Jump to content

గాంధీ-ఇర్విన్ సంధి

వికీపీడియా నుండి
(గాంధీ ఇర్విన్ ఒప్పందం నుండి దారిమార్పు చెందింది)

గాంధీ-ఇర్విన్ సంధి (1931 మార్చి 5) భారతదేశ స్వరాజ్య సంగ్రామ చరిత్రలో జరిగిన విశేష చరిత్రాంశములలోనొకటి. అప్పటిలో (1926-1931) బ్రిటిష్ ఇండియాను వైస్రాయ్ (గవర్నర్ జనరల్) ఇర్విన్ ప్రభువు పరిపాలించుచుండెను. 1920 నాటికి భారతీయులలో స్వరాజ్య కాంక్ష ప్రబలమైయున్నది. బ్రిటిష్ ప్రభుత్వము వారు ఆంక్షలు, నిర్బంధములు విధించి, అనేక స్వాతంత్ర్య నిరోధక శాసనములు, చట్టములు చేసి స్వరాజ్యకాంక్షను రూపుమాపుటకు ప్రయత్నించిననూ, ఉపశమునముగా కొన్ని సంస్కరణలు చేపట్టిననూ, భారతదేశ ప్రజలు, కాంగ్రెస్ నాయకత్వము స్వరాజ్య కాంక్ష విడనాడక 1920 నుండి గాంధీజీ ప్రారంభించిన సహాయనిరాకరణ (non co-operation) అను స్వరాజ్యోద్యమములతో స్వాతంత్ర్య సమరయోధము ఇంకా జోరుగా సాగించారు. కాని చౌరి చౌరాలో జరిగిన హింసాత్మక చర్యల వలన 1922లో సహాయనిరాకరణోద్యమము విరమించెను. మరల 1930 మార్చిలో గాంధీ ఇంకో సహాయనిరాకరణోద్యమము (civil disobedience) ప్రారంభించి 12 నెలలు సాగిన తరువాత 1931 మార్చి 5 తారీఖున ఢిల్లీలో వైస్రాయి ఇర్విన్ గాంధీతో చేసుకున్న వడంబడికతో విరమించెను. ఆ సత్యాగ్రహ విరామ సంధియే గాంధీ-ఇర్విన్ సంధిగా ప్రసిధ్ది చెందినది. ఆ సంధి పత్రములోని ఒడంబడికలు ఇర్విన్ ప్రభువు వెడలిపోయిన సంవత్సరములోనే విచ్ఛిన్నమై బ్రిటిష్ ప్రభుత్వము వారు తిరిగి తమ కఠోర వైఖరితో భారతదేశ స్వరాజ్యోద్యమములను నిర్మూలించ ప్రయత్నించారు.

1930-1931 స్వరాజ్య ఉద్యమ చరిత్ర, ఇర్విన్ దొర గాంధీజీ తో సంధి చేసిన పరిస్థితులు

[మార్చు]

18 వ శతాబ్దము నుండి క్రమేణా రాజ్యతంత్రములు, అనేక యుద్ధములు, చేసి స్వతంత్ర రాజ్యములను కబళించి బ్రిటిష్ వారు వలసరాజ్య స్థాపనచేసి 19 వ శతాబ్దము మధ్య నుండి భారతదేశములోని కొన్ని ప్రాంతములను వలస రాజ్యముగా పరిపాలించ ప్రారంభించి శతాబ్దాంతమునకు యావద్భారతదేశమును బ్రిటిష్ ఇండియాగా చేసి పరిపాలన సాగించారు. 1857 సిపాయల విప్లవముతో పరిపాలనా యంత్రాంగము కట్టుదిట్టము చేసి తమ పరిపాలనతో అసంతృప్తి చెందిన వారికి ఉపశమనములుగా కొన్ని రాజకీయ సంస్కరణలు చేసి దేశాభివృధ్ది, ప్రజాక్షేమ కార్యక్రమములు కొన్ని చేశారు. కానీ 20 వ శతాబ్దారంభమములో భారతదేశములో జాతీయ చైతన్యము కలిగి స్వరాజ్యము కోసము ఉద్భవించిన పోరాటమనే అగ్నిమంటలు రగులుకుని, రాజకీయ పరిజ్ఞానము కలిగి జాతీయ కాంగ్రెస్ మహాసభ స్థాపింపబడి మహామేధావులైన జాతీయ నాయకులు ముందుకు వచ్చి (ఆటువంటి కొందరిని స్మరించక తప్పదు) సురేంద్రనాథ్ బెనర్జీ, మహాదేవ గోవింద రానెడే, దాదాభాయి నౌరోజీ, అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ (ఎ.ఒ హ్యూమ్), గోపాలకృష్ణ గోఖలే, అనీబిసెంట్, బాలగంగాధర తిలక్ మార్గదర్శకత్వములో కొనసాగి 1920 నుండి మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (గాంధీజీ) నాయకత్వములో స్వరాజ్య సంగ్రామము ముందుకు సాగుట మొదలైనది. అప్పటికే ఎందరో స్వతంత్రయోధుల జీవితములు స్వతంత్ర పోరాటముకోసము ఆహుతి కాబడినవి. భ్రిటిష్ ప్రభుత్వము ఎంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, నానాటికీ బలపడుతున్న స్వరాజ్యోద్యమముల దృష్ట్యా ఇర్విన్ ప్రభుత్వము గాంధీజీతో సంధి చేయుట తటస్థించింది. గాంధీజీ భారతదేశానికి వచ్చే నాటికే (1915) ఇచ్చట స్వరాజ్యకాంక్ష, రాజకీయ పరిజ్ఞానము, జాతీయాభిమానములతో చైతన్యము కలిగినయున్నాయి (చూడు వందేమాతరం ఉద్యమము, హోమ్ రూల్ స్వరాజ్యోద్యమము, విప్లవోద్యమము). గాంధీగారు 1915 లో స్వరాజ్య చైతన్య రథములో ప్రవేశించిన కొద్ది కాలమునకే వచ్చిన రౌలట్ చట్టంను గూర్చి చైతన్యము తీసుకువచ్చుటకు గాంధీజీ గొప్ప ప్రచారము చేసి ఆ చట్టమును (బిల్లును) ఆపుచేయుటకు చేసిన ఆందోళనలకు నాయకత్వము వహించాడు. 1919 ఏప్రిల్ 6 తేదీన దేశంలో శాంతియుత హార్తాళ్ తో ఆందోళనలు జరిగెను. 1920లో బాలగంగాధర తిలక్ మరణించిన తరువాత నుండి గాంధీగారి నాయకత్వములో ఉద్బవించిన స్వరాజ్య పోరాటమునకు ప్రయోగించిన అహింసాయుత అస్త్రము; సత్యాగ్రహము. సత్యాగ్రహ సాధనకు అనేక ఉద్యమములు ఆరంభించెను. సహాయనికారణోద్యమము ( (non cooperation and civil disobedience movement), ఉప్పు సత్యాగ్రహము, విదేశ వస్తు బహిష్కరణ మొదలగునవి. గాంధీ-ఇర్విన్ సంధి జరిగేనాటి (1931) పరిస్థితులలో ప్రముఖమైన వాటిని వివరించక తప్పదు. 1929 డిసెంబరు మాసమున లాహోరు సదస్సులో కాంగ్రెస్ ప్రకటించిన లక్ష్యసాధన పూర్ణస్వరాజ్యము అందుకు చేపట్టిన ఉద్యమము సహాయనిరాకరణ (Civil Disobedience ) [1][2]
(1)1930 నాటి సహాయనిరాకరణోద్యమము: బ్రిటిష్ ప్రభుత్వపు నిరంకుశ వైఖరి మార్చుటకు గాంధీ చేపట్టిన మార్గము సత్యాగ్రహము ( నిజమును వక్కాణించుట). అహింసామార్గమునచేయు ఆందోళన విధానమునే భారతదేశానికి స్వరాజ్యము సంపాదించుటకు గాంధీజీ మూడు దశాబ్దములపాటు ( 1915 నుండి 1945 దాక) వివిధ పద్ధతులలో చేపట్టెను. గాంధీ చేపట్టిన సత్యాగ్రహ విధానములు ఆంగ్లములో non co-operation, civil disobedience అను మాటలకు తెలుగులో ఒకే పదములో సహాయనిరాకరణమని చెప్పినప్పటికిని వీటి వెనుకయున్న అర్థము, ఉద్దేశ్యము, ప్రభావములలో వ్యత్యాసముగలదు. (చూడు సత్యాగ్రహ చరిత్ర). 1920లో చేపట్టిన సహాయనిరాకరణము (non cooperation) ఉద్యమము. 1930లో గాందీ చేపట్టిన సహాయ నిరకరణము చట్ట ఉల్లంఘనమైన ఉద్యమము (రాజద్రోహముగా పరిగణింపబడినది). ఇది స్వరాజ్యము కోసము చేసిన పోరాటములో ఒక భాగము. భారతదేశపు రాజకీయములలో గాంధీజీ తొలి ప్రయత్నముగా 1917లో చంపారణలోని ఇండిగో సాగుచేయు రైతులపట్ల జరుగు అన్యాయపు కౌలుదారి అరికట్టుటకు చేసినది కూడా శాసనోల్లంఘనమే (జిల్లా మెజిస్ట్రేట్ ఉత్తర్వులను తిరస్కరించి జిల్లాలో ప్రవేశించి రైతుల వాంగ్మూలములు గ్రహించెను). అది రైతుల ఆర్థిక స్థితి బాగుపరచుటకు చేసినది (రాజద్రోహముగ పరిగణించబడేదు). గాంధీచేసిన మొట్టమొదటి చట్ట ఉల్లంఘన సహాయనిరాకరణ కార్యాచరణ అనవచ్చును (civil disobedience). 1930 మార్చి 12 వ తేదిన గాంధీ తన సహాయనిరాకరణోద్యమమును ఆరంభించి చట్ట ఉల్లంఘన చేయదలచినటుల ప్రకటించెను. వైస్రాయి లార్డు ఇర్విన్ మొదట ఆ ఉద్యమమును చులకనగా తీసుకుని వేచి చూడమను సిద్దాంతము వహించెను. కానీ గాంధీ ఆరంభించిన ఆ ఉద్యమము యావత్తు దేశమున విద్యత్ శక్తివలే ప్రాకి ప్రతి జిల్లాలోను అనేక గాంధీ ల నాయకత్వము క్రింద వేలాది ప్రజలు అవలంబించటం చూసి ఇర్విన్ ప్రభుత్వము తీవ్ర నిర్బంధ విధానము ప్రారంభించెను
(2) ఉప్పు సత్యాగ్రహము: 1930 సహాయ నిరాకరణ ఉద్యమము ముఖ్యముగా శాసనోల్లంఘన ఉద్యమము. గాంధీ నిశ్చయించిన ఉప్పుచట్ట తిరస్కారమే ఉప్పు సత్యాగ్రహమముగా ప్రసిధ్ధి చెందినది. ఉప్పు తయారు చేయు నిబంధనలను బ్రిటిష్ ప్రభుత్వము వారు 1878నుండి శాసనముగా చేసి ఉప్పుతయారిని ప్రభుత్వపరముచేసిరి. వ్యక్తిగతముగా ఉప్పుతయారుచేయుట ఉప్పును కుదవపెట్టుట నేరాలు క్రింద పరిగణింపబడుతున్నాయి. అంతేకాక తమ లాభములు పెంచుకొనటకు ఉప్పుపై పన్నును అధికముచేసిరి. అట్టి ఆర్థికలాభాపేక్షతో కూడిన బ్రిటిష్ పభుత్వపు చట్టమును ఉల్లంఘించ నిశ్చయించి మార్చి2 వ తారీఖున ముందుగ వైస్రాయి ఇర్విన్ ప్రభువుకు తను చేయబోవు చట్ట ఉల్లంఘన వివరములు బహిరంగముగా వెల్లడించుతూ లేఖ వ్రాసెను. మహాత్మా గాంధీ మార్చి 12 తేది 1930న అహ్మదాబాదునుండి 78 మంది సబర్మతి ఆశ్రమవాసులతో 241 మైళ్ళ దూరమున భారతదేశ పశ్చమ సముద్రతీరమందుండిన దండి గ్రామమునకు బయలుదేరెను. ఉప్పుచట్టమును తిరస్కరించి శాసనోల్లంఘనము ప్రారంభించుటకు బయలుదేరిన గాంధీ దండియాత్ర స్వాతంత్ర్యసమరయోధములో అత్యంత ప్రముఖమైనది. అంతేకాక, సబర్మతి ఆశ్రమ సమీప గ్రామ సర్పంచి మొదలగు ఉద్యోగులను తమ ఉద్యోగములకు రాజీనామాలు చేయమన్న గాంధీ సందేశానికి స్పందనముగా వందలమంది రాజీనామాచేసి గ్రామపరిపాలనను స్థంబిపజెసిరి. గాంధీజీ దండి యాత్ర యావద్భారతదేశమును విద్యుతీకరించింది. దేశం కదిలింది. ఆ ఉద్యమములో ఉప్పుతయారుచేయుట కేవలము నామమాత్రమునకేననీ, అంతకంటే ముఖ్యమైన అపేక్షితమైనది ప్రభుత్వమును ధిక్కరించుటనియు గాందీ పేర్కొనెను. శాసనోల్లంఘన ఉద్యమము ప్రజలలో చైతన్యము తీసుకువచ్చుట కొరకునుద్దేశించబడినదనీ, అయితే హింసాత్మకచర్యలు సంభవించునన్న విషయము చింతాజనకమైనదని వాపోయెను. బ్రిటిష్ సామ్రాజ్యమును ధిక్కరించు సహాయనిరాకరణోద్యమము 1920లో ప్రారంభించినప్పటికిని 1922లో జరిగిన చౌరి చౌరా సంఘటనలుతో ఆ సహాయనిరాకరణోద్యమమును గాంధీజీ ఆపివేశను. అటుతరువా మరల 1930లో ఈ ఉప్పుసత్యాగ్రహము విజయవంతమై నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వమును రాజీకి తెప్పించింది. గాంధీజీ దండి యాత్రవలన భారతదేశమున కలిగిన స్పందన జవహర్లాల్ నెహ్రూ మాటలలో ఉల్లేఖన “the fire of a great resolve is in him, and surpassing love of his countrymen and love of truth that scorches, and love of freedom that inspires. And none that passes him can escape the spell, and men of common clay feel the spark of life. It is a long journey, for the goal is independence of India” ఉల్లేఖన [1]
(3) గాంధీజీకి మరోసారి చెరసాల శిక్ష: మార్చి 12న దండికి పాదయాత్రపై బయలుదేరిన గాంధీ బృందం ఏప్రిల్ 6వ తేది దండిలో ఉప్పు-చట్ట తిరస్కారముచేసి శాసనోల్లంఘన ప్రారంభిెచెను. మె నెల 5వ తారీకు నాటికి దండికి దగ్గరలో కరడి గ్రామమునకు చేరుకున్నారు. రెండు నెలల పాటు ( మార్చి, ఏప్రిల్) వైస్రాయి ఇర్విన్ ముందు వెనకాడిన తరువాత చివరకు 1827 సంవత్సరపు బొంబాయి రాష్ట్రపు నిర్బంద నియామక చట్టము క్రింద (విచారణగాని కారణముగాని తెలపనవసరములేని) నిర్బంధించి పూనె దగ్గరలో నున్న యర్వాడ కారాగారమునకు పంపించిరి.
(4) విస్తరించబడిన సహాయనిరాకరణ పరిధి: గాంధీ కారాగారంలోనుండగ గాంధీ ఆరంభించిన సహాయనిరాకరణ ఉద్యమముయెక్క కార్యాచరణ పరిధిని మరింత విస్తృతము చేయుటకు కాంగ్రెస్సు సదస్సు తీర్మానించెను. (అ) ఉల్లంఘించవలసిన శాసనములు ఉప్పుచట్టముతోపాటు అడవుల సంబంధిత చట్టములు (ఇ) పన్నుల తిరస్కారము, ఉప్పు పన్నుతో పాటుగ రైతువారి పద్దతిలో కట్టవలసిన పన్నులను కూడా కట్టుటకు తిరస్కరించుట (ఉ) విదేశ వస్తు బహిష్కరణము విదేశ వస్త్రములు, విదేశ బ్యాంకులను, విదేశనౌకరవాణా సంస్థలను, విదేశీ బీమా వ్యాపార సంస్థలను బహిష్కరించుట.
(4) మెత్తపడిన వైస్రాయి ఇర్విన్: గాంధీ సత్యాగ్రహము దానంతటదే విఫలమగునని రెండునెలలు వేచి చూచిన వైస్రాయి ఇర్విన్ దొర గాంధీ ప్రారంభించిన సత్యాగ్రహము అంతరించిపోవుటకు బదులు పెనుభూతమంత పెద్దదై దేశవ్యాప్తి చెందేటప్పటికి తన రాజనీతి మార్చి గాంధీ తరఫున ఉదారవాదులు తేజ్ బహదుర్ శాప్రు, జయకర్ జరిపిన రాయబారములతోను, ఇంగ్లండులోని లేబరు పార్టి ప్రభుత్వ మంత్రిమండలి ఇండియా రాజ్యాంగమంత్రి వెడ్జివుడ్ బెన్న్ యొక్క సలహా- సహకారముతో మనసు మార్చుకుని గాంధీని విడుదలచేయుటకు అనుమతించిన మీదట జనవరి 25, 1931న గాంధీని విడుదలచేసిరి. అటు తరువాత ఫిబ్రవరి 17 నుంచి కొన్ని రోజుల పాటు వైస్రాయి ఇర్విన్ - గాంధీ మధ్య సంప్రతింపులు జరిగినవి.

సత్యాగ్రహానికి ముందుగా గాంధీ సూచించిన 11 సంస్కరణలు

[మార్చు]

భారతదేశ ప్రజల స్వరాజ్యకాంక్షను ఆపజాలరనియు, కనీసం వెనువెంటనే కొన్ని ముఖ్య సంస్కరణలు చేయమని 1930 మార్చి 2వ తారీకున గాంధీ వైస్రాయికి లేఖ వ్రాసి అందు 11 సంస్కరణలను సూచించెను.[3]
(1) మద్యపానము నిషేధించట
(2) రూపాయికి ఒక షిల్లింగు నాలుగు పెన్నీలుగ మారకపు విలువను తగ్గించుట
(3) భూమి పన్నులో నూటికి ఏబది వంతులు తగ్గిచుట. పన్నులను వృధ్ధిచేయు అధికారము శాసన సభలకిచ్చుట
(4) ఉప్పుపై పన్ను తీసివేయుట
(5) సైన్యము కొరకు చేయుచున్న దుర్వ్యయములో సగము వెంటనే తగ్గించుట
(6) ప్రభుత్వోద్యోగుల వేతనములు సగమునకు కాని, దేశాదాయమునకు తగినట్లు ఇంకను తక్కువకు గాని తగ్గించుట.
(7) విదేశ వస్త్రములపై పన్ను విధించుట
(8) భరతఖండ తీరములందలి నౌకావ్యాపారమును గూర్చి ప్రజాప్రతినిధులు చేయగోరిన చట్టమునంగీకరించుట
(9) హత్య చేసినట్లుగాని, చేయ ప్రయత్నించినట్లుగాని న్యాయస్థానం తీర్మానించిన వారిని తప్ప తక్కిన రాజకీయ నిర్బంధితులనెల్లరను విడుదలచేసి, ద్వీపాంతర వాసముచేయు వీరిని భరతఖండమునకు రానిచ్చుట
(10) రహస్య రక్షక (సి.ఐ.డి) శాఖ వారిని రద్దుచేయుట లేక ప్రజాప్రతినిధులకు లోబరచుట
(11) స్వసంరక్షణ కొరకు ఆయుధము లుంచుకొనుటకు అనుమతి పత్రములిచ్చుట

సత్యాగ్రహ ఫలితములు

[మార్చు]

బ్రిటిష్ ప్రభుత్వముగాని, కాంగ్రెస్సునాయకులు గాని కూడా ఉహించలేనంత గొప్ప స్పందన కలుగజేసినది. పెషావర్, సోలాపూర్ లలో తప్ప మిగతా దేశమంతట 1930 సత్యాగ్రహము (సహాయనిరకరణోద్యమము, ఉప్పు సత్యాగ్రహము) గాంధీ అపేక్షించిన రీతి శాంతియుతమై అహింసాత్మకముగనే యుండెను. మే 1930 నుంచి దేశమంతటా సత్యాగ్రహము ప్రారంభమైయ్యను. వైస్రాయి ఇర్విన్ జారీ చేసిన ఆర్డినెన్సులు, సృష్టించిన అత్యవసర పరిస్థితుల ప్రకారము ప్రభుత్వ సిబ్బంది కఠోర నిర్బందక విధానములు అమలుచేసిరి. దేశమంతటా కాంగ్రెస్సు సదస్సులు నిషేధించబడినవి. ప్రతిజిల్లాలోను కాంగ్రెస్సు నాయకులు కారాగారానికి పంపబడిరి. దాదపుగా 60000 కాంగ్రెస్సు కార్యకర్తలు కారాగారాలలో నిర్బంధిపబడినారని అంచనా. కాంగ్రెస్సుశక్తి తెలియవచ్చెనని ప్రభుత్వ సమాచారకేంద్రముల అంచనా. మహిళా కార్యకర్తలు, ఘోషా స్త్రీలు కూడా విశేషించి పాల్గోని కష్టములనుభవించిరి. విదేశ వస్త్ర బహిష్కరణ విజయవంతమైనదన్న సంగతి లంకాషైర్ (వస్త్ర) వర్తకప్రతినిధుల వాగ్మూలమువలన తెలియవచ్చింది. మహా శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్య వైఖరిని మార్చుటకు చేసిన ఆ 1930 సత్యాగ్రహము అందు ఉల్లంఘించుటకు ఏరికోరిన చట్టము, పన్ను ( ఉప్పుచట్టము, ఉప్పు పన్ను), విదేశ వస్తు బహిష్కరణ మొదలగులనివి కలుగజేసిన ఫలితము నిదర్శనాపూర్వకమైన శాంతియుత పోరాటమును నిరూపించింది. 1920, 1930,1942లలో గాంధీ చేపట్టిన మూడు సత్యాగ్రహ ఉద్యమములలో కల్ల ఈ 1930 సత్యాగ్రహము గొప్ప విజయవంతమైనదని చెప్పవచ్చును. ఆవిధముగ 1930 సత్యాగ్రహము మార్చి 1931 వరకూ 12 నెలలు సాగిన తరువాత గాంధీ-ఇర్విన్ సంధితో విరమించబడింది.

స్వరాజ్యపోరాటమును అణచుటకు బ్రిటిష్ ప్రభుత్వ కార్యాచరణ -కొన్ని చరిత్రాంశములు

[మార్చు]

1857 సిపాయల విప్లవానంతరము ఒకప్రక్క బ్రిటిష్ వారు పరిపాలనను కట్టుదిట్టము చేయుటకు ముందుచూపుతో అనేక పరిపాలనా సంస్కరణలు చేస్తూ తమ పరిపాలనను సుస్థిరము చేయుచుండగా ఇంకొక ప్రక్క భారతదేశమున ఆంగ్లేయ విద్య వృద్దిగావించుటవలన, 1870 నాటినుండే రాజకీయపరిజ్ఞానము అభివృధ్ధి అవటంతో భారతీయులు స్థాపించిన ఆంగ్లేయ మరియూ దేశభాషలలోని వార్తాపత్రికల ద్వారా ప్రజాభిప్రాయము వెల్లివిరియసాగెను. స్వరాజ్యకాంక్ష ప్రబలుచుండెను (1878 దేశీయభాషా పత్రికల చట్టము 1882 లో రద్దుచేయబడబట్టి పత్రికల స్వేఛ కలిగినది) అందుచేత స్వరాజ్యము కావలనెనను జాతీయ చైతన్యమునే అణచుటకు బ్రిటిష్ ప్రభుత్వము వారు చేసిన చర్యలు కొన్ని ముఖ్యమైనవి:

నిబంధనలు, శాసనములు, చట్టములు

[మార్చు]

1857 సిపాయల విప్లవానంతరం కాలక్రమేణ 1931 దాకా బ్రిటిష్ ప్రభుత్వమువారి నిరంకుశ పరిపాలనకు దోహదముగా ప్రవేశ పెట్టిన శాసనాత్మక నిర్బంధనలు, నిషేధనలు లెఖ్ఖ పెట్టలేనన్నిగానుండినవి అనేకం. ప్రజాస్వేచ్చ, రాజకీయపరిజ్ఞాన నిర్మూలనము చేయుటకు చేయబడినవి. అట్టివాటిలో 1857 నుండి 1931 సంవత్సరములలో చేసిన శాసనములు వార్తాపత్రికలు, వాటి ముద్రణపై పరిమితులు రాజకీయ పరిజ్ఞానముకాకుండా చేసినవి అనేకం. గణనాతీతం. వాటిలో కొన్ని ఉదాహరణకు:
(1)1860-61 లో సివిల్, క్రిమినల్, శిక్షాస్మృతులను క్రోడీకరించబడినవి, ప్రాత న్యాయస్థానముల బదులు బ్రిటిష్ రాణీగారి అధీనతలో నుండే ఆంగ్లేయ న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానం, స్థాపించబడినవి. ప్రభుత్వోద్యోగుల నిబంధనలు క్రమబద్దము చేయుట, ఇండియన్ సివిల్ సర్వీస్ (I.C.S) వర్గము క్రింది ఎన్నబడే ఉద్యోగములు కేవలము ఇంగ్లండులోనే నిర్ణయించి నియమింపబడతారట. ఆ ఉద్యోగుల ఎంపిక ఇంగ్లడులోనే జరుగుట
(2) భారతదేశమున స్వాతంత్ర్య చైతన్యమునణచివేయుటకు తగు శాసనములు చేయుట. అందులో కొన్ని:
(అ) ఎట్టి విచారణయు లేక రాజద్రోహము చేశారని నేరము క్రింద అనుమానించిన వారిని నిర్భందించి ప్రవాసమునకంపుటకు వంగ రాష్ట్రములో 1818 లోనుండే యుండిన శాసనము లాంటివి 1850 లోను 1857 విప్లవానంతరము ఇంకా అనేక శాసనములు చేయబడెను.
(ఇ) సిపాయిల విప్లవం తరువాత కాలక్రమేణా ప్రవేశపెట్టిన వార్తాపత్రికల, పుస్తకముల ప్రచురణ, ముద్రాక్షర శాలలపై నిర్బంధక శాసనములు అనేకం. 1857 లో ప్రవేశ పెట్టిన రెండు చట్టములు ప్రెస్ అనుజ్ఞ (లైసెన్సు) చట్టము, నేరముల చట్టము, ఖైదీల చట్టము (1858), ప్రభుత్వముపై తిరుగుబడు పితూరీదారుల ఆస్తిని జప్తు చేసుకొను చట్టము, ఆయుధ నిషేధ చట్టము (1860), ప్రెస్సులు, పుస్తకముల రిజిష్ట్రేషన్ చట్టము (1867), నాటక ప్రదర్శనముల చట్టము (1876), (నాటకముల ద్వారా ప్రజాభిప్రాయము, స్వరాజ్యకాంక్ష, జాతీయ చైతన్యము ప్రబలుచున్నదన్న సంగతి గ్రహించిన బ్రటిష్ వారి ముందుచర్య), 1882 లో రద్దుచేయబడిన దేశీయ భాషాపత్రికల చట్టము (1878), జాతీయత, విప్లవాత్మక నియంత్రణ క్రిమినల్ చట్టము;ఇండియా డిఫెన్స్ చట్టము (1915) ఇత్యాదులు. గాంధీజీ నాయకత్వములో ప్రారంభించిన సత్యాగ్రహోద్యమమునకు కొలది కాలమునకు ముందు స్వరాజ్య చైతన్యమునణచుటకు బ్రిటిష్ ప్రభుత్వము వారు చేసిన కఠోర శాసనములు, కృూరచట్టములలో చెప్పదగ్గ మరి కొన్ని వాటిలో రౌలట్ చట్టం (రౌలట్ బిల్లులు) అనగా 1918లో న్యాయాధీశుడు రౌలట్ దొర అధ్యక్షతన నెలకొల్పబడ్డ విచారణ సంఘము వారు విప్లవోద్యమములను కూకటివ్రేళ్ళతో నిర్మూలించుటకోసం చేసిన సిఫారుసులును బిల్లు రూపములో (డిఫెన్సు ఆఫ్ ఇండియా చట్టమునకు Criminal law amendment చేసి చట్టముగా తీసుకుని వచ్చుటకు) శాసన సభలో ప్రవేశ పెట్టి చట్టముగా తీసుకువచ్చే ప్రయత్నము చేశారు.

కఠోర శిక్షలు కృూరచర్యలు

[మార్చు]

స్వరాజ్య సంగ్రామమునరికట్టుటకు ప్రయోగించిన శాసనములు, చట్టములే కాక అప్పటిలో స్వరాజ్యము సంపాదించుటకు కొందరు స్వతంత్రయోధులు ఉగ్రవాద మార్గమును విప్లవోద్యమములు అవలంబించినందున ప్రతిక్రియగా బ్రిటిష్ ప్రభుత్వము వారు తీవ్ర అత్యాచారములతో కూడిన సోదాలు, నిషేధాజ్ఞలు, కుట్రకేసులు పెట్టుట, చెరసాలలో పెట్టి ఉరిశిక్షలు విధించుట మొదలగు కృూరచర్యలు చేయసాగెను. ఆ తరువాత 1919 ఏప్రిల్ 13వ తేదీన జరిగిన జలియన్ వాలా బాగ్ కాల్పుల ఘటనలు తదుపరి పంజాబ్ లో మార్షల్ లా అను సైనిక పరిపాలన ప్రవేశ పెట్టి అనేక విధాల అసహ్యపు పద్ధతులలో హింసించి స్త్రీపురుషులను అవమానపరిచటం (వివస్త్రులుగా చేయుట, కొరడాలతో కొట్టుట, ప్రాకించుట, సలాములుచేయమని నిర్భందించుట) మొదలగు ఘటములు సాధారణ ప్రజలను చలించగా, గాంధీజీని కదలించినవి. 1922 గాంధీజీకి 6 సంవత్సరముల కారాగార శిక్ష విధించబడింది.[3]

గతజల సేతుబంధనముగా బ్రిటిష్ ప్రభుత్వము చేసిన ఉపశమన కార్యాచరణలు

[మార్చు]

భారతీయుల స్వాతంత్ర్య కాంక్షను అణచుటకు 20వ శతాబ్దారంభములో ఇచ్చటి బ్రిటిష్ ప్రభుత్వపు నిరంకుశ చర్యలవల్ల ప్రభుత్వముపై ప్రజలలో నానాటికి పెరుగుతున్న విముఖుత లండన్ లోని బ్రిటిష్ సార్వభౌములకు ఆందోళన కలుగజేయగా, ఉపశమనచర్యలు చేపట్టుటకు అక్కడ లండన్ లోని తమ ఇండియా రాజ్యాంగకార్య వ్యవహారాల మంత్రి ఎడ్విన్ మాంటేగు మరియూ ఇచ్చటి వైస్ రాయి లార్డు షెమ్సుఫర్డు సంయుక్తముగా సూచించిన సంస్కరణలను చట్టరూపముగా జూన్ 1918 ఆమోదించి అమలు చేయకముందే ఏప్రిల్ 1919 జలియన్ వాలా బాగ్ కాల్పుల ఘటన జరుగుటవలన ఆ సంస్కరణల వల్ల దేశములోని కాంగ్రెస్ నాయకులుగానీ ప్రజలు గానీ బ్రిటిష్ ప్రభుత్వముపై తమ వైఖరిని మార్చలేదు సరిగదా ఆ సంస్కరణలు కళ్లనీళ్ళ తుడుపులనే గ్రహించారు (చూడు మాంటేగు-షెమ్సఫర్డు రాజ్యాంగ సంస్కరణ చట్టము ). ఆ సంస్కరణల చట్టమే కాక లార్డు షెమ్సు ఫర్డు తరువాత వచ్చిన లార్డు ఇర్విన్ దొర గాంధీజీ తో చేసిన సంధి కూడా మరొక ఉపశమన కార్యాచరణ

వైస్రాయి ఇర్విన్ వహించిన రాజనీతి

[మార్చు]

జలియన్ వాలా బాగ్ కాల్పులు, పంజాబులో విధించిన మార్షల్ లా (1919) వైస్రాయి షెమ్స ఫర్డు (Frederic John Napier Thesiger, 1st Viscount Chelmsford) కాలములో (1916-1921) జరిగినవి. తదుపరి వచ్చిన వైస్రాయి లార్డు రీడింగ్ (Rufus Daniel Isaacs, 1st Marquess of Reading) దొర కాలములో (1921-1925) ఉప్పు పన్ను (1835 నుండి ఉన్నది) రెండింతలు చేయబడినది. 1922 లో గాంధీజీని నిర్భందములోకి తీసుకుని కారాగారములో పెట్టించాడు. ఆ విధముగా ఆప్పటిలో బ్రిటిష్ ప్రభుత్వము స్వరాజ్యాందోళనలను ఏమాత్రము సహించమను సంగతి ప్రదర్శించారు. తదుపరి (1926 లో) వచ్చిన వైస్రాయి, లార్డు ఇర్విన్ కూడా అట్టి మార్గములోనే కొంతకాలము నడచి స్వరాజ్యాందోళనలు అణచ ప్రయత్నించాడు. సైమన్ కమీషన్ కు వ్యతిరేకముగా చేసిన ఆందోళనల్లో లాలా లజపతి రాయ్ పై పోలీసుల లాఠీల వల్ల మరణించుట, భగత్ సింగ్ ప్రతీకార్యచర్యగా బ్రిటిష్ పోలీసు అధికారి సాండర్సును హత్యచేయుట మున్నగువాటిని కఠినముగా అణగత్రొక్కుటకు అనేక ఆర్డినెన్సులను జారీచేసి తీవ్ర నిర్బంద విధానములను అతితీవ్రముగా చేసి అధికారులకు అనేక పూర్తి అధికారములిచ్చి, అత్యవసర పరిస్థితులను సృష్టించి, గాంధీ చేపట్టిన సహాయనిరాకరణోద్యమమును ఉక్కుపాదముతో అణగత్రొక్కుటకు అనేక చర్యలు చేసినప్పటికీ చివరకు లార్డు ఇర్విన్ మెత్త పడి గాంధీతో సంప్రతింపులు చేసి సంధి చేసుకుని భారతీయుల స్వరాజ్యకాంక్ష సముచితమేనన్నటుల ప్రవర్తించుటయే కాక భారతదేశానికి పూర్ణ స్వరాజ్యము కాకపోయినా అధినివేశ స్వరాజ్యము అను ప్రజాపరిపాలన పద్ధతి (Dominion Status) అనుగ్రహించగలరన్న ఆశాభావము కలింగించెను. అట్టి ఔదార్యపు కార్యాచరణ భారత జాతీయ కాంగ్రెస్సు మన్ననలందుకున్నది. ఇర్విన్ దొర ఔదార్యము, నీతి నిజాయితీలను మహాత్మా గాంధీ ప్రశంసించెను. కాని భారతదేశ బ్రిటిష్ పరిపాలక బృందమేకాక, ఇంగ్లండు లోని బ్రిటిష్ రాజకీయనాయకుల అసంతృప్తి, ఆగ్రహములకు గురికాబడింది.

గాంధీ-ఇర్విన్ సంధిలోని వడంబడికలు

[మార్చు]

గాంధీ ఇర్విన్ సంధిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన విరమించుటకు ప్రతిపాదించిన షరతులలో ఉప్పు మీద బ్రిటిష్ ప్రభుత్వము విధించిన పన్ను రద్దుపరచుటయున్నప్పటికీ, ఇర్విన్ ప్రభుత్వము ఆ షరత్తును అంగీరకరించనందున ఈ క్రింద ఇచ్చిన ఆరు షరత్తులు సంధి వడంబడికలైనవి.
(1) 1920 లో గాంధీజీ ప్రారంభించిన సత్యాగ్రహోద్యమములు -సహాయనిరాకరణ ( non co-operation or civil disobedience) ఉద్యమములు లను విరమించునటులను
(2) భారతదేశములో స్వరాజ్యోద్యముములు సాగించుచున్న కాంగ్రెస్ పార్టీ బ్రిటన్ లో జరుగు రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొనే టటులను
(3) బ్రిటిష్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీని అణుగత్రోక్కుటకు విధించిన ఆంక్షలు, నిర్భంధములు కలిగిన నిబంధనలు ఉపసంహరించునటులను.
(4) భారతదేశములోని స్వాతంత్ర్య సమరయోధులపై పెట్టిన కేసులు ఏవైతే విప్లవాత్మకము, ఉగ్రవాదమునవి కావో వాటిని ఉపసంహరించునటులను
(5) స్వాతంత్ర్య సమరయోధులను నిర్బందమునుండి విడుదలచేయునటులను
(6) కాంగ్రెస్ ప్రతినిధిగా గాంధీజీ స్వయముగా రెండవ రౌండు టేబుల్ సభలో పాల్గొనునటులను
ఆ సంధి వడంబడికలు పూర్తిగా అమలు చేసిన గాంధీ గారి నిజాయితినీ, దేశ భక్తినీ ఇర్విన్ దొర స్వయముగా అభినందించుతూ తన ఉపన్యాసములో వెల్లడించాడు. గాంధీ- ఇర్విన్ సంధి వడంబడిక జరిగిన నెలరోజులకే ఇర్విన్ దొర పదవి విరమించి ఏప్రిల్ 1931 లో ఇంగ్లండుకు వెనుదిరిగి వెడలి పోవటం అతను వెడలిన సంవత్సరం తిరగకుండానే రౌండ్ టేబుల్ సమావేశములు, అందలి నిర్ణయాలు మాసిపోవటం తిరిగి గాంధీనీ, అనేక స్వాతంత్ర్యయోధులను నిర్బందించటము జరిగింది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "The Making of a Nation" B.R. Nanda(2004) HarperCollins pp204-225
  2. ” The Longest August” Dilip Hiro(2015) Nation Books pp17-19)
  3. 3.0 3.1 "The British Rule in India" D.V. Siva Rao (1938) ఆంధ్ర గ్రంథాలయ ముద్రాక్షరశాల, బెజవాడ pp 337-340,399-417