కొండపేట కమాల్
కొండపేట కమాల్ | |
---|---|
జననం | గుర్రంపాటి కమాల్ సాహెబ్ ఫిబ్రవరి 12, 1915 కొండపేట, కడప జిల్లా |
మరణం | అక్టోబర్ 31, 1974 |
ప్రసిద్ధి | రంగస్థల నటుడు |
తండ్రి | హుసేన్ సాహెబ్ |
కొండపేట కమాల్ రంగస్థల నటుడు. ఇతడు వైఎస్ఆర్ జిల్లా కొండపేట వాస్తవ్యుడు. చిన్నతనంలో తురిమెల్ల నాటక కంపెనీలో చేరి కృష్ణుడు, కనకసేనుడు, ప్రహ్లాదుడు మొదలైన పాత్రలను ధరించాడు. ఇతడు డి.వి.నరసింహారావు శిక్షణలో సత్యభామ పాత్రకు కొత్తగా రూపురేఖలు దిద్దుకున్నాడు. ఇతడు "రాయలసీమ స్థానం" అనే బిరుదు గడించాడు. తాడిపత్రిలో స్థానం నరసింహారావు ఎదుట సత్యభామ వేషాన్ని ధరించి అతడి ప్రశంసలను అందుకున్నాడు. ఇంకా ఇతడు చిత్రాంగి, చింతామణి పాత్రలలో రాణించాడు. పద్యం చదవడంలో భావం వ్యక్తం చేయడంలో మంది గుర్తింపు పొందాడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]అతను స్త్రీ పాత్ర నిర్వహణలో దిట్ట. అతను 1915 ఫిబ్రవరి 12న కడప జిల్లా కొండపేటలో జన్మించాడు. అతని తండ్రి పేరు హుసేన్ సాహెబ్. నిరుపేద కుటుంబంలో పుట్టిన కమాల్ సాహెబ్ ఐదవ తరగతి చదువుతోనే విద్యాభ్యాసం ముగిసింది. పదకొండవ సంవత్సరంలోనే కమ్మగా పాడే కమాల్ సాహెబ్ ను, గాజుల లక్ష్మయ్య చేరదీసాడు. లవకుశ నాటకంలో నటింపజేసాడు. నాటి ప్రదర్శనలో కమాల్ సాహెబ్ నటన, శ్రావ్యమైన గాత్రం నటుడిగా ముందుగా వెళ్ళడానికి తోడ్పడింది. అతను డి.వి.నరసింహారావు దగ్గర శాస్త్రీయ సంగీతం చేర్చుకున్న తరువాత రామదాసు, కృష్ణలీల, తులాభారంలో నటించాడు. తురిమెళ్ళవారి మాధవ విలాస నాటక సమాజం నలభైమంది నటులతో రాయలసీమ ప్రాంతంలో నాటకాలు ప్రదర్శిస్తుండేది. కమల్ సాహెబ్ ఆ సమాజంలో చేరి రంగూన్ రౌడి, చింతామణి, హరిశ్చంద్ర, పాదుకా పట్టాభిషేకం మొదలైన నాటకాలలో నటించి మంచి నటుడుగా పేరుతెచ్చుకున్నాడు. 1935లో రామవిలాస సభ తరపున కడపలో ప్రదర్శించిన రామదాసు, చండిక, పాదుక మొదలైన నాటకాలలో బళ్ళారి రాఘవ, దౌడ్డన గౌడ, పద్మావతి దేవి బృందంతో కలిసి నటించాడు.స్త్రీ పాత్ర నిర్వహణలో సహజత్వాన్ని కనబరచిన కమాల్ సాహెబ్ తరువాత నాటకాలలో సత్యభామ, సక్కుబాయి, చింతామణి, కైక, ముర, చంద్రమతి, సావిత్రి, తార, యశోద, పద్మావతి పాత్రలలో నటించి స్థానం నరసింహారావు, బళ్ళారి రాఘవ, జాషువా ల మెప్పును పొందాడు. అతను మహమ్మదీయుడైనప్పటికీ నటనలో కులమతాలు లేవని, హిందూ మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక, పౌరాణిక పాత్రలలో నటించి నటనా రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇతడు జయప్రద సినిమాలోఋషి వేషం వేసి "మార్గమదేదో గాంచుడీ... దేహము నిత్యము కాదిది వినుడీ" అనే తత్వగేయాన్ని పాడాడు. 1970లో విడుదలైన యమలోకపు గూఢచారి సినిమాలో హరనాథ్‌కు ఒక పద్యం పాడాడు.[2]
1962 వరకు సురభి సమాజం ప్రదర్శించిన నాటకాలలో నటించాడు. ప్రదర్శనాపరంగా లభించిన డబ్బును అనాథ పిల్లల కోసం, నిరుపేదల కోసం, స్కూళ్ళ నిర్మాణాల కోసం విరాళంగా ఇచ్చాడు. అతను నటించిన నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోనే కాక బెంగళూరు, మైసూరు, మద్రాసు లలోనూ మెప్పును పొందాయి. నాటక రంగం కోసం పనిచేసిన అతనిని అనేక పరిషత్తులు అభినందించాయి. సువర్ణ పతకాలతో సత్కరించాయి. 1971 లో ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘానికి అనుబంధంగా ఉన్న రాయలసీమ ప్రాంతీయ సంఘం "నాటక కళాధురీణ" బిరుదునిచ్చి గౌరవించింది.[3]
మరణం
[మార్చు]ఇతడు 1974, అక్టోబర్ 31వ తేదీన కొండపేట, చెన్నూరుల మధ్య పెన్నానదిని దాటుతూ ప్రమాద వశాన మరణించాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ కడపజిల్లా నాటకరత్నాలు[permanent dead link]
- ↑ తవ్వా ఓబుల్‌రెడ్డి (2 February 2022). "స్త్రీ పాత్రలతో రంజింపజేసిన కొండపేట కమాల్". మన తెలంగాణ. Archived from the original on 2 ఫిబ్రవరి 2022. Retrieved 2 February 2022.
- ↑ మిసిమి మాసపత్రిక, అక్టోబరు 2016, పుట 18
- ↑ తవ్వా ఓబుల్ రెడ్డీ. "కొండపేట కమాల్ రంగస్థల నటుడు". కడప.ఇన్‌ఫో. Retrieved 2 February 2022.