చక్కిలం విజయలక్ష్మి
చక్కిలం విజయలక్ష్మి (1948 - 2023 అక్టోబరు 16) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నవలా రచయిత్రి. తెలుగు సాహితీ రంగానికి 45 ఏళ్లకు పైగా ఎనలేని సేవలందించిన ఆమె మొత్తం 14నవలలు, వందలాది కథలు, కథానికలు కూడా రాసింది.
జీవిత చరిత్ర
[మార్చు]కర్నూలులో రుక్మిణమ్మ, కృష్ణమూర్తి దంపతులకు ఆమె జన్మించింది. బాలికోన్నత పాఠశాలలో చదివింది. ఆ తరువాత, కేవిఆర్ మహిళా కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లోనే సాహిత్యం వైపు ఆమె దృష్టి పెట్టింది. పారిశ్రామికవేత్త శ్రీనివాసరావును ఆమె వివాహం చేసుకుంది. వారికి ఇద్దరబ్బాయిలు జన్మించారు.
భర్త చక్కిలం శ్రీనివాసరావు ప్రోత్సాహంతో 1973 నుంచీ ఆమె సాహిత్యంలో తన కెరీర్ మొదలుపెట్టింది. అదే సంవత్సరం, ఆమె తొలి నవల హేమంతగానం పుస్తక రూపంలో తీసుకువచ్చింది. 1977లో 'తల్లిదండ్రులూ తీర్పు మీదే’ అనే సీరియల్ రాసిన ఆమె శైలి పాఠకులను ఆకట్టుకోవడంతో ఆ రచన రేడియోలోనూ ప్రసారమైంది. ఆమె రచించిన మరుభూమిలో మల్లెతీగలు, శాంతి తీరం, బిందు, ఇదేమి న్యాయం, తెర తీయగ రాదా, ఈ రాగానికి అదే తాళం, చిన్నారి చెల్లి వంటి రచనలు పలు పత్రికలలో సీరియల్స్‌గా వచ్చాయి. ఆమె రచించిన ‘కాగితపు పడవలో జీవితపు పయనం’ నవలను 1980లో తెలుగు రచయితల తొలి మహాసభలో ఆవిష్కరించారు.
మరణం
[మార్చు]75 సంవత్సరాల వయస్సులో ఆమె అనారోగ్య సమస్యలతో కర్నూలులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచింది.[1] ఆమె భర్త శ్రీనివాసరావు రెండేళ్ల కిందట మృతి చెందాడు. వారికి ఇద్దరు కుమారులు హేమంత్‌శర్మ, ప్రవీణ్ శర్మ ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "ప్రముఖ రచయిత్రి చక్కిలం విజయలక్ష్మి కన్నుమూత |". web.archive.org. 2023-10-18. Archived from the original on 2023-10-18. Retrieved 2023-10-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)