గట్టు రాధిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గట్టు రాధిక
జననంగట్టు రాధిక
నివాస ప్రాంతంహన్మకొండ
ప్రసిద్ధితెలుగు సాహితీకారిణి

రాధిక పలు తెలుగు సాహితీ ప్రక్రియలలో రచనలు చేస్తున్న రచయిత్రి.

జననం , బాల్యం

[మార్చు]

వరంగల్ జిల్లా స్టేషన్ ఘణపూర్ రాధిక జన్మస్థలం. తండ్రి కిష్టయ్య, తల్లి వెంకటమ్మ. తను పుట్టిన 6 నెలలకే అమ్మను, 9 సంవత్సరాలకే నాన్నను కోల్పోయింది. అమ్మానాన్నల ఆలంబన ఎరగదు. అన్నలు, అక్కలు, వదినలు అల్లారుముద్దుగా పెంచారు.

విద్యాభ్యాసం

[మార్చు]

రాధిక పదవ తరగతి దాకా స్వగ్రామంలో చదివి, పెద్ద పెండ్యాలలో ఇంటర్ పూర్తి చేసింది. టిటిసి ఎంట్రన్స్ టెస్ట్ లో వరంగల్ జిల్లా వుమన్ టాపర్ గా నిలిచింది. అనంతరం ఎంసెట్ రాసి కాకతీయ యూనివర్సిటీలో బీఫార్మసీలో ఫ్రీ సీటుని సంపాదించుకుంది. కానీ మొదటి సంవత్సరంలో ఉండగానే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం రావడంతో బీఫార్మసీని వదిలేసింది. 19 ఏళ్ల వయసులో (1998) ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా జఫర్గడ్ మండలంలో ఆమె కొత్త జీవితం ప్రారంభమైంది. వైవాహిక జీవన గమనంలో భర్త ఇచ్చిన అనూహ్యమైన ప్రోత్సాహంతో బీఎస్సీ, బీఈడీ, ఎమ్మెస్సీ పూర్తి చేసింది. 2009లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గా ప్రమోషన్ పొందింది.

వివాహం

[మార్చు]

రాధిక వివాహం 1998లో వలుగుల రామ్ మోహన్ తో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.. సంహిత, సాయి వర్షిత్

సాహితీ కృషి

[మార్చు]

రాధికకు ఇంటర్ లో ఉన్నప్పుడు కవితలు రాసే ఆసక్తి మొదలైంది. తన బాధలు, సంతోషాలను కాగితాల వేదికపై పదాలుగా రాసుకునేది. కవిత్వం రాయడం మొదలు పెట్టాక తల్లిదండ్రుల జ్ఞాపకార్ధంగా వారి పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకొని (వెంకటమ్మ, కిష్టయ్య) 'వెంకి'గా తన కలం పేరు పెట్టుకున్నది. 2017 నుంచి కవిత్వం పట్ల మరింత శ్రద్ధ పెంచుకున్నది. స్త్రీల సమస్యలు, సామాజికంగా, ఆర్థికంగా, శారీరకంగా, నైతికంగా వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద ఎక్కువ కవితలు రాసింది. అలాంటి కవితలలో కొన్నింటిని కూర్చి 2018లో 'ఆమె తప్పిపోయింది' అనే పుస్తకంగా వెలువరించింది. దానితో స్త్రీవాద కవయిత్రిగా ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో పేరు పొందింది. చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, పదునుగా అభివ్యక్తీకరించడం రాధిక రచనల్లో కనిపిస్తుంది. ఆమె మరో వైపు షార్ట్ ఫిల్మ్స్ కోసం కథలు, మాటలు, స్క్రీన్ ప్లే రాస్తూ పాటలను కూడా రాస్తున్నది.

ప్రచురించిన పుస్తకాలు

[మార్చు]

● ఆమె తప్పిపోయింది (వచన కవితల సంకలనం) - 2018

సామాజిక సేవ

[మార్చు]

ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, డాక్టర్ కడియం కావ్య లాంటి సామాజిక కార్యకర్తల సహకారంతో ఆడ పిల్లల సంక్షేమం కోసం ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నది. డబ్బులు లేక చదువుకోలేని పిల్లల కొరకు తన ఫేస్ బుక్ వేదిక ద్వారా విరాళాలు సేకరించి, వారికి అందించి ప్రోత్సహించింది.

పొందిన అవార్డులు

[మార్చు]

• గణిత జ్యోతి అవార్డు

• గణిత స్ఫూర్తి అవార్డు

• వరంగల్ అర్బన్ జిల్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

• బీసి టీచర్స్ యూనియన్ నుండి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

• లయన్స్ క్లబ్ వారి నుండి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

• జాతీయ సాహిత్య స్ఫూర్తి అవార్డు

• మిట్టపల్లి నరసయ్య సాహితీ పురస్కారం

• కలం భూషణ్ అవార్డు

• అకడమిక్ అచీవ్మెంట్ అవార్డు అసోసియేషన్ నుండి ఎ ప్రైడ్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ బిరుదు

మూలాలు

[మార్చు]
  • గోదావరి పత్రికలో రాధిక ఇంటర్వ్యూ [1] Archived 2021-07-13 at the Wayback Machine
  • నవతెలంగాణ పత్రికలో ప్రచురితమైన కథనం