కోడూరి లీలావతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోడూరి లీలావతి బహుముఖ ప్రజ్ఞావంతురాలు. ఆమె బాలసాహితీవేత్త, సంగీత విద్వాంసురాలు, సాహితీవేత్త, వీణా విద్వాంసురాలు. స్వాతంత్ర్య సమరయోధురాలు, అనువాదకురాలు, రెండు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాహిత్య అకాడమీ అవార్డులు పొందిన రచయిత్రి.

జీవిత విశేషాలు[మార్చు]

ఆమె తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 1919 సెప్టెంబరు 19న దేవత శ్రీరామమూర్తి, లక్ష్మీదేవమ్మ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు. తండ్రి నుంచి జాతీయోద్యమ పోరాటం, కళాభిరుచి ఆమెకు వారసత్వంగా సంక్రమించాయి. గృహిణిగా కుటుంబాన్ని ఉన్నతంగా దిద్దుకుంటూనే సంగీత, సాహిత్యాలకు అంకితమయ్యారు.

రచనా ప్రస్థానం[మార్చు]

1958లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన బాలసాహిత్య పోటీలలో ఆమె రచించిన నాటికల సంపుటి ‘బాలవినోదిని’ బహుమతికి ఎంపికైంది. అప్పటికే ఆమె బాలసాహిత్యంలో రచయిత్రిగా తన స్థానాన్ని పదిలపరుచుకుంది. 1961లో రవీంద్రనాథ్ ఠాగూర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన బాల సాహిత్య పోటీలలో ఆమె కుమారుడు శ్రీరామమూర్తితో కలసి సంయుక్తంగా రచించిన "రవికవి"కు బహుమతి వచ్చింది. 1968, 1969, 1970లలో వరుసగా మూడేళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలసాహిత్య విభాగపోటీలలో ఆమె రచనలు బాలచంద్రిక (బాలలనాటికల సంపుటి), ఆశాకిరణం (బాలలనవల), ‘కుంకుమరేఖ’ (కస్తూరిబా గాంధీ జీవిత విశేషాల ఆధారంగా రూపొందిన రచన) లు బహుమతులను సాధించుకున్నాయి. 1981లో పదేళ్ళ విరామానంతరం ‘సరోజినీనాయుడు’ జీవితగాథ భూమికగా రచించిన ‘ఇంద్రధనుస్సు’ అనే గ్రంథానికి బహుమతి లభించింది. వీటిలో ‘కుంకుమరేఖ’, ‘ఇంద్రధనుస్సు’ రచనలు రెండూ సాహిత్య అకాడమీ అవార్డులు సాధించిపెట్టాయి. ‘కుంకుమరేఖ’ ఇప్పటికి మూడు ముద్రణలుగా వచ్చింది. 1970లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ‘కుంకుమరేఖ’ను ధారావాహికంగా ప్రచురించింది.[1]

ఆమె రచించిన "గృహ నిర్వాహణ శాస్త్రం" నకు తెలుగు సమితివారు బహుమతిని అందజేసారు. "గృహవిజ్ఞానం" గ్రంథానికి కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖవారు బహుమతినిచ్చి గౌరవించారు. స్త్రీల సమస్యలను సున్నితంగా అర్ధం చేసుకోగలిగిన లీలావతి - విలక్షణ పార్శ్వాలను ఆవిష్కరించింది. రాజమహేంద్రవరం చరిత్ర గూర్చి ఆమె ‘జయవిపంచి’ మకుటంతో చారిత్రిక నవలను రచించింది. ఆమె రచనలు ఆకాశవాణిలో ప్రసారమవ్వడమే కాక అనేక పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆమె రచనలు కొన్ని ఇతర భారతీయ భాషలలోకి అనువాదం అయ్యాయి. అమెరికా సమాచారశాఖ కోరిక మేరకు కొన్ని ఆమె ఆంగ్ల రచనలను తెలుగులోకి తర్జుమా చేసింది. కొన్నేళ్ళపాటు ‘ఉదయరేఖ’ అనే వారపత్రికకు సంపాదకురాలిగా వ్యవహరించింది. ఈ వారపత్రిక రాజమండ్రి నుండి వెలువడేది. సరోజినీనాయుడు జీవితాన్ని ఆవిష్కరించిన ‘ఇంద్రధనుస్సు’ రచనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్నేళ్ళపాటు 7వ తరగతి విద్యార్థులకు ఉపవాచకంగా ఏర్పరచింది.

ఆమె రచనలపై పరిశోధనా విద్యార్థులు పత్ర సమర్పణ చేసి, ఎం.ఫిల్‌. పట్టా పొందారు. సంగీత విద్వాంసురాలైన పూర్వరంగంలో, ఆమె ఆకాశవాణిలో అనేక సంగీత కార్యక్రమాలనిచ్చింది.

బిరుదులు[మార్చు]

లీలావతి సంగీత కృషిని గుర్తిస్తూ నాటి ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి ‘వీణా విశారద’ బిరుదుతో ఘనంగా సన్మానించారు. అప్పటి ఆస్థానకవి శ్రీపాదకృష్ణమూర్తి ‘కవయిత్రీమణి’ బిరుదతో అపూర్వసత్కారం చేశారు. మద్రాసు కేసరికుటీరంవారు ‘గృహలక్ష్మి’ బిరుదుతో స్వర్ణకంకణాన్ని బహూకరించారు.

నిర్వహించిన పదవులు[మార్చు]

వివిధరంగాల కృషి నేపథ్యంలో ఆమెను అనేక పదవులు వరించాయి. సంగీత నాటక అకాడమీ కార్యనిర్వాహక సభ్యులుగాను, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ సభ్యులుగాను, రచయిత్రుల సలహామండలి సభ్యులుగాను, బాలల అకాడమీ సభ్యులుగాను, ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనెట్‌ సభ్యులుగాను, ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర కార్యక్రమ సలహామండలి సభ్యులుగానూ వ్యవహరించి, ఆ పదవులకే వన్నె తెచ్చారు లీలావతి. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక అంశాలకు సంబంధించిన ఏ విషయం పైనైనా శ్రోతలను ఆకట్టుకొనే విధంగా అనర్గళంగా ప్రసంగించగల వక్త.

1991 ఏప్రిల్‌ 16న ఆమె మరణించింది.

రచనలు[మార్చు]

  • కుంకుమరేఖ
  • రవికవి (రవీంద్రనాథ్ టాగూర్ జీవిత చరిత్ర) (కోడూరి శ్రీరామమూర్తి సహరచయిత)

పురస్కారాలు[మార్చు]

కోడూరి లీలావతి స్మారక సాహితీ పురస్కారం[మార్చు]

ఈ పురస్కారాన్ని అందుకున్న కొందరు ప్రముఖులు

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". www.andhrajyothy.com. Archived from the original on 2020-12-02. Retrieved 2020-04-28.