Jump to content

కర్ర బిళ్ళ

వికీపీడియా నుండి

కర్ర బిళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ఆడే ఒక గ్రామీణ క్రీడ. కొన్ని రాయలసీమ ప్రాంతాలలో దీనినే కోడి బిళ్ళ, బిళ్ళంగోడు, జిల్లాకోడి అని కూడా అంటారు. [1]

పొడవాటి కర్రను కోడి అనీ, పొట్టి కర్రను బిళ్ళ అని అంటారు. ఆటలోని సభ్యులు ముందుగా రెండు జట్లుగా విడిపోతారు. ముందుగా రెండు జట్లు ఒక స్కోరు మీద ఒప్పందం చేసుకుంటారు. ఈ స్కోరును ఎవరైతే ముందుగా చేరుకోగలరో ఆ జట్టు గెలిచినట్లు లెక్క. ఎవరు ముందుగా ప్రారంభించాలనేది బొమ్మా బొరుసు వేసి తేలుస్తారు. బిళ్ళను నేలలో తవ్విన ఒక చిన్న గుంత (దీన్నే ఊశి అంటారు) మీద పెట్టి అవతలి జట్టు నిలబడి ఉన్న వైపుకు బలంగా కోడితో రువ్వుతారు (చివ్వడం అని కూడా అంటారు). మధ్యలో ఎవరైనా బిళ్ళను గాలిలోనే పట్టుకోగలిగితే ఆ రువ్విన సభ్యుడు అవుటైనట్టు లెక్క. అలా పట్టుకోలేక పోతే కోడిని ఊశి మీద పెట్టి బిళ్ళ ఎంత దూరంలో పడిందో అంత దూరం నుంచి విసురుతారు. ఒక వేళ విసిరిన బిళ్ళ కోడికి తగిలినా అవుటయినట్లే లెక్క. అలా జరగక పోతే చివ్విన ఆట గాడు బిళ్ళను గాలిలోకి ఎగుర వేసి కింద పడకుండా ఎంత ఎక్కువైతే అన్నిసార్లు కొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఇలా కొట్టిన సంఖ్యను బట్టి స్కోరు యొక్క స్కేలింగ్ ఫ్యాక్టర్ ఆధార పడి ఉంటుంది. తరువాత నేల మీద పడి ఉన్న బిళ్ళను ఒకవైపు తట్టి, అది గాలిలోకి లేచిన తరువాత దూరంగా పంపించడానికి ప్రయత్నిస్తాడు. ఒక ఆట గాడికి ఈ విధంగా మూడు అవకాశాలు ఉంటాయి. ఈ మూడు సార్లు కొట్టిన తరువాత బిళ్ళ ఊశి నుంచి ఎంత దూరంలో పడుతుందో దాన్ని కొట్టిన ఆటగాడు అంచనా వేసి చెప్పాలి. ఒక వేళ ఈ ఆంచనా తప్పైనా ఆ ఆటగాడు అవుటయినట్లే లెక్క. స్కేలింగ్ ఫ్యాక్టర్ ఒకటి అయితే దూరాన్ని కోడితో కొలుస్తారు. రెండు అయితే బిళ్ళతో ,మూడు అయితే సగంబిళ్ళతో, నాలుగు అయితే అగ్గిపుల్లతో, అయిదు అయితే పిన్నీసుతో, ఇలా కొలుస్తారు. ఒక జట్టులోని ఆటగాళ్ళంతా అవుటయిన తరువాత మరొక జట్టు ఆడుతుంది.

"కోటికి లాగితే బిళ్లకు, బిళ్ళకు లాగితే కోటికి" అనే సామెత ఈ ఆట నుండి పుట్టింది. [1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 పాపిరెడ్డి, నరసింహారెడ్డి (1983). తెలుగు సామెతలు - జన జీవితం. తిరుపతి: శ్రీనివాస మురళి పబ్లికేషన్స్. pp. 275, 276.