Jump to content

కలకత్తా బ్లాక్ హోల్

అక్షాంశ రేఖాంశాలు: 22°34′24″N 88°20′53″E / 22.573357°N 88.347979°E / 22.573357; 88.347979
వికీపీడియా నుండి
ది బ్లాక్ హోల్ ఆఫ్ కలకత్తా (1756 జూన్ 20) హచిన్‌సన్ రాసిన స్టోరీ ఆఫ్ ది నేషన్స్ నుండి

కలకత్తా బ్లాక్ హోల్ అనేది కలకత్తాలో ఫోర్ట్ విలియం లోని ఒక చిన్న చెరసాల గది. దీని కొలతలు 14 by 18 అడుగులు (4.3 మీ. × 5.5 మీ.). బెంగాల్ నవాబైన సిరాజ్-ఉద్-దౌలా సైనికులు, 1756 జూన్ 20 రాత్రి అనేక మంది బ్రిటిషు యుద్ధ ఖైదీలను ఈ చిన్న గదిలో కుక్కారు.[1][2] : 58 తెల్లవారేసరికి అ ఖైదీలలో చాలా మంది మరణించారు. ఆ బ్రిటిషు ఖైదీలలో ఒకడు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి అయిన జాన్ జెఫానియా హోల్వెల్.. ఆ గదిలో ఊపిరి ఆడకపోవటం, వేడి, అలసట కారణంగా అక్కడ ఖైదు చేయబడిన 146 మంది యుద్ధ ఖైదీలలో 123 మంది మరణించారని హాల్వెల్ చెప్పాడు.

కొంతమంది ఆధునిక చరిత్రకారులు 64 మంది ఖైదీలను ఆ గదిలో బంధించారని, వారిలో 43 మంది మరణించారని భావిస్తున్నారు.[3] మరి కొంతమంది చరిత్రకారులు ఈ సంఖ్యను ఇంకా తక్కువ ఉంటుందన్నారు. దాదాపు 18 మంది మరణించి ఉంటారని చెబుతూ, హోల్వెల్ కథనం లోని నిజాలను సందేహించారు.[4][5]

నేపథ్యం

[మార్చు]
Fort William is located in Kolkata
Fort William ఫోర్ట్ విలియం

22°34′24″N 88°20′53″E / 22.573357°N 88.347979°E / 22.573357; 88.347979

బెంగాల్ ప్రెసిడెన్సీలో ప్రధాన నగరమైన కలకత్తాలో ఈస్టిండియా కంపెనీ వ్యాపారాన్ని రక్షించడానికి ఫోర్ట్ విలియంను స్థాపించారు. 1756లో భారతదేశంలో, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ దళాలతో యుద్ధం జరిగే అవకాశం ఉంది కాబట్టి బ్రిటిషు వారు కోటను బలోపేతం చేశారు. కోట నిర్మాణాలను ఆపమని సిరాజ్ ఉద్-దౌలా, ఫ్రెంచి, బ్రిటిషు వాళ్ళను ఆదేశించాడు. ఫ్రెంచ్ వారు దానికి కట్టుబడగా, బ్రిటిషు వారు లెక్కజేయలేదు.

తన ఆదేశాలను పట్టించుకోనందున సిరాజ్ ఉద్-దౌలా తన సైన్యంతో ఫోర్ట్ విలియంను ముట్టడించాడు. యుద్ధం నుండి బయటపడే ప్రయత్నంలో బ్రిటిషు కమాండర్, ప్రాణాలతో బయటపడిన సైనికులను కోట నుండి తప్పించుకోవాలని ఆదేశించాడు. అయితే, ఒకప్పుడు మిలిటరీ సర్జన్‌గా ఉన్న ఈస్టిండియా కంపెనీ సీనియర్ బ్యూరోక్రాట్ జాన్ జెఫానియా హోల్వెల్ పౌర కమాండు కింద 146 మంది సైనికులను కోట లోనే విడిచిపెట్టాడు.[6]

భారతీయ సిపాయిలు పారిపోయిన కారణంగా ఫోర్ట్ విలియంలో బ్రిటిషు రక్షణ ఏర్పాట్లు సరిపడినంతగా లేవు. 1756 జూన్ 20 న బెంగాలీ దళాల ముట్టడిలో అది లొంగిపోయింది. యుద్ధ ఖైదీలుగా చిక్కిన సైనికుల సంఖ్య 64 - 69 మధ్య ఉంది. వీరితో పాటుగా తెలియని సంఖ్యలో ఆంగ్లో-ఇండియన్ సైనికులు, పౌరులు ఫోర్ట్ విలియమ్‌లో ఆశ్రయం పొందారు. బ్రిటిషు అధికారులు, వ్యాపారులను సిరాజ్ ఉద్-దౌలా దళాలు చుట్టుముట్టి, వారిని "బ్లాక్ హోల్" అని పిలువబడే చెరసాలలోకి బలవంతంగా నెట్టారు.

హోల్వెల్ కథనం

[మార్చు]
కలకత్తాలో చుట్టూ కంచెతో, బ్లాక్ హోల్ (1908)

ఫోర్ట్ విలియం పతనం తర్వాత జరిగిన సంఘటనల గురించి హోల్వెల్ రాశాడు. అతను సిరాజ్-ఉద్-దౌలాతో

బ్లాక్ హోల్ మెమోరియల్, సెయింట్ జాన్స్ చర్చి, కలకత్తా, భారతదేశం .

సమావేశమయ్యాడు. సిరాజ్ అతనికి ఇలా హామీ ఇచ్చాడు: "సైనికుడి మాట; మీకు ఎటువంటి హాని జరగదు". ఖైదీలను (హోల్‌వెల్‌తో సహా) నిర్బంధించడానికి కోటలో తగిన స్థలం ఎక్కడుందో అడిగి తెలుసుకున్న తర్వాత, రాత్రి 8:00 గంటలకు, జైలర్లు ఖైదీల బట్టలు విప్పి, జైలుగదిలో బంధించారు. సైనికుల భాషలో అదొక "బ్లాక్ హోల్"-ఒక చిన్న గది. అది 14 by 18 అడుగులు (4.3 మీ. × 5.5 మీ.) కొలతలున్న గది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు బ్లాక్ హోల్ తెరిచినప్పుడు, కేవలం 23 మంది ఖైదీలు మాత్రమే బతికి ఉన్నారు.[6]

యుద్ధఖైదీలు, గాయపడ్డవారి సంఖ్య విషయంలో చరిత్రకారులు వివిధ రకాలుగా చెప్పారు. స్టాన్లీ వోల్పెర్ట్ అంచనా ప్రకారం, 64 మందిని ఖైదు చేయగా, 21 మంది ప్రాణాలతో బయటపడ్డారు.[6] DL ప్రియర్, ఊపిరాడక, షాక్ వలన చనిపోయినవారు కాకుండా, ఇతర కారణాల వల్ల 43 మంది తప్పిపోయినట్లు లేదా చనిపోయినట్లు అంచనా వేసాడు.[7] కోటను స్వాధీనం చేసుకున్నప్పుడు దానిలో అనేక మంది సైనికులు కానివారు కూడా ఉన్నందున, మరణించిన వ్యక్తుల ఖచ్చితమైన సంఖ్య చెప్పడం అసాధ్యమని బస్టీడ్ అన్నాడు. కలకత్తా బ్లాక్ హోల్‌లో జరిగిన దుశ్చర్య, మరణాలకు బాధ్యత గురించి హోల్వెల్ ఇలా అన్నాడు: "కోట ముట్టడి సమయంలో మరణించిన తమ సహచర సైనికుల పట్ల, అక్కడి జెమాదార్ల (సార్జెంట్లు) గుండెల్లో రగులుతున్న పగ ప్రతీకారాల ఫలితమే ఈ బ్లాక్ హోల్ మరణాలు."

హోల్‌వెల్‌తో ఏకీభవిస్తూ వోల్పెర్ట్, సిరాజ్-ఉద్-దౌలా జైలు శిక్షను ఆదేశించలేదని, అతనికి దాని గురించి తెలియజేయలేదనీ చెప్పాడు.[6] కలకత్తా బ్లాక్ హోల్ భౌతిక ఆకారం, హోల్వెల్ చెప్పినదానికి అనుగుణంగా ఉంటుంది:

చెరసాల తప్పించుకునే వీలు లేని గది. ఒకేసారి ఇద్దరు ముగ్గురి కంటే ఎక్కువ మందిని నిర్బంధించడానికి వీలు లేనిది. దానికి కేవలం రెండు కిటికీలు మాత్రమే ఉన్నాయి. బయట ఉన్న వరండా, కిటికీలో ఉన్న మందపాటి ఇనుప కడ్డీలు సరైన గాలీ వెలుతురూ రాకుండా అడ్డుకుంటున్నాయి. కోటలోని వివిధ ప్రాంతాలలో రేగుతున్న మంటల వలన పరిస్థితి మరింత అధ్వాన్నమైంది. ఖైదీలు ఎంతలా కుక్కబడి ఉన్నారంటే, ఆ గది తలుపు మూయడమే కష్టమైంది.

తమను ఒక పెద్ద గదికి తరలించడానికి, వరండాలో ఉన్న సైనికుల్లో ఒకరికి 1,000 రూపాయిలు ఇవ్వజూపారు. అతను వెళ్ళి, తిరిగి వచ్చి, అది సాధ్యం కాని పని అని చెప్పాడు. లంచాన్ని రెట్టింపు చేసారు. అతను మళ్ళీ వెళ్ళి వచ్చి, కుదరదని చెప్పాడు; నవాబు గారు నిద్రలో ఉన్నారు, అతన్ని లేపడానికి ఎవరూ సాహసించలేదు.

తొమ్మిది గంటల సమయానికి చాలా మంది చనిపోయారు, ఇంకా చాలా మందికి మతిభ్రమించింది. నీటి కోసం వెఱ్ఱిగా కేకలు వేయడం మామూలైపోయింది. కాపలాదారుల్లో ఒకరు, అతని సహచరుల కంటే ఎక్కువ దయగలవాడు, కిటికీ చువ్వల వద్దకు నీటిని తెచ్చాడు. అక్కడ హోల్వెల్, మరో ఇద్దరు ముగ్గురు ఆ నీటిని తమ టోపీల్లోకి తీసుకుని, వెనకున్న వారికి అందించారు. దానిని అందుకునేందుకు జరిగిన తొక్కిసలాటలో ఆ నీళ్ళన్నీ ఒలికిపోయాయి. వారు తాగిన కొద్దిపాటి నీళ్ళు వాళ్ళ దాహాన్ని పెంచాయి తప్ప తగ్గించలేదు. త్వరలోనే వాళ్ళు స్వీయ నియంత్రణ కోల్పోయారు; గదిలో కిటికీ నుండి దూరాన ఉన్నవాళ్ళు కిటికీ వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నించారు. భయంకరమైన గందరగోళం ఏర్పడింది. ఆ తొక్కిసలాటలో బలహీనులు నుజ్జై, మరణించారు. వారు విరుచుకుపడ్డారు, పోరాడారు, ప్రార్థించారు, దూషించారు, చాలా మంది అలసిపోయి నేలపై పడిపోయారు, ఊపిరాడక, తమ నరక యాతనకు ముగింపు పలికారు.

దాదాపు 11 గంటల సమయానికి ఖైదీలు వేగంగా మరణించడం ప్రారంభించారు. ఉదయం ఆరు గంటలకు, సిరాజ్-ఉద్-దౌలా మేలుకుని చెరసాల గది తలుపు తెరవమని ఆదేశించాడు. 146 మందిలో బ్రతికి ఉన్నది హోల్‌వెల్‌తో సహా 23 మంది మాత్రమే. (1758 లో ది యాన్యువల్ రిజిస్టర్, ది జెంటిల్‌మ్యాన్స్ మ్యాగజైన్లో ప్రచురించబడినది ఇతని కథనమే. ఆ కథనం పైననే ఈ కథనం కూడా ఆధారపడింది). స్వచ్ఛమైన గాలి తగిలి వాళ్ళు కాస్త తేరుకున్నారు. కమాండరును "నవాబ్" ముందుకు తీసుకువెళ్ళారు. జరిగిన దానికి అతనేమీ విచారం వ్యక్తం చేయలేదు. కూచోడానికి కుర్చీ ఇచ్చి, ఒక గ్లాసు మంచి నీళ్ళు ఇప్పించాడు. అంతే తప్ప సానుభూతి లాంటిదేమీ చూపలేదు. ఇంత జరిగినా, హోల్వెల్ తదితరులు, ఈ దుశ్చర్యకు అతను కారణం కాదని, అతను నిర్దోషి అనీ, కొంతమంది అధికారులే దానికి కారణమనీ చెప్పారు. కానీ చాలా మంది ఈ అభిప్రాయం నిరాధారమైనదని భావిస్తారు.

ఆ తర్వాత, ఫోర్ట్ విలియం జైలు గదిలో చనిపోయిన వ్యక్తుల శవాలను ఒక గుంటలో పడేశారు. హోల్వెల్‌ను, మరో ముగ్గురు వ్యక్తులను యుద్ధ ఖైదీలుగా ముర్షిదాబాద్‌కు బదిలీ చేసారు.

బ్రిటిషు ప్రతిచర్య

[మార్చు]

కలకత్తా బ్లాక్ హోల్‌లో మిగిలి ఉన్నవారు మరుసటి రోజు ఉదయం నవాబ్ ఆదేశాల మేరకు విముక్తి కలిగించారు. వారి బాధల గురించి అతనికి వారు ఆ ఉదయం మాత్రమే తెలిసింది. [2] : 71 1756 ఆగస్టులో కలకత్తా స్వాధీనం వార్తను మద్రాసులో బ్రిటిషు వారు అందుకున్న తర్వాత, నవాబుపై ప్రతీకారం తీర్చుకోవడానికి లెఫ్టినెంట్ కల్నల్ రాబర్ట్ క్లైవ్‌ను పంపారు. తన దళాలు, స్థానిక భారతీయ మిత్రులతో కలిసి క్లైవ్, 1757 జనవరిలో కలకత్తాను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ప్లాసీ యుద్ధంలో సిరాజ్ ఉద్-దౌలాను ఓడించి, అతన్ని బెంగాల్ నవాబుగా తొలగించి, ఉరితీసారు.[6]

బాధితుల స్మారక చిహ్నం

[మార్చు]
హోల్వెల్ మాన్యుమెంట్, c. 1905
శాసనం డేటింగ్ పునఃస్థాపన

చనిపోయినవారి జ్ఞాపకార్థం, బ్రిటిషు వారు 15-మీటర్ల (50') ఎత్తైన స్థూపాన్ని నిర్మించారు; అది ఇప్పుడు కలకత్తాలోని (ఆంగ్లికన్) సెయింట్ జాన్స్ చర్చి స్మశాన వాటికలో ఉంది. బాధితుల స్మారకార్థం 'బ్లాక్ హోల్' ఉన్న ప్రదేశంలో హోల్‌వెల్ ఒక టాబ్లెట్‌ను ఏర్పాటు చేశాడు. కానీ, ఏదో ఒక సమయంలో (ఖచ్చితమైన తేదీ అనిశ్చితంగా ఉంది), అది అదృశ్యమైంది. లార్డ్ కర్జన్, 1899లో వైస్రాయ్ అయ్యాక, ఆ ప్రదేశాన్ని గుర్తించడానికి ఏమీ లేదని గమనించి, హోల్వెల్ పూర్వ ఉనికిని ప్రస్తావిస్తూ కొత్త స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశాడు; ఇది 1901లో డల్హౌసీ స్క్వేర్ (ప్రస్తుతం BBD బాగ్ ) మూలలో నిర్మించబడింది. ఇదే 'బ్లాక్ హోల్' ఉన్న స్థానంగా చెప్పారు.: 52–6 భారత స్వాతంత్ర్య ఉద్యమం ఉచ్ఛస్థితిలో ఉండగా, కలకత్తాలో ఈ స్మారక చిహ్నం ఉనికిని జాతీయవాదానికి వ్యతిరేకంగా భావించారు. సుభాష్ చంద్రబోస్‌తో సహా జాతీయవాద నాయకులు దాని తొలగింపు కోసం శక్తివంతంగా లాబీయింగ్ చేసారు. స్మారక నిర్మాణ వ్యతిరేక ఉద్యమంలో కాంగ్రెస్, ముస్లిం లీగ్ లు కలిసిపోయాయి. ఫలితంగా, ఆనాటి విద్యార్థి నాయకుడు నవాబ్‌గంజ్ థానాకు చెందిన అబ్దుల్ వాసెక్ మియా 1940 జూలైలో డల్హౌసీ స్క్వేర్ నుండి స్మారక చిహ్నాన్ని తొలగించడానికి నాయకత్వం వహించాడు. కలకత్తాలోని సెయింట్ జాన్స్ చర్చి స్మశాన వాటికలో ఆ స్మారక చిహ్నాన్ని తిరిగి నిర్మించారు.

'బ్లాక్ హోల్' అనేది పాత ఫోర్ట్ విలియమ్‌లో కేవలం గార్డ్‌రూమ్‌గా ఉండేది. ఈ సంఘటన జరిగిన కొద్దికాలానికే ఆ కోటను పడవేసి దాని స్థానంలో కొత్త కోటను నిర్మించారు. కొత్త ఫోర్ట్ విలియం బిబిడి బాగ్‌కు దక్షిణంగా ఉన్న మైదాన్‌లో ఇప్పటికీ ఉంది. ఆ గార్డ్‌రూమ్ ఖచ్చితమైన స్థానం BBD బాగ్‌కు వాయవ్య మూలలో, ఉత్తరాన జనరల్ పోస్ట్ ఆఫీస్, ప్రక్కనే ఉన్న భవనం మధ్య ఉన్న సందులో ఉంది. GPO పక్కన ఉన్న ఆ భవనం గోడపై ఒకప్పుడు ఉన్న మెమోరియల్ టాబ్లెట్ ఇప్పుడు సమీపంలోని పోస్టల్ మ్యూజియంలో ఉంది. దానిపై ఇలా ఉంది:

"బ్లాక్ హోల్ జైలులో డచ్చి, బ్రిటిషు సార్జెంట్లు, కార్పోరల్‌లు, సైనికులు, టోపాజ్‌లు, మిలీషియా, శ్వేతజాతీయులు, పోర్చుగీసు వారితో కూడిన అరవై-తొమ్మిది మందితో (వారి పేర్లు నాకు తెలియదు) పాటు మొత్తం నూట ఇరవై మూడు మంది బ్లాక్ హోల్ జైలులో ఉక్కిరిబిక్కిరయ్యారు "

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Gupta, Brejen K. (1962). Siraj-ud-daullah and the East India Company, 1756–1757. Leiden: E. J. Brill. p. 76.
  2. Cummins, Joseph (2013). The World's Bloodiest History: Massacre, Genocide, and the Scars They Left on Civilization. New York: Crestline. pp. 56–73. ISBN 9781616734633. Retrieved 12 April 2020.
  3. Dalrymple, William; Fraser, Olivia (10 September 2019). The anarchy: the relentless rise of the East India Company. New York. ISBN 978-1-63557-395-4. OCLC 1076511649.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  4. Gupta, Brijen K. (1966). Sirajuddaullah and The East India Company, 1756–1757: Background to the Foundation of British Power in India. Leiden, Netherlands: E. J. Brill. pp. 70–80.
  5. Dirks, Nicholas B. (2008). The Scandal of Empire – India and the Creation of Imperial Britain. Cambridge, Massachusetts: The Belknap Press of Harvard University Press. pp. 3–4. ISBN 978-0-674-02724-4.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 Wolpert, Stanley (2009). A New History of India (8th ed.). New York: Oxford University Press. p. 185. ISBN 978-0-19-533756-3.
  7. D. L. Prior, Holwell's biographer in the Oxford Dictionary of National Biography, estimated figures of 64 prisoners and 21 survivors.