కొర్రపాటి వెంకటరత్నం
కొర్రపాటి వెంకటరత్నం | |
---|---|
జననం | చలపనాయుడుపల్లి, ఆత్మకూరు మండలం, నెల్లూరు జిల్లా | 1943 మే 23
మరణం | 2024 మార్చి 20 నెల్లూరు | (వయసు 80)
వృత్తి | విద్యావేత్త |
తల్లిదండ్రులు |
|
కె. వి. రత్నం గా ప్రసిద్ధుడైన కొర్రపాటి వెంకటరత్నం (మే 23, 1943 - మార్చి 20, 2024) నెల్లూరు జిల్లాకు చెందిన విద్యావేత్త, రత్నం విద్యాసంస్థల అధినేత.
జీవితం
[మార్చు]వెంకటరత్నం మే 23, 1943 న నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలం, చలపనాయుడుపల్లిలో ఒక సాధారణ రైతు కుటుంబంలో కొర్రపాటి ఈశ్వరనాయుడు, సుశీలమ్మ దంపతులకు జన్మించాడు. ఆత్మకూరులో పదో తరగతి పూర్తి చేశాడు. 1961-62లో పియుసి పూర్తి చేశాడు. 1963-66 లో నెల్లూరులోని వి. ఆర్. కళాశాల నుంచి బిఎస్సీ రసాయన శాస్త్రంలో డిగ్రీ సాధించాడు. 1966లో అదే కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా చేరాడు. అదే సంవత్సరంలో నెల్లూరు రజక వీధిలో జయంతి ట్యుటోరియల్స్ పేరుతో శిక్షణా సంస్థను ప్రారంభించాడు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేవాడు. శిక్షణ విషయంలో చాలా క్రమశిక్షణ పాటించేవాడు. నారాయణ విద్యాసంస్థల అధినేత పి. నారాయణను కూడా ప్రోత్సహించి ఆయన సంస్థకు పోటీ ఆయనే తయారు చేసుకున్నాడు.[1] 1983 లో రాష్ట్రంలో తొలిసారిగా రత్నం కోచింగ్ సెంటర్ ప్రారంభించాడు. 1985 లో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత రత్నం కళాశాల అభివృద్ధికి తన సమయాన్ని వెచ్చిస్తూ రాష్ట్రంలో ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటిగా నిలిపాడు. 2005 లో చిన్నారి హార్ట్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి 140 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేయించాడు. మూడేళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతూ మార్చి 20, 2024న నెల్లూరులో హరనాథపురంలోని తన స్వగృహంలో మరణించాడు.[2]
ఈయన భార్య పద్మావతి. వీరికి వేణుగోపాల్, కిషోర్ అనే కుమారులు ఉన్నారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ అల్లూర్, రహీం. "చదువుల కల్పవృక్షం కూలిపోయింది". జమీన్ రైతు.
- ↑ ABN (2024-03-21). "విద్యా'రత్నం' ఇకలేరు". Andhrajyothy Telugu News. Retrieved 2024-03-21.
- ↑ Rao, M. Srinivasa (2024-03-21). "Nellore: Ratnam Institutions founder KV Ratnam passes away". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-03-21.