కచుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కచుడు దేవ గురువు బృహస్పతి కుమారుడు.

ఇతఁడు దేవతల ప్రార్థనచే శుక్రాచార్యులయొద్ద మృతసంజీవని (చచ్చినవారిని బ్రతికించునది) అను విద్యను గ్రహింప కోరి ఆతని యొద్దకుపోయి శిష్యత్వము వహించి ఉండునవసరమున శుక్రాచార్యులును అతని కొమార్తె దేవయాని ఇతనిమీఁద మిక్కిలి ప్రేమ కలిగి ఆదరించుచు ఉండిరి. అదిచూచి దానవులు సహింపను ఓపక ఒక్క దినము ఇతఁడు శుక్రాచార్యుల హోమధేనువును మేపుటకు అడవికిపోయి ఉండఁగా అచట పట్టి వధించిరి. అంత దేవయాని కచుఁడు పోయినపోకడ తెలియకపోయెను అని విచారపడుచు ఉండఁగా శుక్రాచార్యులు యోగదృష్టిచే వాఁడు రాక్షసులచేత చంపఁబడుట తెలిసికొని మృతసంజీవనివలన వానిని సంజీవితునిగ చేసి తోడ్కొని వచ్చెను. అందులకు దానవులు సహింపక మఱి ఒకతూరి అడవిని ఒంటిగా ఉండువేళ అతనిని చంపి కాల్చి భస్మముచేసి ఆభస్మమును సురయందు కలిపి శుక్రునికి త్రావనిచ్చిరి. అంతట దేవయాని మహాదుఃఖితురాలై మరల శుక్రుని వేఁడిన అతఁడు తన దివ్యదృష్టివలన కచునికి ప్రాప్తించిన అవస్థ ఎఱింగి సురవలనకదా ఇంత పుట్టెను అని ఎంచి సురాపానము బ్రాహ్మణాదిజనులకు అందఱకు నిషిద్ధముగా విధించి తన గర్భమునందు ఉన్న కచుని మృతసంజీవనిచే మరల సంజీవితుని చేసి తనయుదరము భేదించుకొని అతఁడు వె‌లువడిరాను తన్ను పునర్జీవితుని చేయను అనువుగా అతనికి మృతసంజీవని ఉపదేశము చేసెను. అట్లు కచుండు శుక్రునివలన మృతసంజీవని పడసి అతనిగర్భము వ్రచ్చుకొని బయిటవచ్చి మృతుండైన శుక్రుని సంజీవితుని చేసి అతనిని సంతోష పఱచెను. అంత దేవయానియు మిగుల సంతసించెను. ఆవల కొంతకాలమునకు వెనుక కచుండు దేవలోకమునకు పోవువాఁడై శుక్రుని వీడుకొని దేవయానికి తన ప్రయాణ యత్నమును తెలుపఁగా ఆమె అతనిని విడనాడ ఓర్వక తన్ను పెండ్లియాడుము అని నిర్బంధించెను. అతఁడు అది ధర్మవిరుద్ధము అని అందులకు సమ్మతింపనందున దేవయాని కోపించి నాప్రయత్నమున నీకు లభించిన మృతసంజీవని విద్య ఫలింపకపోవుగాక అని శపించెను. అంతట కచుండు 'నేను ధర్మమార్గము తప్పనివాఁడను కావున నీశాపమున మృతసంజీవని నాకు పనిచేయకున్నను, నాచేత ఉపదేశము కొన్నవారికి పనిచేయును, నీవు ధర్మవిరోధము తలఁచితివి కాఁబట్టి నిన్ను బ్రాహ్మణుఁడు పెండ్లియాడకపోవునుగాక' అని ప్రతిశాపము ఇచ్చెను. అది కారణముగా దేవయానికి క్షత్రియుఁగైన యయాతిని పెండ్లాడవలసి వచ్చెను. కచునకు మృతసంజీవని ఫలింపక తాను ఉపదేశము చేసినవారికి మాత్రము ఫలించునట్లు అయ్యెను.

మూలం

[మార్చు]
  • పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879
"https://te.wikipedia.org/w/index.php?title=కచుడు&oldid=3877441" నుండి వెలికితీశారు