కాకర్ల కొండలరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాకర్ల కొండలరావు ప్రసిద్ధుడైన శతావధాని, రచయిత, ఆశుకవి. ఇతడు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారికి చూపు సన్నగిల్లినప్పుడు ఆయనకు లేఖకుడుగా పనిచేశాడు.

విశేషాలు[మార్చు]

ఇతడు 1907వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురంలో జన్మించాడు. స్వయంకృషితో సంస్కృతాంధ్రాలలోని కావ్యాలు, నాటకాలు అధ్యయనం చేశాడు. ఇతను 200లకు పైగా అష్టావధానాలు, శతావధానాలు చేశాడు. కాని 1930లో చేసిన ఏలూరు శతావధానము, 1936లో చేసిన సంపూర్ణ శతావధానము మాత్రమే రికార్డు అయ్యాయి.[1] అతను రాసిన "ప్రసన్న రాఘవము" వారికి స్వర్ణకంకణమిచ్చినది. అతని ప్రతిభ వారి నాటక రచనముతో నలుదిక్కుల వ్యాపించెను. [2]

అవధానాలలో పూరణలు[మార్చు]

  • సమస్య: మరణముఁ గోర వచ్చినది మానిని నీ వెటు లాదరింతువో

పూరణ:

సరసుడ వంచు సూనశరశాస్త్రవరిష్ఠుడవంచు పండితా
భరణుఁడ వంచు సన్మధుర వాక్చతురత్వయుతుండవంచు భా
సుర నవయౌవన స్ఫురిత సుందరగాత్రుడవం చెఱింగి కా
మ రణముఁ గోర వచ్చినది మానిని నీ వెటు లాదరింతువో

  • సమస్య: తల చేతులలోననుండు దలప జగంబుల్

పూరణ:

కలస్థావర జంగమ జం
తులఁబుట్టింపంగఁ బెంప ద్రుంపంగ సమ
ర్థులగుట ముగురమ్మల నే
తల చేతులలోననుండు దలప జగంబుల్

  • సమస్య: పాలను దునియలుగజేసె బటు భల్లమునన్

పూరణ:

చాలగద్రావి యొకండమి
మిత్రాళి వధింపంగ నేగి యా సదనముల
న్వ్రేలెడు ఛాయాపటరూ
పాలను దునియలుగజేసె బటు భల్లమునన్

  • దత్తపది: హర్షము - కర్షక - శీర్షము - వర్ష అనే పదాలతో ఋతువర్ణన.

పూరణ:

హర్షముతోడ బర్హి నిచయంబులు నాట్యములం బొనర్పగా
గర్షక బృందముల్ గెరలి క్రన్నన నాగలులం గ్రహింపగా
శీర్షములెత్తి యధ్వగుల చేడెలు మేఘునిగాంచి పొంగగా
వర్ష ఘటిల్లి మేదినికిఁబందువుఁగూర్చె నికేమి చెప్పుదున్

  • వర్ణన: శతావధానము వలన ప్రయోజనములు

పూరణ:

విద్యాతత్వము గొంతయైన దెలియున్ బెంపౌ ముదంబబ్బు వి
ద్వద్యోధ ప్రజ శక్తియిట్టిదని సంభావింప నొప్పున సమ
గ్రోద్యోగంబు కళావిబోధ కొఱకై యొప్పారు గేళీరమాం
చద్యోగంబు శతావధానకలనన్ సంధిల్లు శ్రోతాళికిన్

రచనలు[మార్చు]

ఇతడు ఈ క్రింది సంస్కృత రచనలను ఆంధ్రీకరించాడు.

  1. తపతీసంవరణము[3] (ఆరు అంకాల నాటకము)
  2. ప్రసన్నరాఘవము
  3. అభిజ్ఞాన శాకుంతలము
  4. బ్రహ్మవైవర్తమహాపురాణము
  5. విక్రమోర్వశీయము[4]

మూలాలు[మార్చు]

  1. రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాద్: రాపాక రుక్మిణి. pp. 247–251. Retrieved 14 August 2016.
  2. Kakarla Kondala Rao. Vikramorvaseeyamu.
  3. కాకర్ల, కొండలరావు (1923). తపతీ సంవరణము (రెండవ ed.). బెజవాడ: మారుతీరాం అండ్ కో. pp. 1–95. Retrieved 14 August 2016.
  4. Kakarla Kondala Rao. Vikramorvaseeyamu.