Jump to content

కన్నీరు (పుస్తకం)

వికీపీడియా నుండి
కన్నీరు
కృతికర్త: దేవులపల్లి కృష్ణశాస్త్రి
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రక్రియ: గేయ కవిత్వం
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్(ప్రస్తుత ముద్రణ)
విడుదల: 1923
పేజీలు: 17

కన్నీరు పుస్తకం ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన గేయ కవితల సంకలనం. ఈ గేయాలను 20వ శతాబ్ది తొలి అర్థభాగంలో తెలుగు నాట ప్రాచుర్యం పొందుతున్న బ్రహ్మసమాజంలో ప్రార్థనా గీతాలుగా పాడేవారు.

రచన నేపథ్యం

[మార్చు]

కన్నీరు గేయసంపుటి 1923లో తొలి ముద్రణ పొందింది. ఆనాటి ప్రతులు ఇప్పుడు అలభ్యం. 1923 నాటి ప్రతిలో మధ్య మధ్య పద్యాలతో, అందులో 20 కీర్తనలు కూడా ఉన్నాయి. ఇవి 1918, 1923 మధ్య వ్రాసినవి. కృష్ణశాస్త్రి సాహిత్యాన్ని విశాలాంధ్ర ప్రచురించేప్పుడు చివర కన్నీరు పేరిట ఉన్న గేయ సంపుటిలో 1924 - 1927 ప్రాంతాల్లో రాసిన నాలుగు పాటలు చేర్చారు.[1]

రచయిత గురించి

[మార్చు]

ప్రధాన వ్యాసం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
దేవులపల్లి కృష్ణశాస్త్రి (1897-1980) ప్రసిద్ధ తెలుగు కవి. తెలుగు భావ కవితా ఉద్యమంలో కృష్ణశాస్త్రి ఒక కీలకమైన కవి. తొలిదశలో భావకవిత్వానికి రూపుదిద్ది, తర్వాత వయసులో రేడియో లలితసంగీతానికి ఒరవడి పెట్టి, ఆపైన సినీగీతాలకు రూపురేకలు తీర్చిన విశిష్టకవి. ఆయన ప్రభావం భావకవులపై ఎంతగా పడిందంటే కవిత్వాన్నే కాక ఆయన ఆహార్యాన్ని కూడా అనుకరించేవారు యువకులు. భావకవిత్వాన్ని భుజానమోసి ఊరూరా కవితాగానంతో ప్రచారం చేసిన వ్యక్తి. అటువంటి మధురగళం ఆయన తుదివయస్సులో మూగబోవడం గొప్ప విషాదం. గొంతు పోయినా చివరిదశ వరకూ తాను కవిత్వం రాస్తూనే గడిపారు.

కవితా వస్తువు

[మార్చు]

కన్నీరు సంపుటిలోని కవితా వస్తువులు ప్రధానంగా ఈశ్వరుని గురించినవి. బ్రహ్మసమాజంలోని పలు ఉత్సవాలు, ప్రార్థనల్లో ఈ గీతాలను ఉపయోగించేవారు. ఈశ్వరుని కోరుతూ, ఈశ్వరుని ఎడబాటుకు విలపిస్తూ, ఆహ్వానిస్తూ వివిధ వస్తువులతో ఈ గీతాలను రచించారు. రండు మన జీవితముల కోరుచున్నది గీతం బ్రహ్మసమాజం గురించిన ప్రచార గీతమల్లే ఉంటుంది.[2]

ప్రాచుర్యం

[మార్చు]

జయము జ్ఞానప్రభాకరా గీతాన్ని బ్రహ్మసామజ ఉపాసనలో మంగళ హారతిగా ఉపయోగించేవారు. రండు మన జీవితముల కోరుచున్నది మన బ్రాహ్మధర్మము గీతాన్ని ప్రచార గీతంగా వినియోగించేవారు. బ్రహ్మసమాజ సాహిత్యానికి అతి ముఖ్యమైన 1915-25 కాలంలో కృష్ణశాస్త్రి గీతాలు చాలా ముఖ్యభూమిక పోషించాయి. బ్రహ్మసమాజ ఉత్సవాలలో, ప్రార్థనలలో, వివిధ సమావేశాలలో, ఇళ్లలో ఉపాసన కార్యక్రమాలలో అన్నిటా కృష్ణశాస్త్రి గీతాలు వినిపించాయి.[3]

మూలాలు

[మార్చు]
  1. కృష్ణశాస్త్రి సాహిత్యం - 4:కృష్ణశాస్త్రి:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురణకు సంపాదకుని నోట్
  2. కృష్ణశాస్త్రి సాహిత్యం - 4:కృష్ణశాస్త్రి:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ:పేజీలు. 19 -35
  3. ఆ రోజుల గురించి చలం:చలం:ధర్మసాధని:15.5.1974