గాలవుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గాలవుడు విశ్వామిత్ర మహర్షి శిష్యుడు. అతను కువలయాశ్వునికి అశ్వమును ఇచ్చిన ఒక ఋషి[1]. అతడు శుక్లయజుర్వేదాధ్యాపకుడు.

గురుదక్షిణ కోసం అవస్థలు

[మార్చు]

అతను విశ్వామిత్రుని వద్ద విద్యాభ్యసము పూర్తి కాగానే గురుదక్షిణ ఇస్తానని అన్నాడు. కానీ విశ్వామిత్రుడు నిరాకరించాడు. అయినా మూర్ఖంగా ఏదైనా అడగాలని పట్టుబట్టాడు. విశ్వామిత్రుడు కోపించి ఒక చెవి మాత్రం నల్లగా ఉన్న తెల్లని గుర్రములు ఎనిమిది వందలు సమర్పించు కొమ్మని చెప్పాడు. గాలవుడు అంగీకరించి వాటిని వెదుకుతూ బయలుదేరాడు. ఎంత వెతికినా అవి మాత్రం దొరకలేదు. ఐనా గాలవుడు నిద్రాహారాలు మాని గుర్రాల కొరకు వెదకడం మొదలు పెట్టాడు. మార్గ మధ్యంలో తన బాల్య స్నేహితుడు గరుత్మంతుని కలిసాడు. గరుత్మంతుడు గాలవుని సమస్య తెలుసు కుని అతడిని వీపు మీద ఎక్కించు కుని యయాతి అనే రాజు వద్దకు తీసుకు వెళ్ళాడు. యయాతి కూడా తన వద్ద గుర్రాలు లేవని చెప్పి తన కుమార్తె మాధవినిచ్చి అతనికి వివాహం చేసాడు. అతను తన భార్య మాధవితో సహా గుర్రాలను వెతకడం ప్రారంభించాడు. గుర్రాల కొరకు ఇక్ష్వాకు మహారాజు వద్దకు వెళ్ళాడు. ఇక్ష్వాకు మహారాజు వద్ద అలాంటి గుర్రాలు రెండు వందలు ఉన్నాయి. సంతానం కొరకు పరితపిస్తున్న ఇక్ష్వాకు హయములను ఇచ్చి బదులుగా ఒక సంతానం కలిగే వరకు మాధవిని తన వద్ద ఉంచమని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇక్ష్వాకు మాధవి ద్వారా వసుమనస్సుడు అనేకుమారుని పొందిన తరువాత మాధవిని గాలవునికి ఇచ్చాడు. గాలవుడు కాశీరాజు దివోదాసుకు మాధవిని ఇచ్చి రెండు వందల గుర్రాలను తీసుకున్నాడు. మాధవి వలన దివోదాసుకు ప్రత్యర్ధనుడు అనే కుమారుడు కలిగాడు. తరువాత గాలవుడు మాధవిని భోజ పురాధీశుడు ఔశీనరునికి ఇచ్చి మరొక రెండు వందల గుర్రాలను పొందాడు. ఔశీనరుడికి మాధవి వలన శిబి అనే కుమారుడు జన్మించాడు. అయినా మాధవి కన్యాత్వం చెడలేదు. మిగిలిన గుర్రాల కొరకు గాలవుడు వెదుకుచుండగా గరుత్మంతుడు వచ్చి గాలవునితో " గాలవా ! ఇలాంటి గుర్రాలు ప్రపంచంలో ఇక లేవు. ఈ ఆరు వందల గుర్రాలను నీ గురువు గారికి ఇచ్చి రెండు వందల గుర్రాలకు బదులు మాధవిని అతనికి ఇమ్ము " అని చెప్పాడు. తనకు లభించిన అరు వందల గుర్రాలతో విశ్వామిత్రుని వద్దకు వెళ్ళిన గాలవుడు. తమతో పాటు వచ్చిన తన స్నేహితుడు గరుత్మంతుడు విశ్వామిత్రునితో "అయ్యా ! గాలవుడు పసివాడు అతనిని కరుణించి ఈ ఆరువందల గుర్రాలను తీసుకుని మాధవిని మిగిలిన రెండు వందల గుర్రాలకు బదులు స్వీకరించండి." అని అన్నాడు. విశ్వామిత్రుడు అందుకు అంగీకరించి ఆమె ద్వారా అష్టకుడు అనే కుమారుని పొంది తిరిగి మాధవిని గాలవునికి ఇచ్చాడు.[2] [3]

గురుదక్షిణను గురువు వద్దని చెప్పినా విననందుకు ఈ కష్టాలను గాలవుడు అనుభవించవలసి వచ్చింది.

ఉద్యోగ పర్వంలో

[మార్చు]

మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణ రాయబారం సందర్భంలో శ్రీకృష్ణుని మాటలు సభాసదులందరూ నిశబ్ధంగా విన్నారు. జమదగ్ని మహా ముని లేచి నర నారాయణులే ఈ కృష్ణార్జునులు. కనుక దంభోద్భవునిలా గర్వంతో వారిని ఎదిరించక సంధి చేసుకో " అన్నాడు. ఆ తరువాత కణ్వ మహాముని లేచి " సుయోధనా ! తన బలం ఎదిరి బలం తెలియక గర్వంతో, అహంకరంతో యుద్ధానికి తలపడటం మంచిది కాదు" అని చెబుతాడు. తరువాత నారదుడు " సుయోధనా! ఎంతటి శక్తివంతుల కైనా ధర్మ మార్గాన పయినించి నపుడే అది బలం చేకూరుస్తుంది. శక్తివంతుడైనా అహంకారం బలహీన పరుస్తుంది. ఏది ఏమైనా నేను అనుకున్నది చేస్తాను అంటే గాలవుడికి కలిగిన ఆపదలే ఎదురౌఉతాయి." అని గాలవుని వృత్తాంతాన్ని వివరిస్తాడు.

ఇతర అర్థాలు

[మార్చు]

గాలవుడు అనగా చేపలకు గాలము వేసే వాడని కూడ అర్థమున్నది. అనగా జాలరి అని అర్థము.

మూలాలు

[మార్చు]
  1. "చంద్రికాపరిణయము – 7. పంచమాశ్వాసము – Page 4 – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-04-05.
  2. పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879
  3. మహాభారతం - ఉద్యోగ పర్వంలో గరుడుడు దుర్యోధనునికి చెప్పిన కథ
"https://te.wikipedia.org/w/index.php?title=గాలవుడు&oldid=3165370" నుండి వెలికితీశారు