చింతల వెంకటరమణ దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చింతల వేంకటరమణస్వామి దేవాలయం
చింతల వెంకటరమణ దేవాలయం
చింతల వెంకటరమణ దేవాలయం
పేరు
ఇతర పేర్లు:చింతల వేంగళనాథ ఆలయం
చింతలరాయ దేవాలయం
హరిహర క్షేత్రంగా
ప్రధాన పేరు :శ్రీ చింతల వేంకటరమణస్వామి దేవాలయం
ప్రదేశం
దేశం:భారత దేశము
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:అనంతపురము
ప్రదేశం:తాడిపత్రి
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:వేంకటేశ్వరస్వామి
ప్రధాన దేవత:పద్మావతి

చింతల వెంకటరమణ దేవాలయం అనంతపురం జిల్లా, తాడిపత్రిలో ఉన్న ఒక ప్రాచీన వైష్ణవ దేవాలయం.[1] ఈ ఆలయం పెన్నా నది ఒడ్డున సుమారు 5 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. విజయనగర రాజుల కాలంలో నిర్మించబడింది.

స్థల పురాణం[మార్చు]

ఒకసారి ఈ ఆలయం ఉన్న స్థలంలో ఉన్న ఒక పెద్ద చింతచెట్టు నుంచి అక్కడికి దగ్గర్లో ఉన్నవారికి పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. వారు అక్కడికి వెళ్ళి చూడగా ఆ చెట్టు తొర్రలో ఒక విష్ణువు విగ్రహం కనిపించింది. అదే సమయంలో పెన్నసాని పాలకుడైన తిమ్మనాయకుడు గండికోటలో తన సైన్యంతో సహా విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనకు కల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి కనబడి చింత చిట్ట తొర్రలో ఉన్న తన విగ్రహాన్ని బయటకు తీసి ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆజ్ఞాపించాడు.

చరిత్ర[మార్చు]

ఈ ఆలయాన్ని ప్రౌఢరాయల కాలంలో తాడిపత్రిని పాలిస్తున్న పెమ్మసాని రామలింగనాయుడు, తిమ్మనాయుడులు 1510- 1525 మధ్యలో నిర్మించారు. విజయనగర నిర్మాణ శైలిలో వున్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి ప్రత్యేకంగా వారణాశి నుండి శిల్పులను రప్పించారు. ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో పూర్వం చింతచెట్లు ఎక్కువగా ఉండటం వల్ల, విగ్రహం చింతచెట్టు తొర్రలో దొరకడం వల్ల ఇక్కడి స్వామిని చింతల తిరువేంగళ నాథ స్వామి అని పిలిచే వారు. క్రమంగా చింతల వేంకటేశ్వర స్వామి లేదా చింతల వేంకటరమణ స్వామి అని పిలుస్తున్నారు. కొంత శిథిలమైన కళ్యాణమంటపాన్ని సా.శ..1800 ప్రాంతంలో అప్పటి కలెక్టర్ థామస్ మన్రో మరమ్మత్తులు చేయించి ప్రభుత్వ నిధులతో ఆలయ నిత్యపూజాదికాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాడు[2].

ఆలయ వివరాలు[మార్చు]

గర్భగుడిలోని మూల మూర్తి విగ్రహం సుమారు 10 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి నుంచి ప్రారంభించి వరుసగా మూడు రోజుల పాటు సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయి. ఈ కిరణాలు స్వామి విగ్రహానికి సుమారు 70 అడుగుల దూరంలో ఉన్న రాతి రథంలోని రంధ్రాల గుండా ప్రవేశించి స్వామివారి మీద పడేలా ఏర్పాటు చేశారు.

దేవాలయ మంటపం ఈ రాతి రథం నుంచి ప్రారంభమై 40 స్తంభాలపై నిర్మితమై ఉంది. గోడలపై, స్తంభాలపైన రామాయణ, మహాభారత గాథలను శిల్పాలుగా చెక్కి ఉన్నారు. నడవ పై కప్పు పైన అష్టభుజాకారాంలో పువ్వులు చెక్కి ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలోని సీతారామ స్వామి ఆలయం, పద్మావతీ దేవి ఆలయం ఉన్నాయి.

ప్రయాణ సౌకర్యాలు[మార్చు]

  • అనంతపురం నుంచి తాడిపత్రి సుమారు 56 కిలోమీటర్లు. అనంతపురం నుంచి తాడిపత్రికి బస్సులు తరచుగా ఉంటాయి.
  • తిరుపతి నుంచి తాడిపత్రికి సుమారు 257 కిలోమీటర్లు. తిరుపతి నుంచి కూడా తాడిపత్రికి బస్సులున్నాయి.
  • తిరుపతి నుంచి తాడిపత్రికి రైలు సౌకర్యం కూడా ఉంది. ప్రయాణ సమయం సుమారు 3 గంటల 45 నిమిషాలు.

చిత్రమాలిక[మార్చు]

ఈ ఆలయప్రాంగణ దృశ్యాలు మరికొన్ని:

మూలాలు[మార్చు]

  1. "Chintala Venkataramana Swamy Temple Tadipatri - History, Images". gotirupati.com. gotirupati. Retrieved 17 October 2016.
  2. బత్తుల, వేంకటరామిరెడ్డి (18 June 1978). "శ్రీ చింతల వేంకటరమణస్వామి క్షేత్రము". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 65, సంచిక 76. Retrieved 13 January 2018.[permanent dead link]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.