Jump to content

దేవయాని

వికీపీడియా నుండి
బావిలో నుంచి దేవయానిని ఆ సమయంలో వేటకోసం వచ్చిన యయాతి రక్షిస్తాడు

దేవయాని రాక్షసులకు గురువైన శుక్రాచార్యునికి, జయంతికి కలిగిన కుమార్తె. ఆమెను వారు అతి గారాబంగా పెంచారు.


బృహస్పతి కుమారుడు కచుడు మృతసంజీవనీ విద్య ను నేర్చుకోవడానికి శుక్రాచార్యుని వద్ద శిష్యునిగా చేరతాడు. చాలా శ్రద్ధగా అన్ని విషయాలు నేర్చుకొంటూ, ఇంటి పనులన్నీ చేస్తూ, గురువు గారినే కాకుండా దేవయానికి కూడా దగ్గరయ్యాడు. ఇది రాక్షసులకు నచ్చలేదు, అతని ద్వారా మంత్రవిద్య దేవతలకు చేరుతుందనే భయంతో ఒకనాడు అడవికి గోవులను మేపడానికి వెళ్ళిన కచుణ్ణి చంపి, చెట్టుకి వేలాడదీస్తారు. విషయం తెలిసిన శుక్రాచార్యుడు మృతసంజీవినితో అతన్ని మళ్ళీ బ్రతికించాడు. ఇలాగ లాభంలేదని ఈసారి రాక్షసులు అతన్ని చంపి, కాల్చి, బూడిదచేసి దానిని కల్లులో కలిపి శుక్రాచార్యునిచేత తాగించారు. దివ్యదృష్టితో చూచిన శుక్రుడు కచుడు బూడిద రూపంలో తన కడుపులోనే కనిపించాడు. తన మద్యపానం వలన జరిగిన అనర్ధాన్ని గ్రహిస్తాడు. తన గర్భంలోని కచుణ్ణి సంజీవనీ విద్యతో మరలా బ్రతికించాడు. అతడు బయటకు వస్తే శుక్రుడు మరణిస్తాడు. అందులకు వేరు గత్యంతరం లేక అతనికి మృతసంజీవనీ విద్యను నేర్పించాడు. మాట ప్రకారం శుక్రుని కడుపు చీల్చుకొని బయటకు వచ్చిన కచుడు శుక్రున్ని బ్రతికించాడు. ఆ తరువాత కచుడు దేవలోకానికి ప్రయాణ మయ్యాడు. దేవయాని కచుణ్ణి తను ఆరాధిస్తున్న విషయాన్ని తెలిపి పెళ్ళి చేసుకోమంటుంది. అందుకు కచుడు "ఇది నీకు తగదు. గురువు తండ్రివంటి వాడు. గురు పుత్రిక సోదరి అవుతుంది. నామనసులో కూడా నీకు అదే స్థానం" అని అంటాడు. దేవయానికి కోపం వచ్చి కచుడు తన తండ్రి దగ్గర నేర్చుకున్న విద్యలన్నీ విఫలమవుతాయని శాపమిస్తుంది. అందుకు తిరిగి కచుడు దేవయానిని బ్రాహ్మణుడెవ్వడు వివాహం చేసుకోడని ప్రతి శాపమిస్తాడు.

ఒకనాడు దేవయాని, వృషపర్వుని కుమార్తె అయిన శర్మిష్ఠ వన విహారానికి వెళ్లారు. జలక్రీడల కోసం సరస్సులో దిగారు, పెద్దగాలి వచ్చి చీరలన్నీ కలిసిపోయాయి. ఒకరి చీరను ఒకరు కట్టుకోవడంలో గొడవ పడి, ఒకరు ఎక్కువంటే, ఒకరు ఎక్కువని వాదోపవాదాలు జరిగిన పిదప, శర్మిష్ట దేవయానిని ఒక పాడుపడిన నూతిలోకి త్రోసి ఇంటికి వెళ్ళిపోయింది. దొరికిన లతను పట్టుకుని వేలాడుతున్న దేవయానిని ఆ సమయంలో వేటకోసం వచ్చిన యయాతి రక్షిస్తాడు. దేవయాని వృషపర్వుని నగరానికి రానని తండ్రికి తెలిపి, అతన్ని కూడా రాచరికం విడిచి పెట్టిస్తుంది. వృషపర్వుడు శుక్రుని కాళ్లపై బడి క్షమించమని వేడుకున్నాడు. తన కుమార్తె చేసిన తప్పుకు రాక్షసవంశాన్ని శిక్షించవద్దని దేవయాని ఏ శిక్ష విధించినా తన కుమార్తె అనుభవిస్తుందని అంటాడు. దేవయాని శర్మిష్ట తనకు దాసిగా వుండాలని కోరింది. రాకుమారి దాసి అయినందుకు దేవయాని గర్వపడింది. ఆజ్ఞలు జారీచేస్తుంటే శర్మిష్ట శిరసావహిస్తుంది.

ఒకనాడు వనవిహరానికి వెళ్ళిన వారికి యయాతి వేటకై వస్తాడు. దేవయాని అతడు తన చేయి పట్టుకుని నూతినుండి రక్షించినప్పుడే పాణిగ్రహణం జరిగినట్లేనని తనను పెళ్ళిచేసుకోమంటుంది. శుక్రుని అనుమతితో దేవయాని యయాతిల వివాహం జరుగుతుంది. ఆమెతో సహా శర్మిష్ట, దాసదాసీజనాన్ని రాజుకప్పగిస్తాడు. మహారాణిగా ఆమె ఆనందాన్ని అనుభవిస్తూ సంసార ఫలితంగా యదువు, తుర్వసుడు అనే బిడ్డల్ని కంటుంది.

శర్మిష్ట దేవయాని దాసిగా చాలా బాధ పడుతుంది. ఒకరోజు యయాతి అశోకవనానికి వచ్చాడు. అతన్ని నేను కన్యను, రాజపుత్రికను, దేవయానిని గ్రహించినట్లే తనను కూడా గ్రహించమంటుంది. యయాతి అంగీకరిస్తాడు. ఆమెకు ద్రుహ్యుడు, అనువు, పూరుడు అనే కొడుకులు పుట్టారు. కొంతకాలానికి విషయం తెలిసిన దేవయానికి కోపం, దుఃఖం కలిగింది. దాసి తన సవతి అయిందని తండ్రికి చెప్పింది. శుక్రుడు ఆలోచించక యయాతిని ముసలితనంతో బాధపడమని శపిస్తాడు. యయాతి బ్రతిమాలగా తప్పు తెలుసుకున్న శుక్రుడు "నీ ముసలితనం నీ కుమారుల్లో ఎవరికైనా ఇచ్చి వారి యవ్వనం తీసుకోవచ్చని, వారే రాజ్యానికి అర్హులని చెబుతాడు. ముసలితనంతో బాధపటుతున్న యయాతి కుమారుల్ని వరుసగా తన ముసలితనం తీసుకొని వారి యవ్వనం ఇవ్వమన్నాడు. పూరుడు సంతోషంగా అంగీకరించాడు. యవ్వనవంతుడైన యయాతి తప్పుతెలుసుకున్న దేవయానితో కలసి ఎన్నో యాగాలు చేశాడు. జ్ఞాని అయ్యాడు.

మూలాలు

[మార్చు]
  • దేవయాని: డా.ఎమ్.సుబ్బారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1983, 1997.
"https://te.wikipedia.org/w/index.php?title=దేవయాని&oldid=3878732" నుండి వెలికితీశారు