కెంజి మిజోగుచి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కెంజి మిజోగుచి (溝口 健二 Mizoguchi Kenji; 1898 మే 16 – 1956 ఆగస్టు 24) జపనీస్ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. ఆయన సినిమా ఉగెత్సు (1953) వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సిల్వర్ లయన్ గెలుచుకుంది, 1962, 1972ల్లో సైట్ & సౌండ్ పోల్ లో సినీ విమర్శకుల టాప్ టెన్ దర్శకుల్లో ఆయన నిలిచారు. మిజోగుచి సినిమాలు లాంగ్ టేక్ లు, దృశ్యప్రధానంగా కథనం సాగడం వంటి వాటికి సుప్రసిద్ధి పొందాయి.[1] విమర్శకుడు మార్క్ లె ఫను ప్రకారం - "ఆయన సినిమాలకు అసాధారణమైన శక్తి, స్వచ్ఛత ఉంది. అవి వీక్షకులను మానవుల దు:ఖాన్ని ప్రతిపిబింబిస్తూ, తద్వారా వచ్చిన శక్తి, స్వచ్ఛత, దయలతో కదలించేస్తాయి" [2]

జీవితం[మార్చు]

తొలినాళ్ళు[మార్చు]

మిజొగుచి టోక్యోకు చెందిన హాంగోలో, [3] పైకప్పుల వడ్రంగికి ముగ్గురు సంతానంలో ఒకనిగా జన్మించారు. ఆయన తండ్రి రష్యన్-జపనీస్ యుద్ధం కాలంలో సైనికులకు రెయిన్ కోట్లు అమ్మే వృత్తి చేపట్టేవరకూ వారి కుటుంబం నిరాడంబరమైన మధ్యతరగతి జీవితాన్ని గడపగలిగింది. యుద్ధం ఆయన పెట్టిన పెట్టుబడి తిరిగివచ్చేలోపుగానే ముగిసిపోయింది; మిజొగుచి కుటుంబ స్థితిగతులు దాంతో దారుణమైన స్థితికి చేరుకున్నాయి, దాంతో మిజొగుచి అక్కని దత్తత ఇచ్చేసి అక్కణ్ణుంచి అసకుసకు, థియేటర్ కు దగ్గర్లో వేశ్యావాటిక ప్రాంతంలో నివాసం వెళ్ళిపోయారు.[3] తత్ఫలితంగా ఆయన సోదరి సుజుకోను గీషా (విలాస నృత్యకారిణి) గా అమ్మేశారు - ఈ సంఘటన మిజొగుచికి జీవితంపై ఉన్న దృక్పథంపై తీవ్ర ప్రభావం చూపించింది. వీటికి మధ్య, ఆయన తల్లి, సోదరిలతో తండ్రి వ్యవహరించిన తీరు వల్ల జీవితాంతం ఆయన తండ్రి పనులకు తీవ్ర ప్రతిఘటన నిలుపుకుంటూ జీవించారు.

1911లో, మిజొగుచి తల్లిదండ్రులు పేదరికం కారణంగా కొడుకు ప్రాథమిక విద్యాభ్యాసానికి ఫీజు చెల్లించలేక ఉత్తర జపాన్ లోని మొరియొకాలో కుర్రాడి మామయ్య వద్దకు పంపేశారు. సంవత్సర కాలంలో కీళ్ళవాతం వల్ల అవిటితనం ప్రారంభమైంది, తత్కారణంగా ఆయన జీవితమంతా కొంత పక్కకు తిరిగి నడవాల్సిన పరిస్థితి వచ్చింది.[4] 1912లో తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుకుని సంవత్సరమంతా లేవలేని స్థితిలో మంచం మీదే గడిపారు. 1913లో మిజొగుచి కిమొనొ, యుకటా అనే జపనీయ దుస్తులను డిజైన్ చేసే పనిలో అప్రెంటిస్ గా ఆయన అక్క సుజు పని చూసిపెట్టారు. 1915లో ఆయన తల్లి చనిపోయారు, సుజు తన తమ్ములను ఆమె వద్దకే తెచ్చుకుని స్వంత ఇంట్లో పెట్టుకుని చూసుకోవడం ప్రారంభించారు. 1916లో అయొయ్ బషి యోగా కెన్క్యుటొ ఆర్ట్ స్కూల్లోపాశ్చాత్య పెయింటింగ్ పద్ధతులు నేర్పే కోర్సులో చేరారు. ఈ కాలంలో ఓపెరాలో ఆసక్తిని పెంచుకున్నారు, ప్రత్యేకించి అకసకలోని రాయల్ థియేటర్లో సెట్ అలంకరించేవారికి సహకరించే పనీ చేసేవారు.

1917లో ఆయన అక్క ఈసారి కోబెలోని యుయ్షిన్ నిప్పొన్ అనే పత్రికలో అడ్వర్టైజ్మెంట్ డిజైనర్ ఉద్యోగాన్ని చూసిపెట్టింది. టడయొ సాటో అనే రచయిత మిజొగుచి జీవితంలోని తొలినాళ్ళకీ, షింపా నాటకాల ఇతివృత్తాలకు పోలికలున్న విషయాన్ని చెప్పారు. ఆ రచనలలో సాధారణంగా గేషాలు తమకన్నా చిన్నవారైన ప్రియుల కోసం త్యాగాలు చేయడం కనిపిస్తుంది. సిజుకి మిజొగుచి తమ్ముడే అయినా, "స్త్రీల వేదన, దు:ఖం ఆయన తర్వాతి సినిమాల్లో ప్రాథమికమైన అంశాలు; తమ్ముడి కోసం అక్క చేసిన త్యాగం ఆయన అనేక సినిమాల్లో ముఖ్యమైన అంశంగా నిలుస్తోంది- సాన్షో డయు అందుకొక ఉదాహరణ." [4] సంవత్సరంలోపే కోబె నుంచి టోక్యోలోని బొహెమీన్ డిలైట్స్ కు తిరిగి వచ్చారు.[4] 1920లో మిజోగుచి టోక్యో సినిమా పరిశ్రమలోకి నటునిగా ప్రవేశించారు; మూడేళ్ళ తర్వాత ఆయన పూర్తిస్థాయి దర్శకుడు అయ్యారు. నిక్కత్సు స్టూడియోలో వర్కర్ల సమ్మె కాలంలో ఐ-ని యోమిగేరు హి (The Resurrection of Love, ప్రేమ యొక్క పునరుత్థానం), అన్న పేరుతో ఆయన తొలి చిత్రం ప్రారంభమైంది.

సినీ రంగంలో[మార్చు]

మిజొగుచి మొదట్లో జాన్రా చిత్రాలు, జర్మన్ అనుభూతివాద చిత్రాల పునర్నిర్మాణాలు, యుగెన్ ఓ నీల్, లియో టాల్ స్టాయ్ రచనల అనుసరణలు వంటివి చేస్తూ వైవిధ్యాన్ని అన్వేషించారు. ఆ తొలినాళ్ళలో మిజొగుచి వేగంగా పనిచేశారు, ఒక్కోసారి వారంలో సినిమా పూర్తిచేసేవారు. 1920లు, 1930ల్లో ఆయన తీసిన 50కి పైగా చిత్రాల వివరమిది, వీటిలో అత్యధిక భాగం లభించకుండా పోయాయి.

అతిపెద్ద కెంటో భూకంపం తర్వాత 1923 సెప్టెంబరు 1న, మిజోగుచి నిక్కత్సుకు చెందిన క్యోటో స్టూడియోకి తరలిపోయారు. అక్కడ ఆయన చాన్నాళ్ళు పనిచేశారు. ఆయనతో సహజీవనం చేస్తున్న యోరికొ ఇచిజొ అనే కాల్ గర్ల్ ఆయనపై దాడిచేసి మిజొగుచి వీపును రేజర్ బ్లేడ్ తో గాయపరిచారు. ఈ వివాదం కారణంగా ఆయనను కొన్నాళ్ళు తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. "సంప్రదాయ కళలకు నిలమైన క్యోటోలో పనిచేయడం నిర్ణయాత్మకమైన ప్రభావం చూపింది. మిజొగుచి కబుకి, నోహ్, మరియు సంప్రదాయ నాట్యం, సంగీతం అభ్యసించారు."[5]

మిజొగుచి తర్వాతి సామాజిక చైతన్యం కలిగి, వామపక్షం వైపు మొగ్గిన కీకొ-ఎయ్ గ లేక "టెండెన్సీ సినిమాలు", వీటిలో ఆయన తన వామపక్ష మొగ్గుదల కనుగొంటూ తనదైన ముద్ర ఏర్పరుచుకున్నారు. తర్వాతి  కాలంలో మిజొగుచి సినీ దర్శకునిగా సీరియస్ కెరీర్ సిస్టర్స్ ఆఫ్ ది గియోన్, ఓసకా ఎలెగీ (1936లో రెండు వచ్చాయి) లతో కానీ ప్రారంభం కాలేదని పేర్కొన్నారు.

ఆయన కెరీర్ మధ్యకాలంలో తీసిన సినిమాల్లో, మిజొగుచి జపాన్ సమాజం భూస్వామ్య యుగం నుంచి ఆధునికతలోకి ప్రవేశించడాన్ని నమోదుచేసే సినిమాలు తీసిన 'నూతన వాస్తవికత'కు చెందిన దర్శకుడిగా ప్రశంసలు పొందారు. ది స్టోరీ ఆఫ్ ది లాస్ట్ క్రైసాంతిమమ్స్ (1939) విద్యాశాఖ నుంచి ఓ బహుమతి పొందింది. సిస్టర్స్ ఆఫ్ ది గియోన్, ఓసకా ఎలెగీ లతో పాటు ఇది కూడా అన్యాయమైన పురుషాధిక్య సమాజంలో స్త్రీలు అనుభవిస్తున్న న్యూనమైన స్థితిని ప్రతిబింబిస్తుంది. ఇదే కాలంలో సినిమా నిర్మాణంలో "ఒక-సీన్-ఒక-షాట్" అన్న ప్రత్యేకమైన విధానాన్ని తనదైన ముద్రగా మిజొగుచి అభివృద్ధి చేసుకున్నారు. క్షుణ్ణంగా పరిశీలించి ప్రామాణికంగా సెట్స్ రూపొందించే సెట్ డిజైనర్ హిరోషి మిజొతుని పనితనం మిజొగుచి తరచుగా ఉపయోగించే వైడ్-యాంగిల్ లెన్సెస్ కి సహకరించింది.

యుద్ధ సమయంలో, మిజొగుచి మిలటరీ ప్రభుత్వం యుద్ధప్రచారం కారణంగా బలవంతంగా రాజీపడాల్సి వచ్చింది; ఆ క్రమంలో ఆయన తీసిన చారిత్రక ఇతిహాసం ద 47 రోనిన్  (1941), ప్రఖ్యాతమైనది.

ఆయన సినిమాలను అభిమానించిన ప్రముఖ దర్శకుల్లో అకిరా కురసోవా, [6] ఆర్సన్ వెల్లెస్, [7] మసహిరొ షినొడా, కనెటొ షినొడొ, జేన్-లూక్ గొడార్డ్, [8] ఆండ్రీ టర్కోవ్ స్కీ, [9] జేన్-మేరీ స్ట్రాబ్, విక్టర్ ఎరైస్, జాకస్ రివెట్టీ మరియు థియో ఆంగెలోపాలోస్ వంటివారు ఉన్నారు.[10]

మిజొగుచి డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ జపాన్ కు ఒకసారి అధ్యక్షునిగా సేవలందించారు.[11]

యుద్ధానంతర గుర్తింపు[మార్చు]

ఆయన సమకాలీకుడైన యసుజిరో ఓజుతో పాటుగా యుద్ధానంతరం  జపనీస్ ప్రేక్షకుల్లో పాతరకం దర్శకుడిగా పేరుతెచ్చుకుని, ఫ్రెంచ్ నవవతరంగానికి చెందిన కయె డు సినిమా పత్రికకు చెందిన జాక్వస్ రివెట్టె వంటి సినీ విమర్శకుల ద్వారా పశ్చిమ దేశాల్లో ప్రఖ్యాతిపొందారు. జపనీస్ స్త్రీల దు:ఖం నుంచి స్ఫూర్తి పొంది రాడికల్ సినిమాలైన విక్టరీ ఆఫ్ ద ఉమెన్ (1946) మై లవ్ హాజ్ బీన్ బర్నింగ్ (1949) వంటివి తీసిన దశ తర్వాత జీడయ్-గెకి  లేదా చారిత్రిక నేపథ్యంలోని చలన చిత్రాల రూపకల్పనలో మిజొగుచి - ఎన్నాళ్ళో కలిసి పనిచేసిన స్క్రీన్ రైటర్ యొషికట యోదాతో కలిసి కృషిచేశారు. ఆ క్రమంలో వచ్చిన సినిమాల్లో ఆయన అత్యుత్తమ సినిమాగా పేరొంది ప్రపంచప్రఖ్యాతి తెచ్చిపెట్టిన ద లైఫ్ ఆఫ్ ఒహరు (1952), వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సిల్వర్ లయన్ పురస్కారం గెలిచిన ఉగెత్సు  (1953) వంటి అత్యంత ప్రఖ్యాతమైన సినిమాలు ఉన్నాయి. సాన్షో ది బైలిఫ్ (1954) భూస్వామ్య జపాన్ నేపథ్యంలో తీసిన సినిమా, మోరి ఓగయ్ రాసిన ఓ చిన్న కథ దానికి ఆధారం. ఆయన తీసిన దాదాపు వంద సినిమాల్లో టేల్స్ ఆఫ్ ది టైరా క్లాన్ (1955), ప్రిన్సెస్ యాంగ్ క్వై-ఫీయ్ (1955) — మాత్రమే రంగుల్లో తీశారు.

మిజొగుచి క్యోటోలో లూకేమియా (రక్త సంబంధ క్యాన్సర్) కారణంగా 58 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఆయన మరణించేనాటికి యసుజిరో ఓజు, అకిరా కురసోవాలతో కలిపి 3 మాస్టర్స్ ఆఫ్ జపనీస్ ఫిల్మ్స్ గా ప్రఖ్యాతిచెందారు. ఆయన మరణించేనాటికి ఒసాకా స్టోరీ అన్న సినిమా తీస్తున్నారు. ఆయన జ్ఞాపకాలు ఆధారం చేసుకుంటే దాదాపుగా మిజొగుచి 75 సినిమాలు తీశారు, కానీ తొలినాళ్ళ సినిమాలు దాదాపుగా పోయాయి. 1975లో కనెటో షిండొ అనే దర్శకుడు మిజొగుచిపై కెంజి మిజొగుచి: ద లైఫ్ ఆఫ్ ఎ ఫిల్మ్ డైరెక్టర్ అన్న ఓ డాక్యుమెంటరీ తీశారు. సంబంధిత వివరాలతో పుస్తకం కూడా విడుదలైంది.[12] మిగిలివున్న ఆయన 30 సినిమాలను, ద జపాన్ ఫౌండేషన్ సౌజన్యంతో 2014లో అనేక అమెరికన్ నగరాల్లో తిప్పి ప్రదర్శించారు.

Notes[మార్చు]

 1. Thomas, Kevin (6 January 1997).
 2. Le Fanu 2005, p. 1
 3. 3.0 3.1 Le Fanu 2005, p. 22
 4. 4.0 4.1 4.2 Le Fanu 2005, p. 23
 5. Sato 2008, p. 10
 6. Donald Richie (20 January 1999).
 7. Welles 1998, p. 146
 8. Kenji Mizoguchi’s Movies Seek Beauty -- New York Times
 9. Tarkovsky's Choice
 10. Mizoguchi The Master, Gerald O'Grady,ed.
 11. "Nihon eiga kantoku kyōkai nenpyō" (in Japanese).
 12. Shindo, Kaneto (27 April 1976).