కీలుబొమ్మలు (నవల)
| కీలు బొమ్మలు | |
| కృతికర్త: | జి. వి. కృష్ణారావు |
|---|---|
| దేశం: | భారత దేశము |
| భాష: | తెలుగు |
| విషయం: | పల్లెటూరి జీవనంలోని కార్పణ్యాలు, రాజకీయాలు |
| ప్రచురణ: | అలకనంద పబ్లికేషన్స్, |
| విడుదల: | 1953 |
కీలుబొమ్మలు జి.వి.కృష్ణారావు 1953లో రచించిన ప్రముఖ తెలుగు నవల. పల్లెటూరి జీవనంలోని కార్పణ్యాలు, రాజకీయాలను చిత్రీకరించిన నవల ఇది. ప్రముఖమైన తెలుగు నవలల్లో ఒకటిగా కీలుబొమ్మలు పేరొందింది.
కృష్ణరావు గారిజీవితం శబ్దార్థవిచారణనించీ జీవితార్థవిచారణ వరకూ ఆసాంతం అంతులేని జిజ్ఞాసగా కనిపిస్తుంది. ఆయన రచనలు చూస్తే. కీలుబొమ్మలు నవలకి కూడా అదే ప్రాతిపదిక అంటారాయన. ”స్వాతంత్ర్యమంటే ఏమిటి? మానవుడు దానిని ఎలా కోల్పోతున్నాడు! తిరిగి దానిని సాధించే మార్గమేమిటి? ఆర్థిక సామాజిక రాజకీయ హేతువులెంతవరకు మానవజీవితాన్ని మార్చివేస్తున్నవి? వ్యక్తుల కర్తవ్యమేమిటి? ఈ జిజ్ఞాసను రేకెత్తించటమే కీలుబొమ్మల లక్ష్యం” అంటారు రచయిత (పు. 346)[1]
ఇతివృత్తం
[మార్చు]ఈ నవల మానవ మనస్తత్వ విశ్లేషణకి, విలువల చిత్రణకీ పెద్దపీట వేసింది. మార్క్సిస్టు నుంచి మానవవాది (ఎమ్మెన్ రాయ్) గా మారిన కృష్ణారావు, ఈ రెండు రాజకీయ సిద్ధాంతాలనీ నవలలో ముఖ్యమైన మలుపువ దగ్గర ప్రస్తావించారు.
కోస్తా ప్రాంతంలోని ఓ పల్లెటూరు ఈ నవలలోని కథాస్థలం. ప్రధాన పాత్ర పుల్లయ్య ఆ ఊళ్ళో మోతుబరి రైతు. పెద్దకొడుకు అకాల మరణం మినగా అతడి జీవితంలో ఏ లోటూ లేదు. కోడల్ని, మనుమడిని తన దగ్గరే పెట్టుకున్నాడు. ఉన్న ఒక్క కూతురుని, చిన్న కొడుకుని బస్తీలో పెట్టి చదివిస్తుంటాడు. ఇంటి పెత్తనం అంతా తన భార్య లక్ష్మమ్మదే. ఊరికి పెద్ద మనిషే అయినా, ఇంట్లో పుల్లయ్య కూడా ఆవిడ మాటకి సరే అనాల్సిందే. భార్యతో చెప్పకుండా ఏ పనీ చేయని పుల్లయ్య, గ్రామస్తుడు చంద్రశేఖరం మార్వాడీ దగ్గర చేసిన ఐదు వేల రూపాయల అప్పుకి మాత్రం హామీ పడతాడు.
చంద్రశేఖరం బాగా చదువుకున్న డబ్బున్న కమ్యూనిస్టు, ఊళో ఫ్యాక్టరీ నిర్మించి కార్మికులకి సకల సౌకర్యాలూ ఏర్పాటు చేస్తాడు. అయితే, అతనికి వ్యాపారంలో అనుభవం లేకపోవడంతో ఫ్యాక్టరీకి నష్టాలు మొదలవుతాయి. కార్మికులతో చర్చలు జరిపి, సహకార పద్ధతిలో ఫ్యాక్టరీ నడుపుదామని ప్రతిపాదిస్తాడు. కార్మికులు మాత్రం లాభనష్టాలతో తమకి సంబంధం లేదని, జీతభత్యాలు, సౌకర్యాలు మరింత పెంచాల్సిందేనని తెగేసి చెబుతారు. తన సొమ్మే కాక, మామగారి సొమ్ము మొత్తం తెచ్చి పెట్టుబడి పెట్టినా, ఫ్యాక్టరీ దివాళా తీయడంతో ఆ రెండు కుటుంబాలూ వీధిన పడతాయి.
ఫ్యాక్టరీని నిలబెట్టడం కోసం చంద్రశేఖరం చేసిన అప్పుల్లో పుల్లయ్య హామీ ఉన్న మార్వాడీ అప్పు ఒకటి. అయితే, పుల్లయ్య హామీ సంతకం చేసినట్టుగా సాక్ష్యం లేదు. చంద్రశేఖరం తరపున పుల్లయ్య మార్వాడీకి బాకీ తీర్చాల్సిన పరిస్థితి వస్తుంది. నిజానికి పుల్లయ్యకి చంద్రశేఖరం మీద సానుభూతి ఉంది. చెల్లించాల్సిన మొత్తమూ లెక్కలోది కాదు. కానీ, హామీ విషయాన్నీ అతడు తన భార్య నుంచి దాచాడు. ఇప్పుడు బయట పడితే ఆమె గొడవ చేయచ్చు. చంద్రశేఖరం బాకీ తాను తీరిస్తే, ఊళ్ళో తన పరపతి తగ్గొచ్చు. ఈ ఆలోచనల్లో ఉండి ఎటూ తేల్చుకోకుండానే, తానేమీ హామీ పడలేదని అర్థం వచ్చేలా గొణుగుతాడు పుల్లయ్య,
అక్కడినుంచి అనూహ్యంగా పరిస్థితులు మారిపోతాయి. తాను అభిమానించిన చంద్రశేఖరం మీద పోర్టరీ కేసు పెట్టాల్సి వస్తుంది పుల్లయ్యకి, అతడి మనస్సాక్షికి, లోకరీతికి మధ్య సంఘర్షణ. పుల్లయః దగ్గర గుమస్తాగా పనిచేస్తున్న సత్యనారాయణకి హామీ విషయం తెలుసు. కాని ప్రభుభక్తి, ఉద్యోగభయం అతన్ని నోరు మెదపనివ్వవు. పట్నంలో చదువుకుంటున్న పుల్లయ్య కొడుకు రామారావు కమ్యూనిస్టు సానుభూతి వరుడు. చంద్రశేఖరం ఫోర్జరీ చేశాడని నమ్మలేని రామారావు తన తండ్రిని అనుమానిస్తాడు. అక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరిగి అనూహ్యమైన ముగింపుకి చేరుతుంది.
పుల్లయ్య, చంద్రశేఖరాల కుటుంబాలతో పాటు, ఆదర్శభావాలతో ఊరి వాళ్లకి వైద్యం చేసే వాసుదేవ శాస్త్రి, సంఘసేవికి ముసుగులో రాజకీయాలు చక్కబెట్టే అమ్మాయమ్మ, ఊళ్ళో పుల్లయ్య ప్రత్యర్థి మల్లయు ఇతర ముఖ్య పాత్రలు, మానసిక సంఘర్షణలు, స్త్రీపురుష సంబంధాలని చిత్రించిన తీరు బుచ్చిబాబు 'చివరికి మిగిలేది' ని జ్ఞాపకం చేస్తుంది. వ్యంగ్యాన్ని కథనంలో భాగం చేశారు రచయిత. తాను సృష్టించిన ప్రతి పాత్ర పట్లా రచయిత సానుభూతి చూపడం, ప్రతి పాత్రకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం ఈ నవల ప్రత్యేకత. [2]
మూలాలు
[మార్చు]- ↑ మాలతి, ~ (2012-04-30). "కీలుబొమ్మలుకి ప్రాణం పోసిన మానకలశుడు జి.వి. కృష్ణరావు". తెలుగు తూలిక, thulika in English. Archived from the original on 2023-07-13. Retrieved 2025-11-14.
{{cite web}}:|first=has numeric name (help) - ↑ కీలు బొమ్మలు నవల, అలకనంద పబ్లిషర్స్