Jump to content

కార్తీక అమావాస్య

వికీపీడియా నుండి
పితృ పక్షంలో పూర్వీకుల పూజలు

కార్తీక మాసములో కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను కార్తీక బహుళ అమావాస్య అంటారు. ఇది ఈ మాసంలో 30వ రోజు.

హిందూమతంలో పూర్వీకులను స్మరించుకోవడానికి, వారిని పూజించడానికి కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, పితృదోషంతో బాధపడుతున్న వారు ఈ రోజున వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అమావాస్య రోజున బ్రహ్మముహూర్తంలో చేసిన పూజ, దానాలు, నది స్నానాలు అనేక రెట్లు పుణ్యఫలితాలను ఇస్తాయని భక్తులు నమ్ముతారు.[1]

కార్తీక అమావాస్య పూజా విధానం - ఇలా చేసుకుంటే శుభ ఫలితాలు

1. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి.

2. వీలైతే నది స్నానం చేయడం ఉత్తమం.

3.రాగి పాత్రలో నీళ్లు, కొద్దిగా పాలు, సింధూరం, ఎర్ర పూలు వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి.

4.శివ-కేశవులను స్మరిస్తూ పుష్పాలు, పసుపు, కుంకుమ, చందనం, అక్షింతలు సమర్పించాలి.

5.నైవేద్యం పెట్టి దీపారాధన చేయాలి.

కార్తీక అమావాస్య నాడు తప్పక జపించాల్సిన శక్తివంతమైన మంత్రం. -- "ఓం పితృదేవతాయ నమః"

ఈ మంత్రాన్ని పవిత్రతతో, భక్తితో జపిస్తే పూర్వికుల ఆశీస్సులు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. [2]

తర్పణాలు

[మార్చు]

పూజ తర్వాత, అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణం వదలాలి. గంగాజలాన్ని వినియోగించడం అత్యంత శ్రేష్టం. అది సాధ్యం కాని వాళ్లు నీరు, నల్ల నువ్వులు, పచ్చి పాలను రాగి లేదా ఇత్తడి పాత్రలో కలిపి శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. దక్షిణం వైపు ముఖం చేసి కూర్చుని, చేతిలో నీరు తీసుకుని, సంకల్పం చెప్పుకుని, మీ పూర్వీకులను స్మరిస్తూ నీటిని సమర్పించాలి. "ఓం పితృ దేవతాయై నమః" అనే మంత్రాన్ని జపించాలి. చివరగా, అవసరమైన వారికి ఆహారం లేదా ఆహార పదార్థాలను దానం చేయాలి.అలాగే, సాయంత్రం తులసికోట దగ్గర పిండి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయని, పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు. [3]

అయితే మొదటి రోజు వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమి అంటారు. ఈ రోజునే పోలి స్వర్గం అని ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీకమాసంలో నియమాలు పాటించి నిత్యం స్నానం, దీపం నియమాలు పాటించిన వారు... పోలిస్వర్గం రోజు వేకువజామునే దీపాలు నీటిలో వదలడంతో వ్రతం పూర్తైందని భావిస్తారు.నెల రోజులు కార్తీక మాస నియమాలు అనుసరించిన వారికి పోలిస్వర్గం ముగింపు రోజు అయితే... నెలరోజులూ నియమాలు పాటించనివారు ఆ కార్తీక వ్రత ఫలితాన్ని పొందేందుకు పోలిస్వర్గం రోజు దీపాలు నదిలో విడిచిపెడతారు.

పోలి పాడ్యమి కథ

[మార్చు]

పూర్వకాలంలో ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్లుండేవారు. వారిలో చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు దైవభక్తి చాలా ఎక్కువ. కానీ ఆ భక్తే ఆమెకు శాపంగా మారింది. ఆ భక్తి చూసి అత్త ఓర్వలేకపోయింది. అందుకే నలుగురు కోడళ్లను ప్రేమగా చూసేది కానీ పోలిని బాధలు పెట్టేది. పూజలు చేయనిచ్చేది కాదు. కార్తీకమాసం రావడంతో నలుగురు కోడళ్లను తీసుకుని నిత్యం నదీ స్నానానికి వెళ్లి అక్కడ దీపాలు వెలిగించేది. చిన్న కోడలు నదికి రానీయకుండా ఇంట్లో పనులన్నీ ఆమెతో చేయించేది. నిరాశచెందని పోలి, అత్త, నలుగురు తోడికోడళ్లు వెళ్లిపోయిన వెంటనే స్నానమాచరించి ఇంటి దగ్గరే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించేది. ఇంటి పెరట్లో ఉన్న పత్తిని తీసి ఒత్తి చేసి, వెన్న రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికంటా పడకుండా బుట్ట బోర్లించేది. నెలరోజులూ క్రమం తప్పకుండా దీపం వెలిగించింది పోలి. ఆఖరి రోజైన మార్గశిర పాడ్యమి రోజు కూడా అంతా నదికి వెళ్లారు. వారు తిరిగి వచ్చేసరికి ఇంటి దగ్గర కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఆ రోజు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దీపం వెలిగించి కార్తీక దామోదరుడిని ప్రార్థించింది పోలి. వెంటనే స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవతలు పోలిని ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇది చూసి ఆశ్చర్యపోయిన అత్త, నలుగురు తోడికోడళ్లు, ఇదేంటి, నెల రోజులు తాము భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే పోలిని తీసుకెళుతున్నారని ఆశ్చర్యపోగా, దేవదూతలు పోలి చేసిన పూజల గురించి చెబుతారు. తాము కూడా పోలితో పాటూ స్వర్గానికి వెళ్లాలంటూ వాళ్ళు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పూజలు చేయడం కాదు, కల్మషం లేని భక్తితో పూజలు చేసినప్పుడే ఆ పూజలు ఫలిస్తాయని చెప్పారు దేవదూతలు.[4] అదే ఈ కథలో ఆంతర్యం.

కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే పోలి పాడ్యమి రోజు దేవుడి దగ్గర, తులసి మొక్క దగ్గర దీపం వెలిగించుకుని ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గ ప్రాప్తి లభిస్తుందని కార్తీక పురాణంలో ఉంది. నెల రోజులు నియమాలు పాటించని వారు ఈ రోజు 30 వత్తులు వెలిగిస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని నమ్మకం. ఈ రోజు దీపదానం ఆచరిస్తే మంచి జరుగుతుంది.[5]

పోలిస్వర్గం కథ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రచుర్యంలో ఉంది.

వివిధ సంవత్సరాలలో

[మార్చు]
  • కార్తీక అమావాస్య తిథిన - 2025 నవంబరు 19వ తేదీ ఉదయం 9:44 గంటలకు - ప్రారంభమైంది. నవంబరు 20వ తేదీ 12:17 PM గంటలకు ముగిసింది. సూర్యోదయానికి ఉండే తిథిని పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి నవంబరు 20వ తేదీన కార్తీక అమావాస్య పండుగను జరుపుకున్నారు.
  • 2024లో కార్తీక అమావాస్య డిసెంబరు 1, ఆదివారం వచ్చింది. అమావాస్య తిథి నవంబరు 30న ఉదయం 10:29 గంటలకు ప్రారంభమై, డిసెంబరు 1న ఉదయం 11:50 గంటలకు ముగిసింది. సూర్యోదయ తిథిని పరిగణలోకి తీసుకుని, చాలామంది డిసెంబరు 1న కార్తీక అమావాస్యను జరుపుకున్నారు.[1]

సంఘటనలు

[మార్చు]
  • భారత యుద్ధంలో పదిరోజుల తర్వాత భీష్ముడు పితృదేవతా నక్షత్రమైన అశ్వినీ నక్షత్రం నాడు పడిపోయాడు. ఉత్తరాయణం వచ్చేవరకూ వేచి ఉన్నాడు. మహాభారత కాలంలో మాఘ శుక్ల సప్తమి (రథసప్తమి) నాడు రథం ఉత్తరం వైపు తిరిగే రోజు ఉత్తరాయణ పుణ్యకాలంగా సూర్యుడి గతిమార్పు తెలుస్తుంది. మరునాడు అష్టమి రోజు భీష్ముడు అంపశయ్య మీద ప్రాణ త్యాగం చేశాడు. మాఘ శుక్ల సప్తమి నుంచి ఏకాదశి వరకు ఉన్న ఐదు రోజులూ ‘భీష్మ పంచకం’. ఉత్తరాయణం వరకు ప్రాణాలను నిలుపుకొన్న భీష్ముడు, స్వచ్ఛందంగా మాఘ శుక్ల సప్తమి నుంచి ఐదు రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడిచాడని చెబుతారు. కార్తీక అమావాస్య నాడు భారత యుద్ధం ప్రారంభమైందనీ, అంపశయ్యపై భీష్ముడు యాభై ఎనిమిది రోజులు ఉన్నట్టు భారతంలో స్పష్టంగా పేర్కొని ఉంది. మాఘ శుక్ల అష్టమిని భీష్మ నిర్యాణ దినంగా ‘పద్మపురాణం’ పేర్కొంది. [6]
  • పల్నాడు లో ఈనాడు వీర్ల దేవాలయంపై ఎర్రజండా ఎగురవేసి పీఠాధిపతి ఉత్సవాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తాడు.

మూలాలు

[మార్చు]
  1. Selvi. "కార్తీక అమావాస్య 22న: పితృకార్యాలను నిర్వహిస్తే..?". telugu.webdunia.com. Retrieved 2025-11-25.
  2. "Kartika Amavasya Geeta Jayanthi Poli Swargarohanam". Sri Shirdi Sai Baba Temple - Pittsburgh (in ఇంగ్లీష్). Retrieved 2025-11-25.
  3. "కార్తీక అమావాస్య 2025 తేదీ.. తిథి ప్రారంభం, శుభ ముహూర్తం". Samayam Telugu. Retrieved 2025-11-25.
  4. Rani, Yarlagadda (2022-11-24). "పోలి పాడ్యమి విశిష్టత.. పోలి స్వర్గం వెనకున్న పురాణ కథ ఇదే." www.telugupost.com. Retrieved 2025-11-25.
  5. "Poli Swargam katha: ఈ నెల 21న పోలి పాడ్యమి.. విశిష్టతతో పాటు ఆ రోజు చదువుకోవాల్సిన కథ తెలుసుకోండి!". Hindustan Times. 2025-11-18. Retrieved 2025-11-25.
  6. "పోలి స్వర్గం కథ - కార్తీక మాసం చివరి రోజు తప్పకుండా వినాల్సిన పోలి స్వర్గం కథ | Poli Swargam Katha in Telugu". Hindu Temples Guide (in ఇంగ్లీష్). Retrieved 2025-11-25.

బయటి లింకులు

[మార్చు]