కాశ్మీర రాజతరంగిణి కథలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాశ్మీర రాజతరంగిణి
కృతికర్త: కస్తూరి మురళీకృష్ణ
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రచురణ:
విడుదల:

కాశ్మీర రాజతరంగిణి కథలు ప్రముఖ రచయిత కస్తూరి మురళీకృష్ణ రాసిన చారిత్రిక కథామాలిక. 11శతాబ్దిలో కల్హణుడు రచించిన కశ్మీర రాజతరంగిణిని ప్రతిబింబించేందుకు రాసిన కథామాలిక. చారిత్రిక గ్రంథంగా, కావ్యంగా ప్రామాణికత, ప్రఖ్యాతి పొందిన కల్హణుని రాజతరంగిణిని కథలుగా విభజించుకుని ఈ కథల రచన చేశారు.

రచన నేపథ్యం

[మార్చు]

7,836శ్లోకాలలో పొందుపరచిన కశ్మీర రాజుల చరిత్రను 16 కథలలో ప్రతిబింబించే ప్రయత్నంగా రచయిత ఈ గ్రంథాన్ని గురించి వివరించారు. ఈ కథలు 1998-99 మధ్యకాలంలో జాగృతి వారపత్రికలో ధారావాహికగా ప్రచురితమయ్యాయి. ఏప్రిల్, 2006లో ఎమెస్కో బుక్స్ తొలిముద్రణగా ప్రచురించింది. ఈ పుస్తకం 2009 జనవరిలో ద్వితీయ ముద్రణ పొందింది.
కశ్మీర రాజతరంగిణి కథలు గ్రంథానికి 11వ శతాబ్ది నాటి చరిత్రకారుడు, కవి కల్హణుడు రచించిన కశ్మీర రాజతరంగిణి ఆధారం. రాజతరంగిణిలో ఏడు తరంగాలు(అధ్యాయాలు)గా కలియుగారంభం నుంచి గల కశ్మీర రాజుల చరిత్రను కావ్యంగా రచించారు. ఆధునిక చరిత్రకారులు భారత చరిత్ర పరిశోధనలకు ఆధారంగా స్వీకరించిన ప్రామాణిక గ్రంథం రాజతరంగిణి[1].
చారిత్రిక వాస్తవికతతో పాటుగా కల్పన, రమణీయత వంటి కావ్య లక్షణాలను కలిగిన రాజతరంగిణి కావ్యం తెలుగు సాహిత్యకారులను ఆకర్షించింది. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ప్రసిద్ధ సాహిత్యకారుడు విశ్వనాథ సత్యనారాయణ కశ్మీర రాజతరంగిణినీ, ఆ గ్రంథం చారిత్రికతపై కోట వెంకటాచలం రచించిన చరిత్ర గ్రంథాలను ఆధారంగా చేసుకుని కాశ్మీర రాజవంశావళి పేరుతో నవలల మాలికను రచించారు. ప్రముఖ పాత్రికేయుడు, సాహిత్యకారుడు పిలకా గణపతిశాస్త్రి కల్హణుని రాజతరంగిణి కావ్యంలోని కొన్ని కథాంశాలను విస్తరించి కశ్మీర పట్టమహిషి నవలతో పాటుగా, కొన్ని నవలికలు, కథలూ రచించారు.
అయితే వారెవరూ కల్హణుని కావ్యాన్ని మొత్తంగా అనుసృజించడమో, కావ్యగతమైన మొత్తం క్రమాన్ని రచనల్లో ప్రతిబింబించే ప్రయత్నమో చేయలేదు. తమ రచనలు స్వతంత్ర రచనలుగానే సృజన చేశారు. కశ్మీర రాజతరంగిణి కథలు గ్రంథంలో కల్హణుని కావ్యాన్ని అనుసరిస్తూ కలియుగారంభం నుంచి కల్హణుని కాలం వరకూ సాగిన రాజతరంగిణిని ప్రతిబింబించేందుకు కస్తూరి మురళీకృష్ణ ప్రయత్నం చేశారు.

ఇతివృత్తం

[మార్చు]

రాజతరంగిణి కావ్యం కలియుగారంభం నుంచి మొదలుకొని కశ్మీర రాజుల చరిత్రను, తద్వారా సంబంధిత వ్యవస్థల చరిత్రను చెబుతూండగా దాన్ని అనుసరించే ఈ గ్రంథానికి ఇతివృత్తంగా స్వీకరించారు. 16 కథల్లో ప్రతిబింబించిన రాజుల జీవితాన్నే కాక కథలలో ప్రసక్తి కల్పించి మరీ కథకూ కథకూ మధ్యకాలంలో పాలించిన రాజుల, వంశాల వివరాలు చెప్పారు. చారిత్రిక వివరాలను యథాతథంగా ఉంచి, ఇది ఇలా జరిగి ఉండొచ్చునన్న ఊహలతో కల్పనను అల్లారు.
గ్రంథంలోని కథలు ఇవి:

  1. కశ్మీరాః పార్వతి:
  2. దామోదర సర్పం:
  3. ధర్మరక్షణ:
  4. గురురక్షణ:

మూలాలు

[మార్చు]
  1. ధర్, సోమనాథ్ (1983). కల్హణుడు (1 ed.). న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాఢమీ.