Jump to content

కన్నడ సాహిత్యం

వికీపీడియా నుండి
(కన్నడ సాహిత్యము నుండి దారిమార్పు చెందింది)

దక్షిణ భారత భాషల్లో తమిళము తర్వాత ప్రాచీనమైన లిఖిత సాహిత్యం లభ్యమౌతున్న భాష కన్నడం. తెనుగున 11వ శతాబ్దమున గ్రంథ రచనకాగా కన్నడమున 9వ శతాబ్దమునే ప్రారంభమయ్యింది.నృపంతుడనే రాజు కవిరాజ మార్గము అను వ్యాకరణ గ్రంథాన్ని ఈ కాలమునే వ్రాశారు. ప్రయోగశరణం వ్యాకరణం అను నానుడి ప్రకారము కన్నడ భాషయు ఈగ్రంధరచనకు పూర్వమే వెలసియుండవచ్చునని ఊహించిరి. కన్నడమున ప్రాచీన మైన శాసనములలో హల్మడి శాసనము (సా.శ.700) శ్రావణబెళగొళశాసనము (సా.శ.700) వీనిని పరిశీలించిన కన్నడనుడియొక్క స్వరూపమును దాని స్వభావము కొంత తెలియనగును.అప్పటి భాషను హళెగన్నడమని (ప్రాత కన్నడము) చెప్పెదరు. తమిళమునకు కొంత సన్నిహితముగా నుండును. నృపంతుడు తన కవిరాజ మార్గము న పూర్వ కన్నడ కవులను కొందరిని పేర్కొనెను. శ్రీవిజయ, కవీశ్వర, పండిత, చంద్ర, లోకపాల, మొదలైనవారు కన్నడమున గ్రంథములు వ్రాసి ఉండవచ్చును.

పంపయుగము

[మార్చు]

ఆంధ్రవాజ్మయమున కవిత్రయము వంటి మువ్వురు కవులు కన్నడ సాహిత్యమున రత్న త్రయము అను పేరుతో కలరు. పంప, పొన్న, రన్న అను వీరు మిక్కిలి ప్రసిద్ధులైన ప్రాచీనకవులు. సామాన్యముగా కన్నడ సాహిత్య చరిత్రను జైనయుగమని, వీర సైవయుగమని, బ్రాహ్మణయుగమని విభజించుట పరిపాటి. తెనుగున నన్నయ భట్టారికుడెటలనో కన్నడమున ఆదికవియని ప్రసిద్ధి చెందినవాడు పంపడు. నృపంతుడు ఈతనికంటె ముందుగా కావ్యరచన చేసిననునది కేవలము వ్యాకరణ గ్రంథమే అగుటచే సాహిత్యరంగమున దానికి వ్యాప్తి తక్కువ.

తొలుత పంప కవి (సా.శ.941) ఆంధ్రదేశమైన వేగిదేశమున నుండినవాడు. జైనమతావలంబియై కన్నడదేశమున దానికిగల వ్యాప్తిని చూచి ఆదేశానికి వచ్చెను. జైన మతము తమ తీర్ధంకురుల జీవితచరిత్రలను పురాణములుగా రచించియున్నారు. పంపని ఆది పురాణము న మొదటి తీర్ధంకరుడైన వృషభ నాధుడు చరిత్ర వర్ణింపబడింది. ఈతని విక్రమార్జున విజయము (పంపభారతము) మహా భారతము కదను నిరూపించును. ఈజైనకవులలో పంప, పొన్న, రన్న, నేమిచంద్ర, జన్న, రత్నాకరసిద్ధ మొదలైనవారు ప్రసిద్ధిచెందిరి.జైనులలో రామాయణ భారతములను శ్రీకృష్ణుని కథయూ ఉంది.కాని మనలో ప్రచారమున్న కథలకును జైనమతస్థులలో వాడుకనుండు కథలకు వ్యత్యాసము ఉంది.వీరి రామాయణమున రావణుని సంహరించువాడు రాముడుకాదు లక్ష్మణుడు.పంపకవి తనకు ఆశ్రయదాతయైన వేగిదేశాధీశుడు అరికేసరి సచ్చరిత్రను మెచ్చికొని ఆతనిని అర్జునినితో పోల్చి గ్రంథమును వ్రాసెను. అందులకే దానికి విక్రమార్జున విజయమని పేరు. ద్రౌపది పంచ భర్తృకకాక అర్జుని ఏకైక భార్య.కృష్ణునికి వ్యాసభారతమున గల ప్రాధాన్యమిచటలేదు.

పంపకవి అనంతరము రన్నకవి ఖ్యాతిని గడించెను. ఇతడు జాతిలో వైశ్యుడు, వృత్తిలో గాజులవాడు, ధర్మాచరణమందు జైనుడు.ఈతని అజిత తీర్ధంకరపురాణము, సాహసభీమ విజయము (గదాయుద్ధము) ల్మక్కిలి వ్యాప్తిగాంచిన గ్రంథములు. గదాయుద్ధమునకు భీముడు నాయకుడు. ధుర్యోధనుడు పురుషకారమే ప్రధానమని యెంచి యుద్ధమొనరించి ధుఃఖములనుభవించి కడపట పరిశుద్ధాంతఃకరణుడగును.మొత్తముపైన కన్నడసాహిత్యమున రన్నని రసప్రతిపాదన, శైలి, పాత్రపోషణ వేరొక ప్రాచీనకవికి లేవెని అంటారు.ఈతని రచనను మన తిక్కన రచనలకు పోల్చెదరు.ఈరన్నకవికి పోషకుడైన చావుండరాయుడు తాను గ్రంథకర్త అగుటయేకాక జైనమతావలంబియై శృవణబెళగొళలో నిర్మింపబడిన గోమఠేశ్వరము శిలావిగ్రహమును స్థాపించినవాడట. పొన్నకవి జైనమతాశృఅయమునే శాంతి పురాణము ను వ్రాసెను.ఈతడు ఆంధ్రదేశము వాడనియు చిత్తూరుజిల్లాలోని పుంగనూరు వాస్తవ్యుడు.

ఈకాలముననే నాగవర్మ చంధోంబుధి కావ్యాలోకన కాదంబరి అను గ్రంథములను వ్రాసెను.12 వ శతాబ్దము ఆదిభాగమున నాగచంద్రుడను కవి రామచంద్రచరిత పురాణము మల్లినాధ పురాణము అను రెండు గొప్ప కావ్యములను వ్రాసెను. ఈతనికి అభినవపంప అని బిరుదు.ఇతడు జైన రామాయణము వ్రాసెను.

ఆకాలమందలి సాహిత్యము రాజాస్థానములలో ఉండెను.సామాన్యజనులకై కవులు సాహిత్యమును సృష్టించలేదు. సంస్కృతగ్రంధములే వీరికి మూలములు. వానియొక్క అనువాదములే ఎక్కువగా బయలుదేరెను.కేవలము సంస్కృతములోని దీర్ఘసమాసములకు కన్నడ ప్రత్యయములను చేర్చి వృత్తములను వ్రాయుచుండిరి.

స్వతంత్ర యుగము

[మార్చు]

12 వ శతాబ్దము కన్నడసాహిత్యచరిత్రలో స్వతంత్ర యుగమని చెప్పవచ్చును.సుమరు సా.శ.1190 ప్రాంతమునకు ప్రసిద్ధికి వచ్చిన బసవడు కన్నడ సాహిత్యమునకు ఒక నూతనమార్గమును చూపించెను.వేమన పద్యములలో వలె ఇవి సూటిగా ప్రచారమును దృష్టియందుంచుకొని చెప్పబడినవి. వీనిని కర్ణాటకమున బసవణ్ణన వచనగళు అని చెప్పెదరు. వీనిని సామాన్యులకు అర్ధమగునట్లు రచించెను. కన్నడమున దేశీకవితకు ఈతడు మార్గదర్శి.దీర్ఘసమాసములతో కూడిన సంస్కృత తత్సమ పదములుండవు. బసవనునికి సమకాలీకులైన అల్లమప్రభు, సిద్ధరామ, మడివాళ మాచయ్య, అంబిగర చౌడయ్య మొదలైనవారు బసవని వచనలను పోలి రచించెరు. స్తీలు కూడా కొదరిట్టిరచనలను రచించెను. అక్క మహాదేవి పేర్కొనదగినది.

వీరశైవ మతము వ్యాప్తికి తెచ్చినవారలలో హంపీ వాస్తవ్యుడైన హరిహరకవి ముఖ్యుడు. ఈతడు గిరిజా కళ్యాణము అను కావ్యమును వ్రాసెను. ఈతడు రగళచంధస్సున శివశరణుల కథలను వ్రాసెను. ఈతని తరువాత చామరస, భీమకవి, విరూపాఖ పండిత మొదలగు వీరశైవకవులు ఉదయించిరి. చామరసకవి ప్రభులింగ లీలలు ను, భీమకవి బసవపురాణమును వ్రాసెను.మన పాల్కూరికి సోమనాధుడు వ్రాసిన బసవపురాణమును చూచి తను వ్రాసినట్లు చీమకవి చెప్పుకునాడట.

కన్నడ కవులలో అత్యంత స్వతంత్ర కవిఅని పేరుగాంచినవాడు కుమారవ్యాసుడు విజయనగరమునేలిన ప్రౌఢదేవరాయలకాలమున (1423-1446) తన అమూల్యమైన కన్నడ భారతమును వ్రాసెను. ఈతడు వ్రాసిన భారతమును గదగ్ లోని వీరనారాయణస్వామి దేవునికి అంకితమిచ్చెను. ఈతని స్వంత పెరు నారణప్ప. ఈ భారతమునకు గదుగిన భారత అని పేరు ఉంది. ఇతడు మొదతి 10 పర్వములను వ్రాసెను. పిమ్మట శ్రీ కృష్ణదేవరాయలు కాలమున తిమ్మణకవి మిగిలిన 8 పర్వములను వ్రాసెను. కాని కుమారస్వామి భారతమునకు గల వ్యాప్తి దీనికి లేదు.

బ్రాహ్మణమతసంబందులైన కవులును గ్రంథములును చాలా తక్కువ.చరిత్రాత్మక కథాగ్రంధములు కాని మిశ్రమ కథారూపములు కాని ఆంధ్రవాజ్మయమువలె కర్ణాటక వాజ్మయమున ఈకాలమున కానిపించవు. అనంతరము బ్రాహ్మణ ధర్మమునకు సంబంధించిన వైదిక దహ్ర్మములను ప్రతిపాందించునట్టి కొన్ని సంస్కృత గ్రంథములు భాషాంతరీకరింపబడుటచే ఈకొరత దీరెను. నిత్యాత్మకశుక యోగి భాగవతమును అనువదించెను.లక్ష్మీశుడు జైమిని భారతమును వార్ధక షట్పదిలో రచించెను. ఈతని రచన మనోహరమైనది.

సుమారు సా.శ.1557 ప్రాంతమున గ్రంథ రచన కావించిన రత్నాకరవర్ని పేర్కొనదగినవాడు.ఈతని గ్రంథములలో భారతదేశ వైభవము ప్రసిద్ధి చెందినది.ఇదియొక జైనతీర్ధంకర చరిత్రను కావ్యము. నవరస భరితమై తత్వజ్ఞానభూయిష్ఠమై యొప్పించింది.

16వ శతాబ్దము వేళకు కన్నడనాడున కొందరు హరిదాసు లుద్భవించి పాటలధోరణిలో రచనలను ప్రారంభించిరి.వీరు విష్ణుని గూర్చి రచించెరి.వీరిలో పురంధరదాసు కనకదాసు విఅజయదాసులు ముఖ్యులు. ఈదాసులు ప్రజలకు వైరాగ్యమును బొధించి వారిని సన్యాసులుగా జేసిరని ఒక ఉపవాదము ఉంది.కాని అది సరికాదు.వీరు ఇహజీవనమును తిరస్కరించలేదు. కాని చార్వాకసిద్ధాంతమువలె ఇహలోకజీవనమే పరమావధిగా చెడిపోకూడదని బోధించిరి.

చిక్కదేవరాయని కాలము (1673-1704)

[మార్చు]

విజయనగర సామ్రాజ్యము నాశనమైన పిమ్మట కన్నడనాడునందు చిన్నచిన్న పాళెగాళ్ళ రాజ్యములు స్థాపితమగుటతో సాహిత్యరచనయు కుంటుపడెను.అనంతరము మైసూరు రాజుల కాలమున నిది మరల తలయెత్తసాగెను. వైష్ణవమత ప్రాబల్యముకూడ సాహిత్యాభివృద్ధికి కారణమైనదని చెప్పవచ్చును.

చిక్కదేవరాయలు, శ్రీ కృష్ణదేవరాయలు వలె స్వయముగ కవియు, కవిపోషకుడును నై కన్నడ సాహిత్యాభివృధికి చేయూత నిచ్చెను. తిరుమలార్య, సింగరార్య, చిక్కుపాధ్యాయ అను కవులును హోన్నమ్మయును కవయిత్రియును ఈతని ఆశ్రయమున గ్రంథములను రచించెరి. చిక్కదేవరాయలు స్వయముగ జయదేవుడు గీతాగోవిందము అనుసరించి గీతాగోపాల మను చిక్కదేవరాయబిన్నపం అను గ్రంథమును వ్రాసెను. లక్ష్మీపతి అను నామాంతముగల చిక్కుపాధ్యాయ డనేక గ్తంధములను వ్రాసెను.

శ్రీ కృష్ణదేవరాయలు వలె నీ చిక్కదేవరాయలును వైష్ణవమతోద్ధరణకై గ్రంథములు వ్రాయించెను. ఈతనికాలముననే ప్రప్రథమముగా కన్నడభాషయందు నాటకరచన గావించబడెను.సింగనార్యుడనుకవి శ్రీ హర్షుని రత్నావళిననుసరించి మిత్రవిందా గోవిందా అను నాటకమును రచించెను.యక్ష గానం లను కూడా ఈ కాలముననె వాడుకలోనికి వచ్చెను. అప్పటినుండి యక్షగానములు కన్నద దేశమునందు వ్యాప్తిచెందెను.

సింగనార్యుని శిష్యురాలైన హొన్నమ్మ అను కవయిత్రి తొలుత చిక్కదేవరాయని అంతఃపురమున నూడిగయు సేయుచు కవనశక్తిని ప్రదర్సించుచుండెనట.రాజు ఆమె కళాశక్తిని గుర్తించి గ్రంథమును వ్రాయించెనట.అతని ప్రేరణపై హదిబదియధర్మ అను పుస్తకమును వ్రాసెను. ఇందులో ఈమె పతివ్రతా ధర్మములుగల సన్నివేశములను చక్కగా చిత్రించెనట.

ఆంధ్ర శబ్ద చింతామణిని నన్నయభట్టు సంస్కృత భాషలో రచయించినట్లు కన్నడవ్యాకరణమును భట్టాకళంకుడు అను కవి శబ్దానుశాసన అను పేరిట సంస్కృతభాషలో వ్రాసెను. ఈకాలముననే కన్నడనాడులో జనప్రియుడైన మహాలింగ రంగడు (రంగనాధుడు) అనుభావామృతము అను గ్రంథమును భామినీ షట్పదులలో వ్రాసెను.

ఈచిక్కదేవరాయుని దండనాధుడైన కళలె వీరరాజు కన్నడ ఆంధ్ర భాషలలో గ్ర్మధరచన గావించెను. కన్నడమున వైద్యసంహితాసారార్ణవ, వీరోరాజోక్తివిలాస అన్య్ వైద్యగ్రంధములను తెనుగున వచన భారతమును వ్రాసెను. వీరరాజపుత్రుడు నంజరాజుగూడ కన్నడమున తెనుగున గ్రంథములు వ్రాసెను.

1791 సం. న చంద్రకవి అనునొక తెలుగుకవి శ్రీ ముమ్మడి కృష్ణరాజేంద్ర ఒడయరు పోషణమున శ్రీకృష్ణభూపాలీయము అను వ్యాకరణ గ్ర్రంధమును పద్యరూపమున వ్రాసెను. ఇది నన్నయ ఆంధ్రశబ్దచింతామణికి అనువాదము. దీనిని శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారి పీఠికతో మైసూరు ప్రభుత్వము వారు ప్రకటించియున్నారు.

శ్రీ చామరాజ ఒడయర్ కాలమున అనేక సంస్కృత నాటకములు కన్నడమున భాషాంతరీకరింపబడెను. అభినవకాళిదాస బిరుదాంకితుడైన శ్రీబసవప్పశాస్త్రి గారు శాకుంతలం మొదలైన నాటకములను దమయంతీ స్వయంవర కావ్యమును రచించెను. ఈతనిని ఆంధ్రవాజ్మయమున కీ.శే. వేదం వేంకటరాయశాస్త్రి గారితో పోల్చవచ్చును.

ఆంధ్రదేశమున వేమన పద్యాలవలె కన్నడనాడున అతి బాహుళ్యముగా ప్రజాభిమానమును చూరగొన్న వైరాగ్యకవి సర్వజ్ఞడు.

20 వ శతాబ్దము

[మార్చు]

20 వ శతాబ్దమున ఆధునిక కన్నడరచన ప్రారంభమాయెను. ప్రాచీన సాహిత్యములందు సంస్కృతప్రభావమును చూచితిమేనీ నేటి కన్నడ సాహిత్యమున ఆంగ్ల ప్రభావమును పాశ్చాత్యపోకడలు చూడవచ్చును. జీవితచరిత్రలు, నవలలు, కథలు, ప్రహసనములు, భావగీతికలు మొదలైన వ్రాయుట అవలంబించిరి.ఆధునిక కవులలోను రచయితలలోను టి.పి కైలాసం, బి.యం.శ్రీకంఠయ్య, కె.వి.పుట్టప్ప, డి.వి.గుండప్ప, ముగళి, వి.సీతారమయ్య, శివరామకారాంత, దేవుడు నరసింహ శాస్త్రి, అ.న. కృష్ణరాయ, త.రా.సుబ్బరామ, కె.ఎస్.నిసార్ అహ్మద్, కె.వి.అయ్యర్ మొదలైనవారు పేర్కొనదగినివారు.

మూలములు

[మార్చు]
  • 1956 భారతి మాస పత్రిక -వ్యాసము కన్నడ సాహిత్య పరిచయము - వ్యాసకర్త- శ్రీ.కె.సుబ్బరామప్ప.