 5-తారల హొటేళ్లల్లో కూడ ఒకప్పుడు "కంద అట్లు" వడ్డించేవారు!
 • పన్నెండవ శతాబ్దంలో రచన చెందిన "మానసోల్లాసం" అనే గ్రంథంలో కంద ముక్కలు, పెరుగు, పళ్ల రసాలతో తయారయిన ఒక పుల్లటి ప్రలేహం యొక్క ప్రస్తావన ఉంది. నైషధ చరితంలో ప్రలేహం అంటే కంద, అల్లం, మజ్జిగతో తయారైన ఒక వంటకం అని ఉంది. ఇది మూడొంతులు ఈ నాటి మజ్జిగ పులుసు లాంటి వంటకం అయి ఉండవచ్చు.

ఆయుర్వేదంలో కంద ఉపయోగము[మార్చు]

 • మూలశంఖకు (పైల్స్) కందతో మందు: పై పొట్టు తీసిన కందను పల్చని ముక్కలుగా కోసి ఎండబెట్టి మెత్తటి పొడిగా చేయాలి. బెల్లాన్ని కూడ మెత్తగా చేయాలి. ఈ రెండు పొడులను సమభాగాలుగా కలబోసి బాగా కలిపి, ఉసిరికాయ పరిమాణంలో వుండలుగా కట్టి (లడ్డు లా) నిల్వ చేసుకొని ప్రతి రోజు పొద్దున ఒకటి, రాత్రికి ఒకటి చొప్పున తింటే మూలశంఖ వ్వాది నయమవుతుందని ఆయుర్వాద వైద్యులు అంటారు.
 • కొన్ని ద్రవ్యాలలో (ఈ ద్రవ్యాలు ఏమిటో తెలియదు) నానబెట్టి, ఎండబెట్టిన కంద ముక్కలని "మదన్ మస్త్" అన్న పేరుతో బజారులో అమ్ముతూ ఉంటారు. దీనిని మూలశంఖకీ, అజీర్తికీ మందుగా వాడతారు.
 • మదన్ మస్త్, చిత్రమూలం (ప్లంబాగో జైలానికం) వేరు, శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, బెల్లపు పాకం - వీటన్నిటిని సమ పాళ్లల్లో కలిపి చేసే "సూరణ మాదకం" అనే లేహ్యం అజీర్తి రోగాన్ని చక్కగా కుదుర్చుతుందని డా. నద్‌కర్ణి "The Indian Materia Medica" అనే గ్రంథంలో పేర్కొన్నారు ట.

మూలాలు[మార్చు]

 • ముత్తేవి రవీంద్రనాథ్, కూరగాథలు, విజ్ఞఆన వేదిక, తెనాలి, 2014
Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=కంద&oldid=2277150" నుండి వెలికితీశారు