Coordinates: 20°01′26″N 75°10′45″E / 20.02389°N 75.17917°E / 20.02389; 75.17917

కైలాస దేవాలయం (ఎల్లోరా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కైలాస దేవాలయం
కైలాస దేవాలయం దృశ్యం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:మహారాష్ట్ర
జిల్లా:ఔరంగాబాద్
ప్రదేశం:ఎల్లోరా గుహలు
భౌగోళికాంశాలు:20°01′26″N 75°10′45″E / 20.02389°N 75.17917°E / 20.02389; 75.17917
చరిత్ర
నిర్మాత:కృష్ణ రాజా I (రాష్ట్రకూట రాజు)

కైలాస దేవాలయం భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని ఎల్లోరాలో ఉన్న గుహ దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం ఒకే రాతితో చెక్కబడిన అతి పెద్ద పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి. దీనిని  కైలాసం అని కూడా అంటారు. [1]ఒకే రాతితో ప్రత్యేకంగా చెక్కబడిన కైలాస దేవాలయం ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన గుహ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.[2] ఈ ఆలయం 276 అడుగుల పొడవు, 154 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇది కొండపై నుండి మొదలుకొని నిలువుగా నీడను కలిగి ఉంటుంది. ఈ ఏకశిలా ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 400,000 టన్నుల శిలలను వందల సంవత్సరాలుగా త్రవ్వించారని అంచనా. ఆలయ గోడలపై లభించిన ఉలి జాడల ఆధారంగా మూడు రకాల ఉలిలను ఉపయోగించారని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆలయ నిర్మాణం 46.92 మీటర్ల వెడల్పుతో పిరమిడ్ రూపంలో మూడు అంతస్తులు కలిగి ఉంది. ఎల్లోరా గుహలుగా పిలువబడే 34 గుహ దేవాలయాలలో కైలాస దేవాలయం ఒకటి. ఇది 16వ గుహ.[3] దీనిని 8వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట రాజు కృష్ణ రాజా I (సా.శ. 757-783) నిర్మించాడు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కాంటిలివర్డ్ రాక్ సీలింగ్‌ను కలిగి ఉంది.

చరిత్ర[మార్చు]

మరాఠీ ఇతిహాసం ప్రకారం స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో అతడి భార్య శివుడిని ప్రార్థించింది. రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని, ఆలయం గోపురం చూసేవరకు తాను ఉపవాసం ఉంటానని మొక్కుకుంది. వెంటనే ఆ రాజు కోలుకున్నాడు. రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్నకోకసా అనే శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని వందల ఏళ్లు పడుతుందని చెప్పాడు. దీంతో ఆలయాన్ని ముందు నుంచి కాకుండా కొండ పై భాగం నుంచి చెక్కుకుని వచ్చారు. ముందుగా ఆలయం గోపురాన్ని చెక్కి రాణిని ఉపవాస దీక్ష విరమించేలా చేశారు.[4]

ఆర్కిటెక్చర్[మార్చు]

ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద రెండు అంతస్తుల గోపురం ఉంది. ప్రవేశ ద్వారం వైపున శైవులు, వైష్ణవులు పూజించే దేవతల శిల్పాలు ఉన్నాయి. ప్రవేశ ద్వారం నుండి రెండు అంతర్గత ప్రాంగణాలు కనిపిస్తాయి, ప్రతి ఒక్కటి నిలువు ఆర్కేడ్‌తో సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తరం, దక్షిణ ప్రాంగణంలోని రాయిల మీద పెద్ద ఏనుగు చెక్కబడింది. రాష్ట్రకూట రాజులు తమ ఏనుగు దళంతో అనేక యుద్ధాల్లో గెలిచి, ఏనుగులను తమకు ఇష్టమైన జంతువులలో ఒకటిగా మార్చుకున్నారు. ఆలయంలో ఏనుగు శిల్పాలు ఉండటం రాష్ట్రకూట రాజుల బలాన్ని, శ్రేయస్సును సూచిస్తుంది. కైలాస ప్రధాన ఆలయంలో లోపల గోడపైన కమలంపై కూర్చున్న గజలక్ష్మి ప్రతిమ ఉంటుంది. ఆ ప్రతిమ వెనుక నాలుగు ఏనుగులు ఉన్నాయి. రెండు పెద్ద ఏనుగులలో ప్రతి ఒక్కటి పై వరుసలో ఒక కుండ నుండి గజలక్ష్మి మీద నీరు పోస్తున్నట్లు చిత్రీకరించబడింది, రెండు చిన్న ఏనుగులు దిగువ వరుసలో తామర చెరువు నుండి కుండలను నింపుతున్నట్లు చిత్రీకరించబడ్డాయి. శిఖరం దాని క్రింద అంతస్తునుండి 96 అడుగుల ఎత్తులో ఉంది. గర్భగుడి చుట్టూ ఒక చిన్న అంతరాల గది ఉంది, ఇది ఒక పెద్ద సభ-మండపం (స్తంభాల హాలు)తో కలిసి ఉంటుంది. దీనికి ప్రక్కల అర్ధమండపం, ముందు భాగంలో అగ్రమండపం ఉన్నాయి. నంది-మండపం, గోపురం, పూజా మందిర అగ్ర-మండపానికి మధ్య ఉంది, మూడు భాగాలను ఒకే రాయి దూలంతో కలిపారు. ప్రధాన ఆలయం పునాది పైన ఆలయ నిర్మాణ మొత్తం బరువును మోస్తున్నట్లుగా కనిపించే ఏనుగుల శిల్పాల వరుసలు ఉన్నాయి. కొండ ప్రక్కన ఉన్న ప్రదక్షిణ మార్గ ఆలయ ప్రాంగణంలో ఐదు వేరు వేరు దేవాలయాలు ఉన్నాయి, వీటిలో మూడు నదీ దేవతలకు అంకితం చేయబడ్డాయి: గంగా, యమునా, సరస్వతి.

ఆలయ నిర్మాణంలో రెండు వేర్వేరు 45 అడుగుల ఎత్తైన కీర్తి స్తంభాలు (విజయ స్తంభాలు) కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఈ స్తంభం పైన త్రిశూలం ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ప్రధాన ఆలయానికి ఇరువైపులా ధ్వజ స్తంభం వెనుక వెలుపలి గోడపై మహాభారతం, రామాయణం నుండి కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు చిత్రీకరించారు.[5] రామాయణం నుండి ఏడు వరుసలలో అనేక సన్నివేశాలను చిత్రీకరించారు. అవి: రాముడు అయోధ్య నుండి బయలుదేరిన దృశ్యాలు, భరతుడు తిరిగి రావడానికి ప్రయత్నించడం, శూర్పణఖ అటవీ దృశ్యాలు, రావణుడు సీతను అపహరించడం, రాముడు హనుమంతుడిని కలవడం, హనుమంతుడు సముద్రం దాటి లంకకు చేరుకోవడం, అశోకవనం, రావణుని ఆస్థానం, చివరి వరుసలో వానర సైన్యం లంకకు చేరుకోవడానికి రాళ్ల వంతెనను నిర్మించినట్లు చెక్కారు. అంతేకాకుండా మహాభారతం నుండి ఏడు వరుసలు ఉన్నాయి. అవి: కృష్ణుడి ప్రారంభ సాహసాలు దిగువ రెండు వరుసలలో చూపించబడ్డాయి, మహాభారత యుద్ధం, అర్జునుడి తపస్సు, మహాభారతంలో వివరించిన విధంగా కిరాత-అర్జునుల పోరాటం నుండి దృశ్యాలు మొదటి ఐదు వరుసలలో చిత్రీకరించబడ్డాయి. ప్రధాన ఆలయానికి దక్షిణం వైపున ఉన్న రావణమూర్తి త్రిమితీయ శిల్పం వలన ఈ ఆలయానికి "కైలాస" అని పేరు వచ్చింది. రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించడం అక్కడ శివుడు విశ్రాంతిలో కూర్చున్నట్లు, శివుని బొటనవేలు ఒత్తిడితో రావణుడి అహం తొక్కినట్లు చిత్రీకరించారు. గోపురం లేదా ప్రవేశ ద్వారం, ప్రవేశానికి ప్రధాన బిందువుగా పనిచేస్తుంది. ఒక మండపం నుండి మరొక మండపానికి వెళ్ళేటప్పుడు హాలు పరిమాణం, స్థలం చిన్నదిగా ఉంటుంది, కాంతి మసకబారుతుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు[6] చాల సార్లు ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు, 1000 మందికి పైగా కూలీలను పంపాడు. వారు 3 సంవత్సరాలకు పైగా రాత్రింబవళ్లు పనిచేశారు. కానీ ఔరంగజేబు ఆలయాన్ని ధ్వంసం చేయలేకపోయాడు.

గ్యాలరీ[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Kailasa: The Majestic Temple of Ellora". INDIAN CULTURE. Retrieved 2023-05-17.
  2. "Kailash Temple - Kailashnath Temple Aurangabad, Kailash Temple Aurangabad Maharashtra". www.maharashtratourism.net. Retrieved 2023-05-17.
  3. "Kailas Temple - Cave No: 16 | Travel Blog". www.travelblog.org. Retrieved 2023-05-17.
  4. Ghose, Indrani (2020-06-14). "Kailasa Temple: History and Interesting Facts of Ellora Cave 16". i Share. Retrieved 2023-05-17.
  5. "Kailasa: The Majestic Temple of Ellora". INDIAN CULTURE. Retrieved 2023-05-17.
  6. "Kailasa Temple, Ellora: Even Aurangzeb couldn't destroy it | Sanskriti - Hinduism and Indian Culture Website". 2022-06-06. Retrieved 2023-05-17.