కొటికలపూడి వెంకటకృష్ణయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొటికలపూడి వెంకటకృష్ణయ్య
జననం1764
బొబ్బిలి
మరణం1838
ప్రసిద్ధితెలుగు కవి
పిల్లలుకోదండరామయ్య
తండ్రివెంకటరామయ్య

కొటికలపూడి వెంకటకృష్ణయ్యతెలుగు కవి. ఇతడు సా.శ. 1764 లో జన్మించాడు. ఇతని ముత్తాత వల్లంభట్లు వేదాంత విశారదుడు. అలాగే తాత శివరామయ్య సాహిత్య భోజుడు. ఇక తండ్రి వెంకటరామయ్య మహా ప్రబంధుడు. కొటికలపూడి వంశస్థులు బొబ్బిలి సంస్థానాధీశులకు పురోహితులుగా సేవలందించేవారు. అలాగే జ్యోతిష్యం చెప్పడంలో కూడా సిద్ధహస్తులు. విద్యార్థిగా ఉన్నప్పుడే వెంకటకృష్ణయ్య ఎవరూ తెనిగించడానికి సాహసించని మేఘసందేశమును అనువదించాడు. అయితే ప్రస్తుతం ఈ కావ్యానికి సంబంధించి కేవలం ద్వితీయ సర్గ మాత్రమే లభిస్తోంది. ఈ కావ్యాన్ని వెంకటకృష్ణయ్య శ్రీరాముని పాదపద్మాలకు అంకితమిచ్చాడు. ఇదే క్రమంలో దిలీప చరిత్ర అనే కావ్యాన్ని వ్రాశాడు. మంజువాణి పత్రికలో మంత్రిప్రగడ భుజంగరావు దీనిని గురించి పేర్కొన్నారు. ఈ కావ్యంలో వెంకటకృష్ణయ్య పాద గోపన చంపకమాల, బహువిధత్రికంద గర్భిత సీసం, నాగ బంధ చంపకమాల, చక్రబంధ శార్దూలం లాంటి చిత్ర కవిత్వాలను వాడాడు. ఈ కావ్యం వెంకటకృష్ణయ్యకు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టింది.

కావ్యాంకితాలు

[మార్చు]

వెంకటకృష్ణయ్య కవితా ప్రతిభకు అచ్చెరువొందిన బొబ్బిలి చిన రంగారావు గారు ఆయనకు రామునివలస గ్రామాన్ని కానుకగా ఇచ్చారు. బొబ్బిలి తర్వాతి తరం వారసుడైన రాయుడప్ప రంగారావు వెంకటకృష్ణయ్యను గురువుగా భావించేవాడు. పద్మ పురాణంలోని శ్వేతాచల మహాత్యాన్ని వెంకటకృష్ణయ్య తెనిగించాక, ఆ కావ్యాన్ని రాయుడప్పకే అంకితమిచ్చాడు. రాయుడప్ప తన గురువు మీద గౌరవంతో తన కుమారుడికి శ్వేతా చలపతి అని నామకరణం చేశాడు. సా.శ. 1810 లో వెంకటకృష్ణయ్య అగ్నిష్ఠోమం చేసి సోమయాజిగా మారాడు. బొబ్బిలి దివానుగా పనిచేసిన ఇనుగంటి సీతారామయ్యకు కూడా వెంకటకృష్ణయ్య అనేక గ్రంథాలను అంకితమిచ్చాడు. రాయుడప్ప వేదాంతం మీద ప్రేమతో సంకల్ప సూర్యోదయాన్ని తెనిగించగా, ఆ గ్రంథానికి మూలమైన ప్రబోధ చంద్రోదయాన్ని వెంకటకృష్ణయ్య ఆంధ్రీకరించాడు.  [1]

కుటుంబ విశేషాలు

[మార్చు]

వెంకటకృష్ణయ్యకు ఏడుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. ఈయన నాలుగో కుమారుడైన కోదండరామయ్య కూడా కవిగా పేరుగాంచాడు. 74 సంవత్సరాలు జీవించిన వెంకటకృష్ణయ్య సా.శ. 1838 లో స్వర్గస్థుడయ్యాడు.

మూలములు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఆరుద్ర, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, తేది: 2019-11-12