Jump to content

సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ

అక్షాంశ రేఖాంశాలు: 38°57′07″N 77°08′46″W / 38.95194°N 77.14611°W / 38.95194; -77.14611
వికీపీడియా నుండి
(కేంద్ర నిఘా సంస్థ నుండి దారిమార్పు చెందింది)
సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ
సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ ముద్ర
సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ పతాక
సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ ప్రధాన కార్యాలయం, లాగ్లీ, వర్జీనియా
సంస్థ వివరాలు
స్థాపన సెప్టెంబరు 18, 1947; 77 సంవత్సరాల క్రితం (1947-09-18)
Preceding agency Office of Strategic Services[1]
ప్రధానకార్యాలయం జార్జి బుష్ సెంటర్ ఫర్ ఇంటిలిజెన్స్
లాంగ్లీ, వర్జీనియా

38°57′07″N 77°08′46″W / 38.95194°N 77.14611°W / 38.95194; -77.14611
ఉద్యోగులు 21,575 (అంచనా)[2]
వార్షిక బడ్జెట్ $15 billion (as of 2013)[2][3][4]

సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ (సిఐఎ) అమెరికా ప్రభుత్వ పౌర విదేశీ నిఘా సంస్థ. దీన్ని అనధికారికంగా ఏజెన్సీ[5] అని, చారిత్రికంగా కంపెనీ అని కూడా అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జాతీయ భద్రతా సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం, ప్రధానంగా మానవ మేధస్సు (HUMINT) ఉపయోగించడం ద్వారా, దాని డైరెక్టరేట్ ఆఫ్ ఆపరేషన్స్ తో రహస్య చర్యలను నిర్వహించడం ద్వారా పని చేస్తుంది.[6] అమెరికా నిఘా వ్యవస్థలో ప్రధాన సంస్థ అయిన సిఐఎ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టరు కింద పనిచేస్తుంది. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు, క్యాబినెట్‌లకు నిఘా సమాచారాన్ని అందించడం మీద దృష్టి పెడుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసాక, 1946 జనవరి 22 న ఆఫీస్ ఆఫ్ స్ట్రాటజిక్ సర్వీసెస్‌ను (OSS) రద్దు చేసిన తరువాత అధ్యక్షుడు హ్యారీ ఎస్. ట్రూమన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ గ్రూపును సృష్టించాడు. ఆ తరువాత దాన్ని 1947 జాతీయ భద్రతా చట్టం ద్వారా సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీగా మార్చారు.[7]

దేశీయ భద్రతా సేవ అయిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) మాదిరిగా కాకుండా సిఐఎకు చట్టాన్ని అమలుపరచే పని లేదు. దేశీయ నిఘా సేకరణ పరిమిత స్థాయిలో మాత్రమే ఉంటుంది. ప్రధానంగా విదేశీ నిఘా సేకరింపుపై దృష్టి సారించింది.[8] కార్యకలాపాలను సమన్వయం చేయడానికి సిఐఎ HUMINT వాడుతుంది. ఇది అధ్యక్షుడి ఆదేశాల మేరకు రహస్య చర్యలను కూడా నిర్వహిస్తుంది.[9][10] స్పెషల్ యాక్టివిటీస్ సెంటర్ వంటి పారామిలిటరీ ఆపరేషన్స్ యూనిట్ల ద్వారా విదేశీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుంది.[11] జర్మనీలో బిఎన్‌డి లాగా, అనేక దేశాలలో గూఢచార సంస్థలను స్థాపించడంలో సిఐఎ కీలక పాత్ర పోషించింది. ఇది అనేక విదేశీ రాజకీయ సమూహాలు, ప్రభుత్వాలకు మద్దతు కూడా ఇచ్చింది. చిత్రహింసలో శిక్షణ ఇవ్వడం, సాంకేతిక మద్దతు వంటివి ఇందులో భాగం. ఇది అనేక ప్రభుత్వాలను కూలదోయడంలో, ఉగ్రవాద దాడులు, విదేశీ నాయకుల ప్రణాళికాబద్ధమైన హత్యలలో పాల్గొంది.[12]

ఉద్దేశం

[మార్చు]

సిఐఎ సృష్టించబడినప్పుడు దాని ఉద్దేశ్యం విదేశాంగ విధాన నిఘా, విశ్లేషణ కోసం ఒక సంస్థను సృష్టించడం. నేడు దీని ప్రాథమిక ఉద్దేశం విదేశీ నిఘా సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం, వ్యాప్తి చేయడం, రహస్య కార్యకలాపాలను నిర్వహించడం.

2013 ఆర్థిక బడ్జెట్ ప్రకారం సిఐఎ కి ఐదు ప్రాధాన్యతలు ఉన్నాయిః

  • ఉగ్రవాద వ్యతిరేకత
  • సామూహిక విధ్వంసక ఆయుధాల వ్యాప్తి నిరోధం
  • సీనియర్ విధాన నిర్ణేతలకు సూచనలు, హెచ్చరికలు
  • కౌంటర్ ఇంటెలిజెన్స్
  • సైబర్ ఇంటెలిజెన్స్

చరిత్ర

[మార్చు]
సిఐఎ ప్రధాన కార్యాలయం లోని సిఐఎ స్మారక గోడపై ఉన్న 139 నక్షత్రాలు, రహస్య చర్యల్లో హతులైన సిఐఎ అధికారులకు గుర్తు

సిఐఎకి ముందు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆఫీస్ ఆఫ్ స్ట్రాటజిక్ సర్వీసెస్ (OSS) ఉండేది. దీని నుండి ఎయిర్ ఫోర్స్ జనరల్ హోయ్ట్ S. వాండెన్‌బర్గ్ నేతృత్వంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ గ్రూప్, CIG, 1945 - 1947 మధ్య స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో ఉండేది. అయితే, ప్రచ్ఛన్నయుద్ధం ప్రారంభం కావడంతో, ప్రపంచ శక్తిగా అమెరికాకి మామూలు గూఢచారి శాఖ సరిపోదని త్వరగా గుర్తించారు. 1947 సెప్టెంబరు 18 న జాతీయ భద్రతా చట్టం ద్వారా ఇంటెలిజెన్స్ సర్వీస్‌ను స్థాపించారు.

సిఐఎ మొదటి డైరెక్టర్ అడ్మిరల్ రోస్కో హెచ్. హిల్లెన్‌కోటర్. 1950లో హిల్లెన్‌కోటర్ తర్వాత వాల్టర్ బెడెల్ స్మిత్ వచ్చాడు. అతను, సిఐఎ పాత్రను నిర్వచించిన ప్రత్యేకమైన రహస్య పనుల కోసం ఏర్పరచిన విభాగానికి డైరెక్టర్‌గా OSS లో అనుభవమున్న అలెన్ వెల్ష్ డల్లెస్‌ను నియమించాడు. 1953 నుండి 1961 వరకు సిఐఎ డైరెక్టర్‌గా పనిచేసిన డల్లెస్, జార్జ్ టెనెట్‌తో పాటు అమెరికా విదేశీ గూఢచర్యానికి ఎక్కువ కాలం పనిచేసిన నాయకుడు.

కొరియా యుద్ధ సమయంలో శత్రుశిబిరంలో జరిపిన గూఢచార, సైనిక కార్యకలాపాలన్నిటినీ సిఐఎ నిర్వహించింది. అప్పుడు వచ్చిన ప్రతికూల ఫలితాల నేపథ్యంలో, కమాండో సైనిక కార్యకలాపాలకు సైన్యమే బాధ్యత వహించాలని, అసమాన యుద్ధం కోసం ప్రత్యేక దళాలను సృష్టించాలని రక్షణ శాఖ నిశ్చయించింది. అప్పటి నుండి, ఈ ప్రత్యేక దళాల యూనిట్ సిఐఎకి సైనిక ఇంటర్‌ఫేస్‌గా ఏర్పడింది.

1950ల చివరలో, సిఐఎ విదేశీ గగనతలంలో ప్రధానంగా సోవియట్ యూనియన్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా మీదుగా గూఢచారి విమానాలను ప్రారంభించింది. ఇంటెలిజెన్స్, సాంకేతిక కోణం నుండి, U-2, A-12 వంటి గూఢచారి విమానాలతో కూడిన ఈ కార్యక్రమాలు చాలా విజయవంతమయ్యాయి.

ఉత్తర, దక్షిణ వియత్నాంలో సైనిక జోక్యానికి వ్యతిరేకంగా సిఐఎ విశ్లేషకులు హెచ్చరించారు; వారు వియత్నామీస్ సమస్యలను అంతర్గత సంఘర్షణగా అర్థం చేసుకున్నారు. అయినప్పటికీ, లిండన్ బి. జాన్సన్ ప్రభుత్వం వినలేదు. వియత్నాం యుద్ధ సమయంలో, సిఐఎ లావోస్, కంబోడియా, ఉత్తర వియత్నాంలలో అనేక రహస్య కార్యకలాపాలను నిర్వహించింది. అయితే దక్షిణ వియత్నామ్‌ భూభాగంలో శాంతించే పరిసమాప్తి కార్యక్రమాల (ఆపరేషన్ ఫీనిక్స్) రెండింటిలోనూ పాల్గొంది. ఎయిర్ అమెరికా ఎయిర్‌లైన్‌ను నియంత్రించింది. 1970ల వరకు, సిఐఎ కూడా లాటిన్ అమెరికాలో రహస్యంగా పనిచేసింది. గ్వాటెమాలా (1954), బ్రెజిల్ (1964)[13], చిలీ (1954)[14] లలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మితవాద సైనిక తిరుగుబాట్లకు మద్దతు ఇచ్చింది.

అమెరికాలో, సిఐఎ 1970లలో పౌర హక్కులు, శాంతి ఉద్యమాలకు వ్యతిరేకంగా చురుకుగా పనిచేసింది. ఇది చర్చి కమిటీ పరిశోధనలకు దారితీసింది. చివరికి ఈ కమిటీ సిఐఎ చేపట్టిన తదుపరి కార్యకలాపాలను కూడా పరిశోధించింది. ఫలితంగా, అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్, విదేశీ దేశాధినేతలను ఉద్దేశపూర్వకంగా చంపడాన్ని, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించే తిరుగుబాటు కార్యకలాపాలను ప్లాన్ చేయడాన్నీ నిషేధిస్తూ 1976 ఫిబ్రవరిలో అన్ని అమెరికా ప్రభుత్వ కార్యాలయాలను ఆదేశించాడు.[15] చర్చి కమిటీ పరిశోధనలు, 1978లో ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వైలెన్స్ యాక్ట్ ఆమోదానికి కూడా దారితీశాయి. ఇది బాధ్యతలను పునర్వ్యవస్థీకరించి, అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలను సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు చెందిన రెండు ఇంటెలిజెన్స్ కమిటీల పర్యవేక్షణలో ఉంచింది.

1988లో, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి మాజీ సిఐఎ చీఫ్ (1977-1978) జార్జ్ బుష్.

1995లో, సిఐఎ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా ఒక హత్య ప్రణాళిక జరిగింది. ఆపరేషన్ బోజింకాలో భాగంగా పేలుడు పదార్థాలతో కూడిన చిన్న ప్రయాణీకుల విమానాన్ని లాంగ్లీ లోని సిఐఎ ప్రధాన కార్యాలయం పైకి నడిపే ప్రణాళిక అది. హంతకుడు అబ్దుల్ హకీమ్ మురాద్ ఈ దాడిని నిర్వహించడానికి ముందు నార్త్ కరోలినాలో విమానాన్ని నడిపే పాఠాలు నేర్చుకున్నాడు. అయితే హంతకుడు నివసించే అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరగడంతో అతని ప్లాన్ బెడిసికొట్టింది. దీని ఫలితంగా, అల్-ఖైదా తన ప్రణాళికలను మార్చుకుంది. ఇదే 2001 సెప్టెంబరు 11 నాటి తీవ్రవాద దాడులకు దారితీసింది.[16][17]

సుమారు 2004 నుండి, సిఐఎ అనేక డ్రోన్ కార్యకలాపాలు చేసింది. 2011 ఆగస్టులో, బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం (BIJ) పాకిస్తాన్‌లో డ్రోన్ దాడులపై సుమారు 2,000 మీడియా నివేదికలను విశ్లేషించి ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, 2004 నుండి కనీసం 291 మిషన్లు నిర్వహించగా, వీటిలో 2292 నుండి 2863 వరకూ మరణించారు. 126 మంది పేర్లు తెలిసిన సాయుధ ఇస్లామిస్ట్ నాయకులతో పాటు, అనేక వందల మంది ఇస్లామిస్ట్ మిలిటెంట్లు చంపబడ్డారు. 164 మంది పిల్లలతో సహా దాదాపు 385 నుండి 775 వరకూ అమాయకులు ఈ దాడుల్లో మరణించారు. యెమెన్, ఆఫ్రికా ఖండంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి.

భారత్ - పాక్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు

[మార్చు]

సిఐఎ, పాకిస్తానీ ఐఎస్‌ఐ లు రహస్య యుద్ధం చేసుకుంటున్నాయని అహ్మద్ రషీద్ వంటి రచయితలు ఆరోపిస్తున్నారు. అమెరికాకు బహిరంగ శత్రువైన ఆఫ్ఘన్ తాలిబాన్లప్రధాన కార్యాలయం పాకిస్తాన్ లోని కేంద్ర పాలిత గిరిజన ప్రాంతంలో ఉంది. దీనికి నిధులు సమకూర్చేది ISI అని కొన్ని నివేదికలున్నాయి. అయితే, పాకిస్తాన్ ప్రభుత్వం దీనిని ఖండించింది.

1998 మే 11న భారతదేశం జరిపిన రెండవ అణు పరీక్షను చూసి సిఐఎ డైరెక్టర్ జార్జ్ టెనెట్, అతని ఏజెన్సీ విస్తుపోయారు. పాకిస్తాన్ కొత్త క్షిపణులను పరీక్షించినందుకు ప్రతిస్పందనగా భారత్ ఈ అణు పరీక్ష జరిపింది. ఈ సంఘటనలతో సిఐఎ "గూఢచర్య వైఫల్యం, ఫొటోలను చదవడంలో వైఫల్యం, నివేదికలను అర్థం చేసుకోవడంలో వైఫల్యం, ఆలోచించడంలో వైఫల్యం, చూడడంలో వైఫల్యం" బయటపడ్డాయి.[18]

సెప్టెంబర్ 11 దాడుల్లో

[మార్చు]

సెప్టెంబరు 11, 2001 న, 19 మంది అల్-ఖైదా సభ్యులు ఈశాన్య యునైటెడ్ స్టేట్స్‌లో నాలుగు ప్యాసింజర్ జెట్‌లను హైజాక్ చేశారు . రెండు విమానాలు న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌పైకి, మూడవది వర్జీనియాలోని ఆర్లింగ్‌టన్ కౌంటీలోని పెంటగాన్‌లోకి నడిపించి వాటిని గుద్దేసారు. నాల్గవ విమానం అనుకోకుండా పెన్సిల్వేనియాలోని షాంక్స్‌విల్లే సమీపంలోని మైదానంలో కూలిపోయింది. ఈ దాడుల్లో 2,996 మంది (19 మంది హైజాకర్లతో సహా) ప్రాణాలు కోల్పోయారు. ట్విన్ టవర్లు నాశనమయ్యాయి. పెంటగాన్ భవనపు పశ్చిమ భాగం దెబ్బతింది. 9/11 తర్వాత, న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని విడుదల చేసింది. దాని ప్రకారం, దాడుల నేపథ్యంలో సిఐఎ న్యూయార్క్ ఫీల్డ్ ఆఫీసు ధ్వంసమైందని పేర్కొంది. పేరు చెప్పని CIA వర్గాల ప్రకారం, మొదటి స్పందనదారులు, సైనిక సిబ్బంది, వాలంటీర్లు వరల్డ్ ట్రేడ్ సెంటర్ సైట్‌లో ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నాల్లో తలమునకలుగా ఉన్నప్పుడు, ప్రత్యేక సిఐఎ బృందం మాత్రం, రహస్య పత్రాల డిజిటల్, పేపర్ కాపీల కోసం శిథిలాలలో వెతికింది. 1979లో టెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ఇరాన్ స్వాధీనం చేసుకున్న తర్వాత, బాగా రిహార్సల్ చేసిన డాక్యుమెంట్ రికవరీ విధానాల ప్రకారం ఇది జరిగింది. ఏజెన్సీ రహస్య సమాచారాన్ని తిరిగి పొందగలిగిందా లేదా అనేది ధృవీకరించబడనప్పటికీ, ఆ రోజు ఉన్న అధికారులందరూ భవనం నుండి సురక్షితంగా పారిపోయినట్లు మాత్రం తెలిసింది.

సంస్థాగత నిర్మాణం

[మార్చు]
సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ వ్యవస్థ

సిఐఎలో ఒక కార్యనిర్వాహక కార్యాలయం, ఐదు ప్రధాన డైరెక్టరేట్లు ఉన్నాయి

  • డైరెక్టరేట్ ఆఫ్ డిజిటల్ ఇన్నోవేషన్
  • విశ్లేషణ డైరెక్టరేట్
  • డైరెక్టరేట్ ఆఫ్ ఆపరేషన్స్
  • డైరెక్టరేట్ ఆఫ్ సపోర్ట్
  • డైరెక్టరేట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ

బడ్జెట్

[మార్చు]

మొత్తం నిఘా వ్యవస్థ బడ్జెట్ వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి. 1949 నాటి సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ చట్టం ప్రకారం సెంట్రల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఒక్కరే "లెక్క చెప్పకుండా ప్రభుత్వ డబ్బును ఖర్చు చేయగల" ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగి.[19] 1997 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం, దాని బడ్జెట్ 26.6 బిలియన్ డాలర్లుగా చూపించింది.[20] 2007 నుండి మొత్తం సైనికేతర నిఘా వ్యయం కోసం ప్రభుత్వం 2013 ఆర్థిక సంవత్సరానికి 52.6 బిలియన్ డాలర్లు వెచ్చించింది. అందులో సిఐఎ బడ్జెట్ $ 14.7 బిలియన్లు. మొత్తం నిఘా వ్యయంలో ఇది 28%. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ బడ్జెట్ కంటే ఇది దాదాపు 50% ఎక్కువ. సిఐఎ HUMINT బడ్జెట్ $ 1.3 బిలియన్లు, SIGINT బడ్జెట్ 1.7 బిలియన్లు, సిఐఎ మిషన్ల భద్రత, లాజిస్టిక్స్ కోసం $ 2.5 బిలియన్లు. డ్రోన్ విమానాలు, ఇరాన్ అణు కార్యక్రమ వ్యతిరేక కార్యకలాపాల వంటి వివిధ కార్యకలాపాలతో సహా కోవర్ట్ యాక్షన్ కార్యక్రమాల కోసం $ 2.6 బిలియన్లు కేటాయించారు.

 

మూలాలు

[మార్చు]
  1. "History of the CIA". Central Intelligence Agency. Archived from the original on June 12, 2007. Retrieved March 28, 2014.
  2. 2.0 2.1 Gellman, Barton; Miller, Greg (August 29, 2013). "U.S. spy network's successes, failures and objectives detailed in 'black budget' summary". The Washington Post. Archived from the original on September 1, 2013. Retrieved August 29, 2013.
  3. Kopel, Dave (July 28, 1997). "CIA Budget: An Unnecessary Secret". Cato Institute. Archived from the original on February 14, 2021. Retrieved April 15, 2007.
  4. "Cloak Over the CIA Budget". The Washington Post. November 29, 1999. Archived from the original on September 16, 2018. Retrieved July 4, 2008 – via Federation of American Scientists.
  5. "Central Intelligence Agency | Encyclopedia.com". www.encyclopedia.com. Archived from the original on April 14, 2021. Retrieved 2022-01-05.
  6. "Appeals: the Company". Oxford English Dictionary (in ఇంగ్లీష్). Archived from the original on February 24, 2021. Retrieved 2022-01-05.
  7. "71. Presidential Directive on Coordination of Foreign Intelligence Activities". U.S. State Department Historian. January 22, 1946. Archived from the original on July 12, 2018. Retrieved January 19, 2022.
  8. "How does the FBI differ from the Central Intelligence Agency?". Federal Bureau of Investigation (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on February 22, 2023. Retrieved 2023-02-22.
  9. "Additional pre-hearing questions for Mr. John O. Brennan upon his nomination to be Director of the Central Intelligence Agency" (PDF). Senate Select Committee on Intelligence. 2013. Archived (PDF) from the original on March 17, 2023. Retrieved February 22, 2023.
  10. Woodward, Bob (November 18, 2001). "Secret CIA Units Playing Central Combat Role". The Washington Post. Archived from the original on May 14, 2011. Retrieved February 26, 2012.
  11. Phillips, Tom (October 23, 2006). "Paraguay in a spin about Bush's alleged 100,000 acre hideaway". The Guardian. London. Archived from the original on June 24, 2013. Retrieved April 18, 2011.
  12. Greg Grandin (2011).
  13. "Brazil Marks 40th Anniversary of Military Coup". nsarchive2.gwu.edu. Retrieved 2023-07-11.
  14. "CIA acknowledges involvement in Allende's overthrow, Pinochet's rise". సిఎన్‌ఎన్. 2000-09-19. Archived from the original on 2004-11-26.
  15. Carl Colby (director) (September 2011). The Man Nobody Knew: In Search of My Father, CIA Spymaster William Colby (Motion picture). New York City: Act 4 Entertainment. Archived from the original on April 9, 2019. Retrieved September 18, 2011.
  16. Historycommons.org: Operation Bojinka
  17. Homeland Security: Operation Bojinka Archived 2020-09-28 at the Wayback Machine.
  18. Weiner 2007, p. 468.
  19. Pedlow, Gregory W.; Welzenbach, Donald E. (1992). The Central Intelligence Agency and Overhead Reconnaissance: The U-2 and OXCART Programs, 1954–1974. Washington, D.C.: History Staff, Central Intelligence Agency. pp. 43–44. Archived from the original on August 18, 2013. Retrieved November 21, 2013.
  20. "Statement of the Director of Central Intelligence Regarding the Disclosure of the Aggregate Intelligence Budget for Fiscal Year 1997". Central Intelligence Agency. October 15, 1997. Archived from the original on June 12, 2007.