Jump to content

కారుమంచి రామమూర్తి

వికీపీడియా నుండి

కారుమంచి రామమూర్తి ఏలూరుకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. 1921న గాంధీజీ ఏలూరులో సభ నిర్వహించినప్పుడు తన తల్లిదండ్రులతో సభలో పాల్గొని అప్పట్నుంచీ జాతీయోధ్యమంలో చేరారు రామమూర్తి. సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన, మద్యపాన నిషేధానికి ప్రయత్నిస్తూ తాగుబోతుల చేతిలో దెబ్బలు కూడా తిన్నారు. అయినా ఆయన తన సంకల్పాన్ని మార్చుకోక పట్టుదలతో ముందుకెళ్ళడం విశేషం.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1930 అక్టోబరు 2న పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో కారుమంచి రత్తయ్య, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు రామమూర్తి. తొమ్మిదవ తరగతి వరకు చదువుకున్నారు ఆయన. ఆయన వ్యాపారం చేసేవారు. ఆయన 18వ ఏట ఏలూరుకు మహాత్మాగాంధీ వచ్చినప్పుడు తన తల్లిదండ్రులతో కలసి ఆయన సభకు హాజరయ్యారు రామమూర్తి. గాంధీ మార్గం, మాటలు ఆయనను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో జాతీయోద్యమంలో కృషి చేయాలనే నిర్ణయానికి వచ్చారు రామమూర్తి.[1] సత్యాగ్రహంలో భాగంగా అరెస్టై అనారోగ్యం పాలైనా, మద్యపాన నిషేధ ఉద్యమంలో తాగుబోతుల చేతిలో దెబ్బలు తిన్నా, సైమన్ గోబ్యాక్ ఉద్యమంలో మూర్చపోయేలా పోలీసుల లాఠీఛార్జీలో గాయపడినా, రెండు సార్లు సంవత్సరం పాటు కఠిన కారాగార శిక్ష అనుభవించినా, రాజద్రోహిగా ముద్రవేసి ప్రభుత్వం ఆయన నడిపే సోడా, ఫ్యాన్సీ షాపులను ధ్వంసం చేయడంతో అనేక ఆర్థిక సమస్యలు అనుభవించినా ఏ మాత్రం వెరవలేదు రామమూర్తి. ఆయన తన జీవితకాలంలో దాదాపు 4ఏళ్ళ 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు.

స్వాతంత్ర్యోద్యమంలో కృషి

[మార్చు]

1923లో నాగపూర్ జెండా సత్యాగ్రహంలో 80మందిని అరెస్టు చేయడంతో అప్పటి ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు టంగుటూరు ప్రకాశం పంతులు పిలుపుతో జిల్లాకు చెందిన సత్తిరాజు రామమూర్తి, ఈడూరి సత్యనారాయణ, నిడమర్తి ఉమామహేశ్వరరావు తదితరులతో పాటు రామమూర్తి కూడా సత్యాగ్రహంలో పాల్గొనేందుకు నాగపూర్ బయలుదేరారు. రైళ్ళలోనే సత్యాగ్రహుల్ని అరెస్టు చేస్తున్న పోలీసుల్ని తప్పించుకుని నాగపూర్ లో సత్యాగ్రహంలో పాల్గొన్నారు ఆయన. అయితే అక్కడ పోలీసులు అరెస్టు చేయగా, సంవత్సరం జైలు శిక్ష విధించింది కోర్టు. ఆరునెలల్లోనే విడుదల చేసినా, అనారోగ్యవంతమైన మినపపొట్టు పులుసు, ఉప్పులేని జొన్నెరొట్టెలు వంటి ఆహారం తినడంతో పూర్తి అనారోగ్యవంతులై ఏలూరు చేరారు రామమూర్తి.[1]

1928లో సైమన్ కమిషన్ లో సభ్యులుగా భారతీయులెవరూ లేనందున ఆ కమిషన్ ను వ్యతిరేకించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దాంతో సైమన్ గో బ్యాక్ ఉద్యమం ప్రారంభమైంది. ఏలూరులో జిల్లా కాంగ్రెస్ సభ నిర్వహించి, సైమన్ గో బ్యాక్ నినాదాలతో హర్తాళ్ నిర్వహిస్తుండగా పోలీసులు రామమూర్తిని మూర్ఛపోయేంతగా లాఠీఛార్జీ జరిపారు.

1930లో జిల్లాలోని మట్లపాలెం, తూర్పుతాళ్ళు వద్ద ఉప్పు తయారు చేసి ఉప్పుసత్యాగ్రహం నిర్వహించి శాసనోల్లంఘన చేశారు రామమూర్తి. ఖద్దరు వ్యాప్తి, మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాలను కూడా చేశారు ఆయన. ఉప్పు సత్యాగ్రహానికి వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వం రాజభక్తులు (ప్రభుత్వ ఉద్యోగులు) తో విస్తృత ప్రచారం మొదలుపెట్టారు. అందులో భాగంగానే మే 18న వంగాయిగూడెంలో రాజభక్తులు, క్రైస్తవ మిషనరీలు కలసి సభ నిర్వహించారు. రామమూర్తి, తాడేపల్లి అనంతశాస్త్రి, వెల్లంకి కృష్ణమూర్తి తదితరులు ఏలూరు నుండి వంగాయిగూడెం వెళ్ళి ఆ సభను భగ్నం చేశారు. వీరి దెబ్బతో 24తేదీన ఏలూరులో విదేశీ క్రైస్తవులతో కలసి రాజభక్తులు నిర్వహించాలనుకున్న ర్యాలీని రద్దు చేసుకున్నారు వారు.

మే 26న ఏలూరు కొత్తపేటలో నిర్వహించిన మద్యపాన నిషేధ సభలో కొమ్మారెడ్డి ఆంజనేయులు అధ్యక్షతన, ఇటికల సూర్యనారాయణ, మంగళంపల్లి చంద్రశేఖర్ లతో పాటు కారుమంచి వక్తగా పాల్గొన్నారు. మద్యపానం గురించి వ్యతిరేకంగా ఉపన్యసించిన ఆయనపై రాజద్రోహం అభియోగం పెట్టి 108 సెక్షను కింద అరెస్టు చేశారు. జూన్ 17న అరెస్టు చేసిన ఆయనకు ఏలూరు సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ మహ్మద్ అజింతుల్లా ఖాన్ సాబ్ 1 సంవత్సరం పాటు కారాగార శిక్ష విధించారు. శిక్షలో భాగంగా రాజమండ్రి, తిరిచ్చురాపల్లి, అల్లిపురం, కడలూరు జైళ్ళలో శిక్ష అనుభవించారు రామమూర్తి.

1932లో తిరిగి ప్రారంభమైన శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో తన షాపు వద్ద రాజద్రోహ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనను పోలీసులు అరెస్టు చేసి, 9 నెలల కఠిన కారాగార శిక్ష వేశారు. దుకాణాల మూసివేత, రామమూర్తి అరెస్టుతో ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తరువాత 1941లో వ్యక్తి సత్యాగ్రహంలో భాగంగా ఆయనను ఏలూరులో మళ్ళీ అరెస్టు చేసి, 6 నెలల కఠిన కారాగార శిక్ష విధించారు.

క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరెస్టైన రామమూర్తిని ఆగస్టు 15న 56సెక్షను కింద ఆరోపిస్తూ సబ్ మెజిస్ట్రేట్ ఆర్.సూర్యనారాయణ విచారణ జరిపి, శిక్ష నిర్ధారణ కోసం జిల్లా మెజిస్ట్రేటు కె.పాపరాజు దగ్గరకు పంపారు. ఆయన 1942 ఆగస్టు 22 నుంచి రామమూర్తికి సంవత్సరం పాటు కఠినకారాగార శిక్ష వేశారు. ఈ శిక్షలో భాగంగా బళ్ళారి క్యాంపు జైలుకు ఆయనను పంపారు. శిక్షాకాలం పూర్తయిన తరువాత కూడా రామమూర్తిని 1944 మార్చి 13వరకూ డిటెన్యూగా నిర్బంధించారు. ఈ సమయంలో ఆయన వెల్లూరు, తంజావూరు జైళ్లలో శిక్షను అనుభవించారు ఆయన.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 గాదం, గోపాలస్వామి (2016-08-01). భారత స్వాతంత్ర్యోద్యమంలో పశ్చిమగోదావరి జిల్లా యోధులు. అత్తిలి: శ్రీ సత్య పబ్లికేషన్స్.