Jump to content

చంద్రహాసుడు

వికీపీడియా నుండి

చంద్రహాసుడు జైమిని భారతంలో ఒక పురాణ పాత్ర.

పురాణగాథ

[మార్చు]

చంద్రహాసుడు కేరళ దేశపు రాజకుమారుడు. అతడి పసివయసులోనే అతడి తండ్రి శత్రువుల చేతులో మరణిస్తాడు. ఆ వార్త వినగానే ఇతని తల్లి ఆత్మహత్య చేసుకుంటుంది. ఎవరూ చూసేవారు లేక చంద్రహాసుడు అనాథగా మారి కుంతలదేశం వెళ్తాడు. రాజభవనం సమీపించగానే అక్కడున్న కొందరు బ్రాహ్మణులు ఇతడిని చూసి, రాజలక్షణాలు కలిగిన యితడు ఎవరు? అని అక్కడున్నవారిని అడిగారు. కుంతలదేశపు మంత్రి దుష్టబుద్ధి అనేవాడు ఈ దృశ్యం చూసి "ఒకవేళ ఇతడు గనుక రాజకుమారుడు అయితే, ఈ దేశానికి మహారాజు అవుతాడేమో? అప్పుడు తన కుమారుడిని రాజుగా చెయ్యాలన్న కోరిక నెరవేరదు" అని భావించి తన భటులను పిలిచి ఆ బాలుడిని చంపివెయ్యమని ఆదేశిస్తాడు. ఎందుకంటే, ఆ దేశపు రాజుకు మగసంతానం లేదు, ఒకతే కూతురు. తన కొడుకు మదనుడు అనేవాడిని రాజుగారి అల్లుడిగా చేసి రాజ్యం కొట్టేయాలని అతడి పథకం.

అప్పుడు భటులు చంద్రహాసుడిని అడవికి తీసుకెళ్లి చంపడానికి మనసొప్పలేదు. అతని చేతికి ఆరువేళ్ళు ఉండటం చూసి, ఆరోవేలును ఖండించి అతణ్ణి వదిలేస్తారు. దుష్టబుద్ధికి ఆ కోసిన వేలును చూపి, చంద్రహాసుణ్ణి చంపేశా మని నమ్మబలుకుతారు.

అడవిలో ఏడుస్తున్న చంద్రహాసుడిని వేటకు వచ్చిన కుళిందుడు అనే రాజు చూసి తన ఇంటికి తీసుకెళ్లి పెంచుతాడు. ఒకరోజు దుష్టబుద్ధి కుళిందుడి ఇంటికి వచ్చి చంద్రహాసుడిని చూసి గుర్తించి తన భటులు తనను మోసం చేసారు అని గ్రహించి, మళ్ళీ ఒక పథకం వేస్తాడు. ఒక తెల్లకాగితం మీద "వీడికి తక్షణమే విషము నిమ్ము" అని రాసి "బాబూ, వెంటనే రాజధానికి వెళ్లి ఈ ఉత్తరాన్ని నా కొడుకుకు ఇచ్చిరా" అని చంద్రహాసుడితో చెప్తాడు.

చంద్రహాసుడు వెంటనే రాజధానికి వెళ్తాడు. అక్కడ ఒక ఉద్యానవనం చూసి ముగ్ధుడై ఒక వృక్షం నీడన విశ్రమిస్తాడు. వెంటనే నిద్ర పడుతుంది. ఆ సమయంలో విహారానికి వచ్చిన దుష్టబుద్ధి కుమార్తె "విషయ", చంద్రహాసుడి అందానికి ముగ్ధురాలై చూస్తుండగా అతని జేబులో ఉన్న ఉత్తరాన్ని గమనించింది. చదవగానే ఆశ్చర్యపోయి తన తండ్రి దుర్మార్గానికి కినిసి, ఉత్తరం లోని "విషము" అనే పదాన్ని "విషయ"గా దిద్దుతుంది.

నిద్ర లేచిన చంద్రహాసుడు దుష్టబుద్ధి ఇంటికివెళ్ళి మదనుడిని కలిసి ఉత్తరం ఇస్తాడు. ఉత్తరాన్ని చదివిన మదనుడు వెంటనే తన చెల్లెలిని చంద్రహాసుడికి ఇచ్చి పెళ్ళి చేసాడు. మరునాడు ఇంటికి వచ్చిన దుష్టబుద్ధి తన పథకం వికటించిన సంగతి గ్రహించి ఖేదమనస్కుడై చేసేది ఏమీ లేక "అల్లుడూ, మా ఇంటి ఆచారం ప్రకారం పెళ్లి అయిన తరువాత కాళికాలయానికి వెళ్లి ఫలానా పూవులు సమర్పించి రావాలి. కనుక నువ్వు వెళ్లి పూవులు సమర్పించి రా" అని చంద్రహాసుడుతో చెప్పాడు.

చంద్రహాసుడు వెళ్ళగానే తన భటులను పిలిచి "కాళికాలయానికి ఒంటరిగా ఎవరు వచ్చినా తక్షణమే వాడి శిరస్సును ఖండించండి" అని ఆజ్ఞాపించాడు. భటులు ఆలయానికి వెళ్ళారు. ఆలయానికి వెళ్తున్న చంద్రహాసుడిని రమ్మని రాజుగారు మదనుడి ద్వారా వర్తమానం పంపిస్తారు. మదనుడు వచ్చి "ఆలయానికి నేను వెళ్తాను. నువ్వు రాజుగారిని కలిసి రా" అని తాను ఆలయానికి వెళ్తాడు. చీకట్లో ఒంటరిగా ఆలయానికి వచ్చిన మదనుడిని గుర్తించలేక భటులు మదనుని శిరస్సును ఖండిస్తారు.

చంద్రహాసుడిని చూసి రాజు అతను తన మిత్రుడు కేరళ రాజు కుమారుడు అని తెలుసుకుని తన కుమార్తె నిచ్చి వివాహం చేస్తాడు.

తన కొడుకు చావడం, రాజకుమారిని చంద్రహాసుడు పెళ్ళి చేసుకోవడం చూసిన దుష్టబుద్ధి గుండె బద్దలై మరణిస్తాడు. అప్పుడు ఆలయానికి వెళ్లిన చంద్రహాసుడు అక్కడ మదనుడి శవం చూస్తాడు. అపుడే దుస్టబుద్ధి మరణించిన విషయం కూడా తెలుస్తుంది. కాళికను ప్రార్థించి ప్రత్యక్ష్యం చేసుకుని తండ్రి కొడుకులను బ్రతికిస్తాడు చంద్రహాసుడు.

నీతి

[మార్చు]

మనం మంచివాళ్ళం, పవిత్రులం అయితే, మనలను అభాసుపాలు చెయ్యడానికి ఎందరు కుయుక్తులు పన్నినా, మన మీద ఎన్ని కుట్రలు చేసినా, కనిపించని దైవం మనలను కాపాడుతుంది. ఇతరులకు ఉపకారం చెయ్యడం, మనసులో కుళ్ళు కుతంత్రాలు చేరకుండా మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి. పరాయివారికి మేలు చేసే సద్బుద్ధి మనకుంటే, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, మనకు భగవంతుడే మేలు చేస్తాడు. అందుకే ప్రతి వారూ మంచి నడతను అలవరచుకోవాలి.