చర్చ:సుబ్రహ్మణ్య షష్ఠి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈనాడు దినపత్రిక - 10 జూలై 2008 అంతర్యామి నుండి :

సుబ్బరాయుడి షష్ఠి మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్బరాయుడి షష్ఠి అని, సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి అని అనేక రకాలుగా పిలుచుకోవటం కనిపిస్తుంది. జన జీవనంలో పలు రకాలుగా ప్రచారంలో ఉండి భక్తుల పాలిట కల్పవల్లిగా ఈ పర్వదినం అలరారుతుంది. తెలుగునాట ఈ పండుగ వల్లనే సుబ్బమ్మ, సుబ్బారాయుడు, సుబ్బి, సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, బాల సుబ్రహ్మణ్యం లాంటి పేర్లు విస్తృతంగా పెట్టుకోవటం జరుగుతోంది. శివుడి రెండో కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామిని ఈనాడు ఆరాధిస్తారు. ఈ స్వామినే కార్తికేయుడు అని, స్కందుడు అని, షణ్ముఖుడు అని, గుహుడు, కుమారస్వామి అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. తారకాసుర సంహార నేపథ్యం ఈ కుమారస్వామి జననానికి సంబంధించిదే. మహా బలిష్టుడైన తారకాసురుడిని కుమారస్వామి జయించగలిగాడు కనుక జయాన్ని కోరి ముందుకు నడిచేవారు ఈ స్వామిని పూజించుకోవటం, తలచు కోవటం కన్పిస్తుంది. అతి సామాన్య ప్రజల నుంచి ఉన్నత కులీనుల దాకా సంతానం కోసం శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠినాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు. సంప్రదాయకంగా పాము మంత్రాలను సాధన చేసేవారు ఈ రోజున ఉపవాసం ఉండి ఆ మంత్రాన్ని మరింతగా జపిస్తుంటారు. ఈనాడు ఉదయాన్నే స్నానం చేయటం, ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి అక్కడ అర్పిస్తుంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే.

పురాణాలలో సుబ్రహ్మణ్యస్వామి వివాహితుడుగా కనిపిస్తాడు. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను అందుకే ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి పూజ చేయటం, వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించటం జరుగుతోంది. తమిళ ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడి పంచదారతోనూ, పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కింది. సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానలు కూడా వెనక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం. అలా వానలో తగ్గాక చేసుకోవలసిన పనులను చేసుకోవటానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు. సుబ్రహ్మణ్య ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రజల్లో ప్రచారంలో ఉంది. సర్ప మంత్రాన్ని ఈ రోజున దీక్షగా చేస్తే మళ్ళీ సంవత్సరం వరకూ గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఓ నమ్మకం ఉంది.

సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం వల్ల సామాజిక ప్రయోజనం ఏమిటి? అని అనేవారికి ఈ వ్రత విధిలోని దానాలే సమాధానం చెబుతుంటాయి. మార్గశిర మాసమంటే చలి పులిగా మారి పీక్కుతినే మాసం. ఈ మాసంలో చలి బాధను తోటివారు పడకుండా చూడమని సందేశం ఇస్తుంది. ఈ వ్రతం అందుకే ఉత్తరీయాలు, కంబళ్ళు, దుప్పట్లు లాంటివి వత్రంలో భాగంగా దానం చేయాలని పెద్దలు చెబుతుంటారు.

మార్గశిర షష్ఠినాడే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి లాంటి వ్రతాలను కూడా చెయ్యాలని వ్రత గంథాలు పేర్కొంటున్నాయి. సుబ్బరాయుడు బాలుడైన బాల సుబ్రహ్మణ్యంగా పెద్దవాడైన సుబ్రహ్మణ్యంగా, స్కందుడుగా, షణ్ముఖుడుగా ఇలా అనేక రకాలుగా, అనేక రూపాలలో ఈ షష్ఠినాడు పుజలందుకోవటం జరుగుతుంది. - డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు

--mvs 11:35, 16 అక్టోబర్ 2008 (UTC)

సుబ్రహ్మణ్య షష్ఠి గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి